నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో ఒక ఉదయం

మ. తలఁ బక్షచ్ఛట గ్రుక్కి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
        స్థలి నిద్రింపగ జూచి యారెకులు షస్నాత ప్రయాత ద్విజా
        వలి పిండీకృత శాటులన్సవిఁదదావాసంబు జేర్పంగ రే
        వుల డిగ్గన్వెస బాఱు వాని గని నవ్వున్మాలి గోప్యోఘముల్

ఈ పద్యం శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యంలో బాగా ప్రసిద్ధమైన పద్యం.

ఆముక్తమాల్యద లోని మరొక పద్యాన్ని గురించి ఇంతకు ముందు ముచ్చటించుకున్నాం. తడిసిన వడ్లను ఇంటి ముందు ఆరబోసుకోవడమూ, దేవుడి గుడి తాలూకు జింకపిల్ల వచ్చి వాటిని బొక్కుతుండడమూ, దేవాలయపు జింకపిల్ల కావటంతో కర్రతో కొట్టటానికి చేతులు రాక, ఆ ధాన్యానికి కావలి కాస్తున్న ద్రవిడ కన్య అప్పుడే అమ్మకానికి వచ్చిన చెంగలువల గంపలోని పూవుతో దాన్ని అదిలించడమూ -ఆ పద్యంలో గమనించాం. లోక వృత్తాన్ని రాయలు ఎంత నిశితంగా పరిశీలించి, తాను చూచినదానిని తన కావ్యంలో ఎంత సహజసుందరంగా బంధించాడో గదా – అని అనుకున్నాం. అటువంటి పరిశీలనే పై పద్యంలో కూడా పద పదానా కనిపిస్తుంది. ఒక సాధారణ దృశ్యాన్ని సమర్థుడైన కవి ఎంత కవితా రమణీయం చేయగలడో నిదర్శనంగా నిలిచే పద్యం ఇది.

ఊరిబయట మాగాణి పొలాల లోనికి నీటిని అందించే పంటకాలువల్లో కొట్టగలిగినంత సేపు ఈత కొట్టి అలసిపోయి, కాలువ గట్టు మీదకి చేరి కన్ను మొగిడ్చాయి బాతులు. అలా పడుకునే ముందు, తమ ముక్కునూ, తలనూ రెక్కల్లోకి దోపుకుని (పక్షచ్ఛటల్లో గ్రుక్కుకుని) నిద్రకు ఉపక్రమించాయి. బాతులు అంతా తెల్లగా వున్నా ముక్కులూ, పాదాలూ మాత్రమే ముదురు రంగులో వుంటాయి. రెక్కల్లో దోపుకున్నాయి కాబట్టి ముక్కులు కనిపించవు. శరీరం మొత్తం పాదాల మీదే కూలబడింది కాబట్టి కాళ్ళూ కనిపించవు. మొత్తం మీద పూర్తిగా తెల్లటి ముద్దలా వున్న ఆ బాతులు – తడిపి, ఉతికి, పిండి, పిడచ చేసిన తెల్లటి గుడ్డలా అన్నట్టు కనిపిస్తాయి. ఉదయాన్నే గస్తీకొచ్చిన ఊరి కాపరులు వాటిని చూచి సరిగ్గా అలాగే అనుకున్నారు. పొద్దున్నే కాలవగట్టుకు వచ్చిన బ్రాహ్మలు ఆ కాలవలో స్నానం చేసి, ఉత్తరీయాలని ఉతికి పిండి పక్కన పెట్టి, ప్రాతస్సంధ్యానుష్ఠానాన్ని ముగించుకుని, ఆ వస్త్రాలని మరిచి వెళ్ళిపోయారేమో అనుకున్నారు. సరే, మరి వాటిని సొంతదారులకు అందజేద్దాం అనుకుని రేవులోకి దిగబోగా – మనుషుల అలికిడి విని బాతులు లేచి, రెక్కలు విదిలించుకుని అరుచుకుంటు పారిపోయాయి. ఆరెకులు బిక్కమొగం వేసుకుని చూస్తుండగా, పొద్దునే పొలం కాపలాకో, గడ్డి కోసమో వచ్చిన ఆడవాండ్లు నవ్వబట్టారట. ఖంగుతిన్న ఆరెకులూ, నవ్విన ఆడువారూ పరువంలో వున్నవారైతే ఆ తమాషా అయిన దృశ్యంలోని సొగసు చెప్ప తరమా!

కాలువ గట్టున ముడుక్కొని నిద్రపోతున్న బాతులను చూసి ఎంత అందమైన ఊహను ఏకులోంచి దారం లాగినట్లు సాగలాగి, ఒక సుకుమారమైన సరస దృశ్యానికి రాయలు చేసిన చిత్రీకరణ చూడండి.

కేదారంపుఁ కుల్యాంతరస్థలి – పంట చేను కాలువ గట్టు; ఉషస్నాత ప్రయాత ద్విజావలి – పొద్దున్నే వచ్చి స్నానం చేసి వెళ్ళిపోయిన బ్రాహ్మణులు; శాటి అంటే పైపంచ, పిండీకృతశాటులన్ సవి – పిండి పిడచలుగా చేయబడిన వల్లెవాటు వస్త్రములు అనే ఉద్దేశంతో – అని అర్థం; శాలి గోప్యోఘముల్ – పంట కాపరులైన స్త్రీ బృందాలు.

మొదటిసారి చదవగానే అంత సులువుగా అర్థం కాని ఈ పద్యం, కొంచెం పైన చెప్పిన సమాసాలు అర్థం చేసుకుని అన్వయం కుదుర్చుకుంటూ చదివితే చాలా సులభంగా విడిపోతూ అర్థమైపోతుంది. పిండీకృతశాటి అనేది సంస్కృత సమాస పదం. పిండటం అనే తెలుగు క్రియాపదానికి సమానమైన అర్థం వచ్చే సరికి ఆ పదం కొంచెం తమాషాగా అనిపిస్తుంది. బహుశా ఆ కవి ఆ చమత్కారాన్ని ఉద్దేశపూర్వకంగానే సాధించి వుంటాడు (అన్నట్టు, పిండీకృతశాటి అనే పేరుతో కొలకలూరి ఇనాక్ ఒక గొప్ప కథను రాశారు. అది విషయాంతరం).

ఈ పద్యంలో రాయల కాలం నాటి సాంఘిక జీవనం కనిపిస్తున్నది అంటారు పెద్దలు. పంటపొలాలకు కాలువల ద్వారా నీటి వసతి కల్పించబడేదని తెలుస్తూనే వుంది. పొద్దున్నే కాలవల దగ్గరికి వెళ్ళి ద్విజులు స్నానాలూ, సంధ్యాద్యానుష్ఠానాలూ చేసుకునేవారు. ఉదయమే తలవరులు ఊళ్ళోనే కాక ఊరిబయట పొలాల దాకా గస్తీ నిర్వహించేవారు. ఎవరైనే ఏదైనా మర్చిపోతే వాటిని భద్రంగా సొంతదారులకు అందించేవారు. పంట కాపలాకు ఆడవారు కూడా వచ్చేవారు. రాయల కాలంలోని సస్య సౌభాగ్యమూ, శాంతిభద్రతల పరిరక్షణాశయమూ ద్యోతకమౌతున్నాయి ఈ పద్యంలో. సమకాలీన సమాజాన్ని చూపెడుతూ, గొప్ప ఊహాశాలితతో ఒక అందమైన దృశ్యాన్ని రూపు కట్టిన ఈ పద్యం రాయలవారి ఊహాశక్తికీ, కవన పటిమకీ, కుశాగ్ర ధిషణకూ మచ్చు తునక.

శ్రీకృష్ణదేవ రాయలు 16వ శతాబ్దారంభంలో దక్షిణాపథాన్ని జనరంజకంగా ఏలిన చక్రవర్తి. సాహిత్యాంగణం లోనూ, సమరాంగణం లోనూ సమానంగా ప్రకాశించిన మహారాజు. పొట్నూరు లోని జయస్తంభమూ, ఉదయగిరి లాంటి చోట్ల కట్టించిన దేవాలయాలూ, శ్రీకాకుళం, తిరుపతి వంటి దేవస్థానాలకు ఇచ్చిన ఉపాయనాలూ, శ్రీశైలం, కాళహస్తి వంటి ప్రసిద్ధాలయాలకు నిర్మించిన గోపురాలూ, ఆయన చేత, ఆయన దేవేరుల చేత త్రవ్వించబడి ఇప్పటికీ ఉపయోగపడుతున్న చెరువులూ, అక్షరంగా నిలిచిపోయిన కమ్మని కావ్యం ఆముక్త మాల్యద, ఇంకా ముఖ్యంగా ఆ సార్వభౌమునిచే ప్రోత్సహించి రాయించబడి, తెలుగు సంస్కృతిలో సంపన్న భాగమైపోయిన మనుచరిత్రాది మహా కావ్యాలూ – వీటన్నిటి ద్వారా రాయలు తెలుగువారి గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోతాడు. ఇది ఆయన పట్టాభిషేకం జరిగిన 500వ సంవత్సరంగా నిర్ణయించి ప్రభుత్వాలు కూడా ఉత్సవాలు జరిపాయి. ఈ సందర్భంలో ఆయన పద్యాన్నొకదానిని తలచుకోవడం ఎంతో ఆనంద దాయకం. నాలాగే ఈమాట పాఠకులకి కూడా ఈ పద్యం నచ్చి తీరుతుంది.