నేను పులిని

నేను పులిని
రౌద్రానికీ, క్రౌర్యానికీ,
హింసకీ, ప్రతిహింసకీ
నిర్వచనాన్ని.
కానీ కపటం లేని జంతు విశేషాన్ని.
అందుకే
సాహితీ జగత్తులో నేను
శ్రేష్ఠతకి పర్యాయ పదమై వెలిశాను.

ఇది గతం.

నేనిప్పుడు
బాహ్య ప్రపంచంలో
క్రమేణా అంతరించి
మరింత భయంకరాకారంతో
ఎదుగుతూ ఉన్నాను.
ఇప్పుడు నా పేరు స్వార్థం.
కపటం ఇప్పుడు నా అదనపు గుణం.

ఇక నన్ను శ్రమపడి
అడవుల్లో వెతకొద్దు
నేను కనిపించలేదని నిట్టూర్చొద్దు.
జాగ్రత్తగా మనిషిలో చూడు
తప్పక కనిపిస్తాను.