పసిఁడిపల్లకి

మనుచరితంబుఁ బెద్దన సుమంజులనూత్నకవిత్వఫక్కికం
దనపనుపున్ గ్రహించి తుదిదాక సమాప్తము జేసెనన్న శో
భనమగు వార్త చారసమవాయము దెల్పఁగ మెచ్చి, తత్కవిన్
ఘనముగ సత్కరించు పథకంబుఁ దలంచి మనంబునందునన్.

ఆ మహితాత్ముని గొనిరాన్
శ్రీమహితుఁడు కృష్ణరాజసింహుం డంపెన్
చామీకరవిరచిత నా
నామణిగణఖచితనూతనాందోళంబున్.

వినయసమాహితాత్ములగు వీరభటావళు లప్సరోంఽగనా
మణులకె నృత్యగీతముల మర్మము దెల్పఁగఁజాలు నర్తకీ
మణులు, సువాసినీమణులు మానితరీతిని దోడురాఁగ నా
మణిమయయాప్యయానము సమాదృతి మీరఁగఁ గొంచు నేఁగియున్

బ్రహ్మతేజము మీరు ఫాలభాగమునందుఁ
        దిరునామదీప్తులు మెఱయుచుండ,
ఎత్తుబాహులయందు బెత్తెడంచుల జరి
        యుత్తరీయపుకాంతి యోలగింప.
వెడదయురమ్ముపై నిడుపైన యజ్ఞసూ
        త్రద్వయవిద్యుతుల్ దనరుచుండ,
మల్లెపూడాలుకుం జెల్లెలై విలసిల్లు
        తెల్ల దోవతికాంతి యుల్లసిల్ల,

బదరికాశ్రమంబున నున్న వ్యాసు వోలె
కోకటాగ్రహారంబునఁ గొలువుదీఱు
నాంధ్రకవితాపితామహు నరసి వారు
ప్రభుని పన్పును దెల్పిరి ప్రణతులగుచు.

నర్తకీమణుల్ లాస్యవిన్యాసమెసఁగ
కవిగళంబున సుమదామకంబు నిడిరి;
మంగళంబులు వాడి సుమంగళులును
రాజు పన్పును దెల్పిరి రాజకవికి.

ఇభగమనల్, భటాళి వచియించిన వాక్యము లాలకించి, సం
ప్రభవితమోదచిత్తుఁడయి “వల్లె” యటంచును బల్కి, కృష్ణభూ
విభుని మహాదరంబునకు విస్మయహర్షము లుప్పతిల్లఁగా
శుభదినమొండు సూచి కవిసోముఁడు పైనముగట్టె నేఁగగన్.

ధవళపట్టంబరంబునఁ దనదు కృతినిఁ
జుట్టి, స్వర్ణపేటికయందుఁ బెట్టి దాని,
హైమపల్యంకికాసీనుఁడయ్యె నతఁడు
పద్మపీఠికఁ గూర్చున్న బ్రహ్మవోలె.

ముందరఁ జేరి సుందరు లమోఘముగా నటియించుచుండ, నిం
పొందఁగ నైదువల్ భవికమోహనగీతము లాలపింపఁగన్,
స్కంధములందు నెత్తికొని స్వర్ణమయంబగు యాప్యయానమున్
ముందుకు సాగినారు భటపుంగవులంతట సాధుసాధుగన్.

ఇట్లు వారలు విజయపురీంద్రమందు
అంతిమావరణంబును నందుకొనిరి;
ఆవరణపాలకుల్ వారి నచట నిల్పి
ప్రభున కెరిగించిరంతట వారి రాక.

అంతకు మున్నె చారతతు లా కవిలోకమణీప్రయాణవృ
త్తాంతము గంటగంటకును ధాత్రిపువీనుల నూదియుండుటన్
సాంతము చేసియుండె నృపచంద్రముఁ డా కవిచంద్రు నాగమం
బెంతొ ఘనంబుగా జరుపు నిచ్ఛను గట్టడులెల్లఁ దొల్లిగన్.

అన్నరనాథచంద్రుఁడపు డద్రిసమున్నతహస్తిపృష్ఠసం
పన్నసువర్ణమందిరసమంచితపేశలపట్టుపీఠిపైఁ
జెన్నుగఁ గూరుచుండి కవిసింహు నెదుర్కొన నేఁగె నాట్యపుం
గన్నెలు మంత్రులున్ బుధులుఁ గట్టికలుం జనుదేరఁ దోడుగన్.

అట్లు పరివారసంయుతుం డగుచు వేగఁ
గవివృషభునికి నెదురేఁగి కౌఁగిలించి,
కేలొసఁగి ప్రియమార నె క్కించుకొనియె
భద్రగజముపైఁ దనతోడ పార్థివుండు.

“జయజయ రాజ! రాజపరమేశ్వర! శాత్ర
        వేశభీదాయక! కృష్ణరాయ!
జయజయ కవిరాజ! సరసచతుర్విధ
        కవితాకళత్ర! చొక్కయసుపుత్ర!
జయము మహారాజ! జంభారిసన్నిభ
        శ్రీమహస్సముదాయ! కృష్ణరాయ!
జయము సత్కవిరాజ! స్వర్గురూపమసుధీ
        సాంద్ర! నందపురవంశాబ్ధిచంద్ర!

జయము ద్రవిడాంధ్రకర్ణాటసార్వభౌమ!
జయము సంస్కృతాంధ్రకవితాసార్వభౌమ!
జయము కృష్ణరాయనృపేంద్ర! జయము! జయము!
జయము పెద్దనసుకవీంద్ర! జయము! జయము!”

అనుచుఁ గట్టికవారు సంస్తుతు లాలపించుచునుండఁగన్
గొనబుగా రమణీగణంబులు గొండ్లిసల్పుచునుండఁగన్
పణవవేణుమృదంగగీతులు ప్రస్ఫుటంబగుచుండఁగన్
చనెను ముందున కా సమాజము సంతసం బెద నిండఁగన్.

“చూడవే సింగారి! సురచక్రవర్తియే
        కృష్ణుఁడై నేడు సందృష్టుఁడయ్యె!
పరికింపవే భామ! సురగురుండే నేడు
        పెద్దనాకృతి నొంది ముద్దులొల్కె!
కాంచవే కనకాంగి! కంఠీరవోజస్సె
        ప్రభువురూపమునొంది ప్రకటమయ్యె!
తిలకింపవే జాణ! నళినజుతేజస్సె
        కవిరూపముం గొంచుఁ గానుపించె|”

అనుచుఁ బౌరాంగనామణుల్ ననలవానఁ
గురియుచుండఁగ సాగెను కువలయేశ
కవిగణేశుల పయనంబు కక్ష్యలెల్ల
పూలబాటలై విలసిల్లఁ జాలఁజాల.

ఈవిధి సొగసుగ విజయపు
రీవీథులు గడచి తత్పరీవారము భూ
మీవిభు చారుప్రాసా
దావరణంబున నిలువఁగ నవనీంద్రుండున్.

తాను ముందుగ డిగ్గి దంతావళంబు
మేలుగా దింపెఁ గవిచంద్రుఁ గేలొసంగి;
తత్కరస్థపుస్తకపేటిఁ దరుణి యొకతె
ఉదిరిపళ్లెంబునందుంచి యుంచెఁ బూలు.

మదకరి డిగ్గఁగానె కుసుమాంగులు వారల పాదపద్మముల్
సదమలగంధిలాంబువుల క్షాళనసేసి తువాళ్లచేత నా
యుదకము వోవ నొత్తిరి; నతోజ్జ్వలతత్తనుగాత్రవల్లికల్
విదితమొనర్పఁగాఁ బృథులవృత్తపయోధరగోత్రమిత్రతల్.

చందురుఁ బోలు ఫాలములఁ జక్కని కుంకుమబొట్టు వెట్టి, శ్రీ
చందనగంధిలోదకముఁ జల్లి శిరంబులయందు, బ్రాహ్మణీ
సుందరు లా ద్వయంబునకు శోభనగీతము లాలపించు చా
నందముగా నొసంగిరి ఘనంబుగు నారతులం గ్రమంబుగన్.

వందులంతట సంస్తుతు ల్వల్కుచుండ
సుందరుల విరివాన పెంపొందుచుండ
భువనవిజయంబుఁ జొచ్చిరి భూవరుండుఁ
గవివరుండును, సచివులుం గలసి రాఁగ.

వేదవిద్యావిధావిదితతత్త్వజ్ఞాన
        ఖనులైన శ్రోత్రియగణము లొకట,
వ్యాసవాల్మీకివాక్యార్థకోవిదులైన
        ప్రథితపౌరాణికప్రతతు లొకట,
భాసకాళీదాసబహుకావ్యరసపాన
        పరులైన పండితప్రవరు లొకట,
నందికేశభరతనాట్యవిద్యావిశా
        రదలైన నర్తకీరమణు లొకట,

అష్టదిగ్గజకూటాంచితాన్యకవివృ
షభసమాజ మొక్కెడ నుండ సంఘటిల్లె
దివిజపతిసభవోలె నాభువనవిజయ
మంజుశిల్పాభిశోభితమందిరంబు.

అనిశము తెన్గువాణికి విహారవనంబగు నా సదస్సునన్
జనపతి భద్రపీఠమున స్వర్పతిచందము కొల్వుదీర, నా
జనపతి పార్శ్వభాగమున స్వర్ణమయోన్నతపీఠమందుఁ బె
ద్దన సునిషణ్ణుఁడయ్యెను సుధర్మసభాస్థలి గీష్పతింబలెన్.

అంతటఁగృష్ణరాయవిభుఁ డాదరదృష్టుల నాంధ్రభారతీ
కాంతుని నల్లసానికవిఁ గాంచుచుఁ బల్కెను “సభ్యులార! అ
త్యంతశుభప్రపూర్ణసమయం బిది, పెద్దన కావ్యకన్యకుం
గాంతుఁడనై పొసంగు భవికంబగు భాగ్యము గల్గె మాకిటన్!”

హితుఁడవు, చతురవచోనిధి
వతులపురాణాగమేతిహాసకతార్థ
స్మృతియుతుఁడ వాంధ్రకవితా
పితామహుఁడ వెవ్వ రీడు పేర్కొన నీకున్.

మనువులలో స్వారోచిష
మనుసంభవ మరయ రససమంచితకథలన్
విన నింపు కలిధ్వంసక
మనఘ భవచ్చతురరచన కనుకూలంబున్.

సప్తసంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి
ఖిలము గాకుండునది ధాత్రిఁ గృతియ కానఁ
గృతి రచింపుము మాకు శిరీషకుసుమ
పేశలసుధామయోక్తులఁ బెద్దనార్య!”

“అను మా యభ్యర్థనమున్
విని రచియించెను శిరీషపేశలముగ నీ
మనుచరితంబును పెద్దన
మనువాడఁగ వచ్చె నతఁడు మాతో నిటకున్ ”

అని యనఁగానె రాయ లొక యంగన బంగరుపళ్లెరంబునం
దునిచి ప్రబంధరాజమును దోడుగఁ గుంకుమ,తమ్మలంబు,నూ
తనవసనంబులుంచి, ప్రమదంబునఁ దేఁగఁ, గవీంద్రుఁడామెతోఁ
జని జననాథుహస్తముల సంతసమారఁగ నుంచె గ్రంథమున్.

అట్లు గ్రంథమునుంచి నతాస్యుఁడైన
యతని శిరమున నుంచె నక్షతలు గవియు;
వసనములఁ దమలంబులం బ్రభుని కొసఁగి
శీతపన్నీరముం జిల్కెఁ జెలువ యపుడు.

అంబరమంటె నంతట సభాలయసంస్థితసభ్యహర్షముల్
సంబరమార శ్రోత్రియుల సంఘము వల్కెను వేదమంత్రపూ
తంబగు దీవెనల్, శ్రుతిహితంబుగఁ బాడిరి వందిమాగధుల్
తంబుర మీటు చా కవిపితామహభూపతిసంస్తవంబులన్.

తమ్మిగద్దియఁ గొలువున్న బమ్మపగిది
పిదప స్వస్థలమందున్న పెద్దనార్యు
సుందరాపాంగ దృక్కులఁ జూచి ఱేడు
కేలు నదలించి చేసె సంకేతమొకటి.

అంత పెద్దన లేచి సభాంతరమ్ము
నంత పరికించి స్వస్థుఁడై యాత్మకావ్య
సంస్థితప్రధానేతిహాసంబు లిట్లు
వినిచె ఱేనికి వీనులవిందు గాఁగ.

శ్రీవక్షోజకురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
దేవిం, దత్కమలాసమీపమునఁ బ్రీతిన్ నిల్పినాఁడో యనం
గా వందారుసనందనాదినిజభక్తశ్రేణికిం దోఁచు రా
జీవాక్షుండు కృతార్థుఁ జేయు శుభదృష్టిన్ గృష్ణరాయాధిపున్.

ధర కెంధూళులు కృష్ణరాయలచమూధాటీగతిన్ వింధ్యగ
హ్వరముల్ దూఱఁగఁ జూచి తారచటఁ గాఁపై యుండుటన్ జాల న
చ్చెరువై యెఱ్ఱని వింతచీకటులు వచ్చెం జూడరే యంచు వే
సొరిదిం జూతురు వీరరుద్రగజరాట్ శుద్ధాంతముగ్ధాంగనల్.

అభిరతిఁ గృష్ణరాయఁడు జయాంకములన్ లిఖియించి తాళస
న్నిభముగఁ బొట్టునూరికడ నిల్పిన కంబము సింహభూధర
ప్రభుతిరునాళ్లకున్ దిగు సురప్రకరంబు కళింగమేదినీ
విభునపకీర్తికజ్జలము వేమఱుఁ బెట్టి పఠించు నిచ్చలున్.

ఏవంవిధగుణవంతున
కావల్గత్తురగబహువిధారోహకళా
రేవంతున కతిశాంతున
కావిష్కృతకీర్తిధవళితాశాంతునకున్

అవిరళవితరణవిద్యా
పరరాధేయునకు సజ్జనవిధేయునకున్
గవితాస్త్రీలోలునకున్
ఖవిటంకనటద్యశోబ్ధికల్లోలునకున్.

వ|| అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన స్వారోచిష మనుసంభవంబను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన జైమిని ముని స్వాయంభువమనువు కథాశ్రవణానంతరంబున మీఁద నెవ్వండు మనువయ్యె నెఱింగింపుమనవుడుఁ బక్షులు మార్కండేయుండు క్రోష్టికిం జెప్పిన ప్రకారంబున నిట్లని చెప్పందొడంగె.

వరణాద్వీపవతీతటాంచలమునన్ వప్రస్థలీచుంబితాం
బరమై, సౌధసుధాప్రభాధవళితప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబునం
బురమొప్పున్ మహికంఠహారతరళస్ఫూర్తిన్ విడంబించుచున్.

ఆపురిఁ బాయకుండు మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి, భా
షాపరశేషభోగి, వివిధాధ్వరనిర్మలధర్మకర్మదీ
క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భకులాభరణం, బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యుఁ డలేఖ్యతనూవిలాసుఁడై”

అని యమృతాపగోర్మికలయట్టి యనేకమనోజ్ఞవృత్తముల్
ఘనరవతుల్యరావమున గానముసేయఁగ నాలకించి యా
జనపతియున్ సదస్యులు నిషా మదికెక్కఁగ నష్టచేష్టులై
పొనరి రభిన్నులై యచటఁ బొల్చెడు మూర్తులకన్న వింతగన్.

రామకృష్ణుఁడు వల్కె రమ్యంబు, రమ్యంబటంచు,
రామభద్రుఁడు మెచ్చె రసవార్ధి,రసవార్ధి యంచు,
సూరన్న స్తుతియించె సుందరము, సుందరంబంచు,
తిమ్మన్న వచియించె తేనె, తేనియయే యటంచు,
మల్లన్న కొనియాడె మంజులము, మంజులంబంచు,
భట్టుమూర్తి నుతించె బహుబాగు, బహుబాగటంచు,
ధూర్జటియు నగ్గించె తులలేదు, తులలేనిదంచు

అష్టదిగ్గజయూథపు నన్యకవులు
సంస్తుతింపంగ నీరీతిఁ జక్రవర్తి
కవికి రత్నాంబరంబులు,కనకరాశు
లగ్రహారము లిచ్చి సమాదరించె.

ఇట్లొసఁగి,కవినింక సంహృష్టుఁ జేయు
తలఁపు మదిలోన పల్లవితంబు గాఁగ
రాజనర్తకి దెసఁ జూచి రాజమౌళి
సైగచేసెనెదో హస్తచాలనమున.

మోహనరాగమందపుడు మ్రోగెను వేణువులున్ మృదంగముల్,
తాహితధింతధింత యని తాళయుతంబుగ సాగె గానముల్,
మోహినిఁ బోలు రాజనటి మ్రోల నటించెను సర్వలోక స
మ్మోహనకౌశలంబున సమోదముగా సభయెల్లఁ జూడఁగన్.

అపరవరూధినింబలె రసార్ద్రసముజ్జ్వలదృష్టిపాతముల్
నృపుపయి, సత్కవీంద్రుపయి నృత్యముసేయఁగ నాడుచుండె నా
చపలవిలోలగాత్రి, కవిచంద్రు ని నూతనకావ్యకన్య యీ
నెపమున రూపుదాల్చి కమనీయముగా నటియించునో యనన్.

మున్ను మనఃపథంబుననె ముద్రను దాల్చిన తద్వరూథినీ
సన్నుతరూప మిప్పుడు ప్రశస్తముగాఁ దనముందు నిల్వఁ బె
ద్దన్న విలోకనంబులు ముదంబున జాజులు గ్రుమ్మరింపఁగాఁ
గన్నుఁ గదల్పకుండఁ గని కాంచె నవాచ్యమనఃప్రమోదమున్.

అంతటఁ దేబడె న్సభకు హాటకనిర్మితయాప్యయాన మ
త్యంతమనోజ్ఞరత్నమయ, మా శిబికాంతరమందుఁ బెద్దనన్
సంతసమార ఱేడు సునిషణ్ణునిఁ జేసి నిజాంసమందు నా
వంతయుఁ జింతలేక, ప్రభునంచుఁ దలంపక నెత్తె దానినిన్.

అది కవితాసరస్వతికి నద్భుతమైన మహంబు, మంగళా
స్పదదివసంబు దెన్గునకు, సర్వజగత్తున నాంధ్రభాషకే
యొదవిన నిస్తులంబయిన యున్నతగౌరవచిహ్నకంబు, నా
యెదను గవిత్వదీపశిఖ నెప్పుడు నిల్పెడి తైలరాజమున్.

* “ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి
        కేలూత యొసఁగి యెక్కించుకొనియె,
కోకటగ్రామాద్యనేకాగ్రహారంబు
        లడిగిన సీమలయందు నిచ్చె,
మనుచరిత్రం బందుకొను వేళఁ బురమేఁగఁ
        బల్లకిఁ దనకేలఁ బట్టి యెత్తె,
బిరుదైన కవిగండపెండేరమున కీవె
        తగుదని తానె పాదమునఁ దొడిగె,

“ఆంధ్రకవితాపితామహ! అల్లసాని
పెద్దనకవీంద్ర! ” యని నన్ను బిలుచునట్టి
కృష్ణరాయలతో దివి కేఁగ లేక
బ్రతికియున్నాడ జీవచ్ఛవంబ నగుచు.”

*(పెద్దనగారి పై పద్యము, కృష్ణరాయల పంచశతతమ పట్టాభిషేకస్మరణోత్సవము నాంధ్రప్రభుత్వము ఘనముగా జరుప నిశ్చయించినదను వార్త వినగానె భారతీదేవి ప్రసాదమున గలిగిన ప్రేరణ ఈ ఖండికకు మూలములు.)