జీలకర్ర – బెల్లం

వచ్చింది
మళ్లీ వసంతం
ఇచ్చింది
మాకులకు సౌభాగ్యాన్ని
పూవులకు సౌరభాన్ని
ప్రకృతికి సౌందర్యాన్ని
తెచ్చింది
గడచిన వసంతపు జ్ఞాపకాలను

ఆనాడు నువ్వన్నావు
“మన ఈ గాంధర్వవివాహానికి
ఆకాశమే పందిరి
పక్షులే సాక్షులు
పూలరేకులే తలంబ్రాలు
నేనే బెల్లం
నువ్వే జీలకర్ర
బెల్లం జీలకర్రతో కలిసిపోతుంది
జీలకర్ర బెల్లంతో కలిసిపోతుంది”

ఈనాడు
ఆ ఆకాశం రంగు మార్చుకుంది
ఆ పక్షులు ఎగిరిపోయాయి
ఆ పూలు రాలిపోయాయి
ఆ బెల్లం కరిగిపోయింది
కను మరుగై పోయింది
మిగిలిందంతా జీలకర్ర
ఈ జీవం లేని కర్ర
ఏ వసంతం ఈ రోకలి కర్రకు
మళ్లీ చివుర్లు తొడిగిస్తుందో