వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ

ఇక ఆఖర్న – నాగార్జున్ కవితల్లో కథనం ఎట్లా ఉంటుందో చూడండి

గులాబీ గాజులు (గులాబీ చూఢియాఁ)

ప్రైవేట్ బస్సు డ్రైవర్ అయితేనేం
ఏడేళ్ళ బిడ్డ తండ్రి కాడేంటి?

ఎదురుగా గేర్ రాడ్ పైన
కొక్కానికి తగిలించి వున్నాయి
నాలుగు మట్టి గాజులు గులాబీ రంగువి
బస్సు వేగానికి అనుగుణంగా
ఆడుతూ వున్నాయి

కొంచెం వంగి అడిగేశాను
వులిక్కి పడ్డాడనుకో…
మధ్య వయస్కుడు
బుంగమీసాలతో
ఠీవీ వుట్టి పడే మొహం…

నెమ్మదిగా అన్నాడు, అవునయ్యా
ఎన్ని రకాలుగా చెప్పినా వినదు నాబిడ్డ
చాన్నాళ్ల నుంచే ఇలా వెళ్లాడుతున్నాయి
మున్నీ అమానతు ఇట్లా అబ్బా కళ్ళ ముందు
ఏ నేరం చేసాయని వీటిని
ఇక్కడినించి తీసెయ్యమంటారు?

డ్రైవర్ నాకేసి ఒక చూపు చూస్తే
నేను డ్రైవర్ వేపు ఒక చూపు చూసాను
పెద్ద పెద్ద కళ్ళలోంచి పాల వాత్సల్యం తొణుకుతోంటే
సీదా సాదా ప్రశ్నకి సరళమైన జవాబు
చెప్పేసి ఆ కళ్ళు చూపులు రోడ్ మీదకి సారించాయి

నేను మళ్ళీ వంగి ఇలా అన్నాను –
అవునన్నా
నేను కూడా తండ్రినే
ఉండబట్ట లేక అడిగేశాను కానీ
ఇవి ఎవరికి నచ్చవు గనకా?
చిట్టి చేతుల గులాబీ గాజులు.

పై కవితలో కవి పనితనం చూడండి. ‘అబ్బా’ అన్న మాట బస్సు డ్రైవర్ ముస్లిం అని సూచిస్తుంది. ప్రశ్నలు అడుగుతున్న వాడు హిందువు. గాజులు గేర్ రాడ్‌కి పైన ఎందుకు కట్టావు అన్న ప్రశ్నకి జవాబు చెప్పటానికి డ్రైవర్ తటపటాయిస్తాడు. ఈ విషయం ప్రయాణీకుడు గ్రహిస్తాడు. చిట్టి గాజులు ఎవరికి నచ్చవూ అన్న మాట చెప్పకపోతే ఆయన ప్రాణం ఊరుకోదు ఈ గాజుల బలం ముందు నువ్వూ నేనూ ఒకటే సుమా అని స్నేహ బంధం కలుపుకుంటాడు. అట్లాగే బస్సు కదలికలకీ గాజులు ఊగుతుంటే వాటి కథ ఏమిటో చెప్పి ఇవి ఇక్కడుంటే ఎవరికేమి కష్టం అన్న డ్రైవర్ కళ్ళలోంచి చిప్పిల్లినది పాలు గారే వాత్సల్యం. బుంగ మీసాలూ ఠీవీ ఉట్టిపడే మొహం. పైనించి క్రింది దాకా పురుషత్వం రూపు కట్టుకుని ఉంటే – అందులోంచి చిప్పిల్లినది మాత్రం తల్లి ప్రేమ. ఇట్లాగ ప్రపంచాన్ని మనకు తెలిసిన హిందూ ముస్లిం, స్త్రీ లూ పురుషులూ ఇలాంటి వర్గీకరణల్లోంచి తేలికగా సున్నితంగా తప్పించేస్తాడు నాగార్జున. వర్గీకరణల నిరంకుశత్వం నించి తప్పుకునే తెలివి లేక పోతే, ఒక్క క్షణంలోనే అవి ఎక్కడ లేని శతృత్వాలకి దారి తీయగలవు – అన్న ప్రమాద సూచిక ఈ కవితలో అంతర్లీనంగా ఉంటుంది. నాగార్జున కవే కాదు. కథకుడు, నవలా కారుడు కూడా. గులాబీ గాజులు కథ రూపంలోనూ వ్రాయవచ్చును. కానీ అవసరం లేదు. పైగా ఇక్కడ పదాల పొదుపరితనం చేయగలిగిన పని కధ చేయలేదు. కానీ అంతకన్నా ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది ఇక్కడ.

నాగార్జున కవిత్వంలో ఇది కవిత్వమూ, ఇది జీవితమూ, ఇది రాజకీయమూ, ఇది కాదూ అని విడదీయడానికి వీలుగా ఉండదు. బ్రిటన్ మహారాణీకి స్వాగతం పలికిన నెహ్రూని వెక్కిరించినా, పుత్ర ప్రేమతో అధికార ప్రేమతో చెలరేగుతున్న ఇందిరా గాంధీని చెండాడినా, గాంధీ గారి మూడు కోతులనీ వెక్కిరించినా, సర్వోదయ ఉద్యమ నాయకుల కపటత్వాన్ని కడిగేసినా, మీరట్‌లో మత కల్లోలాల తరువాత రుద్రాక్ష మాల వేసుకుని రిక్షా తొక్కుకుంటున్న యువకుడిని ఆత్మీయంగా పలకరించినా – జన జీవనం పట్ల కవిత్వం పట్లా నిబద్ధతతో జీవించిన సాధారణమైన మనిషి నాగార్జున. అందుకే, నాగార్జున కవిత్వం సాదాగా సీదాగా వూరి చెరువు లాగా ఉంటుంది. దిగితే ఆప్యాయంగా పలకరిస్తుంది.

ఇంత పొడుగు నాగార్జున్ కవిత్వాన్ని పరిచయం చేసిన తర్వాత ఉపసంహారం కోసం వ్యాసం ఆరంభంలో లేవనెత్తిన ప్రశ్నలకి ఇదంతా ఎట్లా ఉపయోగ పడుతుంది అని ప్రశ్నించడం సమంజసమే. మొదట్లో చెప్పినట్లుగా, ఈ వ్యాసానికి ఉన్న పరిధి పరిమితమయినదే – చెదురుతున్న సంభాషణలని ఒక దగ్గర ప్రోవు బెట్టడం. మళ్ళీ ఒక సారి చెప్తాను: భారతీయ కవిత్వంలో అంతస్సూ, చేతస్సూ ఇట్లాంటి వాటికి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నప్పటికీ, ఈ చరిత్రలో ఎనభై తొంభై సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. ఆ తరువాత ఏ భారతీయ భాషలోనైనా ఏ తరం కవులైనా అంతస్సూ చేతస్సూ అన్నప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి కావలసిన నిఘంటువులు మనం తయారు చేసుకోక పోవటంతో వాదవివాదాలు మార్మికతతో నిండి వుంటున్నాయి. అందు చేత మనం రెఫర్ చేస్తున్న అంతస్సు ఎట్లా పుట్టుకు వచ్చిందో దానికి ఉన్న పుట్టుమచ్చ లేమిటో, దానికి ఒక స్ట్రక్చరో అస్తి పంజరమో ఏదైనా ఉంటుందా ఉండదా – అంతర్బహిర్ అనే మాటలకి అర్ధం ఏమిటీ – ఇలాంటి వాటి గురించి కొంచెం సావకాశంగా తెలిసిన వాళ్ళు మాట్లాడాలి. సమిష్టిగా మనకి తెలిసినదేమిటో తెలియనిదేమిటో తేల్చుకోవాలి.

సాహిత్యానికీ భౌతిక అస్తిత్వానికీ (ఒక అర్థంలో – న్యాయం కోసం చేసే పోరాటాలకీ) ఉన్న సంబంధం గురించి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ సంబంధం తేలికగా కొట్టి పారేయగలిగినదీ కాదు. అట్లాగే అదేంటో మనకి తెలుసునని బుకాయించితేనూ చెల్లదు. సాహిత్యానికీ (సంస్కృతికీ) స్వయం ప్రతిపత్తి ఉంటుందా, దాన్ని వర్గ స్వభావానికి లోబడి ఉండే చైతన్య రూపంగానో భావజాలంలో భాగం గానో అర్థం చేసుకోవటం సమంజసమేనా కాదా అన్న ప్రశ్నలని తరువాత ఆసక్తి ఉంటే తేల్చుకొనే ప్రయత్నం చేయవచ్చును. కానీ మొదటగా సాహిత్యమూ సంస్కృతీ ఆచరణ రూపాలే అని ఆలోచించటం, అవి సృజనాత్మక శ్రమనించి పుట్టుతాయని అర్థం చేసుకుంటే చేతస్సు చైతన్యం అనే బ్రహ్మ పదార్థాల బారి నించి బయట పడవచ్చును. బాల గోపాల్ ప్రశ్నలు లేవనెత్తటం మొదలు పెట్టి ఇరవై సంవత్సరాలు గడిచి పోయాయి. ఇప్పుడు ఇంకా వీటిని పట్టించుకుని శ్రమించటానికి ఆయనే లేడు. తెలుగు సమాజంలో ఈ ప్రశ్నల పట్ల ఉండవలసినంత ఆసక్తి లేదు.

ఏ వాదమైనా, ఏ ఉద్యమమైనా – తాము ఇతరులకన్నా ఎంత భిన్నంగా ఉన్నామని చెప్పుకున్నా – అన్నిటికీ మూలమయిన విషయాల గురించి నిర్దుష్టంగా ఉపయోగకరంగా ఉండేలా మాట్లాడుకోలేకపోతే సంభాషణలు ఎటు గాలి వీస్తే అటే కొట్టుకు పోతాయి. నా దృష్టిలో ఇటువంటి చర్చలు మన మధ్యన ఉండే వ్యక్తుల గురించీ, మనకు బాగా తెలిసిన వ్యక్తుల గురించీ మాట్లాడుకొనే క్రమంలో సాహిత్యేతర, సిద్ధాంతేతర విషయాల వలన వచ్చే ఆవేశాలకు లోనై కుప్ప కూలుతుంటాయి. అట్లా అని పూర్తిగా మనకు లోతుగా పరిచయం లేని సందర్భాలనుంచి – ఆఫ్రికాలోనో అమెరికాలోనో చిలీ లోనో పుట్టుకొచ్చిన సృజనతో మొదలు పెట్టుకుంటే పడికట్టు రాళ్ళ విశ్వ జనీనత తప్ప మనకు నిజానికి మాట్లాడుకోవడానికి ఎక్కడా పట్టు చిక్కదు. ఇతర భారతీయ భాషల్లో కవుల గురించి మాట్లాడుకోవడంలో ఒక సౌలభ్యం ఉంటుంది. వారి జీవితానుభవాలూ, వాటి సందర్భాలూ మనకి దగ్గరగా ఉంటాయి. నాగార్జుననే ప్రత్యేకంగా ఎన్నుకోవటానికి ఒక కారణం, ఆయన నాకు కవిగా , వ్యక్తిగా చాలా ఇష్టుడు కావటం ఒకటైతే, ఆయన కవిత్వంలో నేను ప్రస్తావించిన విషయాలు స్పష్టంగా కనపడతాయని అనిపించడం రెండవ కారణం.


గ్రంథసూచి

  1. Partha Chatterjee – Nationalist thought in the colonial world: A derivative discourse. University of Minnesota Press, 1986.
  2. కె. బాలగోపాల్ – చరిత్ర మనిషి మార్క్సిజం, అరుణ తార, సెప్టెంబర్ సంచిక, 1993.
  3. కె. బాలగోపాల్ – చివరి మాట, కల్లోల కథా చిత్రాలు, పెర్స్పెక్టివ్స్ ప్రచురణ, 1997.
  4. K. Balagopal – Democracy and the fight against communalism, Economics and Political Weekly, January 7, 1995.
  5. కె. బాలగోపాల్ – చీకటి కోణాలు (ఇన్) ‘మూడు దశాబ్దాల నక్సల్బరి ఉద్యమం, గమనం. పెర్స్పెక్టివ్స్ ప్రచురణ, 1998.
  6. కె. బాలగోపాల్ – ఖాళీలను పూరించడమే సాహిత్యం పని. కే శ్రీనివాస్ తో ఇంటర్వ్యూ ప్రజాతంత్ర సాహిత్య ప్రత్యేక సంచిక, మార్చి 2001.
  7. బాబా నాగార్జున కవిత్వం కవితాకోష్.ఆర్గ్ నుంచి తీసుకోబడ్డాయి. కవితాకోష్.ఆర్గ్ లో నాగార్జున కవిత్వం పేజీ ఉంది. నాగార్జున కవిత్వానికి వీడియో లింకులు – మంత్ర కవిత, గులాబీ చూఢియాఁ.