వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ

1975 లో వ్రాసిన ఈ కవిత, ప్రతిబద్ధ్ హూఁ చూడండి.

కంకణ ధారినే
అవును కంకణ ధారినే
సమసమాజ నిర్మాణార్థం
సంకుచిత స్వలాభాపేక్ష నివారణార్థం
వివేకహీన జన
అంధ బధిర జన మార్గ దర్శనార్ధం
స్వీయ ప్రేరిత వ్యామోహాత్ పునః పునః నిర్మూలనార్ధం
శతధా కంకణ ధారినే

కొంచెం జాగ్రత్త గా చూస్తే, రెండవ కవితలో కవి బాహ్య ప్రపంచానికి మార్గ దర్శనం చేయటానికి ఎంతగా సిద్ధ పడతాడో, ప్రతి క్షణం తనని తను కాపాడుకోవడం పట్ల కూడా అంతే నిబద్ధత చూపిస్తాడు అని కూడా తెలుస్తుంది. (తెలుగులో తనని తాను కాపాడుకోవటం కూడా కవికి ఒక బాధ్యతేనన్న కవులు, రచయితలూ ఎవరయినా ఉన్నారేమో తెలిసిన వాళ్ళు చెప్పాలి.)

ఇక 1969 లో వ్రాసిన ‘మంత్ర కవిత’ చూడండి. 1969లో భారతీయ జాతి చేతస్సుకి ఈ కవిత ఒక మాప్ లాంటిది. సాధారణంగా మాప్ అంటే బయట కనపడుతున్న దానికి ప్రతి రూపం అని చాలా మంది అనుకుంటారు. మాప్ లలో ఎంత చరిత్ర ఇమిడి ఉంటుందో ఊహించడానికి ఒక సారి అమెరికాలో రాష్ట్రాల సరిహద్దులు చాలా వరకు సరళ రేఖలుగా ఎందుకు ఉంటాయో ఆలోచించండి. సువిశాలంగా జన సమ్మర్దం లేని భూఖండాన్ని (నేటివ్ అమెరికన్ల వేట భూములని కొనేసుకునో జయించుకునో తెల్ల వాళ్ళు సాధించుకోగలగడం కూడా ఒక కారణం) కాగితంపై గీతలతో లెక్కలతో విభజించేయటం వలన ఇది సాధ్యమయింది. అదే హైదరాబాదులో రింగు రోడ్ మాప్ చూస్తే గీత మలుపు తిరిగిన ప్రతి చోటా స్థానిక ప్రజలు, ఆస్తి పరులూ, చిన్నా పెద్దా నాయకులూ తమ తమ బలాబలాలను ఎట్లా ప్రదర్శించారో కనపడుతుంది. ఆ మాప్ సంఘర్షణలని ప్రతిఫలిస్తున్నాదని అర్ధమవుతుంది. అట్లాగ మంత్ర కవిత 1969 లో భారతీయ చేతస్సుకు ఒక మాప్.

ఒక ప్రక్కన బలపడుతున్న హిందూ మత మౌఢ్యం, ఒక పక్కన అలీనోద్యమం వీటన్నిటికీ మధ్యన కులాల వారీగా బల సమీకరణాలూ, వ్యోమయానం, అంతర్జాతీయ పెట్రోలు ధరలూ, ఉక్కు ఉత్పత్తి,, అణు పరీక్షలూ – విడివిడి గా చూస్తే శబ్దాలు తప్ప పంక్తులకి ప్రత్యేకంగా అర్ధాలు ఉండవు. చదువుతుంటే వింటూంటే మాత్రం కళ్ళ ముందు వరసగా ఎన్నో దృశ్యాలు ప్రత్యక్షమవుతాయి. ఈ దృశ్యాల పరంపర ఒక సారి మనసుకి పట్టుకుంటే ఆ వాసన మననీ అంత తేలికగా వదలదు. సందు దొరికిన చోటికల్లా పాకుతుంది. మే మే మే మే మేలిమి బంగారం. కడ మోళ్ళంతా ఓ ఓ ఓ ఓ టి కుండలూ అని ఒక సారి వల్లె వేసిన తరువాత ఎవరికైనా మళ్ళీ నోరు తెరిచి మాట్లాడే ముందు తమని గురించి తాము ఒకసారి ఆలోచించుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం – మంత్ర కవితలో వినపడే శబ్దాలకి మనం పోల్చుకోగలిగే ఒక క్రమం ఏమీ ఉన్నట్లు వెంటనే కనిపించదు. మనిషి చేతస్సు – అంటే కనీసం కవికి అందుబాటులో ఉండే చేతస్సు ఇట్లాగే ఉంటుందా లేక దానికి అంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుందా అన్నది ఒక ఆసక్తి కరమయిన ప్రశ్న. దానికి అంటూ ఏమీ స్ట్రక్చర్ లేకపోతే అందులోనించి కవి ఏమైనా అర్ధవంతంగా ఉండేది ఎట్లా పుట్టించగలగాలి? లేక దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటే ఇక అందులో కవికి స్వేచ్ఛ ఎక్కడినించి వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు నిజానికి బాలగోపాల్ ‘చరిత్ర, మనిషి, మార్క్సిజం’ లో వేసిన ప్రశ్నలకి చాలా దగ్గరిగా ఉంటాయి.

మంత్ర కవిత

ఓం శబ్దమే బ్రహ్మం
ఓం శబ్దం మరో శబ్దం మరో శబ్ధం మరో శబ్దం.
ఓం ప్రణవం, ఓం నాదం, ఓం ముద్రా
ఓం వక్తవ్యం, ఓం ప్రకోపం, ఓం ప్రకటనా
ఓం ఉపన్యాసం…
ఓం ప్రవచనం…
ఓం హుంకారం, ఓం ఛీత్కారం, ఓం చెప్పుదెబ్బలూ
ఓం అంతా స్వంత లాభం, ఓం పిసరైనా ఇంగితం, ఓం చూపులతోటే సైగలూ
ఓం నినాదం మరో నినాదం మరో నినాదం మరో నినాదం
ఓం సర్వస్వం సర్వస్వం సర్వస్వం,
ఓం గుడ్డి గవ్వా గుడ్డి గవ్వా గుడ్డి గవ్వా
ఓం బండ మీది గడ్డి కుందేటి కొమ్ము
ఓం ఉప్పూ నూనీ పసుపూ జీలకర్రా ఇంగువా
ఓం ఎలక పెంటికా పచ్చ గన్నేరు ఆకూ
ఓం పిశాచి కేకా, అఘోరీ పేలుడూ
ఓం బొగ్గూ ఉక్కూ పెట్రోలూ
ఓం మే మే మే మే మేలిమి బంగారం బాకీ సబ్ వొ వో వో వోటీ కుండలూ
ఓం ఇదమాన్నం, ఇమామాపహ ఇదమాజ్యం ఇదమ్ హవిహి
ఓం యజమాన, ఓం పురోహిత, ఓం రాజా ఓం కవిహి
ఓం క్రాంతి క్రాంతి క్రాంతి సర్వత్రా క్రాంతి ఓం శాంతి శాంతి శాంతి సర్వత్రా శాంతి
ఓం భ్రాంతి భ్రాంతి భ్రాంతి సర్వత్రా భ్రాంతి
ఓం బచావ్ బచావ్ బచావ్
ఓం హటావ్ హటావ్ హటావ్
ఓం ఘెరావ్ ఘెరావ్ ఘెరావ్ ఘెరావ్
ఓం నిభావ్ నిభావ్ నిభావ్
ఓం పార్టీల్లో ఒక పార్టీ మన పార్టీ ఓం
ఓం అంగీకరణం, శుద్ధీకరణం, జాతీయకరణం
ఓం ముష్టీకరణం తుష్టీకరణం పుష్టీకరణం
ఓం అభ్యంతరం, ఆక్షేపనం, క్రమం తప్పక శిక్షణం
ఓం గద్దీ పై ఆజన్మ వజ్రాసనం
ఓం ట్రిబ్యూనల్ ఓం అభయం
ఓం అలీనం ఓం సత్తా సాపేక్ష్యం ఓం జోడ్ తోడ్
ఓం ఆషాఢభూతి ఓం మిథ్యా ఓం హోరా హోరీ
ఓం ఊక దంపుడూ ఓం ప్రారంభోత్సవం
ఓం మారణ మోహన ఉచ్చాటనం
ఓం కాళీ కాళీ కాళీ మహా కాళీ మహా కాళీ
ఓం వేసెయ్ వేసెయ్ వేసెయ్ గురి తప్పకుండా వేటు వేసెయ్
ఓం అస్మదీయులకు శుభం భూయాత్
ఓం తస్మదీయులకు మన్ను బోయాత్
ఓం ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ వేసెయ్
ఓం ఎగస్పార్టీ తలకాయలు నీ మెళ్ళో దండలుగా
ఓం హ్రీమ్ క్రీమ్ హూం
ఓం తిలకే వైనా గాంధీవైనా కాళ్ళిరుచుక తింటాం
ఓం ముసలి కళ్ళు ఓం పడుచు కాటుక
ఓం తులసీదళం, బిల్వపత్రం, సిందూర కుంకుమాక్షతం గంగాజలం
ఓం పులికోర భల్లూకం గోరూ
ఓం మరకత పటకా
ఓం ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ నా మనవడిదే రాజ్యం
ఓం ఛూ ఛూ ఫూ ఫూ ఫిట్ ఫుట్
ఓం పగవాడి ఛాతీ పై సమ్మెట పోట్
ఓం భైరో భైరో ఓం బజరంగ బలీ
ఓం తుపాకీ మీట పిస్తోలు గొట్టం
ఓం డాలర్ డాలర్ ఓం రూబుల్ రూబుల్
ఓం పౌండ్ ఓం పౌండ్ ఓం సౌండ్ ఓం సౌండ్
ఓం ఓం ఓం
ఓం ధరిత్రీ ధరిత్రీ ధరిత్రీ వ్యోమమ్ వ్యోమమ్ వ్యోమమ్
ఓం అష్ట ధాతువుల ఇటికెల భట్టీ
ఓం మహామహీమ్ మహా మహో ఉల్లూ కే పట్ఠే
ఓం దుర్గా దుర్గా తారా తారా తారా
ఓం జీర్ణం జీర్ణం సమస్త కార్మిక కర్షక లోకం జీర్ణోభవా జీర్ణోభవా
హరిహి ఓం తత్సత్ హరిహి ఓం తత్సత్.

చివర పంక్తిలో నేను సమస్త కార్మిక కర్షక లోకం అన్న సమాసం వాడాను కానీ – హిందీ మూలంలో నాగార్జున్ అక్కడ వాడిన మాటలు “ఇసీ పేట్ మే సమా జాయె సర్వహారా”.

సర్వహారా అన్న హిందీ పదం ఇంగ్లీషులో ప్రోలేటేరియట్‌కి సమానార్ధకం. సర్వహారా అంటే, సర్వమూ కోల్పోయిన వాడు. కమ్యూనిస్ట్ మానిఫెస్టో సృజనకర్తలు “వర్కర్స్ ఆఫ్ ది వర్ల్డ్ యునైట్! యు హావ్ నథింగ్ టు లూజ్” అంటారు. అక్కడినించి వచ్చిన పదం ఇది – శ్రమ శక్తి మినహా సర్వమూ కోల్పోయిన వాళ్ళు. వాళ్ళని అంటే ఆ మిగిలిన శ్రమ శక్తిని నమిలి మింగేసి జీర్ణించుకుని వొళ్ళు పెంచుకుంటుంది పెట్టుబడి దారీ వ్యవస్థ. విప్లవం వస్తే , మార్పు వస్తే, అట్లా శ్రమశక్తి మినహా అన్నీ కోల్పోయిన వాళ్ళ నించే వస్తుంది. (ఈ విషయం పెట్టుబడిదారీ వ్యవస్థకీ తెలుసు కాబట్టే, వాస్తవంలో అంత పూర్తిగా శ్రమ శక్తి తప్ప మరేమీ లేని ప్రజల సంఖ్య సమతూకంలో ఉంచుకోవడానికే అది ప్రయత్నిస్తూంటుంది అనచ్చు అనుకోండి, అది వేరే విషయం.)