వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ

ఇట్లా చెదిరిపోతున్న సంభాషణలని ఒక చోట ప్రోవు చేసే ప్రయత్నంలో నాకు తట్టిన మరొక ఆలోచనతో కొన్ని ప్రశ్నలొచ్చాయి – భారతీయులు బ్రిటీషు వలస వాదాన్ని ఎదుర్కొనే క్రమంలో డిస్కవర్ చేసిన అంతరంగం, చేతస్సూ ఎటువంటివి? భౌతిక ప్రపంచం మారుతూ వస్తూంటే అవి ఎట్లా మారుతూ వచ్చాయి? ఈ ఒరిపిడి లోనించి కొత్త శక్తులు ఎప్పుడూ ఎట్లా ఎప్పుడు పుట్టుకొచ్చాయి?

ఇట్లాంటి ప్రశ్నలకి నిర్దుష్టమైన వ్యక్తుల గురించీ స్థలకాల పరిస్థితుల గురించీ మాట్లాడుకోకుండా జవాబులు వెతకడం సాధ్యం కాదు. కానీ, నిర్దుష్టమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం అంత తేలిక కాదు. దానికి కావలసిన సావకాశం, ఆవేశ కావేశాలు తగ్గించుకుని మాట్లాడుకోవడానికి తగిన సందర్భం – మనమే సృష్టించుకోవాలి. అంత పని నేను చేయలేనన్నది తెలుసును కానీ, తెలుగు భాషలో కవుల నించి కొంచెం దూరంగా వెళ్ళి శ్రీశ్రీ, కాళోజీ లకు సమకాలికులైన ఇతర భాషా కవుల గురించి మాట్లాడుకుంటే విషయాన్ని కొంచెం సావకాశంగా ఆలోచించడానికి వెసులుబాటు కలుగుతుందని ఆశ. ఇక క్రింద వ్రాయబోయేది ఆ ఆలోచన తోటే.

తెలుగులో ఇంత వరకు బాబా నాగార్జున గురించి పరిచయ వ్యాసాలు ఎక్కడా వచ్చినట్లు నా దృష్టికి రాలేదు. ఆమాట కొస్తే, తెలుగులో ఆఫ్రికన్ కవులూ, స్పానిష్ కవులూ, ఇంగ్లీషు కవులూ, అందరూ ఉంటారు కానీ, ఇతర భారతీయ భాషల్లో కవులు పెద్దగా చెలామణీలో ఉన్నట్టు కనపడదు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న నమ్మకమేమైనా దీనికి కారణమేమో నాకు తెలియదు. నా మట్టుకు నాకు మొత్తం మీద దక్షిణ భారతీయ భాషల్లో, ప్రత్యేకించి తెలుగులో ఒక భయంకరమైన అంతర్ముఖత్వం రాజ్యామేలుతోందనీ – ఇది దాదాపుగా ఆంధ్ర రాష్ట్రావతరణ రోజుల్లోనే మొదలైతే ఎమర్జెన్సీ తరువాత బాగా పాతుకు పోయిందనీ నాకు చాలా కాలంగా అనుమానం. దీనికి ఒక రూపం సాధారణ మధ్య తరగతి జీవితాలను ఈసడించుకునే విప్లవ సాహిత్యమైతే, మధ్య తరగతి జీవితాల్లో ఉండే మురికిని ఆరాధ్య వస్తువులుగా మార్చేసిన తెలుగు సినిమాలూ, పాపులర్ సాహిత్యమూ మరొక రూపం. మొత్తమ్మీద ఎవరి పుణ్యమైతేనేమి తెలుగు మాట్లాడే ప్రాంతాలలో, కొడవటిగంటి కుటుంబరావు గారి ఐశ్వర్యం నవలలో ఒక పాత్ర (సూర్యమేనని జ్ఞాపకం) అన్నట్లు – ఇంగ్లీషు తిట్టుకోవడానికీ, సంస్కృతం దీవించడానికీ, తెలుగు కూరగాయలు బేరం చేయడానికీ తప్ప (అప్ డేట్ చేసుకోవాలంటే హిందీ భాష టీవీ సీరియల్స్ చూసుకోవడానికి పనికొస్తుందని చెప్పుకోవచ్చునేమో) మరెందుకూ ఉపయోగించడానికి వీల్లేని పరిస్థితులు పీఠం వేసుకుని ఉన్నాయి. గతాన్ని గురించిన చింత, భవిష్యత్తుని గురించిన ఆందోళన, ఎంత ఎక్కువ పాళ్లలో ఉంటే, వర్తమానాన్ని విమర్శించడానికి కానీ, అందులోని మంచి చెడులని గుర్తించడానికి కానీ, కావలసిన వివేకం అంత తక్కువ పాళ్లలో ఉంది.

అటువంటి సందర్భంలో మరీ ఇరుకుగా తోచినప్పుడు ఊపిరి పీల్చుకోవటానికి నా దృష్టి నాగార్జున కవిత్వం వైపు పోతుంది.


బాబా నాగార్జున (1911-98)

నాగార్జున అసలు పేరు వైద్యనాథ మిశ్రా. బీహారు లో దర్భంగా జిల్లాకు చెందిన ఒక నిరుపేద బ్రాహ్మణ రైతు కుటుంబంలో 1911లో పుట్టిన వైద్యనాథ మిశ్రా తండ్రి వ్యవసాయంతో పాటు పౌరోహిత్యం కోసం వూరూరు తిరుగుతూండగా వెంబడి తిరుగుతూండేవాడట. అట్లా మొదలయిన ప్రయాణం, 24 నాలుగు సంవత్సరాలు వచ్చేటిప్పటికి సంస్కృతం, హిందీ, మైథిలీ భాషల్లో పాండిత్యం సాధించడం, వివాహం, స్కూల్ టీచరుగా ఉద్యోగం వరకూ వచ్చింది. శ్రీశ్రీ తెలుగులో కవిత్వం మొదలు పెడుతున్నప్పుడే వైద్యనాథ మిశ్రా సంస్కృతంలో కవిత్వం వ్రాయటం మొదలు పెట్టాడు. రాహుల్ సాంకృత్యాయనుడు చేసిన ‘సుత్త పిటకం‘ లోని కొన్ని భాగాల అనువాదాలు చదివి, మూలం పాలీ భాషలో చదవాలన్న కోరికతో వైద్యనాథ మిశ్రా 1935 ప్రాంతంలో శ్రీ లంకకి వెళ్ళాడు. అక్కడ బౌద్ధ మఠంలో భిక్షువులకు సంస్కృతం నేర్పుతూ బదులుగా పాలీ నేర్చుకుంటూ, మఠంలో ఉండటానికి అనువుగా ఉంటుందని బౌద్ధ భిక్షువుగా మారాడు. నాగార్జునగా స్థిర పడ్డాడు. శ్రీ లంకలో ఉండగానే మార్క్సిజం, లెనినిజం అధ్యయనం చేశాడు.

ఆ తరువాత బీహారులో స్వామి సహజానంద అనే రైతుకూలీ ఉద్యమ నాయకుడి దగ్గర కార్యకర్తగా ఓనమాలు దిద్దుకుని 1940ల నాటికి ఒక పక్కన ఉద్యమాలు నిర్వహిస్తూ ఒక పక్కన కవిత్వం మీద పట్టు సాధించడం మొదలు పెట్టాడు. మైథిలి, హిందీ భాషల్లో కవిగా నిలదొక్కుకున్నాడు. 1998లో ఏ మాత్రమూ మారని పేదరికంలో 88 ఏళ్ల వయసులో నాగార్జున గొంతు మూగబోయే నాటికి హిందీ కవిత్వంలో ఏ రకమైన వాదాలూ బలంగా లేవు. కానీ, కాళిదాసు ప్రకృతి వర్ణనల దగ్గరినించీ భారతీయ కవితా సాంప్రదాయాలలోని అన్నీ ధోరణులూ నాగార్జున కవిత్వంలో కనిపిస్తాయి అని తెలిసిన వాళ్ళు అంటారు. కవులూ నాయకులూ పాత్రికేయులూ ఎవరైనా సరే నాగార్జునని – బాబా నాగార్జున అనే గుర్తిస్తారు. ఎన్ని రకాల వివాదాలలో ఎంత మృదువుగా, ఎంత పెద్ద వాళ్ళని అపహాస్యం పాలు చేసినా ప్రజా కవిగా అందరికీ తెలిసిన నాగార్జున మీద చేయి చేసుకోవడానికి ఎవరైనా జడిసేవారు. (క్రితం సారి UPA ప్రభుత్వంలో రైల్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు లాలూ ప్రసాద్ యాదవ్ – రైల్ ఛార్జీలు పెంచితే అధికారానికున్న మూలాలు కదిలిపోతాయని చెప్తూ – నాగార్జున కవితని ఉటంకించాడంటే జన చైతన్యంలోకి నాగార్జున కవిత్వం ఎంత లోతుగా చొచ్చుకు పోయిందో ఊహించవచ్చు.)

ఈ వ్యాసంలో మొత్తం నాలుగు కవితలు పరిచయం చేస్తాను. వీలుండి దేవనాగరిలో చదువుకోవాలనుకున్న వారికి సదుపాయంగా లింకులు ఉన్నాయి. (తెలుగు భాషలో వ్రాయటమే ప్రయత్న పూర్వకంగా చేస్తున్నాను – అనువాదాలు నాకన్నా బాగా చేసే అనుభవం ఉన్న వారు మరొకరెవరైనా ప్రయత్నిస్తే ఇంకా బాగా రావచ్చేమో.)

నేను పరిచయం చేస్తున్న మొదటి రెండు కవితల్లోనూ నాగార్జున కవిగా ఒక ప్రణాళికా ప్రకటన చేస్తున్నట్లు కనపడుతుంది. కానీ రెండింటిలోనూ మధ్య విషయంలో వ్యత్యాసం ఉంటుంది. మొదటిది కవి చేసే పనిని శ్రమ రూపంగా, ఆచరణ రూపంగా నిలబెడుతుంది. దానికి ఒక వర్గ స్వభావాన్ని ఆపాదిస్తుంది. రెండవది కవిగా నాగార్జున్ కవిగా, మనిషిగా ఎటువంటి ఆచరణ పట్ల నిబద్ధుడో చెప్తుంది.

అవును మహా ప్రభూ వ్రాస్తున్నాను (జీ హాఁ లిఖ్ రహా హూఁ)

వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను
అబ్బో ఎంత వ్రాస్తున్నానో
చాలా చాలా వ్రాస్తున్నాను
కుప్పలు తెప్పలుగా వ్రాస్తున్నాను
చిక్కేంటంటే అదంతా మీరు చదవలేరు
చూడను కూడా చూడలేరు

దాపరికం ఎందుకులెండి
ఈ మధ్యన నేను వ్రాసినవి
నేనే చదవ లేకపోతున్నాను
నియాన్ రాడ్ మీద మొలుచుకొచ్చే పంక్తుల లాగా
అవి మరు క్షణానికే మాయమైపోతుంటాయి
చైతన్యపు కీబోర్డు మీద రెండు మూడు సెకండ్లు మాత్రమే నిలుస్తుంటాయి
ఏదో అప్పుడప్పుడు వాటిని పట్టుకుని కాగితమ్మీద నోట్ చేయగలుగుతున్నాను

అలుపెరుగని ఎరుక బుద్బుద మాలికలు రువ్వుతుంటే
వాటిని పట్టుకుని సవర దీసి సాపు చేసి పద్ధతిగా ఇంకొకరికి అందించటం…
ఓర్నాయనో ఇందులో ఎంత శ్రమ వుందో

మరి మీరేమో ఫోర్ ఫిగర్ జీతగాడూ ఉన్నతాధికారీ నాయె
నాకు తెలుసు
మనసులోనే నవ్వుకుంటుంటారు
వీడి మొహం ఇదీ ఓ పనేనా? ఏదో అవీ ఇవీ ఆలోచనలు పోగు చేసి
సన్న సన్నగా ఇంత పొడుగు సాగదీసుకుంటూ పోతుంటాడు
ఇదీ ఒక పనేనా? అనుకుంటుంటారు

ఫోర్ ఫిగర్ జీతగాడూ అధికారీ అయిన మనిషి వ్యాపారపు సరుకుల్తో డీల్ చేస్తాడు. అది మేధో వ్యాపారమయితేనేమి, కిరాణా సరుకయితేనేమి, సమాజాన్ని నియంత్రించడానికి కావలసిన పగ్గాలయితేనేమి. వాడికి తేలికగా అర్ధం కాని శ్రమ శక్తి – కవి దగ్గర ఉంది. దాన్ని వెచ్చించి కవి వస్తువుని సృష్టిస్తాడు. అది మామూలు శ్రమ కాదు. చిత్త సాగరం రువ్వే నురుగుని సవరదీసి నిలకడగా ఉండే మాలలు కట్టే శ్రమ.