వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ

హృదయ కంపనం అంటే ఏమిటో అర్ధమైపోయినట్లే అందరమూ బుర్ర ఊపుతాం కానీ అంతకు మించి అది భాషకి అందదు. అట్లాంటి మార్మికత వలన కవులకి ఏవైనా ప్రయోజనాలు నెరవెరుతాయేమో నాకు తెలియదు కానీ – ఎవరికి ఏది నచ్చితే అదే కవిత్వమనో, లేకపోతే నాకు తోచిందే కవితకి అసలైన గీటు రాయి అనో – మూర్ఖపు ధోరణులు ప్రబలడానికీ, పాఠకులకి కవిత్వానికీ నష్టం కలిగించడానికీ ఈ మార్మికత దోహద పడుతుందనిపిస్తుంది. తెలుగులో కవితా ధోరణుల మధ్యన వివాదాలకి మూలం ఉన్నది ఈ అల్లుకు పోయిన అంతర్ బహిర్ ప్రపంచాల మధ్య ప్రయాణాలలోనించే కాబట్టి, ఏది బయటా ఏది లోపలా అన్న దాని మీద కసరత్తులు చేసే ముందు, కవి అంతరంగాన్ని – నదికి ఎటువైపున ఉన్నదో చెప్పడం సాధ్యం కాని కృష్ణ లంకల లాగా – వూహించుకుంటే కొంచెం వెసులుబాటు అవుతుందేమో. కవి తన సరుకుని నిత్యమూ ఏది ఒడ్డో ఏది లంకో నిర్ధారితంగా చెప్పనివ్వని జీవన ప్రవాహం లోనించి రవాణా చేస్తున్నట్లు భావించటం వీలయితే అప్పుడైనా కవిత్వానికి సంబంధించినంత వరకు ఏది సరైనది ఏది కాదు అన్నది చెప్పటం, ఇతరులకు కొంతయినా నేర్పటం సాధ్యం అవుతుందేమో? ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు సాహిత్య చర్చల్లో కనపడుతుండటం నేను చూసాను. కానీ నిలకడగా దీని మీద దృష్టి పెట్టటం సాధ్యమవుతున్నట్టు కనిపించదు.

జరగవలసి ఉండీ చెదిరిపోతున్న సంభాషణల్లో అది ఒకటి.

పైన చెప్పిన దానికి చేరువలోనే మరొక సంభాషణ జరగవలసి ఉన్నది. చేతస్సు, చేతన, చైతన్యం అన్న మాటలు మనం చాలా తేలికగా వాడుతుంటాం. కానీ మనిషి చేతస్సు గురించి మనకు సమిష్టిగా తెలిసినది చాలా తక్కువే. సరళంగా ఉండటానికి ఈమాట పాఠకులలో చాలా మందికి తెలిసి ఉండే అవకాశం ఉన్న ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. బాలగోపాల్ రచనలతో ఏమీ పరిచయం లేని వాళ్ళకు కూడా బాలగోపాల్ మార్క్సిజంతో మొదలు పెట్టి పది పదిహేను సంవత్సరాల తరువాత మావోయిస్టు హింసని నిరసించి, ఆ రకంగా మార్క్సిజం నించి విముఖుడైనాడు అన్న మాట వినే ఉంటారు. ఈ అభిప్రాయం సాహితీ పరుల లోనూ, రాజకీయ కార్యకర్తల లోనూ, సిద్ధాంత కర్తల లోనూ, సాధారణ పాఠకుల లోనూ కూడా విస్తృతంగా ప్రచారమయ్యాయి . ఆయన సమర్ధకులూ విమర్శకులూ కూడా ఇదే నిజం అని అనుకుంటారు. ఆయన కూడా ఎప్పుడూ దీన్ని స్పష్టంగా ఖండించే ప్రయత్నం చేయలేదు.

మానవ హక్కుల కార్యాచరణలో ఆయనకీ ఇతరులకీ వచ్చిన విభేదాలని ప్రస్తుతానికి పక్కన పెడితే పైన చెప్పిన అభిప్రాయానికి ఒక కారణం – ఆయన తెలుగులో వ్రాసిన రెండు వ్యాసాలూ, ఇంగ్లీషులో వ్రాసిన ఒక వ్యాసం. తెలుగులో ఒక మహిళా నక్సలైటు జీవిత కథా కథనమైన ‘రాగో’ నవలకి ముందు మాటగా వ్రాసి ‘చరిత్ర, మనిషి , మార్క్సిజం‘ అన్న పేరుతో అరుణ తార పత్రికలో విడిగా ప్రచురించిన వ్యాసమూ; ఇంగ్లీషు లో బాబ్రీ మసీదు ధ్వంసం తరువాత సంఘ పరివార్‌ని అణిచి వేయటం సమంజసమేనని వాదించిన సుమంత బనర్జీతో విభేదిస్తూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లో వ్రాసిన వ్యాసమూ సందర్భాలు వేరయినా ఒకే అసంతృప్తిని వ్యక్తీకరిస్తాయి. (తెలుగులో రెండవ వ్యాసం ‘చీకటి కోణాలు‘ పూర్తిగా కార్యాచరణకి సంబంధించిన ధోరణిలో ఉంటుంది కాబట్టి సిద్ధాంత ప్రతిపాదన అంతర్లీనంగా ఉంటుంది.)

స్థూలంగా చెప్పాలంటే ఆ అసంతృప్తి – భౌతికమైన అస్తిత్వానికీ చేతస్సుకీ మధ్య ఉండే సంబంధం ఎలాంటిదీ అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకక పోవటం వలన వచ్చింది. భౌతిక అస్తిత్వానికీ చేతస్సుకీ మధ్యన కార్యకారణ సంబంధం ఉంటుంది అని ఆయన అప్పటివరకూ అనుసరించిన మార్క్సిస్టు-లెనినిస్టు ఆలోచనా విధానం చెప్పింది. కానీ 1980-90ల మధ్య కాలంలో వచ్చిన పరిణామాలను (అంటే సోవియెట్ సామ్రాజ్య పతనం, భారతదేశంలో విప్లవోద్యమాల కార్యాచరణ వంటివి) జాగ్రత్తగా చూస్తే ఈ మార్క్సిస్టు-లెనినిస్టు ప్రతిపాదన అంత సంతృప్తికరంగా అనిపించటం లేదు అని బాలగోపాల్ నిర్ధారిస్తాడు. భౌతిక ప్రపంచంలో ఉత్పత్తి సంబంధాలలో మార్పు వస్తే దానికి అనుగుణంగా చేతస్సులో మార్పులు వస్తాయి, కొత్త మనుషులు పుడతారు అన్న ప్రతిపాదన, చేతస్సుని భౌతిక ప్రపంచానికి (బాహ్య ప్రపంచానికి?) అనుయాయిగా చిత్రీకరిస్తుంది. ఇది నాకు సరిపడడం లేదు అని ఆయన చెప్తాడు. మార్క్సిజం గురించిన ఈ అసంతృప్తి బాలగోపాల్‌కి కలగడం కాకతాళీయం కాదు.

మార్క్సు జీవిత కాలం తరువాత, ప్రత్యేకించి సోవియెట్ సామ్రాజ్యం – అమెరికన్ సామ్రాజ్యం చెరో పక్కనా ప్రపంచాన్ని పంచుకున్న తరువాత, మార్క్సిస్టు ఆలోచనా విధానంలో యాంత్రికమైన ధోరణులు చాలా చోట్ల బలపడ్డ మాట నిజమే. ఈ యాంత్రికత నించి బయట పడి కొత్త పుంతలు తొక్కడం అన్నది 1960ల లోనే యూరప్‌లో , ప్రధానంగా జెర్మనీ, ఫ్రాన్సులలో మొదలయినాయి. (ఇందులో చాలా మంది సిద్ధాంతకర్తలు – 1920లలో ఇటలీలో పని చేసిన మార్క్సిస్టు మేధావి అంతోనియో గ్రాంషి (Antonio Gramsci) వ్రాసుకున్న నోట్స్‌ని ఒక ఉత్తేజంగా తీసుకుంటారు.) మానవతా ప్రధానమైన మార్క్సిజం పాయలుగా చెప్పబడే ఈ ధోరణులు అమెరికా -రష్యాల మధ్య శీతయుద్ధం బలహీనపడటం మొదలయే దాకా అంతగా ప్రచారంలోకి రాలేదు. 1980 దశకంలో మాత్రమే నెమ్మది నెమ్మదిగా ఇవి బలపడటం మొదలయితే సోవియెట్ సామ్రాజ్య పతనం తరువాత ఇవి అందరికీ అందుబాటులోకి రావటం మొదలయింది.

బాలగోపాల్‌కి మార్క్సిజం-లెనినిజం పట్ల కలిగిన అసంతృప్తి ఆయన ఆలోచనని మానవతా ప్రధానమైన మార్క్సిస్టుల ఆలోచనల వైపు మళ్ళించి అక్కడితో ఆగి పోలేదు. ఏ సిద్ధాంతమైనా ప్రపంచాన్ని మనకు పూర్తిగా అర్ధం చేయించలేదనీ, మనం చేయగోరిన పని దృష్ట్యా సిద్ధాంతాలను అంచనా వేసుకోవటం, పదును పెట్టుకోవటం మనమే చేసుకోవాలి అని – కల్లోల కథా చిత్రాలు అన్న పేరుతో అచ్చు వేయబడ్డ ఆయన వ్యాసాల సంకలనానికి చివరి మాటలో ఆయన చెప్తాడు. ఆ చివరి మాటలో మార్క్సిజం-లెనినిజం ఆలోచనా విధానాన్ని అనుసరిస్తున్న కాలంలో ఆయన వ్రాసిన వ్యాసాల తాత్విక విమర్శ ఆయనే చేసుకోవటమే కాక ప్రత్యామ్నాయ మార్గాలపై ఆయన అంచనా కూడా చెప్తాడు.

‘చరిత్ర, మనిషి, మార్క్సిజం‘తో బాలగోపాల్ మార్క్సిజం నించి వెనుదిరిగాడనీ, బూర్జువా ఉదారవాదిగా మారిపోయాడనీ 1992లో పడికట్టు మాటలతో మొదలయిన ప్రచారం 1996లో చీకటి కోణాలు వ్యాసం ప్రచురితమయిన తరువాత తారాస్థాయికి చేరుకుంది. ఆ తరువాత ప్రచురితమైన కల్లోల కథా చిత్రాలు పుస్తకం చివరి మాట విశదీకరించి చెప్పిన విషయాలను ఆయన ప్రజా తంత్ర పత్రికకి 2000లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ రేఖామాత్రంగా ప్రస్తావించాడు కానీ ఇక ఆ పైన మళ్ళీ ఈ విషయాల గురించి పెద్దగా ఏమీ వ్రాసినట్టు కనపడదు. అయితే, కల్లోల కథా చిత్రాల చివరి మాట లోనూ , ఇంటర్వ్యూలోనూ కూడా రేమండ్ విలియమ్స్ అనే బ్రిటిష్ మార్క్సిస్టు సాంస్కృతిక విమర్శకుడి పేరు ప్రస్తావిస్తాడు. మిగతా సిద్దాంత చర్చ ఎట్లా ఉన్నా, సాహిత్యానికీ సంస్కృతికీ పనికి వచ్చే మాటలు ఈ సందర్భంలోనే చెప్తాడు.

రేమండ్ విలియమ్స్ (Raymond Williams), బ్రిటిష్ సాహితీ వేత్త, మార్క్సిస్టు సిద్ధాంత కర్త. వయోజన విద్య మీద చాలా కృషి చేశాడు. ఒక పక్కన రచనా వ్యాసంగాన్నీ, సిద్ధాంత రూపకల్పననీ సాగిస్తూనే, ఆయన కవిత్వం చదవటం ఎట్లా, అన్న విషయంపై చాలా సంవత్సరాలు వయోజనులకు తరగతులు నడిపాడు. ఆయన చేసిన ప్రతిపాదనల్లో ప్రస్తుతం మనకి ముఖ్యమైనవి రెండు చెప్తాను. మొదటిది; సంస్కృతి అన్న పదాన్ని – సంగీతం, సాహిత్యం ఇట్లాంటి వాటిలో – ఉచ్చ శ్రేణి సమాజానికి , చైతన్యానికీ చెందిన వ్యవహారంగా భావించడం పొరపాటు. సంస్కృతి అన్నది అనేక రూపాల్లో ప్రజలు చేసే రోజు వారీ చర్యల్లో ఉంటుంది. రెండవది; సాహిత్యమూ సంస్కృతీ అన్నవి భౌతికవాద మార్క్సిస్టులు అంతవరకు అనుకున్నట్లుగా కేవలం చైతన్య రూపాలుగా, ఉత్పత్తి సంబంధాల పునాదిపై ఆధారపడే భావజాలానికి సంబంధించిన వ్యవహారంగా చూడటం పొరపాటు. అంటే, సాహిత్యమూ సంస్కృతీ కూడా ఉత్పత్తి రూపాలేననీ, వాటిని ఆచరణ రూపాలుగా చూడటం వలన వాటిని శ్రమ రూపాలుగా, ఉత్పత్తి రంగంలో భాగాలుగా చూడడం సాధ్యమవుతుందని ఆయన అన్నాడు. ఆధిపత్య పోరులో ఈ ఆచరణ రూపాలకు ప్రాముఖ్యత ఇవ్వటం సాధ్యమవుతుందని కూడా చెప్తాడు. (ఆ తరువాత బాగా విస్తృత ప్రచారంలోకి వచ్చిన ఈ ఆలోచనా విధానాన్ని సాంస్కృతిక భౌతికవాద మార్క్సిజంగా చెప్పుకోవచ్చును. )

కల్లోల కథా చిత్రాలకు చివరి మాటలో బాలగోపాల్ – తాను ఆ పుస్తకంలో వ్యాసాలు వ్రాస్తున్న రోజుల్లో అనుసరించిన మార్క్సిజం -లెనినిజం, పునాది- ఉపరితలాల మధ్య అంటే భౌతిక ప్రపంచమూ చేతస్సులకు మధ్యన కార్య కారణ సంబంధం ఉన్నదని నమ్ముతుందనీ, దీని పట్ల తనకు అసంతృప్తి ఉన్నదనీ స్పష్టంగా చెప్తూ – సాహిత్యాన్నీ సంస్కృతినీ ఆచరణ రూపాలుగా భావించే రేమండ్ విలియమ్స్ తరహా మానవతా ప్రధానమైన మార్క్సిజం పట్ల కొంచెం మొగ్గు చూపుతాడు. అప్పటికీ ఆచరణకి వర్గ స్వభావం ఆపాదించే రేమండ్ విలియమ్స్ సూత్రీకరణ పట్ల బాలగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. పరమ వికృతంగా హోదా, సంపద, జ్ఞానమూ ఇలా అన్నీ రంగాలలోనూ ఆధిక్యతని కొందరు వ్యక్తులకు అందచేసే పితృస్వామ్యాన్నీ, వర్ణ వ్యవస్థనీ, వర్గ ప్రయోజనాలకు లోబడి ఉండే విషయాలుగా అర్ధం చేసుకోవటం అసాధ్యం అని తెగేసి చెప్తాడు. బాలగోపాల్ రేమండ్ విలియమ్స్ నించి గ్రహించినదీ మనకు ప్రస్తుత సందర్భంలో చాలా పనికొచ్చేదీ సాహిత్యాన్నీ సంస్కృతినీ ఆచరణ రూపాలుగా చూడటం.

ఇట్లా చూడడం వలన ప్రయోజనం ఏమిటో బాలగోపాల్ చివరి మాటలో సిద్ధాంత చర్చగా చెప్తాడు కానీ, అంత కన్నా ముఖ్యంగా ఈ దృష్టిని విశ్లేషణలో ఎట్లా ఉపయోగించుకోవచ్చునో ఆయన చీకటి కోణాలు వ్యాసంలో చేసి చూపించాడు.

చీకటి కోణాలు వ్యాసంలో బాలగోపాల్ పదే పదే ఉదాహరణల ద్వారా నిరూపించినది ఏమంటే అణగారిన ప్రజల తరఫున పోరాడుతున్నామనే కార్యకర్తలు, ఆధిపత్య సంస్కృతి నించి బయట పడతారు అన్న నమ్మకం ఏమీ లేదని. దానికోసం ప్రత్యేకమైన సాంస్కృతిక కృషి జరగాలనీ, ఆచరణలో అప్రమత్తత అలవర్చుకోవలసి ఉంటుందనీ, అది లేక పోవటం వలన ఆధిపత్య పోరులో పాత్రధారులు మారవచ్చును కానీ ఆధిపత్య సంస్కృతి యధాతధంగా ఉండి పోవటం సాధ్యమేనని నిరూపిస్తాడు. సాహిత్యాన్నీ సంస్కృతినీ చైతన్య రూపాలుగా, భావజాలంలో భాగంగా (అంటే భౌతిక అస్తిత్వానికి, ఉత్పత్తి రంగానికీ అనుయాయిగా) కాకుండా ఆచరణ రూపాలుగా చూడటం వలన కలిగే ప్రయోజనం బాలగోపాల్ స్పష్టంగా చూపించినా కూడా అది ఒక పద్ధతిగా తెలుగు సాహిత్య విమర్శలో ఏమీ ప్రాచుర్యం పొందినట్టు కనిపించదు.

ఒక రకంగా చెప్పాలంటే, చీకటి కోణాలు వ్యాసాన్ని నక్సలైటు ఉద్యమం మీద విమర్శగా మాత్రమే అందరూ చదవటం వలన చాలా నష్టం జరిగింది. ఆ వ్యాసాన్ని సాంస్కృతిక విమర్శగా, సాహిత్య విమర్శగా చదివితే విషయాన్ని దానికి తగిన పరిధిలో అర్ధం చేసుకునే అవకాశం కలుగుతుందని నా నమ్మకం. చైతన్యమూ-భౌతిక అస్తిత్వమూ, ఉపరితలమూ-పునాది వంటి ద్వయాలను పక్కన పెట్టి సాహిత్య సృష్టి ఏ శ్రమనించి ఏ ఆచరణలోనించి జరుగుతుంది? ఆధిక్యతా పోరాటాలలో సాహిత్యమూ సంస్కృతీ ఏ పాత్ర వహిస్తాయి? ఆచరణకి పర్యవసానాలు ఎట్లా ఉంటాయి? దానికి వస్తు రూపం ఎట్లా వస్తుంది? ఇవే కాక, సాహిత్యం వినిమయ వస్తువుగా ఎట్లా మారగలదు? మార్పుకి అవకాశాలు ఎక్కడ ఉంటాయి? – ఇలాంటి ప్రశ్నలు చాలా వేసుకోవచ్చును.

బాలగోపాల్ అంత స్పష్టంగా చూపించిన విషయాల పట్ల తెలుగు సాహితీ వేత్తలెవరైనా ఆసక్తి చూపిస్తారేమో, మాట కొంచెం ముందుకి కదిలితే చర్చల్లోంచి పోయినేటి దీపావళి ప్రమిదల్లో జిడ్డులా వదలకుండా పట్టుకున్న మార్మికత కొంత వరకైనా వదులుతుంది అని నేను ఆశ పడ్డానని చెప్పక తప్పదు. బాలగోపాల్ వ్రాసింది వచనం కదా మనకెందుకు అనుకున్నారో మరి లేకపోతే ఆయనేదో మార్క్సిస్టు కాబట్టి మాకు సంబంధం లేని విషయం అనుకున్నారో లేక మరేమైనా కారణాలున్నాయో తెలియదు. ఎందు చేతనైతే నేమి, చేతస్సు గురించీ, అంతరంగం గురించీ ఆరాట పడుతూ, అనుభూతిలో మునకలు వేస్తూ అంతర్బహిర్ ప్రపంచాల మధ్య యుద్ధారావాలతో కొత్త సృజనలు చేస్తూ మననందరినీ అనుభవించి పలవరించమని చెప్పే కవులు ఎవరూ కూడా బాలగోపాల్ తోటి సంభాషించే ప్రయత్నం చేసినట్టు కనపడదు.

ఇది చెదిరిపోతున్న రెండవ సంభాషణ.