Expand to right
Expand to left

కవితావిర్భావం

ఒక్కొక్కప్పుడు ఆలోచనలన్నీ
తామరాకుపై నీటిబొట్లై
అస్థిరంగా జారిపోతాయి.

ఉద్వేగాలు,ఉత్సాహాలు,
వేదనల తాకిడికి
కొంచమైనా కదలకుండా
సుప్తమై మిగిలిపోతుంది చైతన్యం,
నిద్రిస్తున్న నాగినిలా.

అరంగేట్రానికి ముందు
గురువాజ్ఞకై కైమోడ్చి
కదలని భంగిమై నిలచిన నాట్యకత్తెలా
నా కవిత్వం సహనంతో వేచివుంటుంది,
తనను తాను ఆవిష్కరించుకునే
ఓ అద్భుతమైన క్షణం కోసం.

ఆల్చిప్పలో ముకుళించిన ముత్యమై,
పూమొగ్గలో దాగిన పరాగమై,
తొలిపొద్దు స్పర్శకు ఎదురు చూసే ఆకాశమై .

రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...

    
   
Print Friendly

(6 అభిప్రాయాలు)

 1. Phani Dokka అభిప్రాయం:

  May 6, 2010 10:34 am

  వైదేహి గారూ,

  చాలా కాలం తరవాత చూస్తున్నాను ఈమాట. మీ కవిత చక్కగా ఉంది. ” తనని తాను ఆవిష్కరించుకునే ఓ అద్భుత క్షణం కోసం వేచిఉండడం ” అన్న మాటలో ఎంతో నిజం ఉంది. కథావిర్భావానికి కూడా ఇంతే.

  నెలరోజులుగా ఒక కథ రాయాలని ప్రయత్నం. మనసులో ఎన్నో సార్లు రాసి చెరిపేసుకున్నాను. ఎంతో సహనంతో వేచి చూడగా చూడగా, నిన్న రాత్రి అనుకోకుండా కథ పూర్తయింది. టైము చూస్తే తెల్లవారుఝామున నాలుగు!!

  చక్కని కవిత రాసినందుకు అభినందనలతో,
  డొక్కా ఫణి.

 2. మోహన రావు అభిప్రాయం:

  May 8, 2010 7:52 pm

  చాలా బాగుంది మీ కవిత. వేచి ఉన్న కవితా తరంగం లేచి వచ్చే క్షణాలకై ఎదురు చూడడం కూడా ఓర్పులో ఒక నేర్పే. చివరి పదం ఆకాశం కన్నా భూమి అంటే బాగుంటుందేమో? విధేయుడు – మోహన

 3. Satya అభిప్రాయం:

  May 13, 2010 9:44 am

  కవికి కవిత్వం, రచయితకు కథ, ఆటగానికి మైదానం, నాట్యానికి పాటగానికి వేదిక… దేనికైనా అవకాశం, సమయం, సందర్భం కావాలి…అప్పటిదాకా సుషుప్తావస్థలో వున్నవి వెలుగులోకి రావాలి. వచ్చిన అవకాశం చేజారనీయకూడదు, చేజారినా పట్టు విడవకూడదు.

  కవిత చాలా బాగుంది.

  –సత్య

 4. baabjeelu అభిప్రాయం:

  May 13, 2010 11:37 am

  సాహితీ మిత్రులు వైదేహి గారికి,
  మీరు బాగా రాస్తారు. తిరుగులేదు.
  కానీ రాసిందే రాస్తారు. రకరకాలుగా అదే రాస్తారు. బావుంటాయి. కానీ ఏదో వెలితి. ఠుమ్రీలు మానీసి పూర్తి రాగవేఁ రాయాలి మీరు.
  బాబ్జీలు

 5. Vaidehi Sasidhar అభిప్రాయం:

  June 30, 2010 2:47 pm

  “కవితావిర్భావం ” పై తమ అభిప్రాయం తెలిపిన సాహితీ మిత్రులందరికీ
  కృతజ్ఞతలు.

 6. తః తః అభిప్రాయం:

  December 24, 2013 10:44 am

  వైదెహి గారూ మీ ‘కవితావిర్భావం’ ఒక అందమైన భావాన్ని -ఒక అందమైన సత్యాన్ని- ఆవిష్కరించింది. నర్తకి గురువు ఆజ్ణకై కదలని భంగిమగా వేచి ఉండటంతొ పోలిక చాలా గొప్పగా ఉంది. అయినప్పటికీ నాకు తోచిన రెండు మాటలు.

  1. గుండమ్మ గయ్యాళి అని చూపించే ఒకటి రెండు సన్నివేశాలు రాయనా అన్నాడట నరసరాజు చక్రపాణితో. ఎందుకూ సూర్యకాంతాన్ని పెట్టుకున్నాక అని చక్రపాణి. ‘తామరాకు మీద నీటి బొట్లై ‘ అన్న తర్వాత ‘అస్థిరంగా’ అన్నది అలా ఉంది.

  2. గురువు ఆజ్ఞకై వేచి ఉండి నర్తించిన నర్తకి నర్తించిన సర్వస్వం — నా అభిప్రాయంలో గురువు గారి ఆవిష్కరణే. అక్కడ తనను తాను ఆవిష్కరించుకోవడం లేదు.

  తః తః