‘వికృతి’ ఉగాది

కల్లోలిత హృదయార్ణవ కాలాగ్నుల చదలు కాగి
‘విరోధి’ నిట తప్పించుకు గట్టు చేరి భూగోళం
శివ శివా అంటు ముక్కున వేలేసుకుంది అచ్చెరువై
‘వికృతి’ దర్శనాన తాను పారమెటొ ఎరుగలేక
తికమక మకతికల లోన వేయి పేర్లు తిరగవేసి
హమ్మయ్యా ‘వికృతి’ నీ మరో పేరు కదా శివా
అని సముదాయించుకు ఎదలీ రచ్చబండ చేరినవే!
కవిత లల్లుటన్న తీపి భేషజమా వాదరమా!
మాటల మూటలను విప్పి పేర్చుటలా! వదరుటలా!
ఏమందువు శివా నీవు? ఏమి వరాల రాయుడవో
‘మహోక్షః, ఖట్వాజ్ఞం, పరశు, రజినం, భస్మ, ఫణినః,
కపాలం, తంత్రోపకరణం’ నీకే చెల్లును ప్రభూ
వికృతి యగుటయు మరి సద్రూపము ‘వికృతి’ చేయగ!
నీ విభూతి కాదా మరి సృష్టి, పుష్టి, సర్వ నష్టి
వరదల కొట్టుకపోయే ‘చాలని వారి’ ధోరణుల
విజ్ఞతలే నీకాటలు కద! ‘విరోధి’ ఇల పుట్టుటలా
తగు ‘వికృతి’గ మార్చుటలా! దర్శన మీయవె అన్న నీ
తనుమహత్వ మందింతువె! మాగతి నర్తన గతులవి
నీకె సరియగు శివా భవా ప్రభుత్వ మిట్లుంటె స్వామి
ప్రత్యయ మెట్లయ్య మాకు! కూడనట్టి పనులెన్నో
కూరిమితో చేసినాము వలసినవన్నీ చేదగు
కాషాయపు వీధుల బడి దోసపు భజనల చేయుచు
గుడ్డిపూ కుఱుదండ లిచ్చి కామాంధుల పంచను బడ
బూడిదసేయవె అంధత! విపరీతపు లోతులలో
భాషా ప్రయోజన మెట్లు? మానమైన ప్రాపంచిక
మానవ మేధను దేవా ‘వికృతి’ సేయ వచ్చినావొ!
రుద్రా! సర్వ భద్రాకృతీ! మా వందనమిదె సుకృతీ!

[చదలు – ఆకాశం; వికృతి – సంవత్సర నామం; వికృతి – శివ సహస్రనామాలలో ఒకటి; వికృతి – వికార రూపం; వికృతి – కార్య కారణ రహితత్వం; తంత్రోపకరణం – తంత్ర వస్తువు; వారి – నీరు; చాలనివారి – జల్లెడ పట్టిన నీరు, అల్ప జనులు; మహోక్షః – ఆబోతు; ఖట్వాజ్ఞం – కోడు; పరశు – గొడ్డలి; రజినం – చర్మం; భస్మ – బూడిద; చాలని – జల్లెడ; ప్రత్యయం – విశ్వాసం]