Expand to right
Expand to left

నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం

శా. ఆవిప్రోత్తము వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన స
           ద్భావం బంగన సాహచర్య గుణ సంపర్కంబునన్ లోహమై
           గ్రావంబై, ధృఢ దారువై, తరుణ వృక్షంబై, ఫలప్రాయమై
           పూవై తన్మకరందమై కరగే బోఁ బోఁన్నీళ్ళకుం బలచనై.

ఈ పద్యం వైజయంతీవిలాసమనే కావ్యంలోనిది. కవి సారంగు తమ్మయ.

వైజయంతీవిలాస కావ్యం పన్నిద్దరు ఆళ్వారులలో ఒకడైన తొండరడిప్పొడి ఆళ్వారు చరిత్ర. తొండరిడిప్పొడి అంటే భక్త పాదరేణువు అని అర్థం. ఈ ఆళ్వారు విప్రనారాయణ అనే పేరుతో ప్రసిద్ధుడు. కావ్యప్రబంధాలు అలా వుంచితే భానుమతి, నాగేశ్వరరావులు నటించిన విప్రనారాయణ చిత్రం ఈ ఆళ్వారు కథను సాహిత్యపరిచయం లేనివారికి బాగా తెలివిడి పరిచింది. ఆ విప్రనారాయణ కథే ఈ వైజయంతీ విలాసము. శ్రీహరి నిత్యం తన గళసీమలో ధరించే వైజయంతీ దామం యొక్క అంశతో ఈ మహనీయుడు జన్మించాడనే వాడుక వలన, ఈ కథ వైజయంతీ విలాసం అయింది.

సారంగు తమ్మయ కవి 16వ శతాబ్దం చివరా, 17వ శాతాబ్దం ప్రారంభ వత్సరాల్లోనూ జీవించాడు. గోలకొండ నవాబైన మహమ్మద్ షాహీ కాలంలో ఆ రాజ్యంలో ఎక్కడో కరణంగా ఉండేవాడు. క్రీ.శ. 1600 ప్రాంతంలో ఈ కావ్యం రచింపబడి వుంటుందని సాహిత్య చరిత్రకారులు చెపుతారు.

శ్రీరంగంలో ఊరిబయట, కావేరీ పాయల నడుమ ఒక చిన్న తోట వేసుకొని, ఆ తోటలో పూచే పూలను మాలలుగా కట్టి ప్రతిరోజూ శ్రీరంగనికి సమర్పించుకొనేవాడు విప్రనారాయణ. ‘పానీయంబులు ద్రావుచున్, కుడుచుచున్, భాషింపుచున్’ అన్నట్లు ప్రహ్లాదుని లాగా సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుని ధ్యానిస్తూ బాహ్యప్రపంచాన్ని పట్టించుకొనే వాడు కాదు. ఒకరోజు ఆయన వీథిలో పోతూ వుంటే దేవదేవి అనే సౌందర్యఖని అయిన ఒక వేశ్యా, ఆమె సోదరి అయిన మధురవాణి ఆ త్రోవన వస్తూ స్వామిని చూసి నమస్కరిస్తారు. ఇహలోక స్పృహ లేని విప్రనారాయణ అది గమనించడు. నమస్కరించినా మోమైనా ఎత్తి చూడలేదే అని ఒళ్ళు మండుతుంది దేవదేవికి. ఈ స్వామి దొంగస్వామి అని తేల్చేస్తుంది. అక్క కాదని చెప్పినా వినదు. ‘ఇటువంటయ్యలే గాదా చిటుకుమనక యుండ సందె చీకటి వేళన్, ఘటచేటీ విటులై ఇక్కటకంబున దిరుగువారు కంజదళాక్షీ’ అని తీర్మానిస్తుంది. ఈ సాధువుని నా అందంతో వశం చేసుకొని ఇతను వట్టి దొంగ సాధువని నిరూపించి తీరుతానని అక్కతో పందెం వేసి – ఆ ప్రయత్నాలు మొదలు పెడుతుంది.

తానొక దిక్కు లేని దాన్ననీ, ఇహం మీద రోసి మీ తిరువడి ఘళ్ళ నాశ్రయించ వచ్చాననీ నమ్మ బలికి ‘తిరుకట్ట సేవ జేసెద, తిరుమాళిగ నలికి పూసి తీర్చెద మ్రుగ్గుల్, తిరుమంజనంబు దెచ్చెద, తిరుపరిటములుదికి వేగ దెచ్చెద దినమున్’ అంటుంది. అలా ఆయన ఆశ్రమంలో స్థానం దొరకబుచ్చుకొని ‘మానిలో చేవ జొచ్చిన రీతి’ ప్రవేశిస్తుంది. స్వామి నిజంగానే విరాగి. ఆయనదేమీ దొంగవేషం కాదు. కానీ లోక వృత్తమూ, మోసమూ ఎరుగని అమాయకుడు ఐనందున, ఆమె మాయ మాటలు నమ్మి ఆశ్రయం ఇస్తాడు –

ఆ తరువాత ఆమె సాన్నిహిత్యం వలన ఎలా పతనమైనాడో ఎంతో అందంగా వర్ణిస్తుంది పై పద్యం.

ఆమెతో పరిచయం కాకముందు ఆయన ఆంతర్యం వజ్ర పంజరం లాగా కఠినమైనదే. వజ్రంతో పోల్చాడు అంటే – వజ్రం వజ్రేణ భిద్యతే అన్నట్లు – ఆ వజ్రాన్ని బేధించడానికి మరో వజ్రానికి తప్ప సాధ్యం కాదు. దేవదేవి పంతం వజ్రం కన్నా కఠినమైనది అన్నమాట. అందువలన స్వామి అంతరంగం – అంగన సాహచర్య గుణ సంపర్కంతో – తన వజ్ర స్వభావాన్ని కోల్పోవడం ప్రారంభించింది. వజ్ర పంజర నిభమైన ఆయన సద్భావం లోహంగా మారింది. లోహం వజ్రం కన్నా తక్కువ కాఠిన్యం కలిగింది. లోహమల్లా గ్రావం, అంటే బండరాయి అయింది. అది కాస్తా గట్టి దుంగలాగా, ఆ దుంగ లేత కొమ్మలాగా, కొమ్మ పండు లాగా, పండు పువ్వు లాగా, పువ్వు దానిలోని తేనె లాగా, తేనె నీరు లాగా క్రమక్రమంగా దార్ఢ్యాన్ని కోల్పోతూ ‘పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్’ అన్నట్టు నీళ్ళ కన్నా పలుచనై పోయింది.

ఒక వస్తువు తన సహజ సిద్ధ స్వభావాన్ని ఎలా కోపోయిందో అడుగడుగు పోలికలతో ఎంతో అందంగా వివరిస్తుంది ఈ పద్యం. ఆయన సద్భావం నిశ్చలమైనది. అది ఒకసారి చలించగానే – ఇక ఎలా చలిస్తూనే పతనం వైపుకు ఎలా చ్యుతమౌతూ పోయి, తన స్వభావాన్ని ఎలా కోల్పోతూ వచ్చిందో ఎంతో చక్కగా రూపు కట్టించిందీ పద్యం. ఒక్కటంటే ఒక్క వ్యర్థ పదం లేకుండా, ఏడెనిమిది పదాల విరుపులున్నా పద్య ధార ఎక్కడ చెడకపోవడం ఈ పద్యం యొక్క సొగసు. ఈ పద్యం కావ్యం మొత్తానికీ మకుటాయమానమైన పద్యంగా పెద్దలు చెపుతారు. నాలుగాశ్వాసాల ఈ కావ్యంలో 565 గద్య పద్యాలున్నాయి.

ఈ కావ్యంలో ఇంకా చాలా మంచి పద్యాలున్నాయి. మచ్చుకి మరొకటి మనవి చేస్తాను.

కాకులు రావిపండ్లు దిని క్రక్క శిలామయ దేవమందిరా
నీ కములందు రావులు జనించును, సజ్జన చిత్తవృత్తియ
వ్యాకుల లీల రాతి గుడి వంటిది లోకములోన వేశ్యలున్
గాకుల వంటి వార లటు గాన బ్రమాదము జేరనిచ్చినన్

భావం సులభంగానే బోధ పడుతుంది. ఆశ్రయం కోరిన దేవదేవికి – ఆశ్రయాన్ని నిరాకరిస్తూ మొదట విప్రనారాయణుడు పలికిన పలుకులివి.

    
   

(8 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

 1. sridhar అభిప్రాయం:

  May 3, 2010 10:03 am

  పద్యం, వివరణ చాలా బాగున్నది. ధన్యవాదములు

 2. sesha kumar kv అభిప్రాయం:

  May 8, 2010 7:24 am

  చక్కని పద్యాన్ని గుర్తు చేసి వివరించారు.పెద్దగా పేరు కెక్కని ఇలాంటి మంచి కవులు ఎందరెందరో!మంచి వ్యాఖ్యానం.వందనములు.
  శేష్ కుమార్

 3. Vishnu అభిప్రాయం:

  June 9, 2010 9:49 am

  బృందావనరావు గారు,
  “నాకు నచ్చిన పద్యం” అనే ఈ సంప్రదాయ సాహిత్య శీర్షిక నాకు చాల నచ్చింది. అమెరికా భాషా ఎడారిలొ ఉన్న భాషాభిమానులమైన మాకు, ఇది ఒక చిన్న చలివేంద్రం లాంటిదనుకోండి. మీరు ఈ శీర్షిక సంకలనాలతొ (ఇంకా మరిన్ని పద్యాలతొ) ఒక పుస్తకం ప్రచురిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దీని గూర్చి మీరు ఆలోచిస్తే చాల సంతోషం.

  -చైతన్య విష్ణు

 4. Lakshmi Prasad Geddapu అభిప్రాయం:

  June 10, 2010 11:38 am

  ఈ పద్యాన్ని నేనూ ఇటీవలే చదివాను. ఛాలా చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు. ధన్యవాదాలు

 5. lyla yerneni అభిప్రాయం:

  June 17, 2010 3:49 pm

  బాగుండండీ పద్యం, పద్యం పై వ్యాసం. ఈ రచన మంచి పకడ్బందీగా శ్రీరంగేశుడు తప్ప, ఒరులు చొరరాని విప్రనారాయణుని వజ్రహృదయ సన్నిభంగా, నిర్మించారు.

  ఐనా స్త్రీ సహజ చాపల్యం కొద్దీ 🙂

  కథను పట్టి చూస్తే – విప్రనారాయణుడు విష్ణువు ‘పూలమాల’ అంశతో జన్మించిన వాడు కదా. అటువంటి వానికి వజ్రము నుండీ లోహము, లోహము నుండీ చెట్టూ, పూవూ, మకరందమూ అవుతూ పోతూ ఉంటం పతనం కాదు. అతని సహజ గుణానికి దగ్గరగా వచ్చినట్లు నాకు అనిపించింది.

  విప్రనారాయణుడు – దేవదేవి కథ చాల సరసమైనది. వైజయంతీ విలాసము మంచి సరదా కావ్యము.

  లైలా

 6. rama bharadwaj అభిప్రాయం:

  June 18, 2010 2:10 pm

  లైలా గారి వ్యాఖ్యానం నాకు ఎక్కువ బాగుంది. దేవదేవి కూడా ఒక సాధారణ వేశ్యకాదు. అప్సర. శ్రీరంగనాధుని సంకల్పం వల్లనే జన్మించింది.
  సారంగు తమ్మయ్య తెలుగు పలుకుబళ్ళు ఎంతో బాగుంటాయి.”చీకటింటిలో వెకిరింతల్ “లాంటి ఉపమానాలు ఇందుకు నిదర్శనం.

  రమ.

 7. Kameswara Rao అభిప్రాయం:

  June 18, 2010 7:13 pm

  లైలాగారూ,
  ఇక్కడ వజ్రంనుండి నీరుగా మారింది విప్రనారాయణ గుణం కాదు, అతని సద్భావం. అతని వజ్ర సంకల్పం నీరుగారి పోయింది. పైగా పువ్వు దగ్గర ఆగిపోలేదు. నీళ్ళకన్నా పల్చనై పోయింది! కాబట్టి ఇది అతని సహజ గుణానికి దగ్గరగా వెళ్ళడం కాదని నా అభిప్రాయం. విప్రనారాయణుడు ఎప్పుడూ పూలమాలే. ఒకప్పుడు స్వామి మెడలోని మాల, మరొకప్పుడు దేవదేవి కొప్పులో దండ 🙂

 8. kanakarajutunga అభిప్రాయం:

  February 7, 2015 10:07 am

  పెద్దనవలె కృతి జెప్పిన పెద్దనవలె! అల్పకవిని పెద్దనా?
  ఎద్దనవలె మొద్దనవలె గ్రద్దనవలె కాకోదర కుందవరపు కవి చౌడప్ప

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.