Expand to right
Expand to left

శరణాగతి

తిరుగుచు నుంటి నీ వనినిఁ దీరిక లేక మదీయసుందరీ
చరణయుగాంకితంబయిన సౌమనసాధ్వములందుఁ,దన్మనో
హరమృదుగండపాళిలసితారుణిమంబును దోఁచికొన్న భా
స్వరవరబంధుజీవసుమవాటికలందున నిష్ఫలంబుగన్.

అడిగితి మాలతీలతల నా లలితాంగిని గాంచియుండినం
దడయక చెప్పరే యనుచుఁ, “దన్మృదుగాత్రమునందుఁ జేర్చి మ
మ్మెడపక గారవించెఁ, బయి నెచ్చటికో చనె, నామె గమ్య మే
మడుగఁగ మైతి” మంచనె మదాళిరవంబుల నా లతాంగులున్.

కొలఁకులతీరభూములను కోమలమందపదక్రమంబుల
న్మెలఁగెడు రాజహంసముల మీనవిలోచన జాడ నెర్గినం
దెలుపుఁడటంచుఁ గోరితిని; “తీరుగ మాకు పదక్రమంపు టిం
పుల నలవర్చి యెచ్చటికొ పొల్తుక యేఁగె” ననె న్విహంగముల్.

అనుపమకోమలాంగి తెఱఁగారయు నన్ను శిరీషపుష్పముల్
గని పలుకం దొడంగెఁ, “గడు గర్వమునన్ మహిఁ దానె మార్దవ
మ్మునకుఁ బ్రతీకయంచును మముం గణుతింపని యామెతోడ మా
కొనరెడి దేమి? యా వనిత యున్కిని మమ్మడుగంగఁబోకుమీ!”

ఇట్లు పృచ్ఛించి పృచ్ఛించి యింతి జాడ
నరయ లేక చెంగట నున్న సరసియందు
విచ్చుకొనియున్న కెందమ్మివిరిని గాంచి
ప్రార్థనం జేసి తీరీతి ప్రణతుఁడనయి.

“నా చెలి వక్త్రమంజిమ మనాదరమూనిన నూనెఁ గాక, తా
నే చెలువంపురాశినని నీయెడ నో వికచాంబుజాతమా!
ఆచెలి కేమిగాని నిను నాదరమొప్ప భజింతు నేను, ని
ప్డాచెలి నిన్ను వీడి యెటకై చనెనో కరుణించి తెల్పుమా!”

అనినం బద్మం బిట్లనె
ననుఁ దక్కువగాఁ దలఁచుట న్యాయమె సుమ్మీ
వనితామణికిం దానిం
గణుతింపను నే నవజ్ఞగా నిక్కముగన్.

వనిత ముఖంబుచేత నొక పద్మము, నాఱగు వారిజంబులన్
కనుఁగవచేతఁ, గోమలయుగాంఘ్రులచేత, శయద్వయంబుచే
గొనకొని గెల్చియుండుటను గూడిన గర్వముచేత నిట్లు మ
మ్మును నిరసించుచుండె, జయభూషితు లోడినవారి మెత్తురే?

అంతియకాక నాదు హృదయంబది యొక్కటె స్వర్ణకాంతితో
నింతగఁ దేజరిల్లు, మఱి యింతి తనూలతయో వెలుంగు నిం
తింతనరాని స్వర్ణమయతేజముతోడ శిరఃపదాంతమున్,
ఱంతొనరింపనేల? జవరాలిదె పైచెయిపో తనుచ్ఛవిన్!

ఇట్లు నా మంజిమస్థాయి నెఱిఁగి నేను
గారవించితి నామెను గర్వముడిగి
దాన నాయెడసఖ్యంబుఁ బూని యామె
తనదు సంగతి కొంతగ వినిచె నాకు.

పంచమంబునఁ బాడెడి పరభృతాలఁ
గూడి యించుక సేపు నేఁ బాడఁదలఁతు,
పైని చెరువుగట్టుననున్న పద్మసూతి
రాణి నర్చింపఁ దన్మందిరంబుఁ జొత్తు”

అని వివరింపఁ బద్మము, మహాదరపూర్ణకృతజ్ఞతోక్తులన్
వనజము సంస్తుతించి, యట వర్తిలు భూరితరామ్రవాటిలో
ననయము పంచమంబున సమాలపనం బొనరించు కోయిలల్
మనియెడు దారులంబడి క్రమంబుగ నేఁ జనుచున్నయంతటన్.

“చూచితిమోయి పాంథ నిను, సుందరికై యిట వెఱ్ఱిపోలికన్
జూచుచునుంటివీవనుచుఁ జూచితిమేమును క్రుంగిపోవగం
బూచిన యీరసాలతరుపూగశిరంబులనుండి, తన్మృగా
క్షీచరితాధ్వముల్ దెలిపి క్షేమము గూర్తుము నీ కొకింతగన్.

పంచమము దక్క నితరమౌ స్వరము లేని
మాకు సప్తస్వరంబులమహిమఁ దెల్పు
గీతముల నేర్పి పూర్ణసంగీతఫణితిఁ
దెలుప యత్నించె నా యింతి కొలఁదిసేపు.

అనుపమపంచమస్వనమహామధురత్వవిశేషసంపదన్
జనములఁదన్పువారమని, సౌమనసాస్త్రుని బంట్లమంచు, మా
మనముల గర్వమెంతయొ సమాహితమయ్యెను గాని పాంథ! యా
వనితను విన్నయంతనె యపాస్తములయ్యె సమస్తగర్వముల్.

అట్లు గానవిజ్ఞానంబు నలవరించి
శారదాదేవి దర్శింపఁ జనెను తరుణి,
తద్వియోగభరంబును దాళలేక
ఘోషిలుచునుంటి మిట మేము “కుహు”రవాల!”

అనుచుఁ దెల్పిన యా కోకిలాళి నెల్ల
ఘనముగాఁ గొనియాడి,తద్వనము వీడి
చెరువుగట్టుననున్న మందిరమునందుఁ
గొలువు దీర్చిన శారదం గొలువఁ గంటి.

అందున డాఁగి నేను తరళాయతలోచన ధ్యానమగ్నయై
డెందమునందునన్యముల డీల్పడఁజేసి తదేకచిత్తయై
కుందసుచందనోపమసుకోమలగాత్రిని శారదాంబ నా
నందముగా భజించు విధి నారసి యట్టులె చూచుచుండఁగన్.

ఆ మహిళాలలామ హృదయాంచితసర్వకళాస్వరూపతే
జోమయమైన జ్యోతి వనజోద్భవురాణిని జేరి తన్మహా
ధామములోన లీనమయి తన్మృదుగాత్రము యష్టిపోలికన్
భూమిని గూలినం గని ప్రభూతశుగన్వితమానసుండనై.

కట్టెవలె నున్న ప్రేయసి కాయమరసి
బిట్టుగా విలపించితిఁ బెద్దతడవు;
కాని శారదాదేవి సత్కరుణవలన
దుఃఖమును బాపు నొక త్రోవ తోఁచె నాకు.

“నశ్వరము దేహ మాత్మ యనశ్వరంబు,
పుణ్యవతి యామె పల్కులపొలఁతిఁ గూడె
దేహముండఁగనే కాన దీలుపడక
శారదాదేవి శరణంబుఁ గోరుకొనుము!

నశ్వరమౌ శరీరమును నాతి త్యజించి కళాప్రపూర్ణమై
శాశ్వతమైన యాత్మను నజప్రియలోన లయింపఁజేసె,నా
శాశ్వతసత్కళాత్మతనె శారదనుండి గ్రహింపనెంచుమా
శాశ్వతికప్రియాభిరతి స్వాంతమునందున నీకుఁ గల్గినన్!”

అనుచు నేదొ యంతర్వాణి హంసవాహ
నాశ్రయింపుము; తత్కళాత్మైకపదముఁ
బొందుమంచును బలుక నా పుస్తకస్వ
రూపిణిం గూర్చి పల్కితీ రూపముగను.

వేదాదివిద్యలే విహరణక్షేత్రంబు
         లేదేవి కాదేవియే దిక్కు నాకు,
తెలిమించు రాయంచ తేజిపై విహరించు
         నేదేవి యాదేవియే రక్ష నాకు,
పండితస్వాంతముల్ స్ఫటికంపుముకురంబు
         లేదేవి కాదేవియే నేత్రి నాకు,
కవిరాజికావ్యముల్ కనకంపు రవణంబు
         లేదేవి కాదేవియే దాత్రి నాకు,

శరణు! శరణంటి నీకు నో చంద్రవదన!
ఆదరంబున సత్కళాత్మైకసిద్ది
నాకు దయసేయుమోయమ్మ నలువరాణి!
వాణి! కల్యాణి! గీర్వాణి! పద్మపాణి!

నీదు దయావిశేషమున నిల్చును మూఁగయు గొప్ప వాగ్మియై,
నీదు కృపావిశేషమున నిల్చు ఖలుండును పండితుండునై,
నీదు శుభాకృతిం గలసి నిల్చిన నాదు ప్రియాకళాత్మనే
ఆదరమొప్ప నాహృదయమందున నిల్పి యనుగ్రహింపుమా!”

అని గీర్వాణికి మ్రొక్కఁగాఁ గనుచు నన్నాదేవి హృష్టాత్మయై
తన నేత్రాంతదయావిలోకనములం ధన్యాత్మునిం జేసె, నం
తనె నేత్రంబులఁ గప్పియున్న కల యంతంబయ్యె, నా మందిరం
బును, నారామము సర్వమున్ క్షణములోఁ బొందె న్వినష్టాకృతిన్.

అట్లు కలనైనఁ గాంచు భాగ్యంబు గలిగె
నబ్జభవురాణి నని యెంతొ హర్షమంది
శరణుజొచ్చితి నాదేవి సత్వరముగ
బుద్ధికొఱకును, కవితాత్మసిద్ధికొఱకు.

    
   

(18 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

 1. Dr. Gannavarapu Varaha Narasimha Murty అభిప్రాయం:

  May 2, 2010 11:52 am

  సరసిజ నేత్రి శారదయు చారువు రూపిణి వీణ పాణియై
  విరళిత పత్ర రాశులను విశ్రుత మాధురి గంధ రాశులన్
  దరళిత తామరంబులను దాల్చుచుఁ సన్నిధిఁ జేరి నిల్వగాఁ
  దిరుమల కృష్ణ దేశికుఁడు దేటయి గ్రోలెనె దీపి తేనియల్ !

 2. sesha kumar kv అభిప్రాయం:

  May 10, 2010 3:47 am

  తిరుమల కృష్ణ దేశికుడు దివ్యము గానొక అంశముం గొనిన్
  తరుణి తలంపు తోడ కవితామృత ధారను చిల్కరించె నీ
  సరణిని వ్రాసి సత్కవులు ఛందము కందము గూర్చు చుండగా
  స్థిరముగ నాంధ్ర పద్యకళ తేజము లీనదె శారదాంశమై

  చక్కని భాషయు భావము
  మక్కువ పెన వేసి కొనగ మకరందము గా
  దక్కిన దేశికుని కవిత
  నిక్కము గా తెన్గు తీపి ‘ఈమాట’ కిడెన్

  శ్రీమాన్ తిరుమల కృష్ణ దేశికా చార్యుల వారికి,వారి కవితకు సాష్టాంగ ప్రణామములు
  కే.వీ.శేష కుమార్

 3. Geddapu Lakshmi Prasad అభిప్రాయం:

  May 31, 2010 12:56 pm

  ఛందస్సు అభివ్యక్తికి ప్రతిబంధకమనే భాషరాని, భాష నేర్చుకోని సొమరిపోతులు మీ పద్యాలు చదివితే బాగుంటుంది.
  పదక్రమంపు టింపుల నలవర్చి అనే కంటే పదక్రమంపు సొంపుల నలవర్చి అంటే బాగుండేదేమో. స్వర్ణమయతేజముతోడ శిరఃపదాంతమున్ అనే దగ్గర అన్వర్థ సాధనలో క్లిష్టత చోటు చేసుకుదని నా అభిప్రాయం. దీన్ని స్వర్ణ నిధులీనుచు నాపద మస్తకంబికన్ రంతొనరింనేల? అనో వేరే విధంగానో అంటే బాగుండేదేమో! అఖండ యతి బాధా ఉండేది కాదు.
  చనువు తీసుకుని ఉచిత సలహాలిచ్చినందుకు అన్యథా భావించరుకదా!!!!
  శుభం భూయాత్

 4. Geddapu Lakshmi Prasad అభిప్రాయం:

  May 31, 2010 12:59 pm

  సీస పద్యంలో ఛందస్సు సవరించుకోగలరు

 5. Dr.Gannavarapu Vraha Narasimha Murty అభిప్రాయం:

  May 31, 2010 6:05 pm

  వేదాది విద్యలే అను పద్యము సీసం కాదు. ఇందులో ఏడు ఇంద్ర గణములు ఒక సూర్య గణం ప్రతి పాదంలోను ఉన్నాయి. తిరుమల కృష్ణదేశికాచారి గారు దీనిని సీసం అనలేదు. అందుచే ఆయన ఛందస్సును తప్పు పట్టలేము. ఇది క్రొత్త ప్రక్రియో లేక మరో పేరున్న ఉపజాతి వర్గమో అవుతొంది. పద్యం బాగుంది. దీనికో పేరుంటే ఎవరైనా తెలియ పరుచ గలరు. ఒక పేరు లేకపోతే దీనిని తిరుమల అందాము.

 6. ధేశికాచారి అభిప్రాయం:

  June 1, 2010 12:08 am

  లక్ష్మీప్రసాదుగారికి,
  సీసపద్యం ఛందస్సు తెలియక,లేదా సీసపద్యం వ్రాసే సామర్థ్యం లే క అట్లా వ్రాయలేదు. ఇది బుద్ధి పూర్వకంగా సీసపద్యంలోని ఉత్తరార్థంలో 3 ఇంద్రగణాలపైన ఒక సూర్యగణం వేసి, ద్విపదలాగా నడిపించాలని చేసిన ప్రయోగం. ఈ విధంగా సీసపద్యంపై కొద్దిపాటి మార్పులతో సీసపద్యం లాగ నడిచే ఛందస్సులకు నేను పెట్టుకున్న పేరు సీసతుల్యములని. మీకు ఓపిక ఉంటే ఇట్లాంటి నూతనచ్ఛందో ప్రయోగాలు నా వెబ్ సైటులో నా జక్కనచరిత్ర కావ్యంలోచూడగలరు. పైగా అది సీసపద్యమని నేను పైఖండికలో దానిని లేబుల్ చేయలేదు. ఒకవేళ అట్లా చేయాలంటే దానిని సీ.తు. (సీసతుల్యము) అని నా జక్కనచరిత్రలో చేసిన విధంగా చేస్తాను కాని, సీ (సీసము) అని చేయను. మీరు సూచించిన “సొంపుల” అనే మార్పు బాగుందని అంగీకరిస్తాను. కాని రెండవ సూచనతో నేనంగీకరించలేను.”నిధులీనుచు” అనేప్రయోగం అఖండయతిని తొలగించుకొనడానికి చేసిన కృత్రిమయత్నం లాగ ఉంటుందే కాని పద్యం యొక్క సొగసును గాని, అర్థాన్నిగాని పెంపొందింపజేయదు. ఇక్కడ అఖండయతి పడుతున్నదని గుర్తున్నా, దానిని తొలగించడానికి చేసే వికృతయత్నాలకంటే దానిని ఉంచుకోవడమే ఉత్తమపక్షమని నేను ఆవిధంగా వ్రాసినాను.

 7. Geddapu Lakshmi Prasad అభిప్రాయం:

  June 1, 2010 11:32 am

  సీస పద్యం రాసే సామర్థ్యం లేక మీరలా రాసారనే ధ్వని నా అభిప్రాయంలో లేదే!!! ఒకవేళ అలా అన్పిస్తే క్షంతవ్యుణ్ణీ. ఏమైనా సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.

 8. ధేశికాచారి అభిప్రాయం:

  June 1, 2010 10:23 pm

  వరాహనరసింహమూర్తిగారూ, “వేదాదివిద్యలే” అనే పద్యంయొక్క అసలు రూపాన్ని గ్రహించి, నాకంటె ముందుగానే సరియైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినందుకు ధన్యవాదాలు. ఛందస్సులో నేను చేసిన ప్రయోగాలు,ఛందస్సుపై నాకు గల దృష్టి నా వెబ్ సైటులోని “హనుమప్పనాయకుడు” అనే కావ్యంలోని “ప్రస్తావన”ను చదివితే బాగుగా వ్యక్తమౌతాయి. పోతే, ప్రసాదుగారికి వ్రాసిన సమాధానంలో నా అనవధానతవల్ల “నూతనచ్ఛందో ప్రయోగాలు” అని అసాధుప్రయోగం పడింది. దీనిని “నూతనచ్ఛందః ప్రయోగాలు” అని చదువుకొనగలరని మనవిచేస్తున్నాను.

 9. Srinivas Nagulapalli అభిప్రాయం:

  June 3, 2010 11:31 am

  నమస్కారం
  మంచి ధారతో పద్యాలందించినందుకు కృతజ్ఞతలు.

  “వాణి! కల్యాణి! గీర్వాణి! పద్మపాణి!” అన్న సంబోధన చాలా బాగుంది.
  “కవిరాజికావ్యముల్ కనకంపు రవణంబు లేదేవి కాదేవియే దాత్రి నాకు” లో “దాత్రి” అన్నది టైపో అనుకుంటాను, “దాత, ధాత్రి” తెలిసినా.

  అమ్మవారి సంబోధనలో కనిపించిన సహజత్వం నిర్మలత్వం,మిగితా పద్యాలలో లోపించి, ఎందుకో కొంత అసహజత్వ పదప్రయోగం ఉన్నట్టు వెలితి.

  “ఇట్లు పృచ్ఛించి పృచ్ఛించి యింతి జాడ” అంటే అర్థమవుతుంది బాగానే. ఆకట్టుకోదు బాగా.”ప్రశ్నించి ప్రశ్నించి” లేక “అడుగుతూ అడుగుతూ” అన్నవి వదిలేసి, ఏదో బల్మిటికి పట్టుకొని తెచ్చిపెట్టిన పదపొందికల లాగుంది.

  నారికేళ పాకం అంటేనే అర్థం కాక,కొబ్బరికాయ సరే, కోకోనట్‌ అంటే ఓహో అని ఊపే తలలన్నీ ఇటువంటి పద్యాలు,కాదు పల్కులు చూసి పల్కులతల్లికి శిరసొంచి “శరణాగతి” చేస్తాయేమో అనిపిస్తుంది,సార్థకంగా.
  ========
  విధేయుడు
  శ్రీనివాస్‌

 10. Srinivas Nagulapalli అభిప్రాయం:

  June 3, 2010 4:28 pm

  “మదాళిరవంబులు” అంటే సరిగ్గా అర్థం కాలేదు. మత్‌ + ఆళి + రవంబులు అనుకుంటే,”ఆళి”కి నిఘంటువులో “పఙ్క్తి, చెలికత్తె, అడ్డకట్ట” అర్థాలున్నాయి. దయచేసి చెప్ప మనవి.
  =======
  విధేయుడు
  శ్రీనివాస్‌

 11. Desikachary అభిప్రాయం:

  June 5, 2010 8:11 am

  1) When a good poet composes metrical verses, he/she goes beyond the rules of yati, gana and praasaa stipulated by the prosody rules. Like an accomplished goldsmith, he strives to achieve the best refinement in his art. If you miss these refinements, you are to blame yourself, not the artist. If I wrote “pricchinci’ instead “prasninci”, it is because the internal assonace this word has with the rest of the words in the line, which gives it much better sonorous quality. Even according to the rules of yati, ri has assonance with ‘i’ and ‘yi’ which occur in “itlu” and “yinthi” in this line. On the other hand, the ‘a’ in ‘phrasninchi’ has no assonance with ‘i’ or ‘yi’. I hope this helps you to realize the finer points of prosody beyond the basic rules.
  2) mada+aLi+rvambulu= madaaLi = the sounds of intoxicated (with nectar) honey bees. aLi means honey bee and aaLi means row, group, maid etc. mada +aLi = madaaLi (savrNadeergha sandhi)
  Sorry, I have to write this in English, as I have no facility to type Telugu easily from where I am – Desikachary

 12. Desikachary అభిప్రాయం:

  June 5, 2010 8:24 am

  Sorry I missed this one.
  3) “dAtri” is a femenine form of “dAta”, which is a “rikArAnta” word. It is similar to “nEta”, “nEtri” which are also “rikArAntha” words. nEtri occurs in another line of the same verse. dAtri = giver, bestower is very meaningfule wheras DhAtri which means earcth, is totally meaningless in this context.

 13. Gannavarapu Narasimha Murty అభిప్రాయం:

  June 5, 2010 9:14 pm

  అళి అంటే తుమ్మెద. మదాళి రవంబులు అంటే మదించిన తుమ్మెదల ఘోష అని నేనర్ధం చేసుకొన్నాను.
  ప్రతి దినము ద్రాక్షే ఎలా తినగలము? కష్టమయినా నారికేళ పాకము బాగుంటొంది. విరివిగా భాషలో పదజాలమున్నపుడు విన్నా,వాడినా, అలవడి అవుతొంది. అందులో గమ్మత్తుంది. శ్రీశ్రీ గారి కవితలకు కూడా నాకు నిఘంటువు సహాయము కావాలి.
  దేశికాచార్యులు గారూ మీ కవితల సౌధానికి తాళాలు యిచ్చినందులకు ధన్యవాదములు.

 14. Lakshmi Prasad Geddapu అభిప్రాయం:

  June 6, 2010 3:49 am

  మదాళి రవంబులు కు మద + ఆళి రవంబులకు అన్నది విభజన. మదించిన తుమ్మెదల శబ్దాలు (ఝంకారాలు) అని అర్థం.

 15. Lakshmi Prasad Geddapu అభిప్రాయం:

  June 6, 2010 7:37 am

  మద + ఆళి అని అచ్చుతప్పు పడింది మద+అళి అని చదువుకో ప్రార్థన

 16. Srinivas Nagulapalli అభిప్రాయం:

  June 6, 2010 8:02 am

  Thanks for clarification. I believe it helps other readers too.

  > If you miss these refinements, you are to blame yourself, not the
  > artist.. I hope this helps you to realize the finer points of prosody
  > beyond the basic rules.

  Talking about finer points of prosody, expressing opinion and asking questions is vastly different from blame. Missing this only encourages to
  silently ignore the art and artist. And tt doesn’t sound like much of a
  refinement or an art, if only praises are welcome, but cordial and open
  questioning are considered a blame.
  ==========
  Regards
  -Srinivas

 17. K.V.S. Ramarao అభిప్రాయం:

  June 7, 2010 3:52 am

  చాలా కాలం తర్వాత భావకవిత్వపు పోకడలతో మళ్లీ ఇలాటి పద్యాలు రావటం ముదావహం. వెల్చేరు గారు నన్నయ గారి నుంచి నేటి వరకూ వచ్చిన అన్ని రకాల పద్యరచనా ప్రక్రియలు ఏకకాలంలో కనిపించే సాహిత్యం బహుశా తెలుగుభాషలోనే వున్నదని ఒకచోట అన్నారు. ఈ పద్యాలు చదువుతుంటే “వైతాళికులు” సంకలనం లోని అనేక ఖండికలు గుర్తుకొచ్చాయి. ఐతే ప్రస్తుత ఖండికలో వాడిన సాధనాలలో కొత్తదనం లోపించిందనే అనిపిస్తున్నది. ఉదాహరణకు, ప్రేయసి కోసం ప్రకృతి లోని వృక్ష పక్ష్యాదులని అర్థించటం, అవి ఆమె మాకన్నా సుకుమారి అని, కళామూర్తి అని బదులివ్వటం, కథంతా గడిచాక అది కల అని ముగించటం – ఇది ఎన్నో సార్లు నడిచిన దారే. ఛందస్సులో ప్రయోగాలు చెయ్యటం కూడ అలాటిదే. భావాలు కూడ పాతవే అనిపిస్తున్నాయి. అంటే, అవే కవిసమయాలు, పద సంపుటుల ప్రయోగాలు. ఈ ఖండికను తక్కువ చెయ్యటం కాదు కాని ప్రతిభావంతులైన దేశికాచారి గారు భావ కవితా మార్గాన్ని ఇంకొన్ని కొత్త పుంతలకు విస్తరిస్తే ఇంకా బాగుంటుందేమో !

 18. Desikachary అభిప్రాయం:

  June 7, 2010 7:48 pm

  I did not even knew a book called VaitaaLikulu existed until I read Ramaraogari message. In fact, I read very few books of modern Bhavakvis, except Andhra Prasasti by Viswanatha and some works of Indraganti Hanumacchastrigaru. So, any similarities to other poets are entirely conincidental in thought or plot. My two favorite poets in Telugu literature are Ramaraja BhushaNudu and Indraganti. I think these two represnt pretty well the entire spectrum of Sampradaayika literature from old to new. There is no greater Bhavakavi than RamarAja BhushaNudu – no other poet could have described the Suktimati-Kolahala episode better than him. In short, I did not try to imitate anybody in this Khandika, because I did not read anything like this by anyone before, so any similarities are entirely conincidental.

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.