శరణాగతి

అట్లు గానవిజ్ఞానంబు నలవరించి
శారదాదేవి దర్శింపఁ జనెను తరుణి,
తద్వియోగభరంబును దాళలేక
ఘోషిలుచునుంటి మిట మేము “కుహు”రవాల!”

అనుచుఁ దెల్పిన యా కోకిలాళి నెల్ల
ఘనముగాఁ గొనియాడి,తద్వనము వీడి
చెరువుగట్టుననున్న మందిరమునందుఁ
గొలువు దీర్చిన శారదం గొలువఁ గంటి.

అందున డాఁగి నేను తరళాయతలోచన ధ్యానమగ్నయై
డెందమునందునన్యముల డీల్పడఁజేసి తదేకచిత్తయై
కుందసుచందనోపమసుకోమలగాత్రిని శారదాంబ నా
నందముగా భజించు విధి నారసి యట్టులె చూచుచుండఁగన్.

ఆ మహిళాలలామ హృదయాంచితసర్వకళాస్వరూపతే
జోమయమైన జ్యోతి వనజోద్భవురాణిని జేరి తన్మహా
ధామములోన లీనమయి తన్మృదుగాత్రము యష్టిపోలికన్
భూమిని గూలినం గని ప్రభూతశుగన్వితమానసుండనై.

కట్టెవలె నున్న ప్రేయసి కాయమరసి
బిట్టుగా విలపించితిఁ బెద్దతడవు;
కాని శారదాదేవి సత్కరుణవలన
దుఃఖమును బాపు నొక త్రోవ తోఁచె నాకు.

“నశ్వరము దేహ మాత్మ యనశ్వరంబు,
పుణ్యవతి యామె పల్కులపొలఁతిఁ గూడె
దేహముండఁగనే కాన దీలుపడక
శారదాదేవి శరణంబుఁ గోరుకొనుము!

నశ్వరమౌ శరీరమును నాతి త్యజించి కళాప్రపూర్ణమై
శాశ్వతమైన యాత్మను నజప్రియలోన లయింపఁజేసె,నా
శాశ్వతసత్కళాత్మతనె శారదనుండి గ్రహింపనెంచుమా
శాశ్వతికప్రియాభిరతి స్వాంతమునందున నీకుఁ గల్గినన్!”

అనుచు నేదొ యంతర్వాణి హంసవాహ
నాశ్రయింపుము; తత్కళాత్మైకపదముఁ
బొందుమంచును బలుక నా పుస్తకస్వ
రూపిణిం గూర్చి పల్కితీ రూపముగను.

వేదాదివిద్యలే విహరణక్షేత్రంబు
         లేదేవి కాదేవియే దిక్కు నాకు,
తెలిమించు రాయంచ తేజిపై విహరించు
         నేదేవి యాదేవియే రక్ష నాకు,
పండితస్వాంతముల్ స్ఫటికంపుముకురంబు
         లేదేవి కాదేవియే నేత్రి నాకు,
కవిరాజికావ్యముల్ కనకంపు రవణంబు
         లేదేవి కాదేవియే దాత్రి నాకు,

శరణు! శరణంటి నీకు నో చంద్రవదన!
ఆదరంబున సత్కళాత్మైకసిద్ది
నాకు దయసేయుమోయమ్మ నలువరాణి!
వాణి! కల్యాణి! గీర్వాణి! పద్మపాణి!

నీదు దయావిశేషమున నిల్చును మూఁగయు గొప్ప వాగ్మియై,
నీదు కృపావిశేషమున నిల్చు ఖలుండును పండితుండునై,
నీదు శుభాకృతిం గలసి నిల్చిన నాదు ప్రియాకళాత్మనే
ఆదరమొప్ప నాహృదయమందున నిల్పి యనుగ్రహింపుమా!”

అని గీర్వాణికి మ్రొక్కఁగాఁ గనుచు నన్నాదేవి హృష్టాత్మయై
తన నేత్రాంతదయావిలోకనములం ధన్యాత్మునిం జేసె, నం
తనె నేత్రంబులఁ గప్పియున్న కల యంతంబయ్యె, నా మందిరం
బును, నారామము సర్వమున్ క్షణములోఁ బొందె న్వినష్టాకృతిన్.

అట్లు కలనైనఁ గాంచు భాగ్యంబు గలిగె
నబ్జభవురాణి నని యెంతొ హర్షమంది
శరణుజొచ్చితి నాదేవి సత్వరముగ
బుద్ధికొఱకును, కవితాత్మసిద్ధికొఱకు.