చాపల్యం

సంతోషంగా ఆఫీసు మెట్లెక్కి పైకొస్తూ పక్క కేబిన్ లోకి తొంగి చూసాను. మృణాలిని అప్పటికే వచ్చి దీక్షగా ఏదో పేపరు చదువుతోంది. మనసు బాధగా మూలిగింది.

అసలు నాకు మృణాలిని అంటే ఇష్టం వుండకపోవటానికి వుండే సవాలక్ష కారణాల్లో ఇదే అన్నిటికంటే ముఖ్యమైనదేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసుకి తొమ్మిది గంటలకల్లా రావటమే కాదు, రాగానే కబుర్లూ, కాఫీలతో ఏ మాత్రం టైం వేస్టు చేయకుండా పనిలో పడుతుంది. మనకంటే తెలివి తక్కువ వాళ్ళనీ, నీచులనీ క్షమించి స్నేహం చేయగలుగుతాం కానీ మనకంటే తెలివైన వాళ్లనీ, మనకంటే సిన్సియర్ గా కష్టపడి పని చేసే వాళ్లనీ క్షమించి ప్రేమించగలగటం మానవ మాత్రులం మనవల్ల అయే పనేనా? మరందుకే నాకామంటే ఒక రకమైన అసహనం.

అసలా మాటకొస్తే పేరు దగ్గర్నించే తనంటే నాకిష్టం వుండదు. మృణాలిని, ఎంత అందమైన పేరు. ఆ పేరు ముందు నా పేరు, లక్ష్మి, ఎంత బోరుగా, తీసి కట్టుగా వుంది అనిపిస్తుంది నాకెప్పుడూ. పేరే కాదు, అన్ని విషయాల్లో నేను తనకంటే తక్కువే! నేను చిన్న టెక్నికల్ అసిస్టెంటుగా చేరి మెల్లిగా కష్టపడి ప్రమోషన్లు సంపాదించి ఆఫీసరు నవుతే, తనేమో చిన్న వయసులోనే పెద్ద చదువులు చదివి డైరెక్టు రిక్రూట్‌గా ఇదే కేడర్ లో చేరింది.

పెళ్లైనా, పిల్లా పీచూ బాదరబందీ లేకపోవటంతో అందరికంటే ముందే మల్లె పూవులాటి చీరలో వచ్చి కూర్చుంటుంది ఆఫీసులో. నేనేమో ఇద్దరు పిల్లలని సవరించి, ఇంటిల్లి పాదికీ అమర్చి, బస్సులెక్కీ దిగీ రొప్పుకుంటూ రోజుకుంటూ చెమట కారుతూ వస్తాను. సాయంత్రాలూ అంతే. తనకేదైనా పని వుంటే ఆగిపోతుంది. నాకేమో సాయంత్రం అయిదైతే చాలు, ఇంటికెళ్లకపోతే కొంపలంటుకున్నంత టెన్షన్.

పాతికేళ్ళ అందమైన మొహం ముప్పై అయిదేళ్ళ నాకెలా వస్తుంది? నాకేమో మొహం ఎప్పుడూ చిరాగ్గా, కోపంగా వుంటుంది. సహజంగానే అందరికీ ఆమె నవ్వు మొహమూ, నెమ్మదైన మాటా నచ్చుతాయి. నేనేదైనా పని చెప్పితే నిర్లక్ష్యంగా వెళ్లిపోయే అటెండర్లు ఆమె మంచి నీళ్లడిగినా పోటీలు పడి తెస్తారు. మరి ఊరికే అన్నారా, బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు, అని! అయినా అలా చిరునవ్వులు నవ్వుతూ పెద్దా చిన్నా అందరినీ నా చుట్టూ తిప్పుకోవటం నా వల్ల కాదమ్మా! ఏదో సంసార పక్షంగా వుంటూ, నేనూ నా ఆఫీసు పని, అంతే!

మా మేనేజరు కూడా అంతే! ఇంత అనుభవం వున్నదాన్ని, నేనున్నానా? అయినా అన్నిటికీ, “మృణాలినీ మేడం అభిప్రాయం కూడా అడిగి…” అంటాడు నీళ్లు నములుతూ! నాకైతే అరికాలి మంట నెత్తి కెక్కుతుంది.

నేనూ ఏం తక్కువ తినలేదు. ఇంతకు ముందులా ఎప్పుడూ వార పత్రికలు చదవటం, స్నేహితులతో కాఫీలూ, కబుర్లూ అన్నీ కట్టిపెట్టి, ఇంటర్నెట్లో వుండే కొత్త కొత్త టెక్నికల్ పుస్తకాలు చదువుతూ, చర్చలు చేస్తూ నా ఙ్ఞానాన్నీ, ఆఫీసులో నా పర్ఫార్మెన్సునీ మెరుగు పరుచుకుంటున్నాను. నిజానికి వీటన్నిటికీ మృణాలినే నాకు చాలా సహాయం చేస్తుంది.

అందుకని నాకామె అంటే కోపం పెరిగిపోయింది!

ఇవాళ మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆఖరికి నాకూ ఒక అవకాశం వచ్చింది, నా గొప్పతనం చూపించుకోవటానికి. నిన్న రాత్రంతా నిద్ర లేదు. ఒక రకమైన ఉద్వేగంతో, నేను చెప్పబోయే విషయం వినగానే మృణాలిని మొహం ఎన్ని రంగులు మారుతుందో తలచుకుని సంతోషపడుతూ గడిపాను. పొద్దున్నే లేచి గబ గబా తయారై ఆఫీసుకొచ్చాను.

రాగానే అర్జంటుగా పంపాల్సిన ఒక రిపోర్టు పంపగానే మృణాలినిని కాఫీకి తీసికెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అక్కడైతే చాలా సానుభూతిగా నా మొహం పెట్టి విషయం చెప్పొచ్చు. చెప్పగానే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుందేమో! పెద్దదానిగా ధైర్యం చెప్పాలి. నిన్ననేను చూసిన దృశ్యం తలచుకోగానే మళ్ళీ ఎక్సైట్మెంటు నాలో.

నిన్న ఆఫీసునించి ఇంటికెళ్ళేసరికి బాగా అలిసిపోయాను. ఆయన, “ఇవాళ వంటేమీ వద్దులే, బయటికెళ్ళి తిందాం”, అన్నారు. ఫిల్లలు గంతులేస్తూ తయారయ్యారు. మంచి రెస్టారెంట్లో భోజనానికి ఆర్డరిచ్చి, చిరు చీకట్లలోంచి వస్తున్న సంగీతాన్ని వింటూ రిలాక్స్ అవుతున్నాను. పక్క టేబిల్ నించి నవ్వులు వినబడి తిరిగి చూసాను! ఇంకెవరు, సునీల్! మృణాలిని భర్త! పక్కనే ఇంకెవరో అమ్మాయి. జీన్స్ పాంటూ, షర్టూతో అత్యాధునికంగా తయారయి ఉంది. అతని మీదకి ఒరిగిపోయి మరీ నవ్వుతోంది. పది మంది ముందూ వాళ్ళ ప్రవర్తన నాకేమి నచ్చలేదనే చెప్పాలి. ఒకళ్ళ ప్లేటు లోంచి ఒకళ్ళు లాక్కుని తింటూ, చెవిలో రహస్యాలు చెప్పుకుని గొల్లున నవ్వుతూ, కొంచెం విచిత్రంగానే ప్రవర్తిస్తున్నారు.

నేను పొరబడ్డానేమో అనుకున్నాను. ఇంటికొచ్చి అదేదో ఆఫీసు పార్టీలో మా పిల్లలతో కలిసి మృణాలిని తీయించుకున్న ఫోటో వెతికి తీసాను. సందేహం లేదు, అతనే! ఇప్పుడేం చేయాలి? ఆమెతో చెప్పనా వద్దా? వూరికే అలా అనుకున్నానే కానీ తప్పకుండా చెప్తానని నా మనసు లోతుల్లో తెలుసు.

ఆ చెప్పటం తన మంచి కోసమా లేక “నువ్వెంత అందగత్తె వైనా, చదువూ తెలివీ, ఉద్యోగమూ వున్న దానివైనా, మొగుడు మోసం చేస్తే మాత్రం ఉత్త ఆడదానివే” అని హేళన చేయటానికా అన్నది మాత్రం నాకు అర్ధం కావటం లేదు. ఆలోచిస్తూనే నేను పంపాల్సిన రిపోర్టు చదువుతున్నాను.

ఆలోచనల్లోంచి బయటపడి ఫోన్ చేసి మృణాలినిని పదింటికి కాఫీకి రమ్మన్నాను. అయిదు నిమిషాలు ముందే కేంటీన్‌కి వెళ్ళాను. కాఫీ తెచ్చుకుని కిటికీ పక్కన కూర్చున్నాను. బయట సన్నని జల్లు పడుతుంది. బయటకి చూస్తూ కూర్చున్నాను. అలా వర్షపు జల్లు లోంచి చూస్తున్నప్పుడల్లా చిన్నప్పటి రోజులలోకెళ్తాను.

చిన్నప్పుడు నేను భలే అమాయకంగా, ఏ బాధ్యతా పట్టనట్టుండేదాన్ని. ఏదో స్కూలు కెళ్ళటం, హోం వర్కు చేసుకోవటం, స్నేహితులతో ఆడుకోవటం తప్ప, పోటీలూ, ఈర్ష్యా, అసూయలూ ఏవీ అంటని వయసూ, మనసూ! నాతోటి చదివే సరళకి జబ్బు చేసి చదువుకోలేకపోతే పరీక్షలకి నోట్సు రాసి పెట్టాను. నాలుగోతరగతిలో కాబోలు ఇలాటి వర్షంలోనే తడుస్తూ పక్కింటి కుసుమ వెనకాలొస్తుంటే పరిగెడుతున్నాను. బూట్ల లేసుల్లో కాలు చిక్కుని కిందపడిపోయింది కుసుమ. వెనక్కి తిరిగి వచ్చి, లేపి నిలబెట్టి, మొహానికంటిన బురద అంతా చేతనయినట్టు తుడిచి, బూటు లేసులు సరిగ్గా కట్టి స్కూలుకి తీసికెళ్ళాను. తడిసి ముద్దైపోయి, ఆలస్యంగా వచ్చినందుకు టీచరు తిట్టింది కూడా. తలుచుకుంటే నవ్వొస్తుంది.

తన కాఫీ తెచ్చుకుని వచ్చి కూర్చుంది మృణాలిని. ఆలోచనలకి భంగమై తన వైపు చూసాను.

“చెప్పండీ. ఎందుకో రమ్మన్నారట.”

ఒక్క క్షణం ఆగి, “ఎబ్బే! ఏం లేదు. జస్ట్ ఫర్ ఏ కేచ్ అప్! ఎలా వున్నారు? చాలా రోజులయింది మాట్లాడి.” అన్నాను.

“అవునండీ! ఏం చేస్తున్నామో అర్ధం కావటంలేదు కానీ ఇరవై నాలుగు గంటలూ సరిపోతున్నట్టే లేదు! నిజం చెప్పాలంటే, నాకు మిమ్మల్ని చూస్తే ఎక్కళ్ళేని అడ్మిరేషన్. ఊరికే ఆఫీసుకొచ్చీ, ఇంటికెళ్ళీ నేనింత అలసిపోతానా! మీరు ఇవన్నే కాకుండా, పిల్లల అవసరాలూ గమనిస్తూ, ఇల్లూ వాకిలీ సమర్ధించుకుంటూ, యూ డూ సచ్ ఏ గుడ్ జాబ్! ఆ రోజు పార్టీలో మీ పిల్లలని చూసాను కదా! ముత్యాల్లాగున్నారిద్దరూ! మిమ్మల్ని ఎంతైనా అప్రీషియేట్ చేయాలి.”

ఉన్నట్టుండి సంభాషణలో నా పిల్లలు ప్రవేశించేసరికి నా మొహంలో ఒక చిన్న వెలుగూ, సన్నటి చిరునవ్వూ! కానీ నేను అలానే కిటికీలోంచి చూస్తూ తన మాటలు ఎక్కువ శ్రధ్ధగా వినటం లేదు. కాఫీ ముగించి లేచి ఆఫీసుల్లో కెళ్ళామిద్దరమూ, అప్పుడప్పుడూ ఇలా కాఫీ కొచ్చి కష్టం సుఖం చెప్పుకోవాలనుకుంటూ.

నా ఆఫీసు కొచ్చి రిపోర్టు తెరిచి చదవడం మొదలు పెట్టాను. ఉన్నట్టుండి గుర్తొచ్చింది, మృణాలినికి నేను చెప్పదల్చుకున్న విషయం చెప్పటమే మరిచి పోయానని. ఎందుకో చెప్పాలనీ అనిపించలేదు. అన్నట్టు నా మీద నాకు అయిష్టం కొంచెం తగ్గినట్టనిపిస్తుంది. కొన్ని సార్లు నా మనసు నాకే అర్ధం కాదు!

శారద

రచయిత శారద గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు. ...