భవబంధాల సాక్షిగా…

మళ్ళీ సాయంత్రం అవుతూ ఉండగా ఇప్పటిదాకా ఇంటి నుండి ఫోన్ లేదన్న సంగతి గుర్తొచ్చింది. “నా మిస్డ్ కాల్స్ చూసి కూడా ఫోన్ చేయలేదేం?” ప్రత్యూషకు కొంచెం కంగారుగా అనిపించింది. కానీ, ఏం చేయాలో తోచలేదు. మళ్ళీ కాల్ చేయడం -అవతల ఎత్తకపోవడం -చిరాకుపడ్డం. ఇలా కొన్నిసార్లు జరిగేసరికి, రాత్రి ముసిరే కొద్దీ ప్రత్యూషకు కంగారు పెరిగింది. ఆఫీసులో కూర్చుని కూర్చుని విసుగొచ్చి, ఇంటికి బయలుదేరిందన్న మాటే కానీ, మనసంతా అయోమయంలో, తెలీని భయంలో మునిగి ఉంది. తలుపు తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది కానీ, ప్రత్యూష స్థితిలో మార్పు లేదు.అర్థరాత్రి దాకా ఫోన్లు చేస్తూనే ఉంది ఇంటికి.

చా! నిన్నా-మొన్నట్లో కాల్ చేసి మాట్లాడి ఉండాల్సింది.

అయినా, ఎవరికన్నా ఏమైనా అయి ఉంటే, మూడ్రోజులౌతోంది – ఎవరో ఒకరు కాల్ చేసి చెప్పేవారుగా?

ఎవరికీ ఏం కాకపోతే – ఫోన్లెందుకు ఎత్తట్లేదు?

నాన్న ఫోనెందుకు ఇప్పుడు కూడా అవుటాఫ్ రీచ్? అమ్మ ఫోన్ ఇంతసేపు చూడదా? అసలు ల్యాండ్‍లైన్ ఎత్తరేం?” – ఇలా ఆలోచిస్తూనే, దాదాపు పన్నెండున్నరదాకా ఫోన్లు కలుస్తాయేమో ప్రయత్నిస్తూనే ఉంది ప్రత్యూష. “పోనీ, పడుకున్నారేమో, పొద్దున్నే చేస్తాను…” – తన ఆలోచన తనకే అసంబద్ధంగా అనిపించినా, చివరకు ఫోన్లు ఆపింది. కానీ, నిద్రపట్టదే. అలా అలా ఏవేవో ఆలోచిస్తూ, ఎప్పటికో నిద్రపోయింది.

ఫోన్ అదేపనిగా మ్రోగుతూ ఉంటే, ప్రత్యూషకు మెలుకువొచ్చింది.శబ్దం వినబడగానే ఇంటినుంచేమో అని, ఉలిక్కిపడి లేచి, ఫోన్ తీసింది. ఇంతలో కాల్ ఆగిపోయింది. నంబర్ చూస్తే – ఏదో కొత్త నంబర్. అబ్బబ్బ! పొద్దున్నే వీళ్ళెవరో! అని విసుక్కున్నా, మనసేదో కీడును శంకించింది. ఇంటికి కాల్ చేయబోయేంతలో – మళ్ళీ సెల్లు మ్రోగింది – ఇందాకటి నంబరే. విసుగ్గా ఫోన్ ఎత్తి – ’హలో’ అంది ప్రత్యూష.

“నేనే అమ్మను. లేచావా?”

“అమ్మా! ఎక్కడికిపోయారు మీరంతానూ? నిన్న ఎన్నిసార్లు కాల్ చేసానో తెలుసా?” గట్టిగా అరిచింది ప్రత్యూష.

“ఏమౌతుందే…అందరం బానే ఉన్నాము…”

“ఏమైందసలు? ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తరేం?”

“అది కాదే… నా ఫ్రెండు భాగ్య ఆంటీ ఉంది కదా – నిన్న తనకి యాక్సిడెంటైంది. వాళ్ళింట్లో వాళ్ళెవరూ ఊర్లో లేరు. దాంతో పొద్దున్నే మీనాన్న ఆఫీసుకెళ్తున్నప్పుడే నేను చెప్పేసి హాస్పిటల్ కి వెళ్ళిపోయాను. చిన్నదేమో కాలేజీకి వెళ్ళిపోయింది. ఇక భాగ్యకు తోడుగా అక్కడే ఉండిపోయా. ఇప్పుడిక ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నా, వాళ్ళ వాళ్ళు ఊర్నుంచి వచ్చేసార్లే…”

“ఎలా ఉందిప్పుడు ఆంటీకి…?”

“తనకేం పర్లేదు లే. తనకి కంగారెక్కువవడంతో నేనక్కడే ఉండిపోయా. పెద్ద దెబ్బలేం తగల్లేదు… భయం… అంతే” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, ప్రత్యూష మధ్యలోనే ఆపి –

“అయినా, నీ సెల్లేమైంది? ఆ ల్యాండ్ లైన్ ఒక్కసారి కూడా ఎవరూ ఎత్తలేదేం? నాన్న సెల్లేమైంది…?” – ప్రశ్నలమీద ప్రశ్నలు.

“అయ్యో! నిన్నంతా మాకూ అవస్థే. మన ఫోను మూడ్రోజులుగా డెడ్ అయి ఉంది. నేనేమో హడావుడిలో నిన్న సెల్లు పట్టుకెళ్లలేదు. అది ఎప్పట్లాగే సైలెంట్ మోడ్‌లో ఉంది కనుక, నువ్వు చేసినా ఎవరికీ తెలిసుండదు. నిన్న చాలా అవస్థ పడ్డాంలే ఈ ఫోన్లు పని చేయకపోవడం వల్ల. ఉన్నదానికి తోడు, మీ నాన్న సెల్లు పోగొట్టుకొచ్చారు…”

“ఒక్కళ్ళైనా ఫోన్ చేసి ఉండొచ్చుగా..”

“ఇప్పుడు చేస్తున్నా కదా ఫోను. నిన్న మీ నాన్న హాస్పిటల్‌కి వచ్చి ఫోను పోయిన సంగతి చెప్పేదాక నేను కూడా ఆయన సెల్లుకి చేస్తూనే ఉన్నా. ఆఖరుకి పక్కింటివాళ్ళకి చేసి ఆయన వచ్చినపుడు రాత్రికి నేను హాస్పిటల్లోనే ఉంటానని చెప్పమని చెప్పాను..దాంతో ఆయన హాస్పిటల్ కి వచ్చి వెళ్ళారు.. ”

“ఆ సౌజీ ఏం చేస్తోంది?” – చెల్లెల్ని ఉద్దేశించి అంది ప్రత్యూష.

“అదెక్కడుందసలు? వాళ్ళ ఫ్రెండింట్లో నైటౌట్ అని నిన్న పొద్దున్నే బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది.”

“మీరంతా కలిసి – నాకెంత కంగారు పుట్టించారో తెలుసా….ఇంతకీ ఈ నంబర్ ఎవరిది?”

“హాస్పిటల్ లో పబ్లిక్ బూత్. సరే, పెట్టెస్తానిక.”

“బై…” అని ఫోన్ పెట్టేసి పత్యూష ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూంటే ఇంతలో మళ్ళీ ఫోను మ్రోగింది. చూస్తే అమ్మ సెల్ నుంచి –

“హలో” అంది ఆశ్చర్యంతో.

“నేన్రా …. చాలాసార్లు చేసినట్లున్నావ్ కదా అమ్మ సెల్‌కి” – నాన్న గొంతు.

“ఏంటి నాన్నా…నిన్న ఇంట్లోనే ఉన్నావుగా…. ఒకసారి చూసి ఉండొచ్చు కదా సెల్ ఎక్కడుందో…”

“నాకు తెలీదమ్మా… మీ అమ్మని అడిగితే గుర్తులేదంది… ఇప్పుడు వంటింట్లోకి వెళ్తే, గిన్నెలు పెట్టే స్టాండు పక్కన కనబడ్డది సెల్… ఏం చేసేది?”

“హమ్మయ్య! ఏమీ కాలేదన్నమాట…” – ఇంతలోనే…

“నాకెవ్వరూ వద్దు. మనుష్యులతో సంపర్కమే వద్దు… అదీ ఇదీ అన్నావు….?” – మనసు సిద్ధంగా ఉంది.

“ఇప్పుడూ అదే అంటున్నా…”

“చెప్పేదొకటీ… చేసేదొకటీ…”

“చెప్పేదే చేయాలనుంది… చెయ్యాలనుకునే చెప్తున్నాను… కానీ నువ్వే నాకడ్డు..”

“నేనా…”

“శల్య సారథ్యం చేస్తున్నావ్ గా…”

“తప్పంతా నాదేనంటావ్?”

“కాదు – నిన్నూ, నన్నూ కలిసి బ్రతకమని శాసించిన వాడిది”

“అయితే మరి, అసలు నీది బలహీనతా? నీ బలహీనతలకు కారణం ఏమిటి? అసలు నువ్వు…”

“ఆఫీసుకి వేళవుతోంది… పద పద…”

ఎప్పట్లాగే, అడిగినవీ, అడగనివీ – ఏ ప్రశ్నలకి జవాబులు ఇద్దరికీ దొరకలేదు.