భవబంధాల సాక్షిగా…

ఏరోజుకారోజు మనుషుల్తో మాట్లాడకూడదు, మనుషుల్తో చేరకూడదు – అనుకోడం ఓ రెండు మూడు నెల్ల బట్టీ జరుగుతూ ఉంది. అలా అలా క్రమంగా తగ్గిస్తూ తగ్గిస్తూ ఇరవైనాలుగ్గంటలూ స్నేహల్లో మునిగి తేలే ప్రత్యూష ఉనికిని చాలా మంది మర్చిపోయేదాకా తెచ్చుకుంది. కానీ, రోజుకోసారి ఇలా ఒకరిద్దరిని హలో అని పలకరించడం మాత్రం మానలేకపోయింది.

“నువ్వు మానలేవోయ్! నువ్వు మనుషుల్తో మాట్లాడ్డం మానలేవు” అని ఓ పక్క మనసు చెబుతోంది.

“ఏం? మనుషులేం పెద్ద ఇదా?”

“మనుషులేమో కానీ.. నువ్వు మాత్రం పెద్ద ‘అది’ కాదు. కనుక నువ్వు అలా ఉండలేవు.”

“నాకు చిరాకేస్తోంది ఈ బంధాలు తెంచుకోలేకపోవడం చూస్తూ ఉంటే! నా బలహీనతకి నా మీదే అసహ్యం పుడుతోంది” – అసహనంగా అన్నది ప్రత్యూష.

“తెంచుకోలేకపోవడం బలహీనతే అంటావా?”

“కాక? నేను తెంచుకోవాలి అనుకున్నాక తెంచుకోలేకపోవడం మాత్రం తప్పక నా బలహీనతే” – మొండిగా అంది ప్రత్యూష.

“నువ్వు పెట్టుకున్న లక్ష్యమే అసాధ్యమైనదేమో?”

“మనిషి చంద్రుణ్ణే చూసొచ్చాడు.” – ప్రత్యూష నవ్వింది.

“మనిషి చంద్రుణ్ణి చూసాడేమో – మరి, తనని తాను చదూకోగలిగాడా? తన మనసు ఎక్కడుందో తెలుసుకోగలిగాడా?”

“అసలీ మాటల్లోనే తెలుస్తోంది తెలుసా నీకెంత పొగరో, గర్వమో?” కోపంగా అంది ప్రత్యూష.

“పొగరేముంది – అది నిజమే కదా! నేనేంటోనే తెలుసుకోలేకపోయాడు మనిషి. అసలు నేనెక్కడుంటానో ఇప్పటిదాకా సరిగ్గా చెప్పలేకపోతున్నాడు – ఇక నాలోని లోతులెక్కడ తెలుస్తాయి?” – ధీమాగా అంది మనసు.

“మరి నీకు నా గురించి తెలుసా? నేనిలా ఉండలేను అంటున్నావు?”

“నేననీ.. నీవనీ… వేరుగా లేమని… చెప్పినా చెప్పినా వినరా ఒకరైనా… నేను నీ నీడనీ, నీవు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా…” పాట వినిపించింది, మిక్కీ జె.మేయర్ సంగీతంతో సహా.

“చాల్లే! ఆపు! భరించలేకపోతున్నాను.” అసహనంగా అరిచింది ప్రత్యూష.

అటువైపు నవ్వు వినిపించింది. ప్రత్యూష చుట్టూ చూసింది – గదిలో తానొక్కతే.. ఎప్పటిలాగే.

“పోనీ, వీళ్ళని నాతో మాట్లాడ్డం మానేయమని రిక్వెస్టు చేద్దామా?”

“అబ్బే! అలా అంటే మళ్ళీ బాగోదు. మనమే మాట్లాడ్డం మానేద్దాం..”

“అబ్బ! ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నాను… పోనీ, గొడవపడదామా?”

“గొడవపడ్డమే చేతనైఉంటే ఈ తంటాలన్నీ దేనికి?”

“కొన్నాళ్ళు ఇలాగే అడ్డగోలుగా మాట్లాడుతూ, దాగుడుమూతల్లో బ్రతికితే వీళ్ళంతా విసుగొచ్చి నాతో మాట్లాడ్డం మానేస్తారు లే!”

“నాకీ ఎదురుచూపులంటే అసహ్యం. నాకు ఇన్స్టంట్ రిజల్స్ట్ కావాలి”

“నాకు మనుష్యుల్తో మాట్లాడాలని లేదూ! లేదూ! లేదూ!”

“నాకీ ప్రపంచమంటే అసహ్యం!”

“బంధాలు పెంచుకోడం ఎందుకు? తెంచుకోలేకపోవడం దేనికి?”

“పెంచినంత తేలిగ్గా తెంచుకోలేనప్పుడు పెంచుకోడం దేనికి? చస్తూ చస్తూ కట్టగట్టుకు పోతామా? ఇంకెందుకు ఇవన్నీ?”

“చావనైనా చావనివ్వని వెధవ మానవసంబంధాలు”

“మనసుని చంపేస్తే ఈ సంబంధాల బంధనాలు తెంచేస్కోవచ్చు. కానీ, అదెలా ఉంటుందో కూడా తెలియదే!”

“మనిషిని చంపడంకంటే మనసుని చంపడం కష్టంలా ఉంది.”

“మనిషికంటే మనసు కాంప్లికేటెడా? మనసుతో కలిసిన మనిషి కాంప్లికేటెడా? మనసొక్కటే కాంప్లికేటెడా?”

“అబ్బా!”

-విసుగుతో వచ్చిన కేకో…కేకే విసుక్కుందో! ప్రత్యూషకంతా గజిబిజిగా ఉంది.

రోజులు గడుస్తున్నాయి. ప్రత్యూష ఆఫీసు పని అవసరమైన దానికన్నా ఎక్కువసేపు చేస్తూ, పలకరించాలనుకుంటున్న వారికి దొరక్కుండా, దొరికిన వారితో బిజీ అని చెప్పి తప్పించుకుంటూ, వీలు చిక్కినప్పుడల్లా తన గురించి తానే సైకో అనాలిసిస్ చేసుకుంటూ, బ్రతుకెందుకు? చావెందుకు? అని ప్రశ్నించుకుంటూ గడిపేస్తూ ఉంది. అలాంటి రోజుల్లో ఓ రోజు –

“నాన్నకి ప్రమోషనొచ్చింది” – అని పొద్దున్నే అమ్మ ఫోనుతో నిద్రలేచింది ప్రత్యూష.

అప్పటికి ఇంటికి కాల్ చేసి రెండ్రోజులౌతోంది. ఇంట్లో వాళ్ళకి కూడా విసుగొచ్చి తనే చేస్తుందని వదిలేసుంటారు అనుకుంది, వాళ్ళు కూడా చేయకపోయేసరికి.

“ఏమిటీ నిన్నా, మొన్నా మాట్లాడలేదు?” – అడిగింది అమ్మని.

“నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు, మేము మాత్రం ఉండకూడదా?” – పక్క నుంచి చెల్లి అరుపు వినిపించింది, వాళ్ళు స్పీకర్ ఆన్ చేసారని అప్పుడు అర్థమైంది ప్రత్యూషకి.

“నేనేదో బిజీగా ఉన్నాను… నీకేమొచ్చిందే?” విసుగ్గా అంది ప్రత్యూష.

“అది కాదే, ఎందుకు నీకంత విసుగు. చెల్లెలే కదా.” అమ్మ మధ్యలో అందుకుంది.

కొన్ని నిముషాల మాటలు. “నీ గురించి దిగులుగా ఉంది.” “సరిగా తింటున్నావా?” “ఎందుకు ఈ మధ్య ఇలా ముక్తసరిగా మాట్లాడుతున్నావు?” “ఏమన్నా సమస్యలా అక్కడ?” “ఎవరితోనన్నా గొడవా?” – ఇలా ప్రశ్నలన్నీ వింటూ అన్నింటికీ “ఊ” అనో “ఊహూ” అనో జవాబిచ్చేసాక “వదలాలనుకున్నా వదలని ఈ బంధాలేమిటీ? ఎవరితోనూ సంబంధం లేకుండా బ్రతకలేమా?” అనుకుంది ప్రత్యూష.

ఫోను పెట్టేశాక ఆఫీసుకి బయల్దేరింది. మరో రోజు… యధావిధిగా…

“రెండ్రోజులౌతోంది – ఇంటి నుంచి ఫోన్ లేదు. ఈసారి కూడా వీళ్ళు కావాలనే చేసుంటారు, నేను చేస్తానేమో అని. ” అనుకుని ప్రత్యూష చిరాగ్గా అనుకుంది. అలాగే ఆఫీసుకెళ్ళింది.

మధ్యాహ్నం ఔతూ ఉండగా, మెషీన్ కాఫీ సేవిస్తూ ఉండగా, ఇంటి ఫిల్టర్ కాఫీ గుర్తొచ్చి, “ఎవరో ఒకరం…ఎవరు చేస్తే ఏం?” అనుకుని… ఇంటికి కాల్ చేసింది. జవాబులేదు.

“అదేమిటి – ఇంట్లో లేకుండా ఎలా ఉంటారు?” అనుకుని వాళ్ళమ్మ అమ్మ సెల్‌కి చేసింది. రింగ్ ఔతుంది కానీ ఎత్తట్లేదు. నాన్న సెల్‌కి చేస్తే – అవుటాఫ్ కవరేజ్ ఏరియా. “ఈయనకి ఆ పల్లెటూరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఈ నో-సిగ్నల్, లో-సిగ్నల్ బాధలు తప్పవు కదా…” నిట్టూర్చింది.

“హే, ఏమిటి అలా ఫోన్ చూస్తూ ఆలోచిస్తున్నావ్, ఎవ్రీథింగ్ ఓకే?” – ఆఫీసులో తెలుగు కొలీగ్ పలకరింపుతో మళ్ళీ తేరుకుని, సరే, కాసేపాగి చూద్దాంలే అనుకుని పనిలో పడింది ప్రత్యూష.