గుండుగొమ్ములనుమానం – 3

నిపుణులైన రచయితలు తమ సృజన తత్వపు ఎరుకలో నిష్టులై ఉన్నారు. నామిని, త్రిపుర, Salinger వంటి వాళ్ళను నేను ‘బాలోన్మత్త పిశాచవట్’ అన్నది ఇందుకే. వాళ్ళు చిన్న పిల్లలు కారు, పిచ్చివాళ్ళు కారు, పిశాచాలూ కారు, రస నిష్టులైన యోగుల్లాంటి వాళ్ళు. తమకే స్థిరంగా, అనుభవపూర్వకంగా తెలిసిన తమ సృజన తత్వం ఒక్కదానికి మాత్రమే కట్టుబడి ఉండి, దానికి విరుద్ధమైనవన్నిటినీ అవి ఎంతటి వాంఛనీయమైన విషయాలైనా అనివార్యంగా తృణీకరిస్తున్న వాళ్ళు. మిగిలిన సృజన రంగాల్లో కూడా ఇలాంటి నిష్ట ఉన్న సృజనకారుల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ నిబద్ధతను ఏదో ఒక తత్వానికో, ఆలోచనా మార్గానికో చెందినదిగా అపార్ధం చేసుకోకూడదు. ఉదాహరణకు పోతన, అన్నమయ్య భక్తికి, గద్దర్ విప్లవ మార్గానికి, ధూర్జటి వైరాగ్యానికీ నిబద్ధతను ప్రకటించుకున్నారు, కాని ఇది కాక వాళ్ళు తమ సృజన స్వరూపానికి, స్వభావానికీ నిబద్ధులై ఉన్న, నిపుణులైన కవులు. అందుకే వాళ్ళ జీవన తత్వం, సృజన తత్వం ఒకదానికొకటి అడ్డురావు సరికదా వాళ్ళ సృజనల్లో విడదీయరానంతా కలసిపోయి, ఒకదాన్ని ఒకటి పరిపుష్టం చేస్తాయి.

అలాంటి మేలైన సృజనల్ని ఎలా పోల్చుకుంటాము? ఎవరో ఇలాగే అడిగితే రావి శాస్త్రి గారు ‘చదివితే తెలిసిపోతుంది శిష్యా!’ అన్నాడు. నేను ఇది వరకు అన్న పేచీలలో ఒకటి ఏమిటంటే నాకు నూటికి తొంభై రచనలు రుచించవు. చదవబోతే ఏదో ఒక మేరకు నిరాశ కలిగించి, మరి ముందుకి సాగనివ్వవు. నా రచనలు కూడా ఇందుకు మినహాయింపు కావు. గొప్ప కవులనుకున్న వాళ్ళవి కూడా కొన్ని బావుంటాయి, కొన్ని ‘ఛీ కాదూ, భళా కాదూ’ అన్నట్టుంటాయి. ఏవో కొన్ని, ఎప్పుడో అరుదుగా మాత్రం ‘ఆహా!’ అనిపిస్తాయి. ఇది ఎందుకిలాగ? నా దృష్టి దోషమా? లేక మేలైన సృజనలు అంత దుర్లభమా, కోట్లాది కోట్లమంది మనుషుల్లో ఏ కొందరో మహాత్ములున్నట్టు? కవులు ఒకరిపట్ల ఒకరు సామరస్యంగా, సుహృద్భావంగా ఉండటం, అన్ని రకాల పోకడలనూ ఆదరించటం ప్రజాస్వామ్య సంస్కృతికి అవసరం కదా? మరి నచ్చని సంగతులు నామిని చెప్పుకున్నట్టు పైకి చెప్పుకుంటే మనోభావాలు దెబ్బతినవా?

నా స్నేహితులు ఒకరిద్దరు – సాహిత్యం అంటే బాగా ఇష్టపడేవాళ్ళు, విస్తృతంగా చదువుకున్నవాళ్ళు – నాకు త్రిపురంటే ఎందుకంత ఇష్టం అని ఆరోపణగా అడిగేవాళ్ళు. త్రిపుర సృజనలు కనీసం చదివితే ‘అర్ధం’ కావు! ఆలోచనల్ని రేకెత్తించి మనుషుల్ని కార్యోన్ముఖుల్ని కమ్మని బోధించవు! నాక్కూడా ఏమని జవాబు చెప్పడానికీ పాలుపోలేదు. త్రిపుర ఈ విషయం బేషరతుగా ఒపుకుంటారు – ‘ఎవరికో ఇద్దరికో ముగ్గురికో అర్ధమవుతాయనుకుంటాను…’ అని. అర్ధంకావన్న ఆరోపణల్ని గురించి త్రిపుర చెప్పిన ఛలోక్తులున్నాయి. ఆయనకి లెక్కల్లో పాఠాలు పై తరగతులకి పోయేకొద్దీ అర్ధం అయ్యేవి కావట. భిన్నాలు పాఠంగా చెప్పేటప్పుడు ఒక రొట్టెని నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కదాన్నీ 1/4 అనుక్కోమంటే, ‘అలాగెలాగ? ఒక్కోముక్కా అది కూడా పూర్తిగా ఒక రొట్టే కదా?’ అని ఇలాటి సందేహాలతో ఇంక బండి ముందుకి నడిచేది కాదు. పెద్ద లెక్కల పుస్తకాల్నీ, అవి చర్చించుకొనేవాళ్ళనీ చూసి ‘అవి ఏవో నిజమే అయ్యుంటాయి, మనకి ఎక్కవులే!’ అని ఊరుకున్నారట. త్రిపుర వాళ్ళ బంధువులొకాయన, ఏభయ్యరవై ఏళ్ళ మనిషి, పత్రికల్లో వచ్చే కధల్ని చూసి “ఇవీ కధలేన్రా? మధ్యలో మొదలెట్టెస్తారు. ఎలా అర్ధమవుతాయి?!” అని విసుక్కొనేవారట. అంటే ‘పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో సుందర రామ పురం అనే గ్రామమునందు ఒక …’ అని ఇలా ‘మొదట్నుండీ’ చెప్పిందే ఆయనకి రుచించే కధ.

అన్నీ అందరికీ అర్ధం కావాలని ఆశించటం అపోహ. ఈ విషయంలో త్రిపురవి, నారాయణ రావు గారివి కూడా స్థిరమైన అభిప్రాయాలే. ఒక్కో రచయితకి, కవికి వాళ్ళ రచనల్ని అందుకోగలిగినవాళ్ళు, కావాలనుకొనే వాళ్ళూ కొందరే పాఠకులుంటారు. వాళ్ళే వాళ్ళకి ఒకరికొకరు పాఠకులూ, కవులూ. సృజనల్లోనూ ఇలా తరగతులుంటాయి అని, అన్నీ అందరికోసం కానక్కర్లేదనీ ఒప్పుకోవటమే చాలమందికి కష్టంగా ఉంటుంది. కవికి తన సృజనలు ‘నా జాతి జనం గుండెల్లో పాడుకొనే గీతంగా…’ కావాలని కోరికగా ఉంటే అది అందరు పాఠకులూ తను రాసింది ఇష్టపడే తీరాలన్న అపోహకు, ఆశకూ దారితీసే అవకాశం ఉంది. పాఠకులకి తమకు నచ్చిన కవుల్నే అందరూ నచ్చుకోవాలనీ, వాళ్ళు ‘మహా కవులు’ అని ఇతరులు ఒప్పుకోవాలనీ ఉండే కోరిక కూడా ఒక అపోహ. వీరాభిమానం గురించి త్రిపుర ఒకసారి చామల వేపుడు కధ చెప్పేరు. వాళ్ళ మనవడి వరస ఒకబ్బాయి చామల వేపుడొక్కటే తింటాడు తప్ప ఇంక ఏ కూరా తినడు. అవి కూరలే కావు అని తిరస్కరిస్తాడు. కూరల్లో రక రకాల కూరల్ని తిని ఆస్వాదించగలిగినట్టే సృజనల్లో రక రకాలు – మిష్టరీ నవలలు, డిటెక్టివ్ నవలలతో సహా – చదివి ఆస్వాదించవచ్చని, వాటన్నిటిలోను సృజన నైపుణ్యాన్ని, భాషా చమత్కృతిని పరికించి చూడవచ్చని ఉదాహరణలతో చెప్తుంటారు.

నారాయణ రావు గారు వైవిధ్యాన్ని గుర్తించి, ఒప్పుకోవలసిన అవసరాన్ని, పద్ధతినీ బాగా విడమరచి చెప్పేవారు. అన్ని గొప్ప రచనలూ ఒకే రకంగా, అవే కారణాల వల్ల గొప్పవి కావు. ఒక్కోటీ ఒక్కో రకం కారణాల వలన, కొన్ని రకాల పాఠకులకి మాత్రం గొప్పవి. ఇది ఇప్పుడు చాల సరళమైన విషయంలా ఉంటుంది కాని, మా చిన్నప్పుడు దీన్ని గురించే చాల గందరగోళంగా ఉండేది. ఎందుకంటే సాహితీ చర్చ పేరిట మా చుట్టూ ‘శ్రీ శ్రీ గొప్పవాడా, నారాయణా బాబు గొప్పవాడా?’ ‘ఈ శతాబ్దం శ్రీ శ్రీదేనా, ఇంకా ఎవరికైనా వాటా ఉన్నాదా?’ ఇలాంటి సంవాదాలు తీవ్రంగా నడిచేవి. చుట్టూ ఉన్న కవులందర్నీ ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే’ వాద ప్రతివాదాల్లో ఓడించి, ‘గౌడ డింఢిమ భట్టు కంచు ఢక్కా పగలగొట్టటమే’ బాల కవులకి వన్నె తెచ్చే ప్రవర్తన అన్న భావనతో నేను కూడా వీరోచితంగా పోరాడి లయన్స్ క్లబ్ వాళ్ళు, రామక్రిష్ణా మిషన్ వాళ్ళు, సాహితీ సంస్థల వాళ్ళు ఇచ్చే బహుమతుల కోసం ఎగబడేవాణ్ణి. ఈ దురద ఒక యావగా, యుద్ధ కాంక్షగా స్థిరపడకుండా త్రిపుర, నారాయణ రావు గారి వంటి ఉపాధ్యాయులు వాళ్లకి తెలిసో తెలియకో అడ్డం పడి నాకు మేలు చేసేరని తల్చుకుంటాను.

వ్యక్తిగతమైన అభిరుచిని, పదుగురిలో చెలామణీలో ఉన్న ఉమ్మడి అభిరుచినీ సమన్వయం చేసుకోవటం ఎలాగన్న ఈ ప్రశ్నను గురించి సౌందర్య సిద్ధాంతమనీ, రస సిద్ధాంతమనీ, సాహిత్య సిద్ధాంతమనీ మన సంప్రదాయం లోను, పాశ్చాత్య సంప్రదాయం లోనూ చాలా చర్చే ఉంది, వీటిని ఏ కొంతైనా నివృత్తి చేసుకోడానికి ఉపయోగిస్తుంది. మిగతా భాషల సారస్వత సంస్కృతుల్లో కూడా ఇలాంటి చర్చ ఉండే ఉంటుంది. ఈ వ్యాసం ఇప్పటికే తీగె పాకంలాగ సాగుతున్నాది కాబట్టి ఆ సంగతులు ఇంకోసారి వేరేగా మాట్లాడుకోవాలి. పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి ఎలాంటి సృజనలూ ఒక పట్టాన నచ్చేవి కావట. ఆయన తన రస పిపాస తీరుతుందేమోనన్న ఆశతో పధ్నాలుగు భాషల్లోని సాహిత్యాన్ని వెదుక్కుని, ఇంకా తనివి తీరక సంగీతం, నాట్యం కూడా నేర్చుకున్నారట. తీవ్రమైన రస దృష్టి సరస్వతీ తత్వమనీ, దానిలో తాను నిష్టుణ్ణనీ ఆయన చెప్పుకున్నారు. చాసో గారు ఒక పట్టాన ఏ కధలూ తనకి నచ్చవని, నచ్చినవి నిజంగానే వేళ్ళమీద లెక్కించి చెప్పేవారట. విశ్వనాధ సనాతన ధర్మమే తనకు తెలిసిన, తనదైన సంప్రదాయమని, దాన్ని చిత్రిస్తే తనని ఎందుకు తప్పుపడతారని, తనకు తెలిసిందీ, తనదైనదీ రాసుకోక మరి ఇంకేం రాయమంటారనీ వాపోయేరు. నారాయణ రావు గార్ని నేను అభిరుచిని గురించి అడిగితే ఆయన శ్రేష్టమైన అభిరుచి గలవాళ్ళు ఉండే ఉంటారనీ, వాళ్ళు సాహిత్యం పేరిట జరిగే నిర్వాహకాన్ని నిస్సహాయంగా తమాషా చూస్తూ ఉంటారనీ, వాళ్ళు అలా ఊరుకోకుండా తమ దర్శనాన్ని ప్రకటించి, చర్చించాలనీ వాపోయేవారు. చర్చ ఎందుకు? అని అడిగితే చర్చ అభిరుచిని సంస్కరిస్తుందనీ, ఉన్నతం చేస్తుందనీ పదే పదే చెప్పేవారు. త్రిపుర కూడా చర్చకు, విమర్శకు ఉన్న ఈ ప్రయోజనాన్ని గురించి నొక్కి చెప్పేవారు, కాని కళా చర్చ పేరిట జరిగే వ్యాసంగాన్ని అనాసక్తితో పక్కన పెట్టేసేవారు.

చర్చలు సృజనకారులకు కొంతవరకు ఉపయోగ పడతాయిగాని మరీ శృతిమించితే అడ్డంకులౌతాయి అనిపిస్తుంది. ఇందుకేనేమో సృజనను గురించి చర్చలంటే నాకు అదొకలాంటి అయిష్టం. అందుకే ఈ వ్యాసం కూడా ఇంతకుమించి ముందుకు నడవనని మొరాయిస్తుంది. సృజన గురించే కాదు, మనం కావాలనుకొనేవీ, ఉన్నతమైనవి అనుకొనేవీ – ప్రేమ, స్నేహం, దయ, శాంతి, దైవం, ప్రతిభ, సమత, సౌందర్యం, మానవత్వం, మంచితనం, మౌనం, ధ్యానం, ముక్తి ఇలాంటివి – ఏవీ వాటిని గురించి మాట్లాడీ, చర్చించీ పొందగలిగేవి కావనిపిస్తుంది. అంతేకాక వాటిని గురించి ఎంతగా చర్చిస్తే వాటినుండి అంతగా దూరమౌతామనిపిస్తుంది. ‘Word is not the thing’ అని, ‘Map is not the territory’ అని తాత్వికులు హెచ్చరిస్తుంటారు. ‘శబ్దజాల మహారణ్యం చిత్త భ్రమణ కారకం’ అని శంకరాచార్యులు అన్నారట. సృజన గురించిన చర్చలు సృజన కావు కదా. పైగా అవి సృజనశీలుర ధ్యాసను సృజనమీద నిలచి ఉండకుండా పక్కదార్లు పట్టించి ధర్మ పన్నాలుగా పతనమయ్యే ప్రమాదం ఉన్నాయి. ఇందుకే కళా చర్చను గురించి నాకు చాల నిరాశ.