ఉత్తమాయిల్లాలు

భార్య శవం ముందు కూర్చుని, కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు శ్రీరంగశయనంగారు.

ఆయనచుట్టూ అయినవాళ్లూ, కానివాళ్లూ, దారిని పోయేవాళ్లూ చేరి, సర్వవిధాలా అనునయవాక్యాలు చెబుతూ తమవిధిని నిర్వర్తించుకుంటున్నారు.

కొడుకు చక్రధరం వారిని యధావిధి పలకరిస్తూ, వారి ప్రశ్నలకి తోచినట్టు జవాబులిచ్చుకుంటూ, తండ్రినో కంట గమనిస్తూ ఉన్నాడు.

శ్రీరంగశయనం పైపంచెతో కళ్లొత్తుకుంటూ చెప్తున్నారు. “పదహారేళ్లు దానికి పెళ్లినాటికి… నాకు ఇరవైమూడు. ఎంత మర్యాద, ఎంత మప్పితం అంటూ మా అమ్మా, నాన్నా ఎంత మురిసిపోయేరో పిల్లని చూసి! …ముప్ఫైనాలుగేళ్ల కాపురంలో ఒక్కరోజు నోరు విప్పి తనకిది కావాలని కోరలేదు. …నాకేం కావాలో చూసిందే కానీ తనకేం కావాలో చెప్పలేదు. …అనుక్షణం నేను తిన్నానో, లేదో అంటూ తపనపడిపోయిందే కానీ తను తినాలన్న యావ లేదు …అకస్మాత్తుగా పదిమంది గుమ్మంలోకొస్తే కిక్కురుమనకుండా వండి పెట్టిందే కానీ ఇసుమంతయినా ధుమధుమలాడలేదు. కంచాలముందు కూర్చునే వేళకి మరో నలుగురు వచ్చినా సర్దుకుపోయిందే కానీ చిరాకుపడలేదు. …తను తినేవేళకి గిన్నెలో అన్నం నిండుకుంటే, పోన్లెద్దురూ ఓపూట తినకపోతే ఏం అనే అంది కానీ మరోలా వ్యథ పడలేదు. అంతటి ఉదాత్తురాలు. అటువంటి ఉత్తమురాలు మరి పుట్టబోదు…”

“అవునండీ, ఆమెని తలుచుకుంటే చేయెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది” అన్నారు పొరుగింటి సుబ్బారావు ఆయన్ని ఓదారుస్తూ.

నలుగురూ చేరి శ్రీరంగశయనంగారిని రెక్క పుచ్చుకు బలవంతాన లేవదీశారు, మిట్ట మధ్యాన్నానికయినా దహనం అయిందనిపిస్తే, ఆ తరవాత ఇంకా చేయవలసిన విధులు చాలా ఉన్నాయని.

తండ్రీకొడుకులిద్దరూ తలలు బోడి చేయించుకుని, స్నానాలు చేసి పంచెలు కట్టుకుని వచ్చారు.

ముత్తయిదువులు శవానికి స్నానం చేయించి, కొత్తచీరె కట్టి, పసుపూ, కుంకమలతో, పువ్వులతో అలంకరించి పాడెమీద ఉంచేరు. కర్మకాండ పూర్తయేసరికి నాలుగయింది.

అంతసేపూ శ్రీరంగశయనం ఆరారా గుక్క తిప్పుకుని భార్య సుగుణపుంజాన్ని కోమటింట చిట్టా ఆవర్జాల్లా వల్లిస్తూనే ఉన్నాడు.

కాస్త ఎడంగా నిలబడి ఈ తంతు తిలకిస్తున్న ఒకరిద్దరికి ఆయన వరస కాస్త అతిగా కూడా అనిపించింది.

“నేనెంత చెప్తే అంత. ఒఖ్ఖరోజంటే ఒఖ్ఖరోజు నామాటకి ఎదురాడితే ఒట్టు. నాకు నేనై పోనీలే అని ఊరుకోవాలే కానీ తానయి ఒక్కరోజయినా నావల్లకాదండీ అన్లేదు పుణ్యాత్మురాలు… ” అన్నాడాయనే మళ్లీ అందుకుని.

“అవును మరి. ఉత్తమాయిల్లాలు,” అన్నాడు సుబ్బారావుగారు.

పెళ్లినాటికి అమ్మాయికి పదహారు. ఆ బ్రహ్మముహూర్తం ఆసన్నమయేవరకూ ఆరేళ్ల పసిదానిలా నిష్పూచీగా ఆడుతూ పాడుతూ తిరిగింది చిన్నప్పగారి పెదవానిపాలెంలో. సాంప్రదాయకమయిన కుటుంబం. నలుగురు మగపిల్లల తరవాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల. తండ్రి ఎంతో ముద్దుగా చూసుకున్నాడు. మరీ అంత ముద్దేమిటి, పిల్లని పాడు చేస్తున్నారని తల్లి కసిరినా, మురిపెంగానే కానీ ముటముటలాడుతూ కాదు. పదును లేని ఆ విదిలింపులకి, తండ్రి కళ్లు చికిలిస్తూ, “నీమురిపేనికి మాత్రమేం తక్కువ” అనేవాడు వెక్కిరిస్తూ.

శ్రీరంగశయనం మెరికలాటి కుర్రాడనీ, పట్నంలో లాయరుప్రాక్టీసు పెట్టేడని ఎవరో చెప్తే విని తండ్రి మధ్యవర్తి ద్వారా కబురు పెట్టేరు. అట్టే ఆర్భాటం లేకుండానే వివాహం నిశ్చయమయిపోయింది. అటూ ఇటూ కూడా ఆనందంగానే కార్యం అయిందనిపించేరు. పిల్లని పసుపుకుంకాలతో అంపకాలు పెడుతుంటే తల్లిగుండెలే కాదు తండ్రిగుండెలు కూడా అవిసిపోయేయి. ఎన్నో సుద్దులు చెప్పి అప్పగింతలు పెట్టేరు. ఇది ముప్ఫైనాలుగేళ్లకి ముందు మాట.

చుట్టూ చేరిన జనం శ్రీరంగశయనంగారి మాటలు నిజం నిజం అంటూ తమ సానుభూతి తెలియజేసి, ఆ మహాఇల్లాలు పట్టెడు పసుపూ, కుంకుమలతో పుణ్యస్త్రీగా తరించినందుకు హర్షం వెలిబుచ్చారు.

ముఫ్ఫైనాలుగేళ్లపాటు నిసువుని సాకినట్టు కట్టుకున్నవాడి ఆలనాపాలనా చూసుకున్న ఇల్లాలు కన్ను మూసింది. మళ్లీ అంతటి నియమనిష్ఠతోనూ ఇప్పుడు ఎవరు తనకి చేస్తారనుకుంటూ దుఃఖిస్తున్నారు ఆయన.

పక్కింటి సుబ్బారావుగారు ఆయనవేపు ఓమారు చూసి, “హుం, నిన్నటికీ ఇవాళ్టికీ ఎంత వ్యత్యాసం!” అనుకున్నాడు. నిన్న కొట్టొచ్చినట్టు కనిపించిన ధీమా ఈరోజు మచ్చుకయినా కనిపించడంలేదు ఆయన ముఖంలో. మనిషి సగానికి సగం తగ్గిపోయాడు. దివాలామొహం పడింది. “భార్య ఆసరా అలాటిది”, అని కూడా అనుకోకుండా ఉండలేకపోయేరు.

హాల్లో కూర్చుని, “కాఫీ తే”, “నా చెప్పులేవీ”, “కళ్లజోడు ఎక్కడ పెట్టేనో చూడు” అంటూ కేకలేస్తే, వినిపించుకోడానికి ఆవిడ లేదింక. ఆయన బాధ అదేనేమో అని కూడా అనిపించింది సుబ్బారావుగారికి.

ఆ వెంటనే, ఛీ, ఛీ, పాడు ఆలోచన అని తనని తనే చీవాట్లు వేసుకున్నాడు.

ఆవిడ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరరు. అదే కాలేజీలో గౌతమి ఇంటరులో చేరింది. వాళ్లున్న వీధిలోనే ఆ చివరింట్లో ఉండేవారు. గౌతమి కాలేజీకి బయల్దేరేవేళకే ఆవిడా బయల్దేరేది. ఒకటిరెండు సార్లు రోడ్డుమీద కనిపిస్తే, రా అంటూ రిక్షాలో ఎక్కించుకుంది. రిక్షావాడు మొదటిరోజు ఏం అనలేదు కానీ రెండోరోజు, “కాలేజీ అప్పులో ఉద్దర్ని నాగాల. కస్టం సూడండమ్మగోరూ“ అంటూ నసిగేడు.

“ఆవిడ అలాగేలే, పద” అని, రిక్షా దిగింతరవాత, వాడిచేతిలో మరో రూపాయి ఎక్కువ పెట్టింది. ఆసంగతి గౌతమి వాళ్లమ్మతో చెప్తే, ఆవిడ రిక్షావాడితో మాటాడి, గౌతమిని కూడా ఆ రిక్షాలోనే రోజూ తీసుకెళ్లే ఏర్పాటు చేసింది.

ఆవిడ గౌతమికంటే సుమారు పదిహేనేళ్లు పెద్ద. మొదట్లో గౌతమికి మొహమాటంగా ఉండేది కానీ నాలుగురోజులయేక, అలవాటయిపోయింది. పత్రికలలో వస్తున్న సీరియల్స్ గురించి మాటాడుకునేవాళ్లు ఇద్దరూ. తనకి చాలారోజుల వరకూ తెలీలేదు. ఆవిడ కూడా కవితలూ, కథలూ రాస్తోందని. శ్రీరంగవల్లి అన్న పేరుతో కవితలూ, కథలూ రాస్తున్నారుట. ఆవిడపేరు వేదవల్లి!

“మరి మీరు రాస్తున్నారా? లాయరుగారు రాస్తున్నారా నిజంగా?” అడిగింది గౌతమి ఓరోజు.

ఆవిడ చిన్నగా నవ్వి, “నువ్వేం అనుకుంటున్నావు?” అన్నారు, కొనకళ్ల కొంటెతనం మెరిపిస్తూ.

గౌతమి ఆలోచించి, “మా స్నేహితులు చాలామంది ఆయనే రాసి మీపేరు పెట్టేరంటున్నారు. నేను అనుకోడం మీరే రాస్తున్నారు అని,” అంది సీరియస్‌గా.

ఆవిడ నవ్వేసి, మాట మార్చేశారు.

శ్రీరంగశయనం కొడుకుతో మళ్లీ తనకథ కొనసాగించేడు, “నేను కంచంముందు కూర్చుని ఆ కబురూ ఈ కబురూ, జరిగినవీ విన్నవీ చెప్తే, తను కథలు కథలుగా రాస్తూండేది. నేనే చెప్పేను పత్రికకి పంపమని. నా ప్రోత్సాహమే లేకపోతే, మీఅమ్మ పేరు ఎవరికీ తెలిసేదే కాదు. మీరే కదా చెప్పేరు కథ, మీ పేరు మీదే పంపండి, అంది మొదట్లో. అంతటి వినయం మీ అమ్మది. సరే ఇద్దరి పేరు మీదా పంపించు అన్నాను నేను. అసలు శ్రీరంగశయనం అనే పెట్టాలిసింది. శ్రీ అంటే సిరి, ఆవిడే కదా నా సిరి. మళ్లీ నాకే తోచింది శ్రీరంగవల్లి అని. ఒరిజినల్‌గా ఉంది కదూ. పత్రికలవాళ్లు ఆడపేరు చూస్తే, తిరుగు లేకుండా వేసేసుకునే రోజులవీ”, అన్నారాయన నిట్టూర్చి. పత్రికలవాళ్లు అలా ఆడపేరు కోసం ఆరాటపడకపోతే, రచయితపేరు శ్రీరంగవల్లి కాకపోను అన్నట్టుందామాట చక్రధరానికి.

అతను తలొంచుకు కూచుని వింటున్నాడు తండ్రిమాటలు. తల్లిమొహం పదే పదే గుర్తొస్తోంది ఎంచేతో, తండ్రిమొహం ఎదురుగా ఉన్నా. “శ్రీరంగవల్లి” రూపు కంటికి ఆనడం లేదు.

“నీకు గుర్తుందా విజయవాడలో సన్మానం జరిగినప్పుడు. మొదట మీఅమ్మ రానంది కానీ నేనే గట్టిగా చెప్పేను ఆవిడ కూడా రావాలని. నా అర్థాంగి. నాకు సత్కారం అంటే తనకీ సత్కారమే కాదూ. ఆవిడ వేదికమీద ఉంటేనే నాకు పరిపూర్ణమయిన సంతృప్తి అని”.

కొడుకు మళ్లీ తల్లిమొహం గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాడు. నిన్నటివరకూ కళ్లఎదుట నడయాడిన అమ్మ – ఆవిడమొహం ఈరోజు ఇలా మసకమసక అయిపోతోందేం? తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది.

“ఆరోజు నేనే చెప్పేను ఆ సెక్రటరీకి మా ఆవిడని కూడా గౌరవించాలని… సభలో ఆవిడకి కూడా శాలువా కప్పించేను నేనే చెప్పి. మీఅమ్మది ఎంత దొడ్డ మనసో… సాయంత్రం ఇంటికొచ్చేవేళకి గుమ్మంలో గంగిరెద్దు కనిపించిస్తే, ఆ శాలువా ఆఎద్దుమీద కప్పింది. చూశావా… అంతటి ఔదార్యం ఆ మహాయిల్లాలిది“.

అది ఔదార్యం? దానగుణమేనా, మరోటా?… ఉహూఁ… చక్రికి అలా గందరగోళం అయిపోయింది మనసంతా.

గౌతమి, “అత్తగారు ఆ శాలువా దానిమీద విసిరేసేరు, చూసారా?” అంది ఆరోజు తల్లివెనకాలే ఇంట్లోకి వస్తూ. తల్లిమొహంలో ఆ పూట తనకి దానగుణం కనిపించడంలేదు ఎంతగా కళ్లు పొడుచుకు చూసినా. కళ్లు గట్టిగా మూసుకుని మరోసారి జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నించేడు. అమ్మమొహం అలుక్కుపోయి కనిపిస్తోంది. ఆమొహంలో… అదేదో… చిరాకులా ఉంది కానీ ఔదార్యంలా అనిపించడంలేదు… అయ్యో, దేవుడా! ఇంత మందబుద్ధిని చేసేవా నన్ను? అమ్మమొహం గుర్తించేపాటి తెలివయినా లేకుండా చేసేవేమిటి? – చక్రధరం జుట్టు పీక్కున్నాడు.

“అంతటి మహా మనీషి మరి పుట్టబోదు…” అంటూ శ్రీరంగశయనం బాధపడిపోతున్నాడు. ముప్ఫైనాలుగేళ్లు తన మంచీ చెడ్డా, ఆలనా, పాలనా చూసిన ఇల్లాలు తన్నొంటరిగాణ్ణి చేసి తరలిపోయింది.

“ఇప్పుడు నాగతేం కానూ … ” అంటూ ఏడుస్తున్నాడాయన.

ఆయనవేపు మరోసారి చూసేడు చక్రి. రవంత జాలేసింది రెండునిముషాల పాటు. పాపం, ఎంతలేదన్నా ముఫ్ఫైనాలుగేళ్లు కలిసి కాపురం చేసింతరవాత ఆమాత్రం బాధ ఉండదా సహధర్మచారిణి పోయినందుకు అనుకున్నాడు. తనజీవితంలో పాలు పంచుకున్న మనిషి మరింక ఉండదనుకుంటే ప్రాణం గుబగుబలాడదా అనిపించింది. మరోసారి, ఆయనమొహంలోకి తేరి పారచూశాడు.

“నాకేం కావాలో చూసుకుని అమర్చిపెట్టడంలోనే పరమానందం పొందింది గానీ ఏనాడూ తనకిది కావాలని కోరి ఎరగదు. అంతటి ఉత్తమురాలిని మరి కానం. సాయంత్రాలు ఆఫీసు నుంచొచ్చి, తోటి సావాసగాళ్లతో నేను పేకాటక్కూర్చుంటే, కాలేజీనించి హడావుడిగా వచ్చి, వేడి వేడి పకోడీలు చేసి పెట్టి, ఆ తరవాతే వంట మొదలు పెట్టేది… ఒక్కసారి మాత్రం కాబోలు అలిగి, అన్నం తిననని పట్టు బట్టుక్కూచుంది. నాకు నేను వడ్డించుకు తినాల్సొచ్చింది.”

అంతవరకూ ఓపిగ్గా వింటున్న మరో చుట్టం, “అదేమిటండీ, ఆవిడ చేసిన వంట ఆవిడ తినకుండా మీరు కూర్చుని భోంచేశారా?” అన్నాడు.

అమాయకుడు కాకపోతే అలా అడుగుతాడా?

“నాకోసం చేసిన వంట నేను తినకపోతే, పాపం, ఆవిడ చిన్నబుచ్చుకోదూ? అక్కడికీ అన్నాను, ఒకటి కాదు రెండుసార్లు, నువ్వూ తిందూ గానీ, రా అని. ఆకల్లేదంది. మరి, ఆకల్లేదంటే, తిను, తిను అనడం తగునా?”

“పాపం, మీకు మీరే వడ్డించుకు తినాల్సొచ్చిందా” ఎదురింటి ఎల్లమ్మగారు నొచ్చుకున్నారు.

శ్రీరంగశయనం విచారంగా తలూపేరు.

వచ్చినవారందరూ ఒకొకరే పొద్దు పోతోందంటూ లేచేరు.

నెలరోజులయింది. శ్రీరంగశయనం గతించినభార్యనీ, ఆమె ధార్మికచరిత్రనీ కీర్తిస్తూనే ఉన్నారు, గంగాప్రవాహఝరిలా.

అంతవరకూ మాటాడకుండా కూర్చున్న కొడుకూ, కోడలూ లేచారు.

“కూరేం చేద్దాం?” అంది గౌతమి.

“నిన్న తెచ్చిన బెండకాయలు ఉన్నాయి కదా” అన్నాడు చక్రధరం ఆమెని అనుసరిస్తూ.

శ్రీరంగశయనం కోడలివెనక వెళ్తున్న కొడుకుని చూశారు తీక్షణంగా. ఓ పావుగంట అయినతరవాత, ఏమనుకున్నారో, “చక్రీ, ఇలా రా. నీతో మాటాడాలి” అంటూ పిలిచారు, స్వరం పెంచి.

“వస్తున్నా. బాబుకి స్నానం చేయించి వస్తా. అన్నం తింటూ మాటాడుకుందాం,” అన్నాడు చక్రి గదిలోకి వచ్చి, బాబుని తీసుకు బాత్రూంవేపు నడుస్తూ.

తండ్రి తలూపేడు అప్రసన్నంగానే.

ఆరాత్రి భోజనాలదగ్గర నెమ్మదిగా చెప్పేరాయన తనమనసులో మాట, “నీకు గుర్తుందా, మా ఆఫీసులో వేణుగోపాల్. వాళ్ల చెల్లెలుంది, చేసుకోమంటున్నాడు. నీకూ తెలుసు కదూ ఆవిడ. నాలుగేళ్లక్రితం భర్త పోయాడు.”

నోట్లో ముద్ద పెట్టుకోబోతున్నకొడుక్కి కొరబోయింది. గొంతు సవరించుకుంటూ నీళ్లగ్లాసు అందుకున్నాడు. గ్లాసులో నీటితెరల్లో అమ్మమొహం అలుక్కుపోయి కనిపించింది.

కూర మారు వడ్డించబోతున్న కోడలి చేతిలోంచి గరిటె జారి గిన్నెలో పడి ఖంగుమంది.

తండ్రికి ఒళ్లు మండిపోయింది ఆ యిద్దరివరసా చూసేసరికి. “తప్పకుండా చేసుకోండి, మీకు ఆలనా పాలనా చూసుకోడానికి మనిషి కావాలి” అనవలసిన కొడుకు ఇలా గుక్కిళ్లు మింగడమేమిటి? చటుక్కున నీళ్లగ్లాసు అందుకుని, అరచేతిలో నీళ్లు పోసుకు కంచంలో వదిలి, లేచిపోయేరాయన.

లేస్తూ, లేస్తూ, “ఆవిడ వితంతువని కాబోలు నీబాధ?… నాకలాటి నికృష్టపు ఆలోచనల్లేవు… నిన్ను కూడా నాలాగే… ఆధునికభావాలతో… పెంచేననే అనుకున్నాను ఇంతకాలం. ఛీ ఛీ, నాకడుపున చెడబుట్టేవు“, అనేసి, విసవిస అంగలేస్తూ హాల్లోకి వెళ్లిపోయేరు.

కొడుకు వంచిన తల ఎత్తలేదు. కోడలు స్థబ్ధురాలయి కూర్చుండిపోయింది.

రెండునిముషాలపాటు భోజనాలగదిలో గాలి ఘనీభవించిపోయింది, చురకత్తి విసిరినా తెగనంత దట్టంగా, మట్టసంగా.

శ్రీరంగశయనం తిరిగి గుమ్మంలోకి వచ్చి, “నీకు మీ అమ్మలాటి మనిషి కావాలని ఉందేమో. అమ్మలాటి మనిషి మళ్లీ దొరకదు. నేను వేణుగోపాల్ ‌చెల్లెల్ని చేసుకుంటానంటే నా విశాల హృదయమే అదీ,” అన్నారు గుండెలమీద చేత్తో రాచుకుంటూ.

కొడుక్కి అదును దొరికింది, “లేదు, నాన్నగారూ, వేణుగోపాల్‌గారి చెల్లెలంటే నాకు గౌరవమే! ఆవిడ అమ్మలాటి ఉత్తమాయిల్లాలు కాదు. అందుకు నేను విచారించడంలేదు కూడా. మీకే… మీరే… మీరే… ఆమె… అమ్మ లాటి ఉత్తమాయిల్లాలు కావాలని ఆశ పడుతున్నారనీ…” అన్నాడు ‘అమ్మలాటి ఉత్తమాయిల్లాలు’ అన్నపదం ఒత్తి పలుకుతూ.

అన్న తరవాత తన భార్య గౌతమివైపు చూశాడు. ఆ ముఖం అమ్మ తన ఆశలకీ, ఆశయాలకీ, అభిప్రాయాలకీ ప్రతీకగా తీర్చిదిద్దిన ముఖమేమో అన్న అనుమానం అతనికి గతంలో చాలాసార్లు కలిగింది. ఇప్పుడు ఆ ముఖంలో అమ్మ ముఖం ప్రస్ఫుటంగా తీరిచి దిద్దినట్టు కనపడింది అతడికళ్లకి.

వెనక్కి తిరగబోతున్న శ్రీరంగశయనం వెర్రిగా చూశాడు కొడుకుమొహంలోకి.

ఆ యువకుడి అభిప్రాయం ఆ పెద్దమనిషికి అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు.