గుండుగొమ్ములనుమానం – 1

నాకు అనుమానాలు, సందేహాలు ఎక్కువ. ఒకసారి నేను ఎవర్నో మరీ ప్రశ్నలడిగి విసిగించటం చూసి మా బావ నాకు ఒక కధ చెప్పేడు. ఒకతను కొత్తగా గుండు చేయించుకున్నాడు. సాయంకాలం ఏమీ తోచక వీధరుగు మీద కూర్చుని ఒచ్చేపోయే వాళ్ళని చూసేవాడు. రోజూ ఒక ఎద్దు వాళ్ళింటిముందు నుంచే వెళ్ళేది. దాని గుండ్రని కొమ్ముల్ని చూసినప్పుడల్లా అతనికి తన గుండు ఆ కొమ్ముల మధ్య సున్నాలో దూరుతుందా లేదా అని ఒకటే అనుమానంగా ఉండేది. రోజూ ఆ ఎద్దు వెళ్తుండటం చూసేకొద్దీ ఈ దుగ్ధ మరింత ఎక్కువయ్యింది. అతని అవస్థ చూళ్ళేక వాళ్ళ చుట్టం ఒకడు ‘ఎందుకలా ఊరికే గింజుకుంటావు? గుండు దూర్చి చూసుకోకూడదా? ఆ అనుమానఁవేదో తీరిపోతుంది!’ అని సలహా ఇచ్చేడు. అతను ఆవేళ ఎద్దు వచ్చేవరకూ కాసుక్కూర్చుని ఎదురెళ్ళి దాని కొమ్ములు పట్టుకుని, ఆ కొమ్ముల మధ్య జాగాలో తన గుండు దూర్చి చూడబోయేడు. ఆ ఎద్దు కోపగించుకుని విసిరికొడ్తే ఎగిరి కిందపడ్డాడు. గుండుగొమ్ములనుమానం తీరిపోయింది.

కధలు కవిత్వాల్ని గురించీ నాకు ఇలాంటి అనుమానాలు, సందేహాలూ ఎప్పట్నుండో పీడిస్తూ ఉన్నాయి. ఇవి తీరుస్తారని త్రిపుర గార్ని, వెల్చేరు నారాయణరావు గార్ని ఇరవయ్యేళ్ళుగా అనేక సందర్భాల్లో గంటల తరబడి రకరకాలుగా అడుగుతూ ఉండేవాణ్ణి. వాళ్ళిద్దరూ విసుక్కోకుండా నా అనుమానాలకీ సందేహాలకీ తమకు తోచినట్టు జవాబులు చెప్పేవాళ్ళు. వాళ్ళు అన్న మాటలు గుర్తున్నంత మటుక్కి జ్ఞాపకం తెచ్చుకుని ఎప్పుడైనా ఇలా రాసుకుందామని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. త్రిపుర, నారాయణరావు గారు ఈ వ్యాసంగంలో అరుదైన ప్రతిభ, అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన సంగతులు ఇంకెవరికైనా కూడా పనికిరావచ్చు.

ఇంతలో ఇప్పుడే ఉమా మహేశ్వర్రావు గారు నామిని సుబ్రమణ్యం నాయుడు గార్నుంచి ఇంటర్వ్యూ ప్రచురించేరు. నామిని రచనలు అంటే నాకు చాలా ఇష్టం, మాటల్లో చెప్పుకోలేనంత గౌరవం. J. D. Salinger రచనలు, ముఖ్యంగా Catcher in the Rye అంటే ఎంత వెర్రి ఇష్టమో అంత ఇష్టం. రచయితలుగా Salinger నామిని స్వభావాల్లోను, వాళ్ల రచనల్లోను కూడా సారూప్యాలు ఉన్నాయి. నామిని దారిద్ర్యాన్నీ Salinger ఐశ్వర్యాన్నీ ఆలంబనలుగా, చాలా భిన్నమైన సంస్కృతుల నేపధ్యంలో చెప్పినప్పటికీ, వాళ్ళిద్దరి రచనల్లోని గొంతు, ఎత్తుగడ, ఉద్వేగం, కధని నిర్వహించే పద్ధతి చాల సమీపంగా ఉంటాయి. దీన్ని గురించి నా తనివితీరా రాస్తానని ఎప్పట్నుంచో ఒక ప్రణాళిక లాగ వేసుకున్నాను. ఇతరత్రా చాలా వరకు రచనలంటే రచయితలంటే నామినికి పరమ ఒళ్ళు మంట (తిమురు) అని ఉమా గారు చెప్తున్నారు. ఈ విషయం నామిని రచనల్లో కూడా స్పష్టమవుతుంది. రచనా వ్యాసంగాన్నీ, ప్రచురణనీ గొప్ప పనిగా తలకెత్తుకొనే ప్రసిద్ధులైన రచయితల్ని గురించి Salinger కూడా ఇంతే తీవ్రంగా తన అసహనాన్ని, ఒళ్ళు మంటనీ ప్రకటించేడు. It’s a goddamn embarrassment – publishing! … The poor boob who lets himself in for it might as well walk down Madison Avenue with his pants down.” అని దూషించేడు.

నామిని, Salinger ల అభిప్రాయాలు తెలియక ముందే నాకు గొప్పవని చెప్పుకునే చాలా తెలుగు రచనలు, కొన్ని ఇంగ్లీష్ రచనల్ని గురించి ఇలాంటి అనుమానాలే ఉండేవి. ఈ రచనలకి ఇంత ‘సీన్’ ఎందుకు చేస్తారో అని అదొక ప్రశ్నలాగ ఉండేది. వెర్రి గొల్లవాడు మేక కధలో లాగ అందరూ అవే రచనల్ని ‘ఓహో గొప్పవి గొప్పవీ!’ అంటుంటే ‘వీళ్ళు ఎంచేత ఇలాగంటుంటారు చెప్మా?!’ అని సందేహం. ఇలాటి అనుమానాల్నే నారాయణరావు గార్నీ, త్రిపురని అడిగడిగి కాల్చుకుతిన్నాను. ఇప్పుడు నామిని తిమురు అని చదివి నాకు ఆయన మాటల్లోనే చాలా కులుకుగా ఉంది – ‘ఈయనకీ ఇలాగే అనిపించిందా!’ అని. తిమురు అంటే ఏంటో నాకు సరిగ్గా తెలీదు. ఒళ్ళు తిమ్మిరి అని కాబోలు. మంచివి మంచివి అని పదిమందీ అనే కధలు పొగరుబోత్తనం అనిపించేంత బలంగా నామిని గారికి ‘జూటా’ అని ఎందుకనిపించేయి? ఈ ప్రశ్నకి సమాధానాల మొదళ్ళు ఆయన ఇంటర్వ్యూ లోనే, క్లుప్తంగా ఉన్నాయి. ఆయన చేసినవి వ్యాఖ్యలు; విమర్శలు కావు. విమర్శకి ముడి సరుకు.

Salinger గాని, నామిని గాని రచనా వ్యాసంగాన్ని గురించి చేసినవి తీవ్రమైన ఆరోపణలే అయినప్పటికీ, అవి మౌలికంగా అగౌరవంతో, అమర్యాదతో అన్న మాటలు కావని నేను నమ్ముతాను. గొప్ప ప్రతిభావంతులు, ఒక అపురూపమైన సాహితీ మార్గాన్ని అనుభవపూర్వకంగా మాత్రమే దర్శించగల్గిన వాళ్ళు, తమ కడుపులో ఉన్న మాటని కపటం లేకుండా చిన్న పిల్లలు ఏడుస్తూ తిట్టే తిట్లలాగ అన్నట్టు అర్ధం చేసుకుంటాను. వాళ్ళు చూసిన సత్యాన్ని నిక్కచ్చిగా, మర్యాద లేకుండా, నామిని మాటల్లోన ‘ఈది కుక్క’ల్లాగ చెప్తున్నారు. చిన్నపిల్లలు, యోగులు, పిచ్చివాళ్ళు, పిశాచాలు – ఈ నాలుగు రకాల వాళ్ళ నడవడిక ఇలా ఉంటుందని తాత్వికులు అంటారు (‘బాలోన్మత్త పిశాచవత్..’). రచనా వ్యాసంగంతో అనుబంధం ఉన్నవాళ్ళు – అంటే రచయితలు, పాఠకులు, సంపాదకులు, ప్రచురణకర్తలు – సర్వ సాధారణంగా ఉన్నతమైన రచనలే తమకి కావాలనీ, అదే తమ లక్ష్యం అనీ చెప్తుంటారు. ఇలాంటి లక్ష్యం ఉన్నవాళ్ళని కరుకైన వ్యాఖ్యలు ఎంతో కాలం నొప్పించవు. ఆ వ్యాఖ్యలకి కారణాలు ఏమయి ఉంటాయనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానాలు విమర్శలో వివేచనతో వెతుక్కోవాలి అని, అది తప్ప మరో మార్గం లేదనీ నారాయణరావు గారు అనటం నాకు గుర్తుంది. నామిని, Salinger వంటివాళ్ళ వ్యాఖ్యల్ని ఇలా తరచి చూసుకోవాలని నాకు పట్టుకోలేనంత ఉబలాటంగాను, ఆలోచనగాను ఉంటుంది. త్రిపుర గారు, నారాయణరావు గారు నాతో అన్నమాటలు దానికి ఉపయోగపడతాయి. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వ్యాసం మొదలుపెట్టడానికి ఇప్పుడూ నామిని తిమురు ఇంటర్వ్యూ సందర్భం అనిపించింది.

నేను ముందే చెప్పినట్టు, ఇవి సుమారు ఇరవయ్యేళ్ళుగా నడిచిన సంభాషణల్నుండి నెమరు వేసుకుంటున్నవి. చాలావరకు మర్చిపోగా మిగిలినవి. ఇవేవీ ఇంటర్వ్యూ అని ప్రత్యేకించి వాళ్ళని అడిగిన సంగతులు కావు. పిచ్చాపాటీ సందర్భాల్లో – అంటే కిళ్ళీలకోసం వెళ్తుండగా, ఫోన్లమీద ఊరికే క్షేమం కనుక్కోవటానికి మాట్లాడుకునే సందర్భాల్లోనూ అనుకున్న మాటలు. ఇవి వాళ్ళిద్దరి స్థిరమైన అభిప్రాయాలని, వాటికి పూర్తి పాఠాలనీ అనుకోడానికి లేదు. నేను నారాయణరావు గార్ని పదే పదే అడిగిన ప్రశ్న ఒకటి – అసలు కధలు, కవిత్వాలతో అవసరం ఏముంది? అవి ఎందుకు? అని. ఇదే ప్రశ్నని నేను త్రిపురతో కూదా ప్రస్తావించేను. నారాయణరావుగారు అన్నిసార్లూ నాకు చెప్పింది ఏంటంటే – సాహిత్యం మనుషుల్ని సంస్కరిస్తుంది. అంటే ‘civilize’ చేస్తుంది అని. ఈ సూచనలో ఉన్న వాగ్దానం చాలా బావుంటుంది. కాని దీన్ని నేను నమ్మలేకపోయేవాణ్ణి. బుద్ధి చాల చంచలమైనది; కపటం, ఆశ దాని స్వభావాలు. ఈ విషయాన్ని గురించి మానవీయ శాస్త్రాల్ని చదివేవాళ్ళు, రచయితలు, తాత్వికులు ఎన్నో రకాలుగా మధిస్తూనే ఉన్నారు. ఇలాంటి బుద్ధి సృష్టించే సాహిత్యం అదే బుద్ధిని – అంటే తనని తానే – సంస్కరించుకోగలుగుతుందా? అది దొంగకే పోలీసు ఉద్యోగం కట్టబెట్టినట్టు కాదా? ఈ అనుమానం ఆయన్ని నేను ఎప్పుడూ సూటిగా అడగలేదు. నాలో నేనే చెప్పుకున్నది ఏమిటంటే – బలమైన, స్వచ్చమైన రాతలు బుద్ధికి అతీతంగా, అంటే మేధస్సు ఇనప సంకెళ్ళనుండి ఎలాగో తప్పించుకుని వస్తాయి. వాటిని ‘సాహిత్యం’ అని అనుక్కుంటే, వాటికి ఎంతో కొంత సంస్కరించే శక్తి ఉంటుందని నేను ఒప్పుకుంటాను. అవి చదివితే ఏదో స్నానం చేసినట్టు ఉంటుంది. అయితే సంస్కరించాలన్న ఉద్దేశ్యం, సంకల్పం వాటి వెంకాల కనే కనిపించవు. నామిని, Salinger రచనలు ఇలాంటివి. వాళ్ళకి మేధస్సు పట్ల, అది సాహిత్యానికి చేసే హాని యెడల ఉన్న ఏవగింపును కూడా నేను ఇలాగనే అర్ధం చేసుకుంటాను. నాకు నచ్చిన సాహిత్యాన్ని సమస్తం నేను ఈ నేపధ్యంలో ఎత్తిచూపించగలను.

కాల్పనిక సాహిత్యం ఎక్కడ్నుంచి వస్తుంది? అంటే, ఎవరైనా కధో, కవిత్వమో రాసేటప్పుడు దాని మూలం ఎక్కడున్నాది? మేధస్సులోనా? ‘సాహిత్యం సమాజంలోంచి వస్తుంది’ లాంటి మర్యాద మాటల్ని నామిని ఇదివరకు కూడా అవహేళన చేసి ఉన్నారు. మేధావులు మేధావుల మెప్పు కోసం సృష్టించే సాహిత్యం ‘జూటా’ అని ఆయన మళ్ళీ ఇప్పుడు ఖరాఖండిగా చెప్తున్నారు. ఈ మాటనే నేను బలంగా నమ్ముతున్నాను. మేధస్సు కాల్పనిక సాహిత్యానికి అడ్డు అని, అనవసరంగా సృజనలో తలదూర్చి పానకంలో పుడకలాగ బాధిస్తుందనీ నాకు అనిపిస్తుంది. మేధస్సు తలదూర్చిన మేరకు కాల్పనిక సాహిత్యం కలుషితమే అవుతుంది. మేధస్సు చేసే ఈ జూటాకోరు పనిని నామిని ఇచ్చినలాంటి ఉదాహరణలతో కధల్లో, కవిత్వంలో కూడా ఎత్తి చూపించవచ్చు. కవిత్వంలో అయితే ‘కడివెడు పాలలో ఒక్క తోడుచుక్క’ అన్నట్టుగా ఈ అబద్ధం మొత్తం సృజననే చెడగొట్తుంది. కాని ఈ ప్రశ్నను లేవనెత్తితే, వెంటనె మేధస్సు అంటే ఏమిటి? అసలు ఊహలు ఎక్కడ్నించి పుడుతున్నాయి? అని ప్రశ్నలు వస్తాయి. ఇవి మనోవిజ్ఞాన శాస్త్రంలో (Cognitive Science) ఈనాటికీ నలుగుతున్న ప్రశ్నలు. కొందరు సాహిత్య విమర్శకులు ఈ అవసరాన్ని గుర్తించే తమ విమర్శలకు మనోవిజ్ఞానాన్ని ప్రాతిపదికగా ఎంచుకుంటారు. Western Wind: An Introduction to Poetry అనేది నాకు నచ్చిన పుస్తకం, ఇలాంటి కోవకు చెందినది. మనస్తత్వం జోలికి పోకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే ఏమని చెప్తాం? నారాయణరావు గార్ని నేను కధలు, కవిత్వాలకి మూలం ఏమిటి, అవి ఎక్కడ్నించి వస్తున్నాయి అనడిగితే ఆయన ‘అది ఒక మిష్టరీ. నిజమైన కాల్పనిక సాహిత్యానికి, సృజనకి మూలం ఏమిటో మన బుద్ధికి అంతుచిక్కదు’ అని చెప్పేరు. ఆ జవాబు నాకు చాల నచ్చింది. ఇదే మాటని ఇంకొందరు కళాకారులు, రచయితలు, శాస్త్రజ్ఞులు, తాత్వికులు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాసంగాలకి సంబంధించి చెప్పి ఉన్నారు. కాల్పనిక సృజనకి మూలం ఏమిటి అనేది ఒక నిగూఢమైన, అంతు చిక్కని సంగతి. నారాయణరావు గారు అక్కడితో ఆగకుండా ఇంకొక మాట కూడా అన్నారు: ‘మూలం ఏమిటో ఎందుకూ తెలియడం? మీకు రాయాలని అనిపిస్తే మీరు రాయండీ!’ అని. ఈ మాట ఆయన పదే పదే ఖచ్చితంగా చెప్పటం నాకు గుర్తుంది. అంటే ‘రాయడం మీ ప్రవృత్తే అయితే, మీకు మరీ అంత ‘ఇది’గా ఉంటే రాసీయండీ’ అని.

ఇలాంటి ప్రశ్నకే త్రిపుర ఇచ్చిన సమాధానం ఇలాంటి నిర్ధారణలకే దారితీస్తుంది. ఆయన ఇలాంటి సంగతులు ఎక్కువ మాటల్లో చెప్పరు. ‘ఆఁ.. ఊఁ.. అలాగున్నాదివై…’ అని ఇలా ఊత మాటలు అంటూ సంభాషణ నడవనిస్తారు. ఆయన అనేక సందర్భాల్లో వేరు వేరుగా చెప్పిన మాటల్ని పోగు చేసుకుని నేను అర్ధంచేసుకున్నది ఇది. మనం ఎవరి మట్టుకు వాళ్ళు మనస్సు పంజరాల్లో చిక్కి బతుకుతుంటాం. ఒకరి కష్టసుఖాలు, ఆలోచనలు ఇంకొకరికి తెలియచెప్పుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. ఒకర్నొకరు అర్ధం చేసుకోవటం ఇంకా కష్టం. ఆయితే ఒకరికొకరం కావాలనీ, అర్ధం చేసుకోవాలనీ, అర్ధమయ్యేలా చెప్పుకోవాలనీ కూడా మనకి కోరిక, ఆసక్తి ఉంటాయి. కొందరికి మాటల మీద, వాటితో కట్టే నిర్మాణాల మీద గొప్ప తమకంగా ఉంటుంది. ఊహల్ని, అనుభవాల్నీ రాయాలని, మాటల్నీ భాషనీ అందుకోసం రకరకాలుగా వాడుకోవాలనీ బలంగా, ఆపుకోలేనంతగా కోరుకునేవాళ్ళు రచయితలు, కవులు. అలాగే వాటిని చదవాలని ఉబలాటపడేవాళ్ళు పాఠకులు. ఈ రెండు వ్యాపారాల పట్ల త్రిపుర గారికి ఒక జాలి వంటి సానుభూతి. అంటే మిగతా దేహవ్యాపారాలు – ఒకటికెళ్ళటం వంటివి – స్వాభావికాలు కాబట్టి, వాటి మీద మనకి పెద్ద ఆసక్తి గాని, అసహ్యం గాని, గౌరవం గాని ఇలా ఏమీ ప్రత్యేకించి అక్కర్లేదు. అవి అలా ఉన్నాయి. ఆగకుండా నడుస్తుంటాయి. రచనకి సంబంధించిన వ్యాపారాలు కూడా అంతే. ఇందుకే అనుకుంటాను, నేను రచన వెనుక ఉన్న సంకల్పాలు – అంటే motives – గురించి ప్రస్తావిస్తే త్రిపుర అంతగా ఇష్టపడేవారు కాదు. ఏ రచయితల రచనల్లోన కపటం లేని కాల్పనిక ధార ఉంటుందో అలాంటివి ఆయన ఇట్టే పోల్చి చెప్పేవారు. ఆ రచనని గురించీ, రచయితని గురించీ ఆయన ఒప్పుకోలుగా అనే ఒక చిన్న మాట, చూపు మాత్రం దీన్ని మనకు పట్టిస్తాయి. అయితే, ఇంతకు మించి రచయితల సంకల్పాలనీ, వాటి మంచిచెడ్డల్నీ విచారించడం అనవసరం అని త్రిపుర నమ్మకం అని ఆయన మౌనాన్నుండి నేను అర్ధం చేసుకున్నాను. రచయితల సంకల్పాల మంచిచెడ్డల్ని తూచబోయే వాళ్ళు అవే తూకాలతో తమని తాము కూడా తూచుకోవద్దా అని త్రిపుర సూచన అని అనుకున్నాను. మనుషులకుండే ఎన్నో రకాల బలహీనతలు ప్రస్తావనకు వచ్చినప్పుడు త్రిపుర వాటిని కరుణతో స్పృశించి వదిలెయ్యటం నేను చూసేను. నామిని ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన కూడా రచనల్ని ఎత్తి చూపిస్తున్నారే గాని, రచయితల్ని గాని, వాళ్ళ స్వభావాల్ని గాని తప్పుపట్టటం లేదు.

సృజనలో జూటాకోరుతనం అనే వివేచన మీద నారాయణరావు గారి అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి. ‘అసలు చిత్తశుద్ధి అనేదే ఒక అర్ధం లేని మాటండీ!’ అని ఆయన విసుక్కోవడం నాకు గుర్తుంది. చాలా ఏళ్ళ కిందట ఆయన్ని ఒక మాటడిగేను. కధల్లో, నవలల్లో సంభాషణలు, సన్నివేశాలు – ముఖ్యంగా ఏదో ఒక సందేశాన్నో నీతినో సత్యాన్నో చెప్పాలని ఉద్దేశించినవి – కృతకంగా దిగుతాయి కదా? అని. (నామిని సాగర సంగమంలో కమలహసన్ బావి గట్టు డేన్స్ గురించి లేవనెత్తింది ఇలాంటి అభ్యంతరాన్నే). ఆయన ఆ మాట ఒప్పుకోలేదు. ‘ఒక కధో నవలో కృతకంగా ఉందీ, బావులేదూ అని మీకనిపిందంటే మీ యెడల అది విఫలమయ్యింది, అంతే! పంచతంత్రం కధల్లో కాకీ నక్కా ఒకదాన్నొకటీ “ఓయ్ కాకి బావా! ఏమోయ్ నక్కబావా!” అని పిల్చుకుంటాయి. అసలు కాకీ నక్కా బావా బావా అని మాటాడుకోవటం ఏమిటి? అని మీకెప్పుడన్నా సందేహం వచ్చిందా? నిజాయితీ అని ఏంలేదు. మీకు నచ్చిన రచనలు, నచ్చనివి అనే ఉంటాయి. మీ రచనలు నచ్చని వాళ్ళు మీకు పాఠకులు కాదు, మీరు వాళ్ళకి రచయిత కాదు. ఎవరికో ఎక్కడో ‘అబ్బా ఏం రాసేడ్రా!’ అనిపిస్తుంది. వాళ్ళే మీ పాఠకులు!’ అని. ‘ఏవి బావుండే రచనలు, అవి ఎలా పోల్చుకుంటాము, పదుగురు కలిసి వాటిని ఎలా గుర్తు పెట్టుకుంటారు?’ అని ఇలాంటి సంగతులమీద నారాయణరావు గారు ఎంతో తరచి తరచి ఆలోచించేరని, అది ఆయన నైజం అనీ ఆయనతో మాట్లాడినప్పుడు బోధ పడుతుంది. జూటాకోరుతనం – చిత్తశుద్ధీ అనే చర్చను కొట్టి పారేసే ఆయనే మంచి రచన – కాని రచన అనే చర్చని మరీ మరీ ఆహ్వానిస్తుంటారు. ఈ విషయం చుట్టూ నా సందేహాలూ, నేను అడగ్గా అడగ్గా ఆయన అన్న మాటలు, త్రిపుర అన్న మాటలు, ఆ మాటల మీద నేను గుళ్ళించుకుంటున్న నా మాటలూ కూడా ఎన్నో ఉన్నాయి. నేను చెప్పుకోవలసిన ఈ సంగతులు ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ గొలుసుకట్టు రచనకి అనుమతించమని నేను సంపాదకుల్ని బతిమాలుకున్నాను.

(ఇంకా ఉంది)