కలవరపెడుతుంది మనస్సును

అనంతంగా ధ్వనించే
సముద్ర ఘోషలో
మెత్తగా ఆకులు రాలే
శిశిర సాయంత్రాన
రాబోయే చీకటి
ఏ బంధాలను తెంపుతుందో!
ఏ జ్ఞాపకాలను రేపుతుందో!

నీలినీడల వెనుకాల
గాలికెరటాల అంచుల మీద
జలతారు చేలాంచలాలను
పరాకుగా జారవిడుస్తూ,
జ్ఞాపకాల భూతకాలంలోకి
అవలోకనం చేసే అనుభవాల నెమ్మోముల
అలముకునే పల్చని చీకటి
కలవరపెడుతుంది మనస్సును .

నిర్జన ప్రదేశాలలో
వంగిన ఆకాశం మీదుగా
చల్లని గాలి మోసుకొచ్చే
జనవాసాల హోరు
అస్తమించే సూర్యునితో
దిగులుగా వెళ్ళిపోయే దృశ్యం
కలవర పెడుతుంది మనస్సును.

పెంచిన కుక్కలా
వెంబడించే దుఃఖాన్ని
గర్భస్థ శిశువులా రోదించే
అస్పష్టపు జ్ఞాపకాల్ని
మరణ సుంకంగా చెల్లించే
అమాయకపు విశ్వాసం
కలవరపెడుతుంది మనస్సును.