హిమబిందు

ఏ దూర సాగరపు వారికణాలో
ఆవిరై ఒక మేఘమాలికన
తూలికై
గాలిలో తేలుతూ
గాలితో తూలుతూ
ఏ ప్రత్యేక లిప్తలో
ఘనీభవించాయో
హిమస్ఫటికమణిగణనికరాలై
చల్లగా మెల్ల
మెల్లగా తెల్ల
తెల్లగా ధరకు దిగి
పగడాల పెదవులపై
ఆరురేకుల పారిజాతాలై
అర విరిసి
అంతలోనే కరిగి
హేమంతసంధ్యలో
భూమికి రాలాయి

మళ్లీ
ఏ జలాశయంలో నీటిముత్యాలై
ఎవరి చెక్కిళ్లను
చక్కగా నొక్కుతాయో