శ్రీశ్రీ ఛందఃశిల్పము

పరిచయము

ఇరవైయవ శతాబ్దంలో పుట్టిన అద్వితీయ కవి శ్రీశ్రీ. సామాన్యుల భావాలను అసామాన్య భాషలో, ఛందస్సులో వెలువరించిన మహాకవి శ్రీశ్రీ. పాతకాలపు రచనల ధోరణి, వాటి ఛందస్సు నేటి కాలపు కవిత్వానికి అన్వయం కావని (వాటిని ఒక మారు ప్రయోగించిన తరువాత మాత్రమే) తిరస్కరించినా, తెలుగు మాత్రాఛందస్సామ్రాజ్యానికి సార్వభౌముడు శ్రీశ్రీ. ‘శ్మశానాలవంటి నిఘంటువులు దాటి, వ్యాకరణాల సంకెళ్ళు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి వేయాలని’ అభిలషించి, ‘ఛందో బందోబస్తులన్నీ ఛట్‌ఫట్‌ఫట్‌మని త్రెంచి Damn it! ఇదేమిట్రా అంటే Pray, it is poetry అందాం’ అని కొంటెకోణాలలో అంటాడు. కానీ ఇదేదీ పూర్తిగా నిజం కాదు. శ్రీశ్రీ అభిలషించి అందుకొని అవలీలగా వ్రాసిన మాత్రాఛందస్సు కూడా ప్రాచీన ఛందస్సే. తెలుగులో ఈ ఛందస్సు ముందే ఉన్నా దానికి పూర్వ కవుల ఆదరణ లభించలేదు.

ఛందస్సు – శ్రీశ్రీ

శ్రీశ్రీ పుట్టుక 1910లో. అదే సంవత్సరంలోనే నవయుగానికి నాందీగీతాన్ని పాడిన మహాకవి గురజాడ అప్పారావు ముత్యాలసరం కూడా పుట్టింది. ఆధునిక యుగంలో అందాలు సంతరించుకొన్న దేశి ఛందోరూపాలలో అది మొదటిది. తరువాతి కాలంలో శ్రీశ్రీ ఈ ఛందస్సును తన అవసరానికి అద్భుతంగా మలచుకొన్నాడు. అతనికి సాంప్రదాయిక ఛందస్సులోని గతులను, రీతులను బోధించిన వారు విశాఖలోని మిసెస్ ఏవీఎన్ కళాశాలలో వైస్‌ప్రిన్సిపల్‌గా పని చేసిన వడ్డే కేశవరావు.

చాలా చిన్నప్పుడే శ్రీశ్రీకి పద్యాలమీద మోజు ఎక్కువ. పద్యాలు వ్రాయడం అంటే కూడా చాలా ఇష్టం. ఈ విషయం గురించి చెబుతూ ఇలా అంటాడు –

“నేను ఏవో యతిప్రాసలు లేని పద్యాలు వ్రాస్తూండడం చూచి మా నాన్నగారు నాకు సులక్షణసారం కొనిపెట్టారు. ఛందస్సులో మొదటిపాఠం చెప్పారు. అప్పటికి నాకు ఏడెనిమిది సంవత్సరాలకు మించి ఉండదు. ఆ రోజు నుండి ఎన్ని పద్యాలు వ్రాశానో చెప్పను, అన్నీ తప్పులే! కాని ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చెయ్యలేదు. అందరూ నా తప్పులు దిద్దేవారే! కొన్ని తప్పులు నాకు తప్పుగా తోచలేదు. అవి చెయ్యడానికి నాకేదో హక్కు ఉందనిపించింది. అందువల్ల నా వ్యక్తి చైతన్యం ప్రగాఢతరం అవుతున్నట్లు, నా బలం హెచ్చినట్లు నాకు స్పష్టంగా తోచింది!

మొట్టమొదటిసారి నాకు పద్యం వ్రాయాలని బుద్ధి పుట్టినప్పుడు ఏదో కొత్తది కనిపెట్టినట్లే భావించాను. నేను వెతుకుతున్న గులేబకావళి దొరికిందనుకొన్నాను. అతః పూర్వ సాహిత్యానికి అది అనుకరణ కాదు! తర్వాత తర్వాత సాహిత్య దృష్టి హెచ్చి నాలాగే ప్రమాదప్రయాణాలు చేసి అనుభవాలు సంపాదించి విశేషాలు కనుక్కొని మజాగా చెప్పినవారి పరిచయం పూర్వులదీ నవ్యులదీ కలిగిన పిమ్మట వాటికి తగినంత చేరువగా అనుకరణ చేస్తూ పోవాలని బుద్ధి పుట్టింది. ఛందస్సు గుఱ్ఱం వంటిది. గుఱ్ఱం ఎటు తీసుకుపోతే అటల్లా వెళ్ళిపోయేవాడు ఆశ్వికుడు కానట్లే ఛందస్సు లాగుకుపోయినట్లు వ్రాసేవాడు సంవిధానజ్ఞుడు కాడు! ఆ ఛందస్సును లొంగించుకొని దానిచేత చిత్రవిచిత్రరీతులలో కదం త్రొక్కించిన వారినే ప్రశంసిస్తాం.”

వాక్యం రసాత్మకం కావ్యం, అంటే రసవంతమైన వాక్యాలతో నిండి ఉంటే అది కావ్యమవుతుంది అని. అదే విధంగా వాక్యం లయాత్మకం ఛందస్, అంటే లయాత్మకమైన వాక్యాలతో నిండి ఉంటే అది ఛందస్సు అవుతుంది అని చెప్పవచ్చు. శ్రీశ్రీ ఛందస్సుపైన చేసిన తిరుగుబాటు నిజంగా పదహారణాల తిరుగుబాటు కాదు, అలా చేసిన ఘనత గురజాడ గారిది. శ్రీశ్రీ మొట్టమొదట చాలామంది కవులలాగే ఉత్పలమాల, శార్దూలవిక్రీడితము, సీసము, తేటగీతి లాటి ఛందస్సులోనే పద్యాలను కట్టాడు. తరువాతి కాలంలో వ్యావహారిక ప్రయోగాలు చేసినా, ఆయనకి సంస్కృత పదాలపైన మోజు పోలేదు. శ్రీశ్రీ కవిత్వం ఆనందించిన వారందరికీ ఆయన ఉపయోగించిన కొన్ని పదాలకు అర్థం తెలిసికోవాలంటే నిఘంటువులు వెదకవలసిందే!

సాంప్రదాయిక కవిగా శ్రీశ్రీ

మనకు దొరికిన శ్రీశ్రీ పద్యాలలో మొట్టమొదటిది ఆయన పదిహేనో ఏట రాసిన ఒక తేటగీతి పద్యం. అది –

ఓ మహత్మ త్వదీయ మహోన్నత ప్ర
భావ మింతని తెలుప నెవ్వానితరము?

ముందే చెప్పాను, అనుకరణ అంటే శ్రీశ్రీకి ఇష్టమని. కృష్ణశాస్త్రిని అనుకరించిందని తోస్తుంది కింది తేటగీతి పద్యం –

ఇది మహోజ్జ్వల మమృతరసైక మధుర
మిది మనోహర మానందసదన మిద్ది

మొట్టమొదట శాస్త్రీయముగా శ్రీశ్రీ రచించిన ఒక రెండు వృత్తాలను ఇక్కడ చెప్పడం సబబు. ‘ప్రళయనర్తనము’లో జగత్తును నీ మూడవ కంటితో తగులబెట్టమని శార్దూలవిక్రీడితములో శివుని అడుగుతాడు –

శా. సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్సంపూర్ణ సౌందర్య రా
     శీయుక్తామల దివ్యమూర్తివయి సాక్షీభూత నానామరు
     త్తోయస్తోత్ర గభీర గానరవ సంతుష్టాంతరంగంబునన్
     మాయామేయ జగద్వినాశాన మతిన్ నర్తింపుమా శంకరా

ఈ పద్యాన్ని చదువుతుంటే శ్రీశ్రీ అభిమానించిన తిక్కన వ్రాసిన ‘భీష్మద్రోణకృపాది ధన్వి నికరాభీలంబు’ లాటి పద్యాలు జ్ఞాపకానికి వస్తాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సందర్భంలో 1947లో శ్రీశ్రీ వ్రాసిన దుష్కరప్రాసముతో ఒక స్రగ్ధరా వృత్తమును ఉదహరిస్తాను. “శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం…” లాటి స్తోత్ర పద్యాలు ఈ వృత్తములో ఉన్నాయి. నన్నెచోడుని కుమారసంభవము లోని మొదటి పద్యము స్రగ్ధరయే. పైన చెప్పిన శార్దూలవిక్రీడితములా కాక క్రింది పద్యములోని పదాలు అందరికీ అర్థ మయ్యేవే.

స్ర. ఏ స్వాతంత్ర్యం నిమిత్తం ఎవరెవరెవరో ఎందరో దేశసేవా
     భాస్వంతుల్ బాలవృద్ధుల్ పతితులధికు లప్రాజ్ఞులున్ ప్రజ్ఞులంతా
     అస్వాశల్ వీడి లాఠీహతులయి ఉరికొయ్యల్ కవుంగిట చేర్చా
     రా స్వాతంత్ర్యం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే

అలానే మచ్చుకి, శ్రీశ్రీ రాసిన మాలా వృత్తాల ఉదాహరణలుగా ఈ రెండు పద్యాలను చూడండి –

చ. ముసరు నిశాంధకారముల మ్రోతలలో నొకమూల తారకా
     రసికవిలాసవీణ కొసరన్ దలపోసెడు మూగపాటకే
     దెసలు చెవుల్ నిగుడ్చి పరతేరని రాగము లాస చేయ, ని
     శ్వసనము లాగుచున్ హృదయవాద్యరుచుల్ బిగియించివేగుచున్

– నక్షత్రవీణ, మూగపాట

ఉ. ఈయెడ విస్తరిల్లు ప్రతి హృద్య లతాంత పరీమళాల నా-
     లో యువకానుభోగసరళుల్ పులకించు, రసప్రమోదపున్
     తీయదనాలు నించుకొను తీరనదత్ ప్రతి కమ్రవాయువుల్
     నాయెద భావతంత్రుల నినాదిల చేయునెవో కవిత్వముల్

– పూలనెత్తావులు

మాత్రాఛందస్సు

ఛందస్సు రెండు విధాలు, అవి గణ ఛందస్సు, మాత్రాఛందస్సు. గణ ఛందస్సు అంటే ఒకటి, రెండు, మూడు అక్షరాలతో ఉండే గణాలతో అమర్చబడినవి. అక్షర గణాలలో అక్షరాల సంఖ్య మారవు, గురు లఘువుల (హ్రస్వ దీర్ఘాల) స్థానాలు మారుతూ ఉంటాయి. అందుకే మూడు అక్షరాలతో మ, భ, జ, స, న, య, ర, త అనే ఎనిమిది గణాలు లభిస్తాయి.

మాత్రాగణములలో మాత్రల లేక కళల సంఖ్య ముఖ్యము. ఈ పద్ధతిలో గురువుకు రెండు మాత్రలు, లఘువుకు ఒక మాత్ర. ఉదాహరణకు మనకు నాలుగు మాత్రల గణాలు కావాలంటే అవి రెండునుండి నాలుగు అక్షరాలవరకు ఐదు విధాలుగా దొరుకుతాయి. మాత్రాగణాలతో పద్యాలు, పాటలు అందరినీ బాగా ఆకర్షిస్తాయి. ఈ విషయం కాళిదాసుకు కూడా తెలుసు. విక్రమోర్వశీయంలో మహారాజు నోటిగుండా కొన్ని ప్రాకృత పద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు దుర్మిల ఛందములోని క్రింది పద్యము అట్టిదే –

దఇఆ-రహిఓ అహిఅం దుహిఓ విరహాగుణఓ పరిమంథరఓ
గిరి-కాణణఏ కుసుముజ్జలఏ గజ-జూహ-వఈ బహు ఝీణ-గఈ

– విక్రమోర్వశీయము (ఉత్తర ప్రతి) (4.10)

(భార్యలేక అతి దుఃఖితుడై విరహాతిశయమువలన గిరికాననములలో వసంతకాలములో గజరాజు చిక్కిపోయినవానివలె కనబడెను.)

మాత్రాఛందస్సు మాయలు శంకరాచార్యులకు కూడా తెలుసు. వారు చతురస్ర గతిలో వ్రాసిన భజగోవిందం లాటి స్తోత్రాలు శ్రీశ్రీకి ఎంతో ప్రేరణను ఇచ్చాయి. అదే విధంగా మిశ్రగతిలో శంకరులు వ్రాసిన చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం స్తోత్రము, మత్తకోకిలలాటి వృత్తాలు, మాత్రాగణాలతో రుద్రకవి వ్రాసిన జనార్దనాష్టకములోని “అలుకలన్నియు తీరగా నా అండ కెప్పుడు వస్తివీ…” వంటి పద్యాలను కూడా శ్రీశ్రీ తప్పక చదివి ఉండాలి. ముత్యాలసరపు గతి కూడా ఇలాంటిదే. ఈ గతిని ఉపయోగించుకోవడంలో శ్రీశ్రీ తన ప్రతిభను చూపించాడు. శంకరాచార్యుల గురి మతప్రచారం, శ్రీశ్రీ గురి తన కమ్యూనిస్టు వాదాన్ని చాటడం. అందుకే ఇద్దరూ జనరంజకమైన మాత్రాగణాల ఛందస్సును వాడడంలో ఆశ్చర్యం లేదు.

శాస్త్రీయ సంగీతములోని మెలకువలను తెలిసినవారు ఎలా లలిత సంగీతాన్ని ఆబాలగోపాలం మెచ్చేటట్లుగా సృష్టిస్తారో, అదే విధంగా ఛందస్సులో మంచి జ్ఞానాన్ని సంపాదించిన శ్రీశ్రీకి మాత్రాగణాలతో ఆడుకోవడం ఎంతో తేలికైన విషయం. కాని వాటితో మంచి కవితాశిల్పాన్ని చెక్కడానికి శ్రీశ్రీ ఎంతో పరిశ్రమించాడు.

మాత్రాఛందస్సులో మూడు మాత్రలతో (UI, IU, III) త్ర్యస్రగతి, నాలుగు మాత్రలతో (UU, UII, IUI, IIU, IIII) చతురస్రగతి, ఐదు మాత్రలతో (UUI, UIU, IUU, UIII, IUII, IIUI, IIIU, IIIII) ఖండగతి, రెండు వేరువేరు గతులతో మిశ్రగతి సాధించవచ్చును. ఇట్టి గణాలకు పేరులు కూడా ఉన్నాయి. ట-గణానికి ఆరు మాత్రలు (UUU, UUII, UIIU, IIUU, UIIU, IUUI, UIUI, IUIU, UIIII, IIUII, IIIIU, IUIII, IIIUI), ఠ-గణానికి ఐదు మాత్రలు, డ-గణానికి నాలుగు, ఢ-గణానికి మూడు, ణ-గణానికి రెండు (U, II) మాత్రలు. మన దక్షిణదేశపు ఛందస్సులో వీటి ప్రసక్తి లేదు. కాని ప్రాకృత ఛందస్సులో, మరాఠీ, హిందీ ఛందస్సులలో ఈ పేరులతో ఉండేగణాల వాడుక ఉంది. ఉదాహరణకు ప్రాకృతపైంగలములోని క్రింది పద్యము పై విషయాలను తెలియబరుస్తుంది –

టట్ఠ డఢణహ మజ్ఝే
గణభేఓ హోంతి పంచ ఆక్ఖరఓ
ఛ ప చ తద్ ఆ జహసంఖం
ఛత్పంచ చ్ఉతి దు కలాసు

– ప్రాకృతపైంగలము, 1.8

(ట, ఠ, డ, ఢ, ణ అనే పంచాక్షరముల మధ్య గణభేదము ఉన్నది. ఇవి ఛ, ప, చ, త, ద సంఖ్యలు గలవి. ఇందులో ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు కళలు (మాత్రలు) ఉండును.)

మాత్రాగణాలకు సంగీతంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించినవాడు జయదేవకవి. ఇతని గీతగోవిందకావ్యం సంగీతానికి ఒక మార్గదర్శి.

ముఖరమధీరం త్యజ మంజీరం రిపుమివ కేలిషు లోలం
చల సఖి కుంజం సతిమిరపుంజం శీలయ నీలనిచోలం

– గీతగోవిందము, అష్టపది 11.4

అనే పై చతుర్మాత్రల పదాన్ని ఆధారంగా చేసికొని

ఎముకలు క్రుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి
నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి

అనే పంక్తులను వ్రాశానని శ్రీశ్రీయే చెప్పుకొన్నాడు. అదేవిధముగా జయదేవుని ‘చందన చర్చిత నీలకలేవర’ గీతగతిలోనే శ్రీశ్రీ వ్రాసిన కింది గేయాన్ని పాడుకోవచ్చు-

నిద్రకు వెలియై నేనొంటరినై నాగదిలోపల చీకటిలో
నేనొక్కడనై నిద్రకు వెలియై కన్నుల నిండిన కావిరితో

చతుర్మాత్రలతో ఎన్నో కవితలను వ్రాశాడు శ్రీశ్రీ. ఉదా.-

  1. ఎగిరించకు లోహ విహంగాలను, కదిలించకు సుప్త భుజంగాలను (ఇది తోటకవృత్తము పోలినది).
  2. రానీ రానీ వస్తే రానీ, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రానీ, వస్తే రానీ, తిట్లూ రాట్లూ పాట్లూ రానీ (ఇది యతి ప్రాసలు లేని విద్యున్మాలను పోలినది).
  3. పొలాలనన్నీ, హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ, జగానికంతా సౌఖ్యం నిండగ (జగణముతో, లగముతో పాదాలు మొదలైనాయి).

ఇటువంటి గేయాలలో మనకు తెలిసిన కొన్ని ఛందస్సుల పోలికలు ఉన్నా ఇవన్ని కేవలము మాత్రాగణాలతో నిర్మింపబడినవే. దానికి మించి మనము ఆరాలు తీయరాదు.

చతుర్మాత్రలతో సంస్కృతములో నవవిధములైన ఆర్యా గీతులున్నాయి. అందులో ఒకటైన ఆర్యాగీతియే ప్రాకృతములో స్ఖందఅ అయి, తెలుగు కన్నడములలో కందముగా మారింది. శ్రీశ్రీకి కూడా కందములంటే ఇష్టం. సిరిసిరిమువ్వా అనే మకుటముతో ఎన్నో కంద పద్యాలు వ్రాశాడు. మాత్రాగణాలతో వ్రాసే రగడలు అనే దేశి ఛందస్సు కూడా ప్రసిద్ధి చెందినది. వీటిని యక్షగానాలలో ఉపయోగిస్తారు. ఈ సంగతులు పూర్వకాలపు కవులకూ, ఈ కాలపు కవులకు కొందరికీ తెలుసు. కాని ఈ గతులను చక్కగా వాడాలంటే పదాల, పాదాల విరుపులను సాధించడములో ప్రజ్ఞ చూపించాలి. శ్రీశ్రీ తన ఘనతను, చాకచక్యాన్ని ఇక్కడే ప్రదర్శించాడు. ఉదాహరణకు ఈ ముత్యాలసరాన్ని చూడండి-

నేనొకణ్ణే నిలిచిపోతే
చంద్రగాడ్పులు వాన మబ్బులు
మంచుసోనలు భూమి మీదా
భుగ్నమౌతాయి

అని అందరివలె వ్రాయకుండా

నేనొకణ్ణే
నిలిచిపోతే
చంద్రగాడ్పులు వాన మబ్బులు మంచుసోనలు
భూమి మీదా
భుగ్నమౌతాయి

అని వ్రాశాడు. ఇలా వ్రాసినప్పుడు భావము, శైలి, నడక కొత్త అందాలను తెచ్చుకొన్నాయి. ఇట్టి మిశ్రగతులలో త్రిమాత్రలు వచ్చే చోటులలో లగాన్ని కూడా వాడినాడు శ్రీశ్రీ (ఉదా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను. ఇందులో ప్రపం అనే త్రిమాత్ర ఒక లగము. రగడాదులలో ఇట్టి త్రిమాత్ర నిషిద్ధము). ముత్యాలసరపు పాదాలకు ముందు ఒక గురువును ఉంచి కూడా ఒక కొత్త ఛందస్సును కల్పించాడు (ఉదా. ఈ తామసీ నిశ్శబ్దహృది మన కిర్వురకు స్వాగతముగా… ఇందులో ఈ అనే అక్షరము అదనపు అక్షరము.)

త్ర్యస్రగతిలో రాసినదానికి ఉదాహరణగా ఈ గీతాన్ని పేర్కోవచ్చు-

వేళకాని వేళలలో
లేనిపోని వాంఛలతో
దారికాని దారులలో
కానరాని కాంక్షలతో
దేనికొరకు పదే పడే
దేవులాడుతావ్

ఇది భోగ షట్పదిని పోలినది. ఇట్టివి కూడా యక్షగానాలలో ఉన్నాయి. చవితి చంద్రుని కవితలో ఖండేందుమూర్తిని వర్ణిస్తూ ఐదు మాత్రలతో ఖండగతిలో రాయడం ఒక ముద్రాలంకారమే నా ఉద్దేశంలో.

ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై
వ్యాపించు కాలమేఘాళిలో బొడసూపి
ఖండేందుమూర్తి ఆకాశకర్పరమెల్ల
నిండు నీ గ్రుడ్డి వెన్నెల ధూమధూపమై

ఖండగతిలో ద్విపదలాటి ఛందస్సును కూడా శ్రీశ్రీ ఉపయోగించాడు-

గగనమంతానిండి పొగలాగు క్రమ్మి
బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను

మాత్రాఛందస్సులో ఆరు మాత్రలతో కూడా వ్రాయవచ్చు. ఇందుకు ఉదాహరణ ‘జగన్నాథ రథచక్రాల్’. వ్యంగ్యంగా చెప్పాడోలేక ఆశావాదిగా చెప్పాడో చివర కోరికలు ఈడేరుతాయనే ఆశానక్షత్రాన్ని చూపించాడు కవి. ఇది మంగళప్రదమైనది. కావ్యాదిలో, మధ్యలో, అంతములో మంగళము ఉండాలంటారు కాబట్టి దీనిని శ్రీశ్రీ మంగళమహాశ్రీ అనవచ్చునేమో?

స్వాతంత్ర్యం సమభావం
సౌభ్రాత్రం
సౌహార్దం
పునాదులై ఇళ్ళు లేచి
జనావళికి శుభం పూచి
శాంతి, శాంతి, శాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది
ఈ స్వప్నం నిజమవుతుంది
ఈ స్వర్గం ఋజువవుతుంది

శ్రీశ్రీకి కొన్ని ఛందస్సులు అంటే ఎంతో ఇష్టం. పాదానికి పద్నాలుగు మాత్రలు (6, 8) వ్రాయడం అంటే కూడా ఇతనికి చాల ప్రీతి. ఇట్టి గేయాలలో సామాన్యముగా చివరి ఎనిమిది మాత్రలను 2/6 (శ్మశానమున శశి కాంతులలో), 3/5 (నీ ఎగిరిన జీవ విహంగం), 4/4 (హసనానికి రాణివి నీవై), 6/2 (పయోధితట కుటీరములవలె), 8/0 (భవిష్యమును పరిపాలిస్తాం) లుగా విరిచి లయను సృష్టించాడు. ఈ విన్యాసాన్ని నవకవితలో, అద్వైతంలో, పేదలు కవితలలో, 14 మాత్రలు (5/4/5)గా విరవడం దేశచరిత్రలు కవితలో గమనించవచ్చు.

ఎదురు నడక

“ఉత్కృష్టమైన కళాకార్యాలు అన్నింటికీ ఒక symmetry అంటే సౌష్ఠవము ఉంటుంది. ఐతే సౌష్ఠవము వున్నవన్నీ ఉత్కృష్టరచనలు కావు” – శ్రీశ్రీ.

నా ఉద్దేశంలో శ్రీశ్రీ ప్రవేశ పెట్టిన ఛందస్సులోని ఉత్కృష్టమైన మార్పు (పాత తెలుగు ఛందస్సుకు వ్యతిరేకంగా ఒక విప్లవాత్మకమైన మార్పు) ఎదురు నడక. తెలుగులో, కన్నడములో దేశి ఛందస్సులో పద్య పాదం లఘువు (I) గురువు (U) కలయికలతో ఎప్పుడూ ఆరంభమవదు. దీనికి కారణము దేశిఛందస్సుకు కావలసిన సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు (కన్నడములో బ్రహ్మ, విష్ణు, రుద్ర గణాలు) రెండు మాత్రలైన U, II నుండి పుట్టినవి. అందువలన IU నడకకు ఈ భాషలలో అవకాశమే లేదు. కానీ తమిళములో ఇట్టి నడక నిషిద్ధము కాదు. తెలుగు సంగీత కృతులలో కూడా వీటికి ఎక్కువ ప్రాముఖ్యత లేదు. త్యాగరాజ కీర్తనలలో కూడా ఇట్టివి వ్రేళ్ళపైన లెక్కించవచ్చు. లఘుగురువుల పదాలను మొదట ఉచ్చరించేటప్పుడు బహుశా లఘువును ఊది పలకడం సాధ్యపడదేమో?

ఏది ఏమైనా, జ-గణము, య-గణము, లగము పాదానికి ముందు దేశి ఛందస్సులో ఉండవు. దీనిని ఎదురు నడక అంటారు. సంస్కృత వృత్తాలలో దీనికి ఆక్షేపణ లేదు. పంచచామరము, భుజంగప్రయాతము, ఉపేంద్రవజ్ర, శంభునటనము వంటి వృత్తాలలో ఇవి కనిపిస్తాయి. శ్రీశ్రీ చతుర్మాత్రలలో జ-గణాన్ని ఉపయోగించడం మాత్రమే కాక వాటిని మొదట కూడా పెట్టాడు. ఇది శ్రీశ్రీ ఒక ప్రత్యేకమైన సాధన. అన్ని పాదాలు ఎదురు నడకతో ప్రారంభమయితే ఒక గమనము, ఉరుకు వస్తుంది. ఇలా వ్రాస్తే ఆద్యక్షరాలు తేలిపోతూ ద్వితీయాక్షరాల ఊనికచేత ఉచ్చారణ గౌరవం పొందుతూ గీతానికి ద్రుతగతిని ఆపాదిస్తాయని సంపత్‌ తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ తానే ‘జగణంతో జగడం కోరగా దగదు గానీ’ అని చమత్కరించాడు. ఎదురు నడక గీతాలకు ఎన్నో ఉదాహరణలు (స్విన్‌బర్న్ కవికి) ఉన్నాయి.

విషం క్రక్కే భుజంగాలో
కదం త్రొక్కే తురంగాలో
మదం పట్టిన మాతంగాలో
కవీ నీ పాటల్

కొన్ని చమత్కారాలు

కుమ్మరి మొల్ల చిత్రంలో అష్టావధానాలలోని దత్తపదిలా ఒక పద్యం కూడా శ్రీశ్రీ వ్రాశాడు. ఇందులోని పదాలు అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు, కాని ఈ పదాలకు ఈ అర్థాలు ఉండవు ఈ పద్యంలో. ఆ పద్యం –

అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విడిచె శివకార్ముకమున్

ప్రాసాక్షరములో అచ్చును ఉపయోగించి కూడా ఒక పద్యాన్ని శ్రీశ్రీ వ్రాశాడు-

ఓ అంతా కవులే, అ
ఆ ఇయ్యీలయిన రాని యంబ్రహ్మలె, మే-
మూ ఋషులం అంటూ
ఛీ ఎంతటి సిగ్గు చేటు సిరిసిరిమువ్వా

స్వరయతులను వర్ణిస్తూ రేచన కవిజనాశ్రయములోని మరొక పద్యము మాత్రమే ఇట్టి ప్రాసకు నాకు తెలిసిన ఉదాహరణ. అంతేకాదు, శ్రీశ్రీ ఒక కంద పద్యములో ర అక్షరానికి ఠ అక్షరానికి రూపసామ్యం ఉండడంబట్టి యతి చెల్లించాడు!

వచన గేయాలు

అనంతుని ఛందములో గద్య లక్షణము ఈ విధముగా చెప్పబడినది-

కనుఁగొనఁ బదరహితమై
పనుపది హరిగద్దెవోలె బహుముఖరచనం-
బున మెఱయు గద్య మది దాఁ
దెనుఁగుకృతుల వచన మనఁగ దీపించుఁ గడున్

అట్టి వచనములలో చూర్ణగంధి లక్షణాలు ఇలాగుంటాయి-

ఛందోగణముల నియతిం
బొందక తాళప్రమాణమునఁ గడుఁ జెలువై
కొందఱిచేఁ దచ్చూర్ణం
బందముగాఁ దాళగంధి యనఁ బొగడొందున్

అంటే పొడిపొడి మాటలతో అందముగా తాళబద్ధముగా వ్రాయబడే వచనములు ఇవి. తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు (అన్నమయ్య మనుమడు) ఈ గతిలో శ్రీవేంకటేశ్వర వచనములను వ్రాసినాడు. అదే విధంగా మారుతుండే లయలతో, గతులతో, గమనములతో పాడుకోటానికి వీలుగా వచన గేయాలను శ్రీశ్రీ సృష్టించాడు. ఇట్టి వచనాలలో గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో పద్యాలను కూడా చొప్పించినాడు. ఇట్టి వచనములలో కొన్ని చోట్ల ఒక పద్యపు పోలిక మరి కొన్ని చోట్లలో వేరొక పద్యపు నడక మనకు కనబడవచ్చు. ఇవి ఆంగ్లములోని vers libreను, సంగీతములోని medleyను పోలినవి. ఇందులో నిశ్వాస విరామస్థానానికి ప్రాధాన్యత ఎక్కువ. ఒక విధముగా ఇది సంస్కృతములోని పాదాంతయతి లాటిది. ఆద్యక్షర ప్రాసలు, ద్వితీయాక్షర ప్రాసలు, అంత్యప్రాసలు ఇట్టి గేయాలకు ఆభరణాలు. శ్రీశ్రీ ఈ ప్రయోగాన్ని విద్యున్మాలికలతో ఆరంభిస్తాడు. ‘దెబ్బ తిన్న లేళ్ళ కళ్ళు’ లోని క్రింది పంక్తులను ఒక ఉదాహరణగా భావించవచ్చును.

కావవి, వేటకాని కోలలకు కూలి వేదనల తూలు హరిణాల కండ్లు, జాలికి పురిటిండ్లు దిక్కుదిక్కుల కంపిన దీనంపు చూడ్కులే ఆనాటి ప్రళయతాండవ భయంకర సౌదామినులు

ఈ వచనగీతాలకు పతాకము ‘కవితా, ఓ కవితా’ వచన గేయము. ఇందులో ఎన్నో ఛందస్సుల ఛాయలున్నాయి, అనుప్రాసల మాయలున్నాయి, ప్రాసలు రాసుకొని క్రీడిస్తున్నాయి, పదజాలాలు తీయగున్నాయి, అలంకారాలు అందెలవలె మ్రోగుతున్నాయి, భావాలు సమాసాలలో కౌగిలించుకొంటున్నాయి, పలు భంగుల రంగులు సింగారించుకొంటున్నాయి. వచనగేయాలలో కూడా గణాలు ఉన్నాయి. కాని ఈ గణాలలో ఒక నిర్దిష్ట క్రమము (అన్నీ పంచమాత్రలు లేక మూడు, నాలుగు మాత్రల మిశ్రగతులు, ఇలాటివి) ఉండదు, ఒక నిర్దిష్ట సంఖ్య ఉండదు (ప్రతి పాదములో నాలుగు గణాల లాటివి). అక్షరగణాలతో, మాత్రాగణాలతో నడిచే పద్యాలు మానవులు నిర్మించిన కాలువలవంటివి ఐతే, వచన గేయాలు నిసర్గములో ఒక చోట తక్కువ వెడల్పుతో మరొక చోట ఎక్కువ వెడల్పుతో ప్రవహించే చిన్న సెలయేరులాటిది. దేని అందము దానిది. ఇట్టి గణాలతో పద్యాలను కూడా వ్రాయవచ్చునని నేను ఈ మధ్య వివరించాను. ఈ శైలి ఖడ్గసృష్టిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని వచనగేయాలు అనేకన్నా వచనములని చెప్పవచ్చును.

ముగింపు

ఛందస్సును గురించి శ్రీశ్రీ ఇలా అంటాడు – “కవికి కావాల్సింది కవిత్వ స్వరూపం కాదు; స్వభావం. ఛందస్సేదైనా సామాజిక స్పృహ ముఖ్యం. మాత్రాఛందస్సులోనే మళ్ళీ రామాయణం రాస్తే అది ఆధునిక కవిత్వం అనిపించుకోదు. ఎంత ప్రతిభావంతుడికైనా ఎంతోకొంత వ్యుత్పత్తి కూడా వుంటుంది. ప్రతిభ కూడా నూటికి పది శాతం inspiration, తతిమ్మాదంతా perspiration అన్నదాంట్లో చాలా నిజం వుంది. నా అనుభవం కూడా ఇదే. ఇక ఆదేశం అంటారా అది ఎవరికివారు తేల్చుకోవల్సిందే”. సైన్సులాగే కవిత్వానికి కూడా ప్రయోగాలు లేనిదే అభివృద్ధి లేదు. నాడు పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు ఎంత ధీమాతో ‘వాణి నా రాణి’ అని చెప్పాడో అంతే ధీమాతో శ్రీశ్రీ ‘ఒక విధంగా చూస్తే నేను వాడిన ఛందస్సులన్నీ శ్రీశ్రీయాలే’ అన్నాడు. మాత్రాఛందోప్రయోగాల్లో శ్రీశ్రీ “ఈ శతాబ్దానికి పర్యాయపదం, కవితాసృష్టికి పరిశోధన కేంద్రం”.


ఉపయుక్త గ్రంథసూచి

  1. అనంతుని ఛందము, అనంతామాత్యుడు. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1921.
  2. ఆధునిక కవిత – అభిప్రాయ వేదిక, సం. తిరుమల, సేకరణ మద్దాళి రఘురాం. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 1981.
  3. ఆధునికాంధ్ర కవిత్వము, సి. నారాయణ రెడ్డి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1967.
  4. ఖడ్గ సృష్టి, శ్రీశ్రీ,
  5. నవగీతి – ఆధునిక కవితలకు ఛందస్సు నమూనాయేమో?, జెజ్జాల కృష్ణ మోహన రావు, 2009.
  6. పాడవోయి భారతీయుడా – సినిమా పాటలు, శ్రీశ్రీ. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1983.
  7. భారతీయ సాహిత్య నిర్మాతలు – మహాకవి శ్రీశ్రీ, బూదరాజు రాధాకృష్ణ. సాహిత్యా అకాడెమీ, న్యూ ఢిల్లీ, 1999.
  8. మాత్రిక ఛందోం కా వికాస్, శివనందన ప్రసాద్, బిహార్ రాష్ట్రభాషా పరిషద్, పట్నా, 2000.
  9. రగడలు, జెజ్జాల కృష్ణ మోహన రావు.
  10. శ్రీశ్రీ కవితావైభవం, మిరియాల రామకృష్ణ. యువభారతి, సికిందరాబాదు, 1981.
  11. శ్రీశ్రీ కవిత్వం, మిరియాల రామకృష్ణ (This is the long doctoral thesis of Ramakrishna. After obtaining his PhD, Ramakrishna sent a telegram to SrISrI and SrISrI quipped back famously – Congratulations, yours patiently!)
  12. “శ్రీశ్రీ కవిత్వంపై మరొక వ్యాసం, శంఖవరం రాఘవాచార్యులు. ఈ మాట, మే 2007.
  13. శ్రీశ్రీ వచన విన్యాసం, రాపోలు సుదర్శన్. అనన్య ప్రచురణలు, హైదరాబాదు, 1997.
  14. శ్రీ వేంకటేశ్వర వచనములు, తాళ్ళపాక పెద తిరుమలాచార్య, పరిష్కర్త వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్, తిరుపతి, 1945.
  15. సులక్షణ సారము, లింగమగుంట తిమ్మకవి.

(ఈ వ్యాసములోని కొన్ని భాగాలు శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ శత జయంత్యుత్సవాల సందర్భంగా సెప్టెంబరు 26-27, 2009న డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఆధ్వర్యాన జరిగిన సభలో చదువబడినవి.)

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...