సామాన్యుని స్వగతం: పాఠం చెప్పటం!

[కన్నడదేశంలో ‘లలిత ప్రబంధగళు’ అనే పేరుతో స్వగతాలను వ్యాసాలుగా రాసే సాహితీ ప్రక్రియ ప్రాచుర్యంలో ఉంది. ఆ సాహితీ సంప్రదాయాన్ని ఈమాట పాఠకులకు పరిచయం చేస్తూ వింధ్యవాసిని రాస్తున్న లలిత ప్రబంధాల వ్యాస పరంపర ‘సామాన్యుని స్వగతం’ – సం.]

“సెల్ఫ్ హెల్ప్ ఈస్ ది బెస్ట్ హెల్ప్!” అని నాకు నేర్పించాడు మా అన్నయ్య. నేను సెకెండ్ ఫారం చదివేటప్పుడు నాయన గుండె పోటుతో పోయినారు. అందుకని నా టీనేజ్ జ్ఞాపకాలన్నీ అన్నయ్య చుట్టూ ఉంటాయి. మాకిద్దరికీ వయసులో పదహైదేళ్ళు తేడా. మా బంధువుల్లో మొదటగా ఇంజనీరింగ్, ఖర్గపూర్ ఐఐటీలో ఎం.టెక్ చేసి అక్కడే లెక్చరర్‌గా చేరిన ఆయన నా పర్మనెంటు ట్యూషన్ మాస్టర్. నలుగురు చెల్లెళ్ళలో నేను ఆఖరుదాన్ని కాబట్టేమో ఆయన దగ్గర నాకు చనువెక్కువ. అయినా చదువు మాటకొస్తే మాత్రం క్రమశిక్షణ తప్పేది లేదు.


ఈ వ్యాసం కోసం రచయిత్రి
కుమార్తె గీసిన చిత్రం

నాకు సైన్సు, లెక్కలు, ఇంగ్లిష్ సబ్జక్టుల్లో కావలసి వచ్చే సహాయమంతా ఆయన్నుంచే లభించేది. కానీ ఏ విషయంలోనయినా బయటి ట్యూషన్లకు మాత్రం వెళ్ళనిచ్చేవాడు కాదు. స్కూల్లో వ్యాసరచన, ఎలొక్యూషన్ అన్నిట్లో పోటీ చేసేదాన్ని. విషయం ఎలాంటిదయినా నన్ను తయారు చెయ్యటానికి అన్నయ్యకు ఒక్క రాత్రి చాలు. అంతా భట్టీ పట్టి తన ముందు రెండు సార్లయినా హావభావాలతో చెప్పాలి. ఇద్దరం అంత కష్టపడింతర్వాత మరుసటిరోజు పోటీలో నాకు బహుమతి రాక తప్పుతుందా?

మిగతా అన్ని విషయాల్లో బాగా మార్కులు వచ్చినా తెలుగు వ్యాకరణం మాత్రం నాకు కొరుకుడు పడేది కాదు. ఈ విషయంలో నాకు సహాయం చేసే డ్యూటి మా పెద్దక్కయ్యది. కానీ నేనేమో కాస్త బాగానే సోమరిని! ముందే ఏమీ చెప్పి చెప్పించుకునేదాన్ని కాదు. రేపు పరీక్ష ఉంటే ఆరోజు రాత్రి అన్నీ బయటికి తీసేదాన్ని. వేసవిలో కరెంటు కోతలో లాంతరు వెలుగు, దోమల బాధ! ఈ పరిస్థితుల్లో నాకు సంధులు, సమాసాలు, అలంకారాలు అర్థం చేయించడం తనకెంత కష్టమయేదో నాకు మాత్రం తెలీదు. నేను ఆవలిస్తూ నిద్రకు తూగుతుంటే నా తొడమీద గట్టిగా గిచ్చిన నొప్పి మాత్రం తెలిసేది!

అన్నయ్య దగ్గర చదువు పాఠాలే కాదు, ఇంట్లో అవసరమయిన కొన్ని చిన్నచిన్న ఎలెక్ట్రికల్ రిపేర్లు తనే చేసేటప్పుడు నేనూ చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించేదాన్ని. అప్పట్లో ఇళ్ళలో పడుకున్న తర్వాత లైటు కానీ, ఫాను కానీ ఆర్పాలన్నా, వేసుకోవాలన్నా బెడ్‌సైడు స్విచ్‌లు ఉండేవి కావు. గోడమీదినుంచీ వైర్లతో వేలాడే నొక్కే రకం స్విచ్‌లు తను తన గదిలో తయారు చేసుకున్నాడు. నా గదిలో నేను చదువుకోవడానికి టేబిలుకు, మంచానికి కూడా దగ్గర్లో ఒక లైటు పెట్టినాడు. నేను దానికొక బెడ్‌సైడు స్విచ్ తయారు చేసుకోవాలనుకున్నాను. అన్నయ్య ఆదివారం మధ్యాహ్నం పడుకున్నప్పుడు చూసి మెల్లగా ఆయన టూల్స్ బాక్స్ తెచ్చుకుని, ఒక గజం పొడవు వైర్, స్విచ్, ఇన్సులేషన్ టేపు అందులో వెతుక్కుని పని మొదలుపెట్టినా. బ్లేడుతో ప్లాస్టిక్ వైరు కొసలు చెక్కేసి సన్నని రాగి తీగలు బయటికొచ్చినవి జాగ్రత్తగా పురి తిప్పి ఒకటిగా చేసి, అన్నీ అన్నయ్య చేసినట్లే కనెక్షన్లు చేసి చాల ఉత్సాహంగా మంచం మీద పడుకుని స్టైలుగా స్విచ్చి నొక్కినా. లైటు పడలేదు సరిగదా అంతవరకూ తిరుగుతున్న టేబుల్ ఫాను కూడా ఆగిపోయింది. నాకేం అర్థం కాలేదు. ఇంకొక లైటు, వరండా లైటు వేసి చూశా. ఏవీ పడలేదు. అప్పుడే సరిగ్గా పవరు పోయి ఉండాలి అనుకున్నాను.

సాయంత్రం ఆరయింది. ఆరున్నరయింది. అప్పుడు కనుక్కున్నారు ఇంట్లోవాళ్ళు మా ఇంట్లో మాత్రమే కరెంటు పోయిందని. అన్నయ్య ఫ్యూజ్ పోయిందేమోనని చెక్ చేయడానికి వరండాలోకి వచ్చాడు. గదిలో గోడమీద వేలాడుతున్న స్విచ్చిని చూసి “ఏందది?” అని అడుగుతూ ఆశ్చర్యంగా లోపలికొచ్చాడు. “ఎవరు కనెక్ట్ చేసిపెట్టినారు?” అనడిగితే “నేనే!” అని ఉత్సాహంగా చెప్పాను. “నీ కన్నీ కనెక్షన్లు తెలుసునా?” “ఓ! అన్నీ సరిగ్గా చేసినాను.” అని నమ్మకంగా చెప్పాను. టార్చ్ లైటు, ఫ్యూస్ వైరు తీసుకుని మెయిన్స్ బాక్స్ దగ్గర వేసుకున్న స్టూలు మీదెక్కుతూ, మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో వెనక్కొచ్చి నేను కనెక్ట్ చేసిన వైర్లన్నీ చెక్ చేసినాడు. దొరికింది దొంగ! నాకు తెలీక లైటునుంచీ టూ-వే చెయ్యటంలో పాసిటివ్, నెగటివ్ రెండు కలిపేసి వేరు చేసిపెట్టినా. అందుకే నేను స్విచ్ నొక్కగానే షార్ట్ సర్క్యూట్ అయి కరెంటు పోయింది. “ఇట్లాంటి పనులు చెయ్యద్దమ్మా మహా తల్లీ!” అని అన్నయ్య బాగా చీవాట్లు పెట్టి కనెక్షన్లు సరిజేసి, ఫ్యూజ్ వేసి కరెంటు తెప్పించాడు. “ఇంకా నయం! కరెంటు వైర్లన్నీ కాలిపోయి డామేజ్ కాలేదు” అని ఆయన అమ్మతో గొణుగుతోంటే నేను వినిపించనట్లు ఉండిపోయినాను.

అమెరికాలో టీనేజర్సే పనులు చేసి సంపాదిస్తారంట అని నా చిన్నపుడు అబ్బురంగా చెప్పుకునేవాళ్ళం! మా అన్నయ్య నాకు అది ప్రాక్టికల్‌గా నేర్పించాడు. రోజు విడిచి రోజు మా కాంపౌండులో ఉన్న మొక్కలకు బావిలోంచి నీళ్ళు తోడి పోయాలి. నేను పది బిందెలకన్నా ఎక్కువ పోస్తే నాకారోజు బిందెకు అణా చొప్పున ఇచ్చేవాడు. మా వరండా చుట్టూ ఉన్న కడ్డీల గ్రిల్లును సంవత్సరాని కొకసారి అన్నయ్యే పెయింట్ చేశేవాడు. నేను సహాయం చేస్తుండేది. ఒకసారి ఆదివారం ఉదయమే మొదలుపెట్టాలని ఇద్దరం బట్టలు మార్చుకుంటున్నాము. అప్పుడు నాకొక ఐడియా వచ్చింది. “అన్నయ్యా! అంతా నేనొక్కదాన్నే పెయింట్ చేస్తా. నాకొచ్చు. నాకేమిస్తావ్?” అని అడిగాను. నమ్మలేనట్లు చూస్తూనే ఏమనుకున్నాడో ఏమో, మా అన్నయ్య “ఇరవయి రూపాయలిస్తాను. అయితే బాగా నిగనిగలాడే మాదిరి, నేను నేర్పిచ్చినట్లు చెయ్యాల!” అన్నాడు. తరువాత ఎవరొచ్చిందీ పోయిందీ నేను పట్టించుకోలేదు. రోజంతా, స్టూలు మీద ఎక్కీ, చిన్న నిచ్చెన మెట్ల మీద నిలబడీ పెయింట్ చేస్తూ పోయాను. అన్నయ్య అప్పుడప్పుడూ వచ్చి చెక్ చేసి పెయింట్ కలిపిచ్చి వెళ్ళేవాడు. వదినె ప్లేట్‌లో తెచ్చి భోజనం పెట్టింది. రెస్టు లేకుండా పనిచేసినాను. సాయంత్రం చేతులు కడుక్కుని, బట్టలు మార్చుకున్న తరువాత, అమ్మ, వదినె, అన్నయ్య అందరూ నేను చేసిన పనిని తేరిపార చూస్తుంటే, వాళ్ళ ముందు గర్వంగా నిలబడ్డాను. బయటికి వెళ్ళాలని తయారయి ఉన్న అన్నయ్య జేబులోంచి ఇరవయి రూపాయలకు, ఇంకొక ఐదు రుపాయలు ఇనాముగ చేర్చి నాకివ్వక తప్పలే!

పిల్లలకు పాఠాలు చెప్పుకోవడమనే అలవాటు మా నాయన దగ్గర్నుంచే గుర్తుంది. ఆయన కో-ఆపరేటివ్ బ్యాంకులో సబ్-రిజిస్ట్రార్‌గా ఉద్యోగం చేసేవారు. దగ్గరి ఊళ్ళకు ఎక్కువగా క్యాంపులు వెళ్ళేవారు. చాలా రోజులు ఆయన ఇంటికి రావడం ఆలస్యమయేది. ఎప్పుడొచ్చినా కాచుకుని ఉండే అక్కలకు ఇంగ్లిష్ గ్రామర్ పాఠాలు చెప్పకుండా నిద్రపోయేవారు కాదు. ఫ్రెషప్ అయి వచ్చి కూర్చుని “ఏదమ్మా సన్నక్కా! అచ్చుపుస్తకం?” అని మొదలుపెట్టేవారు. ఈయనెందుకు మా పెద్దక్కను ‘సన్నక్క’ అంటాడో అని ఆశ్చర్యపోయేదాన్ని. అక్కయ్యలు ముగ్గురిక్కావలసిన పాఠాలు వేరయినా అందరూ అన్నీ వినాలిసిందే!

ఆయన మంచం మీద పడుకుని పుస్తకం పట్టుకునో, లేదా అక్కలెవరయినా గట్టిగా చదివితే వినో వివరించి చెప్పేవారు. నేను మాత్రం అన్నం తినేసి, హాయిగా ఆయన ప్రక్కనే కడుపు మీద కాలు వేసుకుని పడుకునేదాన్ని. తమాషా ఏమిటంటే ఆయన చదివింది ఆరోజుల్లో ఎస్సెల్సీ వరకే. అయినా అక్కయ్యలకు కాలేజీ రోజుల్లో కూడా సునాయాసంగా పాఠాలు చెప్పిన గుర్తు. మా నాయన నాన్న, మా జేజయ్య ఆ రోజుల్లో బ్రతుకుతెరువు కోసం వడ్డీ వ్యాపారం చేసినా, ఎప్పుడో వచ్చీ రాని సర్కారు సహాయంతో గుంతకల్లులో తనే ఒక బడి పెట్టి నడిపినారు. కూలివాళ్ళ ఇళ్ళకు పోయి బ్రతిమాలి పిల్లలను తెచ్చుకునేవారు స్కూలుకు. తన కూతుళ్ళనిద్దర్ని ఐదో తరగతి చదివిన తర్వాత టీచర్ ట్రయినింగ్ చదివించి తన బడిలో టీచర్లుగా వేసుకున్నాడు. ఆయనలోని ఈ గుణమే మా అందరికీ వొచ్చినదేమో!

మా పెద్దోళ్ళ వ్యాసంగాన్ని నేనూ తలకెత్తుకున్నా మా మేనల్లుళ్ళు, అన్నయ్య కొడుకుల కోసం. మా పెద్ద మేనల్లుడు గోవిందు, రెండోవాడు భవానీ ప్రసాదు – వీళ్ళిద్దరికీ పాఠాలు చెప్పేది నా పని! ఉన్న మాట చెప్పాలి! గోవిందుకు చదువు చెప్పడం సులువు. రోజూ సాయంత్రం చక్కగా హోంవర్క్ అంతా ముందే చూపించి చెయ్యాల్సిన పని ముగించి మరీ ఆటలమీద పడేవాడు. భవానీగాడికి చదువు చెప్పటమొక పెద్ద ఛాలెంజ్ నాకు! బలవంతంగా వాని స్కూల్ డైరీ తీసి చూసి ఏదయినా చెప్పి వ్రాయించాలంటే, “ఏమిస్తావ్?” అని అడిగేటోడు. వాడు చదువుకోవడానికి నేను లంచం ఇచ్చుకోవాలి! నాకు అన్నయ్య ఇచ్చే కొద్ది పాకెట్ మనీలో, వీడికి ఒక పావలా అయినా ఇవ్వాలి!

మరో ఐదేళ్ళకు మా అమ్మాయి శివాని తయారు. మా పెనిమిటి కాలేజి లెక్చరర్. నిజానికి తనదే అమ్మాయి చదువు బాధ్యత! కానీ ఆయన అమ్మాయికి త్వరగా ఏదయినా అర్థం కాకపోతే విసుక్కుని, కసురుకునేవాళ్ళు. అందుకని నేను నా చేతిలోకి తీసుకోవలసి వచ్చేది. చిన్నప్పుడు ఎందుకో తను లెక్కల్లో కాస్త వీక్! దాని బుఱ్ఱకు కూడికలు, తీసివేతలు, ఎక్కాలు, అన్నీ కష్టమే! దాని పాఠాలకన్నా ఎక్కువ నాకు గుర్తున్నది దాని చేతిపనులు. కనీసం వారానికి ఒకటయినా క్రాఫ్ట్-వర్క్ ఎసైన్మెంట్ ఉండేది. ఒకసారి అగ్గిపుల్లలతో పడవ అయితే, మరోవారం ఐస్‌క్రీం పుల్లలతో ఫ్లవర్‌వేస్. ఒకసారి బొమ్మకు గౌను అయితే ఇంకొక సారి కలర్‌పేపర్లతో ఫోటో ఫ్రేము. అదీ ఎక్కువ టైమివ్వదు, ప్రాజెక్టు ఎక్సిక్యూషన్‌కు. సాయంత్రం పరిగెత్తి వెళ్ళి బజార్లో వెతికి కావలసిన వస్తువులు సేకరించుకోవాలి. అర్ధరాత్రిదాకా కూర్చుని ఎసెంబ్లీ చెయ్యాలి! అసలు సమస్య, ఆలస్యానికి కారణం ఏమంటే పనంతా తన చేతులతో తనే చెయ్యలి. నేను చూస్తూ కూర్చోవాలి!

ఒకసారి టీచర్ ‘మొహెంజోదారో, హరప్పా సంస్కృతులను’ గురించి ఒక చార్టు తయారు చెయ్యమంది. ఆవారం నేను కాస్త బిజీగా ఉండి అలాంటి బొమ్మలు దొరికే అంగడి దగ్గర్లో ఉన్నచోట తెచ్చుకుని చార్టు తయారు చేసుకొమ్మన్నాను. తర్వాత కొన్ని వారాలకు వాళ్ళ డాడీ నా సహాయం లేకుండా ఎలా చేసిందో చూద్దామన్న కుతూహలంతో చార్టు చూపించమన్నారు. కొనుక్కు తెచ్చుకున్న బొమ్మలన్నీ చాలా బాగా కొలాజ్ చేసి అంటించింది. నేను మెచ్చుకోలుగా చూస్తున్నాను. ఆయన మాత్రం ఒక హరప్పా బొమ్మ వైపు అదే పనిగా చూస్తున్నారు. నాకేమీ అర్థం కాలేదు. “ఈ బొమ్మ ఎక్కడిది?” అని అడిగారు ఉరిమినట్లు చూస్తూ. శివాని ఏం మాట్లాడలేదు కానీ, నేను మాత్రం “షాప్‌లో తెచ్చుకునుంటుందిలే!” అన్నాను తేలికగా. “నీకేం తెలీదు. నువ్వూరుకో!” అని పుస్తకాల అలమరలో ఉన్న `హిస్టరీ ఆఫ్ ది వరల్డ్’ అనే రంగురంగుల ఫొటోలున్న పుస్తకం బయటికి తీసినారు. ఆ పుస్తకం దాని ఐదో పుట్టిన్రోజుకు మేమిచ్చిన బహుమతి! అందులో ఒక పేజీలో హరప్పా సంస్కౄతి పేజీల్లో ఒక చోట ఒక బొమ్మ కత్తిరించిన కిటికీ ఉంది. అంతే ఆయన కోపానికి అంతుల్లేవు. దాని తలమీద అంత పెద్ద పుస్తకం తోటే దెబ్బ పడింది. ఇంకా కోపం తట్టుకోలేక ఆయన అక్కడినుంచే వెళ్ళిపోయారు. చిత్రంగా శివాని ముఖంలో తప్పు చేశానన్న భావం లేదు! పుస్తకం తనకు బహుమతి అయినప్పుడు అందులో బొమ్మలు కత్తిరించే స్వతంత్రం తనకు లేదా? అన్న ప్రశ్న కనిపించింది దాని కళ్ళలో!

ఏమాటకామాటే చెప్పాలి! ఎలొక్యూషన్ పోటీల్లో నా చిన్నప్పటి నాకన్నా తను ఎక్కువ ఉత్సాహం చూపించేది. నేను మా అన్నయ్య నన్ను తయారు చేసినట్లే నా కూతుర్ని తయారు చేసేదాన్ని. తను స్కూల్ ఫైనల్లో ఉండగా స్కూల్ ఎన్నికల్లో పాల్గొంది. స్కూల్ ప్యూపిల్ లీడర్‌గా పోటీ చేసింది. తన ఎన్నికల కాంపేన్ చాలా కష్టపడి తయారు చేశాము. తనవెంట కాంపేన్లో తిరిగే వాళ్ళు, ఒకటి, రెండు తరగతుల పిల్లలు. వాళ్ళకే తనెవరో బాగా తెలుసు. వాళ్ళంతా చొక్కా జేబుల మీద పిన్ చేసుకోవడానికి, రాత్రుళ్ళు కూర్చుని రంగు రిబ్బన్లతో బ్యాడ్జులు తయారు చేసే వాళ్ళం. క్లాసు ఇంటర్వల్స్‌లో, లంచ్‌టైం తర్వాత, వెళ్ళి తన ఎన్నికల స్పీచులు ఇచ్చుకునేది. తన మామూలు రీలు అయింతర్వాత ఇలా ముగించేది. “మిగతా నిలబడిన వాళ్ళిద్దరు కూడా నా ఫ్రెండ్సే! మీరంతా కలిసి మాలో ఎవర్ని సమర్థులుగా అనుకుంటే వారిని ఓటు వేసి గెలిపించండి!” అదే అందరికీ నచ్చిందేమో! ఆ యేడు ఎన్నికల్లో శివాని గెలిచింది!

మొన్నీమధ్యే మావారు రిటైరయినారు. మొదటి మూడు నెలలు ఇంట్లో ఊరికే కూర్చోవడం ఆయనకు శిక్ష వేసినట్లుండేది. క్లాసులను, విద్యార్థులను చాలా మిస్సయినారు. మా శివానికి ఇప్పటికి పిల్లలు పుట్టి ఉంటే ఈయనకు బాగా పొద్దు పోయేది వాళ్ళకు చదువు చెప్తూ అనుకున్నాను. ఆరోజు శనివారం! ఇద్దరం కాస్త తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుంటుండినాము. మా డ్రైవర్ తన నాలుగేళ్ళ కూతురు గాయత్రిని తీసుకొచ్చాడు. ఆ పిల్ల ఇంకా స్కూలుకెళ్ళదు. పక్క ఇంటి పిల్లలెవరో స్కూలుకు వెళుతుంటే ఈ పాప నేనూ వెళ్తానని గోల చేస్తే వాళ్ళ నాన్న, ఆమెను తన చిన్న స్కూలు బ్యాగుతో వెంటబెట్టుకొచ్చాడు. ఆ పిల్లను మావారు దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళిద్దరూ చేరిక కావటానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఆయన తన సంచీలోంచి పుస్తకాన్ని తీసి ఏ, బీ, సీ, డీ చెప్పించడం, ఆ పిల్ల నేర్చుకుని చెప్పటం నేను చూస్తూ ఉండిపొయినాను!