కలైన గోర్వెచ్చని పాట

ఓ తాత పదమెత్తి పాడుతుంటే
అలసి గూటికి చేరిన పక్షులు
రెక్కలు సరిచేసుకుంటూ సేదదీరేవి
దాలిలో మునగదీసుకున్న కుక్కపిల్లలు
చెవులాడించుకుంటూ చూస్తుండేవి
బోదెలో కప్పలో
గట్టుపైచేరి వళ్ళారబెట్టుకుంటుండేవి

పాటతో పాటు వేళ్ళుకదిలేవి
నడుం కదిలేది
పాటపూర్తయ్యేసరికి
వెన్నెల విరగబూసేది
నేస్తున్న నులకమంచం పూర్తయ్యేది

సన్నని పురిపేనిన నులకతో
అల్లిన కౌశలమంతా
రాజమందిరాలలో పరచిన
తీవాసీలా పరుచుకునేది

చేనునుంచో కూలినుంచో
తిరిగొచ్చిన అమ్మో
బాప్పో, పెద్దో, చిన్నమ్మో, మామ్మో
సన్నికల్లుపై నూరిన
మిరపకాయల పచ్చడితో
కూరేదైనా వండి వడ్డించేది

నడుం వాల్చిన తాత చుట్టూ పిల్లలు
ఆ కథలకు పదాల రాగాలకు
వూకొడుతూ వూకొడుతూ
గోర్వెచ్చని కలలకోసం
నిద్రలోకి జారిపోయేవారు
కలచెదరకుండా
ఆకులు, చుక్కలు కావలి కాసేవి

ఆ తాత పాడిన పదం
అప్పుడప్పుడూ నాకు జోల పాడుతుంటుంది
మెలివేసిన మీసం ఊయలూపుతుంటుంది
ఆ నులక కౌశలం కోసం
ఎప్పుడూ ఆత్రంగా వెతుకుతుంటాయి నా కళ్ళు