“ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ

ఎక్సెకటివ్ ట్రావెల్ లౌంజ్‌లో కూర్చుని షాంపేన్ తాగుతున్నది ఆమె. ఇంకొంచెం సేపట్లో లండన్ నుండీ ఫ్లారెన్స్‌కి ప్రయాణం. ట్రావెల్ కాన్‌సియార్జ్ ఏన్ ఎంతో శ్రద్ధగా తన అభిరుచుల కనుగుణంగా ఏర్పాటు చేసిన చక్కని హోటెల్స్, ఒక్కో చోటా చూడవలసిన ప్రదేశాలు సూచిస్తూ ఇచ్చిన పట్టికలు, మేప్‌లూ, ప్లేన్, రైలు టిక్కెట్లూ అన్నీ ముద్రించివున్న చిన్న పుస్తకం మరొక్కసారి చూసుకుంది.

ఆమె ప్రయాణానికి అనుగుణంగా కొంచెం వదులుగా ఉన్న సిల్కు బట్టలు వేసుకుంది. మెడలో గూచీ స్కార్ఫూ, చెవులకు మికిమోటో ముత్యాలూ, చేతికి మ్యుల్లర్ వాచీ, పక్కనే లూయీ విట్టోన్ పర్సూ, ఒక కేరీ-ఆన్ బేగ్.

ట్రావెల్ లౌంజ్‌లో మనుషులు దట్టంగా ఉన్నారు. ఎక్కడి కక్కడే చిన్న బల్లల చుట్టు గుమిగూడి కొందరూ, సోఫాల్లోనూ, బార్ వద్ద కూర్చుని, పక్కనున్నవారితో కులాసా కబుర్లు చెప్పుతున్నవారు కొందరూ.

ఆమె కూర్చున్న బల్ల వద్దకు వీపు మీద వేళ్ళాడే బ్యాక్‌ప్యాక్‌తో, చేతిలో న్యూస్ పేపర్తో ఒకతను వచ్చి, ఇక్కడ కూర్చోవచ్చా అన్నట్లు చూశాడు. నిసి బల్లకింది నుండి తన కాలితో ముందున్న కుర్చీని అతని వైపు తోసింది. అతడు నవ్వుతూ కూర్చున్నాడు.

“ఎక్కడి దాకా మీ ప్రయాణం?” అన్నాడు యాదాలాపంగా మాట కలుపుతూ.

“ముందు ఫ్లారెన్స్, అక్కడి నుండి రోమ్”

“ఈస్ ఇట్? నేనూ పై వారంలో రోమ్ లోనే ఉండాలి”

నిసీకి ఎందుకో అశాంతిగా ఉంది. అటూ ఇటూ చూడ్డం, తటపటాయించటం, కుర్చీలో ఇబ్బందిగా కదలటం గమనించి “నేను ఇక్కడ కూర్చోటం మీకు ఇబ్బంది కలిగించటం లేదు కదా” అన్నాడు.

నిసీ లేచి, “ఏం అనుకోవద్దు. చుట్టూ అంతా పీనట్స్ తింటున్నారు. గాలిలో ఆ వాసన దట్టంగా ఉంది. నాకు పీనట్స్ వాసన పడదు. నేను బైట ఈ వాసనలు లేని చోట పోయి కూర్చుంటాను” అంది.

“అర్థమయ్యింది. చాలా మందికి ప్రాణాంతకమైన ఎలర్జీ కలిగించే ఈ పీనట్స్ ఎయిర్లైన్స్ వాళ్ళు సెర్వ్ చెయ్యడం పూర్తిగా ఆపెయ్యాలి, కానీ, ఎందుకు ఆపరో మరి. త్వరలో ఎలర్జీ కలిగించని పీనట్స్ వస్తాయంటున్నారు. వెళ్ళండి. వెళ్ళండి. అనవసపు రిస్కులు తీసుకోగూడదు.” అంటూనే ఆమె సామాను తలుపు దాకా తీసుకువచ్చి, తలుపు తెరిచి నుంచున్నాడు ఆమె వెళ్ళేదాకా. నిసీ అతని వంక నవ్వుతూ చూసి తన సామాను తీసుకుని వెళ్ళిపోయింది.


నిసీ షామల్ రోమ్ నగరంలో బుక్ చేసుకున్న హోటెల్ గదికి వచ్చేసరికి సాయంత్రమయ్యింది. అది చాలా చక్కని గది. గదిలో గోడ బారూ ఉన్న కిటికీ తెరలు పక్కకు లాగి కిటికీలు తెరిస్తే, అవతల కనిపించే ఎత్తుపల్లాల నగరం, గుబుర్లుగా చెట్లు. మధ్య మధ్యన వాటికన్నా ఎత్తుగా సూదుల్లాటి సిప్రెస్ చెట్లు, విచిత్రమైన రంగులతో, మేఘాలతో నిండిన ఆకాశం. ఆ అందం చూసేసరికి ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయింది.

ఆమె తన సూట్ కేస్ తెరిచి, గదిలో బీరువాల్లోనూ, డ్రెస్సరు సొరుగుల్లోనూ చకచకా తన బట్టలు సర్దేసింది. ఫ్రిజ్ లోనుండి మంచినీళ్ళ సీసా తీసుకుని తాగుతూ మంచం అంచున కూర్చుని, ఆ ఊళ్ళో వింతలు విశేషాలు చెప్పే గైడ్ చూసుకుంది. ఆమెను ఆకర్షించిన విషయం – ఆ రాత్రి ఆ ఊళ్ళో కవుల సమావేశం ఉంది. ఆ జరిగే సమయం, అడ్రెస్ ఉన్నాయి.

ఆమెకు ఉత్సాహం ఉప్పొంగింది. ఇటాలియన్ కవులు కలిస్తే ఎలాటి కవిత్వం పాడతారు? వారి సమావేశాలు ఎలా ఉంటాయి? వెళ్ళి తప్పక వినాలి. ఇలాటి అవకాశం పోగొట్టుకోకూడదు. కాని రోమ్ వచ్చిన కొద్ది సమయంలోనే ఆమె గమనించింది ఏమిటంటే, అక్కడ టాక్సీ నడిపేవాళ్ళూ, షాపుల వాళ్ళూ ఎక్కువమంది ఇటాలియన్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఆ భాష తనకు రాదు. వాళ్ళకు ఇంగ్లీషు రాదు. ఊరు ఇంకా పరిచయం కాలేదు. పగలైతే పర్వాలేదు. ఈ తెలియని ప్రదేశానికి ఒక్కతే వెళితే? మళ్ళీ తిరిగి రావటానికి కేబ్ దొరుకుతుందో లేదో? ఆమె కొంచెంసేపు వెళ్ళాలా, వద్దా అని అశాంతిగా ఊగిసలాడి, చివరికి వెళ్ళకూడదని నిర్ణయించుకుని, ఈ రాత్రికి హోటెల్లోని రెస్టరాంట్ లోనే భోజనం చేసి పడుకుని, రేపు సంగతి రేపు చూడచ్చు అనుకుంది.

ఆమెకు దూరదేశ ప్రయాణాల్లో బొంగరంలా తిరిగి, యాత్రికులు మామూలుగా చూసే ప్రదేశాలన్నీ ఒక్కటీ వదలకుండా చూసేయ్యాలనికాక విశ్రాంతిగా ఉండటం ఇష్టం. హాయిగా హోటెల్ గదిలొ యూరోపియన్ టబ్‌లో స్నానాలు చేస్తూ, బాల్కనీలో కూర్చుని హోటెల్ వాళ్ళిచ్చిన వార్తాపత్రికలు చదువుకుంటూ, టెలివిజన్లో ఆ దేశపు ప్రజల వార్తలు వింటూ, మధ్య మధ్య గదిలో ఫలహారాలు తెప్పించుకుని, కాఫీ, టీలు తాగుతూ, తన ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది.

మరుసటి రోజు మధ్యాహ్నం టబ్‌లో, పెర్‌ఫ్యూం కలిపిన వేడి నీళ్ళలో స్నానం చేస్తూ ఈ రోజు ఊళ్ళో ఏం ప్రదేశాలు చూద్దామా అని చేతిలో ఉన్న గైడు తిరగేస్తుండగా, ఆమె కళ్ళు విప్పారాయి. నిజంగానే! జాన్ కీట్స్ ఇల్లు ఇక్కడ! రోమ్ లోనా! అనుకుంది.

పక్కనే ఉన్న ఫోన్ అందుకుని కింది కాన్‌సియార్జ్ డెస్క్ కి ఫోన్ చేసింది.

చాలా ఉత్సాహంగా “ఇవ్వాళ నేను జాన్ కీట్స్ ఇల్లు చూడాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళటం? టాక్సీ బుక్ చేస్తారా?” అని అడిగితే, కాన్‌సియార్జ్ నవ్వుతూనే మర్యాదగా –

“మడామ్! మీరు బైటికి వెళ్ళి కుడి వైపుకు తిరిగి నాలుగడుగులు వేస్తే, అక్కడ కిందికి పోవడానికి ఎన్నో మెట్లు కనిపిస్తాయి. వాటిని ‘స్పానిష్ స్టెప్స్’ అంటారు. అవి దిగి, కిందికి వెడితే అక్కడ ‘పియెజా డి స్పాగ్నా’. అక్కడే పడవలా ఉండే బెర్నీనీ ఫౌంటెన్ కనిపిస్తుంది. స్పానిష్ స్టెప్స్ దిగగానే ఎడమ పక్కనే కీట్స్-షెల్లీ హౌస్. మీకు వెంటనే తెలుస్తుంది. మీరు క్రిందికి వచ్చినప్పుడు మేప్ తీసుకోండి. కావాలంటే ఇంకా ఇతర విశేషాలు అవీ అందులో గుర్తు పెడతాను. ఈ ఒక్క చోటూ చూడడానికైతే మీకు ఏ మేప్ అవసరంలేదు” అని చెప్పాడు.

నిసికి చాలా ఆశ్చర్యం వేసింది. ‘సెభాష్! ఇంతవరకూ ఆమెకు ఏ కవుల ఇళ్ళూ తనకు చూడ్డానికి ఇంత వీలుగా , అంత దగ్గిర్లో ఉన్న గుర్తు రాలేదు. కీట్స్ నివాసం, తను ఉన్న ఈ ప్రదేశానికి ఐదు నిమిషాల దూరంలో ఉన్నదా? మెట్లు దిగి వెళ్ళాలా? తను ఉన్న ఈ హోటెల్ చాలా ఎత్తు మీద ఉన్నదా? టాక్సీలో వస్తున్నప్పుడు ఏమీ తెలియలేదు. ఏన్ భలే మంచి రిజర్వేషన్ చెసిందే!’ అనుకుంది.

తర్వాత ముస్తాబయ్యి, స్పానిష్ మెట్లు దిగుతూ, ఎండ మండిపోతూ ఉంటంతో, మధ్యమధ్య చెమటలు తుడుచుకుంటూ, ‘అబ్బ ఇన్ని మెట్లు ఉన్నాయేంటి దేవుడా! కాలక్షేపానికైనా మెట్లు లెక్క పెట్టి ఉండాల్సింది’ అనుకుంది. చుట్టూ ఎక్కడ చూసినా జనం. జంటలుగా, గుంపులుగా. తనో? ఒంటరి!

మెట్లు దిగగానే, కాన్‌సియార్జ్ చెప్పినట్లు గానే ఎడమ పక్కన ‘కీట్స్ -షెల్లీ హౌస్’ ఉంది. ‘ఈ పురాతన నగరంలొ కూడా ఇళ్ళ గుర్తులు, మేప్‌లు ఇంత బాగా, ఖచ్చితంగా ఇస్తారో!’ అని మనసులో మెచ్చుకుంది. కీట్స్ -షెల్లీ హౌస్ ఒక చిన్నభవనం. తలుపు తీసుకుని లోపలికి వెడితే పైకి వెళ్ళటానికి ఇరుకు మెట్లు. ఎక్కుతూ గోడల మీది చిన్న ఫొటొలూ, పెయింటింగులూ చూస్తూ, పైన డెస్కు వద్ద ఉన్న ఒక యువకుడి వద్ద ఆగింది. అతడు ఆ మెమోరియల్ ని చూడ్డానికి టికెట్ ఉందని చెప్పాడు. ఆమె దగ్గర డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తూ, లోపల గదులు అన్నీ తిరిగి చూడవచ్చనీ, అమ్మకానికి ఉన్న ఒక్క రేక్ లోని ఇటాలియన్, ఇంగ్లీషు పుస్తకాలు తప్పించి ఇతర పుస్తకాలూ, వస్తువులూ ఏవీ ముట్టుకోకూడదనీ, కీట్స్ మంచం మీద కూర్చోకూడదనీ చెప్పాడు.

నిసి లోపలే నవ్వుకుంది. కీట్స్ మంచం మీద ఎవరు కూర్చోబోయారు? వేరే వాళ్ళ మంచం మీద, అందులోనూ చచ్చిపోయిన వాళ్ళ మంచమ్మీద -అనుకుంది. మళ్ళీ ఆమెకు లండన్లో షెర్లాక్ హోమ్స్ మ్యూజియంలో, హోమ్స్ కుర్చీలో, అతని టోపీ పెట్టుకుని ఫొటోలు దిగేవాళ్ళు గుర్తొచ్చి, ‘ఒక్కొక్క చోట ఒక్కో పద్ధతి!’ అనుకున్నది. కానీ హోమ్స్ నిజమైన వ్యక్తి కాదయ్యె. కీట్స్ నిజమైన వ్యక్తే. ఏమిటో! ఎవరు నిజం మనుషులో! ఎవరు కారో! అంతా కన్ఫ్యూజన్. నిజం మనుషులకీ, ఊహాజనిత మూర్తులకీ, అందరికీ మెమోరియల్సూ, మ్యూజియంలూ, ఎమ్యూస్మెంట్ పార్కులూనూ! మాయా సంసారం తమ్ముడా! అనుకుంటూ ఆ యువకుడి వద్దకు మళ్ళీ వెళ్ళి, ఒక గైడ్ పుస్తకం కొనుక్కుని దాని సాయంతో అక్కడ గోడల మీది బొమ్మలు, ఆస్కార్ వైల్డ్, వాల్ట్ విట్మన్, షెల్లీ, కీట్స్ శిలా విగ్రహాలు, షో కేస్‌లో కీట్స్ జోసెఫ్ సెవర్న్‌కి రాసిన ఉత్తరం, కీట్స్ పోయెట్రీ పుస్తకాల మొదటి ఎడిషన్లు, షెల్లీ సగం కాలిన దవడ ఎముక, కీట్స్, షెల్లీల చిన్ని జులపాల కత్తిరింపులూ చూస్తూ, కీట్సు జుట్టు గురించి గైడ్‌లో “Mr. Keats’ hair was remarkable for the beauty of its flowing grace and fineness… it was kind of ideal, poetical hair..” అన్న మాటలు చదివి నవ్వుకుంది. కీట్స్ పడక గదిలోని మంచం, ఫైర్ ప్లేస్, అతని చిత్రపటం, డెత్ మాస్క్ ఇలాటి చిహ్నాలన్నీ విచిత్రంగా చూసి, పాత వాసనలు నిండి అప్పుడప్పుడూ దగ్గు తెప్పిస్తున్న ఆ ఇరుకు భవనం నుండి బైట పడింది. వచ్చే ముందు కొన్ని కవిత్వం పుస్తకాలు కొనుక్కుంది.

బైటికి పోయి మళ్ళీ స్పానిష్ మెట్ల మీద కూర్చుని ఆ ఎండలొ అటూ ఇటూ ఆ ఫౌంటెన్ చుట్టూ తిరుగుతున్న మనుషులను చూస్తూ కూర్చుంది. ఇప్పుడు నిసీలో హుషారు లేదు. ఏదో తెలీని దిగులు.

ఐనా ఏమిటి తన దిగులు? కీట్స్ మెమోరియల్ ఎలా ఉంటే తనకెందుకు? ఎప్పుడో 1821లో పోయిన కవి, క్షయ వ్యాధితో పొయేసరికి అతని వస్తువులూ, బట్టలూ మంచం అన్నీ అప్పుడే తగలబెట్టారు. తను చూసినది కీట్స్ నివసించిన ఇల్లూ కాదు, అందులోది అతని మంచమూ కాదు. అది కీట్స్ మరణించిన స్థలం. అతను పొయెట్రీ ఇక్కడ రాయలేదు. కీట్స్ రాసిన ప్రేమ కవిత్వానికీ, ఈ స్మారకానికీ ఏమీ చెప్పదగ్గ సంబంధమూ లేదు.

‘ఐతే ఏం? అమెరికన్ ప్రెసిడెంట్ థియొడోర్ రూస్వెల్ట్, ఇంకా కొంతమంది పెద్దల పూనిక వల్ల ఈ మెమొరియల్ 1909లో ఏర్పడిపోయింది. కొద్దిగా షెల్లీ, బైరన్‌ల జ్ఞాపికలు కూడా ఇందులో జత పర్చారు. ఎందుకీ మెమోరియల్? సుమారు 200ఏళ్ళ నాటి రొమాంటిక్ కవులకు, వారి లిరికల్ పొయెట్రీకి ఇది ఎలాటి గుర్తు?’ అనుకుంది నిసి.

“హల్లో! కీట్సును గురించి చదువుతున్నారు. మనసులొ ఏదో మథన పడుతున్నారు. ఏమిటా మథన? చెప్పరూ”

నిసి ఉలిక్కి పడింది. ఎవరు? ఈ ఊరు కాని ఊరులో తనని పలకరించేది? అతడు ఆమె పక్కనే వచ్చి కూర్చుంటూ, ఒక కోక్ కేన్ ఆమెకు ఓపెన్ చేసి ఇచ్చి, తనకు కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాడు.

“నేను మీకు తెలుసా?” అందామె అతనికేసి కొంచెం అనుమానంగా చూస్తూ.

“మొన్నీ మధ్యే గదండి లండన్ ఎయిర్ పోర్ట్ లొ చూశారు. అప్పుడే మర్చిపోయారా? అవున్లెండి, డాక్టర్లు రోజువారీ ఎంతమందినో చూస్తారు. ఎవరినని గుర్తుంచుకుంటారు లెండి” అన్నాడు.

“నేను డాక్టరని మీకెలా తెలుసు?”

‘ఏం? మీ పేరు ఏ మెడికల్ సొసైటీ హాస్పిటల్ స్టాఫ్ డిరెక్టరిలోనో చూసి ఉండకూడదా?”

“నిజంగా! ఏ దేశంలో? ఏ ఊళ్ళో?”

“అబ్బా! మీరు డాక్టరా? డిటెక్టివా? అప్పుడు లండన్లో మీ సామాను మొయ్యలేదూ? సామాను మీద, బైటే మీ పేరూ, ఊరూ స్టిక్కర్లు అతికించి లేవూ? అంతేలెండి. ఆడవాళ్ళకు ఎక్కడికక్కడే సామాన్లు మోసేవాళ్ళు సిద్ధంగానే ఉంటారుగా. అందుకని వాళ్ళు గుర్తుండరు. ఇంతకీ ఆ యువకవి గురించి ఏమిటి మీ ఆలోచన? ”

వాళ్ళ సంభాషణ ఇంగ్లీషులో సాగుతున్నది.

“అదే! ఆ ఇరుకు మృతి పంజరం లాంటి మ్యూసియంలో నైటింగేల్ లాటి అతని స్మృతిని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బంధించి ఉంచినట్లు అనిపిస్తుంది నాకు. కీట్స్ మధురమైన కవితలు అతని ఆనందభరితమైన హృదయంలో నుండి ప్రవహించాయి కాని విషాదంలో నుండి కాదు” అంది.

అతడు నవ్వాడు. “నిజమే లెండి. ఈ సంస్మరణ చిహ్నం కీట్స్ ఇష్టపడడు. కానీ వ్యక్తుల ఇష్టాలు, కోర్కెలు సంఘజీవులైన మనుషులు ఎప్పుడూ గుర్తించరు గదా!”

“సంఘం, మానవ హక్కులను పరిరక్షిస్తుందనుకుంటారు కానీ చాలా సార్లు వాటిని పరిమారుస్తుంది. వ్యక్తిగత హక్కులను అతిక్రమిస్తుంది. మనిషిని కొనేసినట్లుగా ప్రవరిస్తుంది. ప్రతి మనిషికి చావు ఉందేమో కాని, కొందరికి బ్రతుకులోనూ చావులోనూ కూడా సంఘం నుండి, కుటుంబం నుండి, సమాజం నుండి విముక్తి లేదు.” అంది నిసి.

“ఈ విశాల ప్రదేశం, ఎదురుగా ఈ ఫౌంటెన్, ఈ ఎండ, గాలి, మనుషుల కోలాహలం ఇవి కీట్స్ ఆనందించాడుగా! మీరు ఇక్కడ చదవరూ అతని పొయెట్రీ? నేను వింటాను” అన్నాడతను.

నిసి తన దగ్గరి పుస్తకం లోంచి ఈ పద్యం ఎంచుకుని చదివింది.

 Ode On Melancholy

No, no, go not to Lethe, neither twist
Wolf’s -bane, tight rooted, for its poisonous wine;
Nor suffer thy pale forehead to be kiss’d
By nightshade, ruby grape of Proserpine;
Nor let the beetle, nor the death-moth be
Your mournful Psyche, nor the downy owl
A partner in your sorrow’s mysteries;
For shade to shade will come too drowsily’
And drown the wakeful anguish of soul….”  

పద్యమంతా చదివింది నిసి షామల్. అతడు ప్రశాంతంగా విన్నాడు.

“చాలా అందమైన పద్యం. చాలా బాగుంది. విషాదాన్ని అధిగమించాలే గాని దాన్నే అభిరుచిగా చేసుకోకూడదు. మీరూ ఉత్తి పుణ్యానికి ప్రతిరోజూ హృదయాన్ని కృంగదీసే వాళ్ళకు దూరంగా ఉండండి. ఐనా, మీరు డాక్టరు. రోగాలు, చావులు, విషాదం – ఈ విషయాలు గురించి తెలిసిన వారు. మీకు నేను చెప్పేది ఏమిటీ? లేవండి, మీరు మళ్ళీ ఈ మెట్లన్నీ ఎక్కొద్దు. రోమ్ నాకు బాగా తెలుసు. పక్క సందుల్లోంచి నడిచి, ఎక్కడైనా కఫేలో కూర్చుని స్నాక్ తిందాం ఏమంటారు?” అన్నాడు.