బాలగోపాల్‌కొక నూలుపోగు


కే. బాలగోపాల్
20జూన్ 1952 – 08అక్టోబర్ 2009

బాలగోపాల్‌నీ పౌరహక్కుల పరిరక్షణా ఉద్యమాన్నీ వేరు చేసి మాట్లాడటం అసంభవం, అసాధ్యం. తెలుగునాట గత ముప్పై సంవత్సరాలుగా ప్రజాస్వామిక హక్కులకోసం, ముఖ్యంగా, ఆర్థికంగా సమాజంలో అణగదొక్కబడిన, అణగదొక్కబడుతున్న ప్రజల హక్కుల కోసం నిద్రాహారాలు మాని నిరంతరం పోరాడిన ఏకైక వ్యక్తి బాలగోపాల్.

ఆయన ఆకస్మిక మరణం ఆయన చేపట్టిన ఉద్యమానికి తీరని లోటు. మేధావిగా మధ్యతరగతి విద్యాధికులని తన వ్యాస పరంపర ద్వారా మేలు కొలపటానికి ప్రయత్నించాడు. ఉద్యమ నిర్మాతగా సర్వదా ఒంటరిగా నిలబడ్డాడు. తను నమ్మిన ఉద్యమానికి స్వచ్ఛంద కార్యకర్తగా, రేయింబవళ్ళు కృషి చేసాడు. తన ఆరోగ్యాన్నికూడా లెక్కచేయకుండా ఆఖరి క్షణం వరకూ పౌరహక్కుల కోసం పోరాడాడు.

మేధావులు రెండు రకాలు. ఒక తరహా మేధావులు వారి ఆశయాలనీ, ఆలోచనలనీ కాగితంపై పెడతారు; మనందరికోసం. మరొక తరహా మేధావులు మాత్రం వారి ఆశయాలనీ, ఆలోచనలనీ కాగితంపై పెట్టడమే కాకండా ఆచరణలో కూడా పెడతారు. బాలగోపాల్ ఈ రెండవ తరహా మేధావి. బాలగోపాల్‌కి ఆశయం, ఆచరణా పేకా, పడుగులా జమిలిగా నడిచాయి. అదీ, అతని ప్రత్యేకత, అతని గొప్పతనం. సరిగ్గా అటువంటి వాడే మనం ఎప్పుడో మరిచిపోయిన మేధావి, మోహనదాస్‌ కరంచంద్ గాంధీ. గాంధీకి కూడా ఆశయానికీ, ఆచరణకీ మధ్య అంతరం లేదు.

బాలగోపాల్ బహుముఖప్రజ్ఞుడు అనడం అతిశయోక్తి కాదు. సాహిత్య విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, తత్వశాస్త్రవేత్తగా, సామాజికశాస్త్ర వ్యాఖ్యాతగా తెలుగునాట ప్రసిద్ధికెక్కాడు. ఆయన సరళమైన తెలుగులో రాసిన “ప్రాచీన భారతదేశచరిత్ర” (దామోదర్‌ ధర్మానంద్‌ కొసాంబి పరిచయం) ఇప్పటికీ తెలుగు చదవడం వచ్చిన ఎవరికైనా తేలికగా అర్థమయ్యే పుస్తకం. ఇది ప్రతి తెలుగుమనిషీ తప్పక చదవాల్సిన పుస్తకం. బాలగోపాల్ రాసిన ప్రతి తెలుగు రచనలోనూ, సరళత, పుష్టి,  తెలుగుదనం కనబడతాయి.

కొసాంబి భగవద్గీత మీద రాసిన వ్యాసాన్ని 1976లో మొట్టమొదటిసారిగా చదివి మార్క్సిస్ట్ నయ్యానని బాలగోపాల్ రాసాడు. తరువాత, కాలక్రమేణా ఆ మార్కిస్ట్ సిద్ధాంతాలని అధిగమించి, సామాజిక పరివర్తనకి అనువైన సైద్ధాంతిక ప్రయోగాత్మక సాధనాల పరంగా బాలగోపాల్ ఆర్జించిన పరిణతి (పరివర్తన కాదు!) గురించి వేరుగా నిష్పక్షపాతంగా పరిశోధించి రాయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

బాలగోపాల్ రాసిన “కల్లోల కథా చిత్రాలు” (1997) అన్న పుస్తకానికి నేపథ్యం రాస్తూ చలసాని ప్రసాద్ మేధావుల గురించి కొడవటిగంటి కుటుంబరావుగారు అన్న మాటలు ఉదహరించి, ఆ మాటలు అక్షరాలా బాలగోపాల్‌కి వర్తిస్తాయని అన్నాడు: “తల్లికీ, తండ్రికీ, గురువుకీ, దేశానికీ ప్రతి మనిషీ రుణపడి ఉంటాడు. మేధావికి మరో రుణం కూడా ఉన్నది. తన తలను పొలంగా మార్చి, దున్ని, ఎరువు వేసి, పంటలు ప్రజలకు పంచటం. ఇది తీర్చవలసిన బాకీ – తలబీడు పడిపోయే దాకా. ఆ తర్వాత ప్రపంచం శాశ్వతంగా ఆ మేధావికి బాకీ పడి ఉంటుంది.” ఇది సత్యం.

బాలగోపాల్ కొసాంబి లాగానే గణిత శాస్త్రవేత్త. బాలగోపాల్‌లో తార్కికతకి అతని గణితశాస్త్ర ప్రావీణ్యత సహకరించి ఉండాలి. అతని తాత్వికతకి అది బలం చేకూర్చి ఉండాలి.

యద్యదాచరతి శ్రేష్ట స్తత్తదే వేతరోజనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

– భగవద్గీత, కర్మయోగం – 21

శ్రేష్టులైనవారు (గొప్పవారు) ఏ పనులు చేస్తారో, మామూలు మనుషులు కూడా ఆ పనులే చేస్తారు. వాళ్ళు ఏ విధమైన ప్రమాణాలు నిర్దేశిస్తారో, ఆప్రమాణాలని అందరూ అనుసరించుతారు, అని అర్థం. నిజం చెప్పాలంటే, శ్రేష్టులు ఏ పనులు చేస్తారో,అందరూ ఆ పనులే చెయ్యాలి. ఏ ప్రమాణాలను నిర్దేశిస్తారో, అందరూ ఆ ప్రమాణాలనే అనుసరించాలి  – అని గీతావాక్యం తిరగరాసి ఉంటే బాగుండేదనిపిస్తుంది.