అమ్మ ఉత్తరం

కాకినాడ
31-08-2000

చిరంజీవి భాస్కరానికి,

మీ అమ్మ ఆశీర్వదించి రాయునది. మేమిక్కడ క్షేమం. నువ్వక్కడ క్షేమంగా ఉన్నావని నువ్వప్పుడప్పుడు చేసే ఫోన్ల వల్ల తెలుస్తోంది. ఎప్పుడు ఫోన్లో మాట్టాడినా, “ఉత్తరం రాయీ, ఉత్తరం రాయీ” అని కాల్చుకు తింటావు. ఏం ఉంటాయీ సంగతులు ఉత్తరంలో రాయడానికి? అదీగాక ఉత్తరం అనేది రాసి ఎంత కాలమయిందో! పొద్దున్నే లేస్తాం, వండుకుంటాం, తింటాం, పడుకుంటాం. మళ్ళీ పొద్దున్న లేస్తాం. ఏం సంగతులుంటాయి రాయడానికి? చెప్తే వినవు. ఎప్పుడూ ఉత్తరం రాయమనే అడుగుతావు ఫోన్లో. “సరే! వీడిన్ని సార్లు అడుగుతున్నాడు కదా? ఏదో తోచింది రాద్దాం” అని మొదలు పెట్టాను.

ఇందాకే భోజనాలయ్యాయి. నేను కుర్చీలో కూర్చుని ఉత్తరం రాస్తుంటే, మీ నాన్న టీవీలో క్రికెట్ విశేషాలు చూస్తున్నారు. అయినా ఎవరో ఆడుతుంటుంటే, ఈయన కెందుకో అంత ఉబలాటం? ఆ మాయదారి ఆటలో లీనమై పోతారు. “అదో కాలక్షేపం ఆయనకి, పోనీలే పాపం” అని ఆయన మానాన్న ఆయన్ని వదిలేస్తూ వుంటాను.

ఇందాక టీవీలో ప్రకటనలు వస్తున్నపుడు, నా వేపు చూస్తూ, “ఏమిటీ? కధేమన్నా రాస్తున్నావా?” అని వేళాకోళమాడేరు. కధలు రాసే మనిషి లాగా కనబడుతున్నానురా ఈయనకి?

“ఏం? టీవీలో క్రికెట్ గోల ఆపారా, నా మీద దృష్టి పడిందీ?” అని నేనూ చురుగ్గానే అన్నాను.

“అబ్బే! ఊరికే అడిగానంతే!” అన్నారు ఖంగు తిని. నాకే జాలి వేసింది. ఎప్పుడూ నన్ను ఒక్క మాట అని ఎరగరు కదా?

“అది కాదండీ! పిల్లాడు అస్తమానూ ఫోనులో, ‘ఉత్తరం రాయీ, ఉత్తరం రాయీ’ అని అడుగుతూ వుంటేనూ, అదేదో చేద్దామని రాయడం మొదలు పెట్టేను” అని సామరస్యంగా చెప్పాను.

“మంచిది, మంచిది! రాయి, రాయి! అంతా రాసేక నాక్కూడా చూపించు ఒకసారి. నేనూ చదువుతాను” అన్నారు ఆశగా. అలాగేనన్నట్టు తలాడించి నా రాతలో పడ్డాను. ఆయనేమో మళ్ళీ క్రికెట్ విషయాలు చూడ్డంలో పడ్డారు.

మొన్న ఫోనులో నా ఇబ్బందుల గురించి అడిగావు కదా? నాకేం ఇబ్బందు లుంటాయీ? పెద్దవేం లేవు గానీ, చిన్న చిన్న ఇబ్బందులే వున్నాయి. పనిమనిషి శుభ్రం నచ్చదు నాకు. అయినా నాలుగిళ్ళలో పని చేసేవాళ్ళు, ఏం తీరిగ్గా, ఏం శుభ్రంగా చెయ్య గలుగుతారూ? మనింట్లోనే ఇచ్చే జీతంతో వాళ్ళకి బతుకు గడవదు కదా? అందుకని ఇంట్లో పనులన్నీ నాన్నా, నేనూ శుభ్రంగా చేసుకుంటాము. అదే అప్పుడప్పుడు అలసటగా వుంటుంది.

మంచి నీళ్ళు సరిగా రావు. వచ్చి నపుడే పట్టి వుంచుకోవాలి. అవి కూడా దొంగల్లా తెల్లారు ఝామున ఏ నాలిగింటికో వస్తాయి. ఒక్కోసారి సినిమా రెండో ఆట వదిలాక వస్తాయి. అదో భవ సాగరం నాయనా!

అన్నింటి కన్నా పెద్ద ఇబ్బంది ఎదురింట్లో వుండే బామ్మ గారితో. నువ్వు అమెరికా వెళ్ళాక వాళ్ళు దిగారు ఆ వాటాలో. కొడుకూ, కోడలూ ఉద్యోగాలకి వెళితే, ఒక్కతీ వుంటుంది ఇంట్లో పగలంతా. హాయిగా టీవీ చూసుకుంటూ, పుస్తకాలు తిరగేస్తూ వుండొచ్చు కదా? అబ్బో, సినిమాలంటే ఎంత పిచ్చనీ! కొత్త సినిమా వచ్చిన రోజునే చూసెయ్యాలి. ఆపైన ఆ కధంతా నాకు చెప్పాలి. పైపెచ్చు తోడుగా సినిమాకి నన్ను కూడా రమ్మని వేధింపు. ఎటొచ్చీ కాస్త మాట సాయంగా వుంటుందనుకో ఆవిడ.

ఒక విచిత్రమైన ఇబ్బంది నాలుగిళ్ళ అవతల ఇంట్లో అద్దెకి వుంటున్న స్కూలు టీచరుతో. మామూలుగా వంటింటి సామాను అప్పు కోసం ఆడవాళ్ళు వస్తారు. అయితే ఇక్కడ ఆ వాటా ఇల్లాలు తన భర్తని పంపిస్తుంది ఓ కప్పు కాఫీ పొడి కోసమో, ఓ గ్లాసు పంచదార కోసమో! మొన్నో సారి ఒక గరిటతో వచ్చాడాయన శనగ పప్పు అప్పు కోసం. నాకు ఒకటే నవ్వు. అదో విచిత్రం నాకు. ఆ స్కూలు టీచరు కూడా బొత్తిగా సిగ్గు పడకుండా వస్తాడు అప్పు కోసం. ఇచ్చిన వెంటనే చెప్పేస్తాడు తీర్చలేనని. నాకే జాలేస్తుంది ఆయన్ని చూస్తే.

అస్తమానూ, “ఉత్తరం రాయీ, ఉత్తరం రాయీ” అంటుంటే, “దేని గురించి రాయమంటావూ?” అని నేనడిగినప్పుడు, “ఏదో ఒకటి రాయి. పిల్లి గురించో, కుక్క గురించో రాయి” అంటావు కదా? “పిల్లి సంగతీ, కుక్క సంగతీ నీకు తెలుసు కదరా” అనంటే, “పోనీ అవే మళ్ళీ చెప్పూ” అంటావు. అందుకని ఇప్పుడు పిల్లి సంగతులు రాస్తాను. నువ్వెళ్ళిన కొన్నాళ్ళకి ఓ పిల్లి నన్ను వేధించడం మొదలెట్టింది. వంటింటి కిటికీ బయటి నించీ నన్ను చూసి ఒకటే అరవడం. ఎందుకంటే ఓ రోజు దానికి కాసిని పాలు పోశాను. అప్పట్నించీ అదే టైంలో కిటికీ దగ్గరకి వచ్చి, నన్ను చూసి అరుస్తుంది. కాసిని పాలు పోస్తే, తాగి వెళ్ళి పోయేది. మళ్ళీ మర్నాడు అదే సమయానికి కిటికీ దగ్గర హాజరు. నక్షత్రకుడి చెల్లెలే అనుకో! ఏదో బాకీ వున్నట్టే. ఇదో చాకిరీ అయిపోయిందేవిటా అని అనిపించింది మొదట్లో. పోనీ కిటికీ ఊచల్లోంచీ దూరి లోపలకి వస్తుందా అంటే, అబ్బే, దాని కెంత టెక్కూ! “అలా లోపలకి వచ్చి పాల గిన్నెల మీద మూతలు పడ గొట్టడం, గిన్నెల్లో మూతులు పెట్టడం మా ఇంటా వంటా లేవమ్మా!” అన్నట్టుగా, నన్ను చూస్తూనే కిటికీ బయటి నించే అరిచేది.

ఒకరోజు విసుగు పుట్టి, “ఎంతసేపు అరుస్తుందో చూద్దాం” అని వంటింటి కిటికీ తలుపు మూసేసి, హాల్లో కూర్చున్నాను. పాపం కాస్సేపు అరిచి ఊరుకుంది. “హమ్మయ్య, వెళ్ళిపోయింది” అనుకుంటూ, వంటింటి కిటికీ తలుపు తీసి చూశాను. అప్పటికీ అక్కడే పడుకుని వున్న ఆ పిల్లి, మళ్ళీ నన్ను చూడగానే తోక నిటారుగా పైకెత్తి అరవసాగింది. “ఓసి నీ దుంప తెగా!” అని తెగ ఆశ్చర్యపోయాను. ఈసారి ఎందుకో విసుగు పుట్టలేదు. పైపెచ్చు జాలేసింది. పోసిన కాసిన్ని పాలూ తాగి వెళ్ళిపోతున్న దాన్ని చూసి, కాస్త ఇష్టం కూడా కలిగింది. మర్నాడు వంటింటి తలుపు తీసి ఇంట్లోకి పిలిస్తే, చక్కగా చుట్టాల్లా వచ్చేసింది. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. ఒక్క రోజూ ఏ గిన్నె లోనూ మూతి పెట్టి ఎరగదు. పెట్టింది తినడం. ఇల్లంతా నా వెనకాల తిరగడం. బయటికి వెళ్ళి మళ్ళీ ఎప్పటికో తిరిగి రావడం. రాను రాను నాన్న క్కూడా బాగా అలవాటయి పోయింది ఆ పిల్లి.

అయినా ఆ పిల్లి ఠీవి చెప్పనలవి కాదనుకో! అది కిటికీ వూచల్లోంచీ లోపలకి రావడానికి సుతరామూ ఒప్పుకునేది కాదనుకో. దానికి నామోషీ అలా రావడం. గుమ్మం తలుపు తీసే వరకూ అరుస్తూ ఎదురు చూసేది గానీ, కిటికీ లోంచీ దొంగ పిల్లిలా రావడం దానికి అవమానం. ఒక రోజు నేనూ, నాన్నా సుందరత్తయ్యా వాళ్ళింటికి భోజనాలకి పొద్దున్నే వెళ్ళి, సాయంకాలానికి తిరిగి వచ్చాము. వెళ్ళే ముందర పిల్లికి పాలు పోసి వెళ్ళాను. సాయంకాలం వచ్చి తలుపు తీస్తే, ఏముందీ? సోఫా కింద నించీ పిల్లి అరుస్తూ బయటి కెళ్ళిపోయింది. అంటే మేము పొద్దున్న చూసు కోకుండా, పిల్లిని ఇంట్లోనే వదిలేసి, తాళం వేసి వెళ్ళిపోయాం. కిటికీ వూచల్లోంచీ వెళ్ళచ్చుగా బయటికి? అబ్బే! దాని కెంత ఠీవీ! అన్నీ బిగ పెట్టుకుని, మేం తిరిగి వచ్చి తలుపు తీసే వరకూ ఎదురు చూసిందే తప్ప, కిటికీ లోంచి మాత్రం బయటికి వెళ్ళ లేదు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. అదీ మన పిల్లి గారి గొప్పదనం!

ఎప్పుడైనా కొన్ని గంటలు కనబడక పోతే, “ఎక్కడికి పెత్తనాలకి పోయిందో!” అనుకుంటూ, మీ నాన్న పెరట్లోకి వచ్చి, “పిల్లీ, పిల్లీ” అని గట్టిగా కేక లెట్టేవారు. ఎక్కడో రెండు, మూడు ఇళ్ళ అవతల వున్న ఆ పిల్లి గారు, నాన్న గొంతు వినగానే, అరుచుకుంటూ, ఇళ్ళ కప్పుల మీదుగా పరిగెత్తుతూ వచ్చేసేది. అంత మచ్చికై పోయింది నాన్నకి. ఇంకో రోజు నాన్న కారప్పూస తింటుంటే, అరుస్తూ, ఆయన కాళ్ళ మధ్య దూరింది. “నువ్వు తినేది కాదే! ఇది కారప్పూస” అని నాన్న చెప్పినా వింటేగా! ఒకటే అరవడం, “నాకూ పెట్టు” అన్నట్టుగా. దాని పోరు పడలేక, కాసింత కారప్పూస నేల మీద దాని ముందర నాన్న పోస్తే, తినేసింది. మాకెంత ఆశ్చర్యం వేసిందో! పిల్లి కారప్పూస తినడం! దానికీ, మాకూ ఏదో జన్మజన్మల సంబంధం వుందనిపించింది. కారప్పూసతో ఆగిందా దాని ఆగడం? నాన్న పెడితే, ఆవకాయన్నం, పెరుగన్నం, గారెలూ, అన్నీ తినేసేది.

“దీనికి మనం కిందటి జన్మలో రుణపడి వున్నాం” అనేవారు నాన్న. ఆ పిల్లి ఒక రోజు నీళ్ళ గదిలో నాలుగు పిల్లల్ని పెట్టింది. పిల్లల్ని కని అలిసిపోయిన దానికి పాలు పోస్తే, ఎంత నీరసంగా పాలు తాగిందో! చాలా జాలి వేసింది మాకు ఆ బాలింతరాలిని చూసి. నీళ్ళ గదిలో పిల్లులుండగా ఎలా స్నానం చేసేదీ? పిల్లినీ, దాని పిల్లల్నీ పెరట్లో వున్న కొట్టం గదిలోకి మార్చాలని మా ఆలోచన. అయితే అప్పుడే పుట్టిన పిల్లల్ని ముట్టుకుంటే, తల్లి వూరుకుంటుందా? పీకేయదూ మమ్మల్ని, దాని పిల్లల్ని ఏమన్నా చేసేస్తున్నామేమోనని? ఏం చేయడానికీ తోచలేదు. ఆఖరికి ధైర్యం చేసి నాన్న దాని దగ్గరకు వెళ్ళారు. నీరసంగా కళ్ళు తెరిచి, నాన్నని చూసి సంతోషంగా, “నా పిల్లల్ని చూడూ” అన్నట్టు అరిచింది. నాన్న మీదెంత నమ్మకమో దాని కళ్ళల్లో. నాన్న దాన్నీ, దాని పిల్లల్నీ ఒక చేటలో పెట్టి, కొట్టం గదికి మార్చారు దాని మకాం. అప్పుడే పుట్టిన దాని పిల్లల్ని ఎత్తి చేటలో పెడుతున్న నాన్న మీద దాని కెంత విశ్వాసం! ఏమీ చెయ్యలేదు మమ్మల్ని. కొన్నాళ్ళకి పిల్లల్ని అక్కడ్నించీ తీసుకుని, వేరే చోటికి పట్టుకు పోయింది.

ఇంకొన్నాళ్ళకి, “ఏమిటీ? పిల్లి కనబడి రెండ్రోజులయింది. ఎక్కడకి పోయిందబ్బా?” అనుకుంటూ, నాన్న పెరట్లోకి వెళ్ళి, “పిల్లీ, పిల్లీ” అని చాలా సార్లు కేకలు పెట్టారు.మళ్ళీ ఆ పిల్లి ఎప్పుడూ కనబడలేదు. “దేని కిందన్నా పడి చచ్చి పోయిందేమో!” అనే ఆలోచన గుండెల్ని బరువెక్కించేది. మరి కొన్నాళ్ళకి అది లేక పోవడం కూడా అలవాటయి పోయింది.