నింగి-నేల

నేలంటే మరేమీ కాదు
నిదురించే నీటి గుండెలపైకి
ఆప్యాయంగా కప్పిన
ఆకుపచ్చని దుప్పటి

అమరిన ముక్కలన్నిటినీ
అతిజాగ్రత్తగా కూర్చి
అంతిమంగా పరిష్కరించిన
అనాది ప్రహేళిక

ఒకోసారి
నేలమీంచి చూసే ఆకాశం కన్నా
ఆకాశంలోంచి చూసే నేలే
అందంగా ఉంటుంది

నిజానికి
నేల, నింగి
ఒకరి అందానికొకరు అసూయపడుతూ
యుగాలు గడిపిన ఇద్దరు వనితలు

నిరంతరం
చూపులతోనే అభినందించుకొంటున్నా
ఎప్పటికీ కలవని
ఇద్దరు ప్రేమికులు