నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని మధుకేళి వర్ణన

సీ.  వేదండ వదన శుండాదండ గండూష
             కాండ సిక్తాప్సరో మండలములు
       గంధర్వ కన్యకా కనక సౌగంధిక
             మాలికా లగ్న షాణ్మాతురములు
       నందీశ్వర క్షిప్త నారంగ ఫలపాక
             తరళ విద్యాద్ధరీ స్తన భరములు
       గరుడ లీలావతీ కస్తూరికా పంక
             పిహిత నిశ్శేషాంగ భృంగిరిటులు

తే.  వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ
       ధవళితాకాశ చర వనితా ముఖములు
       శాంభవీ శంభు మధుకేళి సంభ్రమములు
       పొదలి వాసించుఁ గాత నా హృదయ వీధి

పై పద్యం కవిసార్వభౌముడైన శ్రీనాధుని హరవిలాస కావ్యం లోనిది. కావ్య ప్రారంభంలో, ఇష్ట దేవతా ప్రార్థన చేసే సందర్భంలో శివపార్వతులను సంభావిస్తూ రాసిన పద్యం. ఏ కవి అయినా దైవప్రార్థన చేసేటప్పుడు ఒక నమస్కారం పెట్టి ఊరుకోడు. ఆ దేవుడి ప్రభావాన్నీ, లీలలనూ ఉత్ప్రేక్షలతోనో, రూపకాలతోనో చమత్కారంగా వర్ణించి – అలాంటి దేవుడు నా కృతిభర్తనూ నన్నూ కాపాడుగాక అని వేడుకోవడం పరిపాటి. అలాంటిదే ఈ పద్యమున్నూ. ఇందులో కేవలం శివపార్వతులనే గాక శైవలోకం లోని ఇతర ప్రధాన పెత్తందార్లనూ, వారి చేష్ఠావిన్యాసాలనూ వివరిస్తూ పద్యాన్ని నడిపించాడు కవి. మొత్తం మీద ఒక సందర్భాన్నీ, సంఘటననూ ఈ దేవదేవులూ, వారి పరివారమూ ఎలా నిర్వహించుకున్నారో, ఆ సంబరాన్ని తెలిపేది ఈ పద్యం.

సందర్భం మధుకేళి. అంటే వసంతోత్సవం. హోలీ పండగన్నమాట. రంగులు పులుముకోవడం, పిచికారీలతో రంగునీళ్ళు చిలకరించుకోవడం ఈ పండగలోని ప్రధాన కార్యక్రమం. ఇలాంటి సందర్భాల్లో చిన్నా పెద్దా తేడాల్లేకుండా, ఉల్లాసంగా అందరూ కలిసిపోవడం ఆనవాయితీ. అంతే కాదు, మర్యాద కోసం మనసులోనే దాచి వుంచుకొని బైటికి తెలుపుకోలేని కోరికలనూ, ఆశలనూ కొంచెం బయట పెట్టుకునే అవకాశం లభించేది ఇలాంటి సందర్భాల్లోనే. ఈ ఉల్లాసాన్నంతా ఈ పద్యంలో చూపించాడు శ్రీనాధుడు.

వినాయకుడుగారు తన సహజ పిచికారీ అయిన తొండంతో నీటిని పీల్చి ఆగండూష జలాన్ని అప్సర స్త్రీల మీద చల్లుతున్నాడు. బంగారు సౌగంధిక పుష్పాలతో మాలలు కట్టి వాటితో కుమారస్వామిని బంధిస్తున్నారు గంధర్వ కన్యలు (షాణ్మాతురుడు – కుమారస్వామి). నందిగారు నారింజపండ్ల రసాన్ని విద్యాధర కన్యకల వక్షస్థలం మీద పోసి వారి ఉరోజాలని తరళితం గావిస్తున్నాడు. గరుడ కన్యలు భృంగిరిటిని పట్టుకొని కస్తూరి పంకంతో వొళ్ళంతా సందులేకుండా పూసేస్తున్నారు. ఈ ముచ్చటనంతా ఆకాశంలో నిలబడి తిలకిస్తున్న అచ్చరలేమల ముఖాల మీదకి కర్పూరపు పొడిని జల్లి వారు తెల్లముఖం వేసేట్టు చేస్తున్నాడు వీరభద్రుడు. ఈ విధంగా శాంభవీ, శంభుడూ, వారి పరివారమూ జరుపుకుంటున్న మధుకేళి సంబరాలు నా హృదయంలో వసించుగాక అని ఆశిస్తున్నాడు కవి.

ఒక చక్కని వసంతోత్సవ వాతావరణాన్ని రూపు కట్టించాడు శ్రీనాధుడు ఈ పద్యంలో. స్త్రీలూ పురుషులూ సమాన సంరంభంతో ఈ క్రీడలో పాల్గొన్నారు. పద్యంలోని మూడు పాదాల్లో, వేదండ వదనుడూ, నందీశ్వరుడూ, వీరభద్రుడూ దుడుకుతనాల్చేస్తే, రెండు పద్యపాదాల్లో గంధర్వ కన్యలూ, గరుడ లీలావతులూ విజృంభించారు. ఆ పరివారంలో పెద్దవారు కాబట్టీ శాంభవీ శంభులు దుడుకు పనులేమీ చేసినట్లు చెప్పకుండా, ఒక్క ముక్కలో శాంభవీ శంభు మధుకేళి సంభ్రమములు అని సూచించిడు కవి ఔచిత్యవంతంగా. వసంతోత్సవం అంటే రంగులుండాలి కదా. కనుక సౌగంధికాలతో బంగారు రంగునూ, నారంగ ఫలపాకంతో కాషాయ వర్ణమూ, కస్తూరి పంకంతో నలుపూ, కర్పూర చూర్ణంతో తెలుపూ – ఇలా బహువర్ణ సమ్మేళనాన్ని చూపించాడు కవి. విద్యాధరీ స్తన భరములు అనేచోట నారంగఫలాన్ని ఉటంకించి కొంత కొంటెతనమూ ప్రదర్శించాడు అనుకోవచ్చు.

వసంతోత్సవం అనేది ఒక ఉల్లాసకరమైన పండుగ. ఇలాంటిదాన్ని వర్ణించే అవకాశాన్నీ ఏ కవి వదులుకుంటాడు? శ్రీనాధుని వంటి రాసిక్య రాశి అసలే వదులుకోడు. హరవిలాసంలో అవకాశం తక్కువుగా వున్నందున ఇష్టదేవతా స్తుతిలో ఒక పద్యంతో సరిపుచ్చాడు కానీ, భీమేశ్వర పురాణంలో విస్తృతంగానే వసంతకేళిని వర్ణించాడు శ్రీనాధుడు. పద్యం నడకా, ధారా, వస్తు సుందరతా, అభివ్యక్తి సామర్ధ్యమూ, అన్నీ పోటీ పడి సాగిన ఈ పద్యం మళ్ళీ మళ్ళీ చదువుకోడానికీ, మననం చేసుకోడానికీ అందంగా కుదిరిపోయింది.

ఈ వసంతకేళిని ఇంత కండ్లగ్గట్టినట్టు వర్ణించాడంటే కవికి ఇలాంటి సందర్భాలతో బాగా పరిచయం వుండి వుండాలనిపిస్తుంది గదా. నిజమే. తాను స్వయంగా తిలకించిన, బహుశా పాల్గొన్న – మధుమాస క్రీడనే వర్ణించాడు శ్రీనాధుడు. ఆయన కొండవీటి రెడ్డి రాజుల కాలం వాడు. ఆ రోజుల్లో రెడ్డి రాజుల రాజ్యాల్లోనే కాక ప్రౌఢ దేవరాయలు పరిపాలించే విజయనగర రాజ్యంలో కూడా ప్రతి సంవత్సరమూ ఈ వసంతోత్సవాలు జరిగేవని చరిత్ర పరిశోధకులు చెప్తారు. కొమరగిరి రెడ్డి – కర్పూర వసంతరాయలు అనే ప్రసిద్ధి వహించడానికి ఈ ఆమని పండగలే కారణమంటారు. స్వయంగా రాజులు ఈ తిరునాళ్ళను పర్యవేక్షించేవారు. రాజ్యం నలుమూలల నుండీ ప్రజానీకం ఈ ఉత్సవాలు చూడడానికి వచ్చేవారు. ప్రత్యేకాహ్వానం మీద కవులూ కళాకారులూ వచ్చేవారు. రాజులు కవిగోష్ఠులు ఏర్పాటు చేసేవారు. (అలాంటి కవిసమ్మేళనాల్లో కవిత్వం విని పులకరించి రోమాంచితుడైన రాజు, ఆలస్యంగా అంతఃపురం చేరేసరికి – అతని దేహం మీది పులకలు చూసి అపార్థం చేసుకున్నా రాణి గారు అసూయ చెందారని – ఒక కవి చమత్కారం).

సమకాలీన చరిత్రనూ కొంత దాచుకున్న ఈ అందమైన పద్యం నాకు నచ్చిన పద్యాల్లో ఒకటి. ఏ పాదానికి ఆ పాదం అర్థవంతంగా విరుగుతూ, ఒడిదుడుకుల్లేని ఒక క్రమగనపు కవాతుతో, సంస్కృత పదాల బాహుళ్యం వల్ల సహజంగా వచ్చే గాంభీర్యంతో, శ్రీనాధుడి ప్రత్యేకత ఐన ఈ సీసం – ఒక సౌందర్యావేశం.