సామాన్యుని స్వగతం: మా అమ్మ – నడిచే బడి

[కన్నడదేశంలో ‘లలిత ప్రబంధగళు’ అనే పేరుతో స్వగతాలను వ్యాసాలుగా రాసే సాహితీప్రక్రియ ప్రాచుర్యంలో ఉంది. ఆ సాహితీ సంప్రదాయాన్ని వింధ్యవాసిని ఈమాట పాఠకులకు పరిచయం చేస్తూ రాస్తున్న లలిత ప్రబంధాలలో ఇది మొదటిది – సం.]

అందరు అమ్మలూ ఒకటే! వాళ్ళకు జీవితమే వాళ్ళ పిల్లలనెలా పెంచిపెద్ద చేయాలో నేర్పుతుంది. వాళ్ళెక్కువ చదువుకోక పోయినా వాళ్ళ పిల్లలకేమని పాఠాలు చెప్పాలో, వాళ్ళకు తెలుసు! మా అమ్మా అంతే! ఆమెకు ఇంగితజ్ఞానం, తెలివీ ఎక్కువ. వాళ్ళ నాన్న స్కూలు హెడ్మాస్టరు. అందుకని ఆయన స్కూల్లోనే ఐదవ తరగతి వరకూ చదివింది. అయినా తన పిల్లలు ఐదు మంది కనీసం గ్రాడ్యుయేషన్, వీలయితే ఇంకా ఎక్కువ చదవాలని ఆమె ఆశయం.


ఈ వ్యాసం కోసం రచయిత్రి
కుమార్తె గీసిన చిత్రం

ఆవిడకు పిల్లలను ఎక్కువగా దగ్గరికి తీసే అలవాటు లేదు. నేనయితే, ఆమెకు ముప్పయి ఏళ్ళవయసొచ్చిన తర్వాత వద్దనుకుంటూనే పుట్టినందుకేమో ఇంకా దూరం! ఇంట్లో నాయన నుంచీ, అన్నయ్య, అక్కలదాకా అందరికీ చిన్నదాన్నని ముద్దు. అయినా ఎవరూ నన్ను గారాబం చేసి చెడగొట్టే వీలు లేదు. అక్కయ్యల మీద ఆమె విధించే ఆంక్షలు, క్రమశిక్షణా పద్దతులు నాకూ వర్తిస్తాయి అని మాటల్లో చెప్పనక్కర లేదు. కూర్చున్నా, లేచినా ఆమె ఒక కన్ను ఇటే ఉంటుందనీ, అడుగు తప్పిపడిందంటే చంపేస్తుందని తెలుసు!

మా అమ్మ వంటలో దిట్ట. సామాన్యమయిన పదార్థాలు, మితంగా ఉపయోగించినా, కట్టెలతో మండే పొయ్యి మీద మా కందరికీ రుచిగా వండి వడ్డించేది. మా ఇంట్లో చాలా ఏళ్ళ వరకూ అమ్మ వంటకు కుండలు ఉపయోగించేది. పండగ రోజుల్లో ఏవైనా ప్రత్యేకమయిన వంటలు మాత్రం కంచు, ఇత్తడి గిన్నెల్లో చేసేది. దానికి ముందు రోజు పెట్టెలోంచి ఆ గిన్నెలు తీసి శుభ్రంగా కడిగేది. ప్రతి రోజూ జొన్న రొట్టె, ముద్ద పప్పు ఉదయం ఫలహారం. ఎప్పుడో ఒకసారి మా అక్కలతో పిండి రుబ్బించి దోశలు, వేరుశనగపప్పు చట్నీ చేసేది. ఏం చేసినా లొట్టలేస్తూ తినేవాళ్ళం.

నేను సెకెండ్ ఫారం (ఏడో తరగతి) లో ఉండగా మా నాన్న చనిపోయారు. పెద్దక్కయ్యకు పెళ్ళయిపోయింది. చిన్నక్కయ్యలు కర్నూల్లో కాలేజీల్లో చదువుతున్నారు. ఇంట్లో అన్నయ్య, వదినె, అమ్మలతో బాటు నేనొక్కదాన్నే. నాయన ఉన్నప్పుడు ఇంటిక్కావలసిన బయటి పనులన్నీ నాయన ఆఫీసునుంచీ ఇద్దరు ప్యూన్లు రసూలు, ఓబులేసు అనేవాళ్ళు వచ్చి చేసేవారు. అమ్మకు వాళ్ళంటే ప్రేమ. వాళ్ళకు అమ్మంటే గౌరవం. ఇద్దరివీ మతాలు వేరయినా రామలక్ష్మణుల్లా కలిసి ఉండేవారు. ఏపనయినా కలిసి చేసేవారు. కరెంటు బిల్లు కట్టడం దగ్గర్నుంచీ, ఇంటికి కావలసిన సరుకులు తేవటం వరకూ వాళ్ళే చేసేవారు. అందుకని మాకెవరికీ ఆ పనులు చేసే అలవాటు లేదు. నాయన పోయాక అలాంటి పనులన్నీ అన్నయ్య చేయటం అమ్మకిష్టం లేదు. అవిడ ప్రకారం ఆయన చదివిన చదువుకు గవర్నరులా కాలిమీద కాలువేసుకుని ఉండాలి ఆయన. అందుకని అన్నిటికీ తనే వెళ్ళేది. ఆమె వెంట సహాయం నేను. ఎంత దూరంలో ఉన్న రేషన్ షాపుకయినా నడిచే వెళ్ళేవాళ్ళం. గంటలకొద్దీ క్యూలో నిలబడి, నెలకు కావలసిన, గోధుమలు, చక్కెర సంపాదించే వాళ్ళం! వచ్చేటప్పుడు మాత్రం సామాన్ల బరువెక్కితే రిక్షా ఎక్కేవాళ్ళం, అర్ధ రూపాయో, ముప్పావలానో ఇచ్చి.


అప్పట్లో పత్రికలు ఎక్కువ వచ్చేవి కాదు. ఒకరింట్లో ఆంధ్రప్రభ తెప్పిస్తే, మరొకరు ఆంధ్రపత్రిక తెప్పించుకుని అందరూ రెండు చదివేవారు. మా ఇంట్లో పత్రికలకు కూడా ఖర్చు పెట్టిన గుర్తు లేదు. అమ్మ మధ్యాహ్నం తనకు తీరుబాటుగా ఉన్నప్పుడు చాలా పుస్తకాలు చదివేది. స్థానిక జిల్లా లైబ్రరీ నుంచీ అన్నయ్య తెలుగు నవలలు తెచ్చి పెట్టేవాడు. ఆవిడ ఆరోజుల్లో ఇంచుమించు తెలుగులో వచ్చిన బెంగాలీ నవలల అనువాదాలన్నీ ఒకసారి చదివేసుంటుంది. బంధువులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలుండాలని ఆమె నమ్మకం! అన్నీ చదవగలిగినా, బంధువుల ఉత్తరాలు మాత్రం, పోస్ట్ కార్డు మీద, ఆమె డిక్టేషన్ చేస్తుంటే మేమెవరయినా వ్రాయాలి. చివర్లో సంతకంగా తనపేరు వ్రాయడానికి మాత్రం తనకు చోటుండాలి!

అమ్మ ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మా కెవరికీ చదువులో ఏవిధంగానూ తోడ్పడలేదని అనుకున్న నన్ను కూడా ఆశ్చర్యపరిచిందీ సంఘటన. కర్నూలు మెడికల్ కాలేజిలో చదువుతున్న మా అక్క ఒకసారి ఫోన్ చేసింది. అప్పట్లో ఇళ్ళలో ఫోన్లుండేవి కావు. పోస్ట్-ఆఫీసుకు ట్రంక్-కాల్ చేసి మా చిరునామా చెప్తే, పోస్ట్‌మాన్ ఇంటికి వచ్చి పిలుస్తాడు. ఒక ఆదివారం ఉదయం, పోస్ట్‌మాన్ మా ఇంటికొచ్చి “బాలనాగమ్మ ఎవరమ్మా?” అని అడిగాడు. మా అమ్మ బయటికొచ్చి విషయం తెలుసుకుంది. కర్నూలు నుంచీ మా అక్క ఫోన్ చేసి అమ్మను అడుగుతోంది. అమ్మ రిక్షా ఎక్కి వెళ్తుంటే నేనూ వెంటబడ్డాను. పాతూర్లో ఉన్న ఒకే పోస్ట్ ఆఫీసుకు వెళ్ళాము. మా అక్క మళ్ళీ రెండుగంటల తరువాత ఫోన్ చేస్తే మేమక్కడున్నాము. నన్ను లోపలికి ఫోను దగ్గరికి రానివ్వలేదు. అప్పట్లో ఇలా ఫోను వస్తే మామూలుగా కీడేగానీ మేలు శంకించరు. అందుకని కాలు కాలిన పిల్లిలా అమ్మ బయటికొచ్చేవరకూ, పోస్ట్ ఆఫీసు చుట్టూ ఉన్న స్థలంలో ప్రదక్షిణలు చేస్తున్నాను. అరగంట తర్వాత బయటికొచ్చిన అమ్మ, “దానికి రేపు పెద్ద పరీక్షలు గదా? భయమవుతుందంట! నేను పోవాలి ఊరికి” అని తనలో తను అనుకున్నట్లుగా చెప్పింది.

ఇంటికెళ్ళాక, లోపలికెళ్ళి చిన్న బ్యాగులో కొన్ని బట్టలు సర్దుకుని అదే రిక్షాలో బయల్దేరింది. అక్క పరీక్షలకు భయపడటానికి, ఈవిడ హుటాహుటీ బయల్దేరడానికీ సంబంధం అప్పట్లో నాకర్థం కాకున్నా, నిదానంగా తెలిసింది – అమ్మ అక్కకు ధైర్యం చెప్పి తోడుండి పరీక్షలు వ్రాయించడానికి వెళ్ళింది. అది అక్క మొదటి సంత్సరం. తరువాత ప్రతీ సంవత్సరం ఈ టైములో ఫోను వచ్చేదాకా ఆగకుండా తనే ప్లానేసుకుని ప్రయాణం కట్టేది కర్నూలుకు. ఇది మరో నాలుగేళ్ళు కొనసాగింది. అక్క బెదురు గొడ్డు, నేనయితేనా అనుకున్నాను! కానీ బిఎస్సీ మూడు సంవత్సరాల కోర్సు ఒకేసారి పరీక్ష వ్రాయవలసి వచ్చేసరికి, నాకూ భయమేసింది. అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఆవిడ పక్క గదిలోనే ఉంది కాబట్టి సరిపోయింది! (అప్పట్లో సెమిస్టర్ పద్ధతి లేదు! మేము మూడేళ్ళు కలిపి ఒకేసారి వ్రాశాము!)