ప్రశ్న

చల్లగా నెమ్మదిగా పారుతున్న గోదారీ…
ఒడ్డున నిటారుగా నిల్చిన రావి చెట్టూ!

“పారుతున్న గలగలలు ఇష్టమా
పాడుతున్న ఆకుల సంగీతం ఇష్టమా?”

ప్రశ్నిస్తే-
ఏమిటి సమాధానం?

“అమ్మ ఇష్టమా, నేను ఇష్టమా”ని
అమాయికపు చిన్నారిని
అనాయాసంగా అడిగేశాను.

ఒడ్డును పొదివిన నది ఇష్టమో!?
ఒద్దికగా నీడ పట్టిన చెట్టు ఇష్టమో?!
ఏం సమాధానం చెప్పగలదు?

ఏదొక రోజు తన వంతూ వస్తుందని
అప్పుడు తెలీదు నాకు.

“అమ్మ నీకెందుకు నచ్చింది?
అమాయికంగానే అడిగినట్టూ
అమాంతంగా అడిగేస్తే-
ఏం సమాధానం చెప్పగలను?

“అమ్మ నీకు అమ్మ అయినందుకు!”
అన్నానంతే!!