రెండు అమెరికన్ రుతాలు

కొన్నాళ్లు
శిశిర వృక్షం
నీడల్లో నడక
నెత్తి మీద మంచు పళ్లు
చేతుల్లో
తెల్లని ఇసుక
ఒకప్పుడది వెచ్చని నీరట
ఇళ్ల ముందు
పలకరించకుండానే
పులకరించే మంచుమనుషులు
ఊరి మధ్య
నుంచుని చూస్తే
కదలని కెరటాల పాల సముద్రం
ఊరంతా
గాఢమైన యోగ నిద్ర
వస్తుంది వసంతం జ్ఙానంలా
ఈలోగా
ఆ మూలన చలిగాడికి వాతలు
ఎవరో కాదు, సిగరెట్టూ నేనున్నూ

మరి కొన్నాళ్లు
వసంతం
వచ్చేసిందిక ఏదీ
బ్లాక్ అండ్‍ వైట్‍గా వుండదు
పొద్దున్నే
తలుపు తీయగానే
చెవులకు మంచి బ్రేక్ ఫాస్ట్
దొంగ దొంగ
చెట్టు కొమ్మన బర్డ్ ఫీడ్ గూటిలో
తల దూర్చిన చిప్మంక్ ఉడత
భయం భయం
మో చేసిన లాన్ లో ఆ మూలన
ఒదిగిన పసుప్పచ్చ డాండెలియన్
మేపుల్స్
చెట్ల కొమ్మల్లో చర్చాగోష్ఠి
టాపిక్ నా జ్ఙాపకాలు
భూమికి అటు వేపు
నాకోసం చూసి చూసి
రాలి ఎండిన కొండ రేగు పళ్లు
జేబు కింద
కదుల్తూ ఒక పద్యం
అభిమన్యుడు వినని కథ