మిగారమాత

తీర్థక స్వామి ఇచ్చే ఉపన్యాసాన్ని వింటున్నాడన్న మాటేకానీ మిగారుడి మనస్సు ఇంకెక్కడో ఉంది. తీర్థకునికి ఇదంతా తెలుస్తూనే ఉంది. శిష్యుడు చేతిలోంచి జారిపోకుండా ముందే జాగ్రత్తపడాలి. లేకపోతే నెలసరి మిగారుడిచ్చే ముసురణాలు మాయమౌతై. అవిగాని పోతే బిచాణా ఎత్తెయ్యడమే. ఆ తర్వాత తీర్థకునికీ రోడ్డుమీద బిచ్చగాడికీ ఏమీ తేడాలేదు. ఇప్పటికీమధ్య తనకున్న లక్షమందిలో దాదాపు ముప్పాతిక మూడొంతులు బుద్ధుణ్ణి ఆశ్రయించారు. ఏవుంది ఆ బుద్ధుడి దగ్గిర? ధర్మాన్ని రక్షించండి, అహింసా పరమో ధర్మః అంటాడు. చెప్పడానికేం? అహింస పట్టుక్కూర్చుంటే ఖాళీ కడుపు నిండేదెలా? కానీ తానెంత ప్రయతించినా తన శిష్యులందరూ బుద్ధుడికేసే మొగ్గు చూపుతున్నారు. ఈ మిగారుడొక్కడూ ఉన్నా చాలు తనకి.

ఎటో చూస్తున్న మిగారుడికేసి తిరిగి తీర్థకుడిలా అన్నాడు. “ఏం మిగారా? నేను చెప్పేది కొంచెం కూడా బుర్రకెక్కినట్టులేదే? ఎటో చూస్తున్నట్టున్నావు కాబోలు. ఏమిటీ నీకొచ్చిన ఆపద?”

ఉలిక్కిపడ్డాడు మిగారుడు. “స్వామీ నేను కోడల్ని తెచ్చుకోవాలని ఎన్నేళ్ళుగానో అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అబ్బాయి ఒప్పుకోలేదు కానీ పోరగా పోరగా ఇప్పుడు ఒప్పుకుని కొన్ని షరతులు పెట్టేడు పెళ్ళి చేసుకోవడానికి. ఆ షరతులు వింటేనే మతి పోతోంది ఇంక పెళ్ళి అయ్యేదెలా?”

“ఏమిటా షరతులు మిగారా?”

“కాబోయే వధువు శరీరం అంతా ఒకటే రంగులో ఉండాలి. చిన్న మచ్చ కూడా ఉండకూడదు. పొడవైన కేశాలు నెమలి పింఛం రంగులో ఉండాలి. పెదాలు తాంబూలం వేసుకున్నా వేసుకోపోయినా ఒకే గులాబీ రంగులో ఉండాలి. శరీరం మంఛి ధృడంగా ఉండి ఎంతమంది పిల్లల్ని కన్నా అలాగే ఉండాలి. తనతో సమానమైన ఎత్తు ఉండాలి. పలువరస తెల్లగా మెరుస్తూ ఒక్క అవకతవకగానీ ఉండకూడదు. పిల్లల్ని కన్నాక కూడా శరీరం ధృడంగా ఉండడం ఎలాగా? ఇలాంటి గొంతెమ్మ కోర్కెలు తీర్చే పిల్ల ఎక్కడైనా ఉంటే చేసుకుంటాట్ట, లేకపోతే లేదు. అడగడానికైనా ఒక హద్దూ పద్దూ ఉండాలి కదా?”

“ఎంత అందగాడైనా వాడికి పెళ్ళయ్యే యోగం లేదులా ఉంది. అయినా కొంతమందిని దేశం మీదకి పంపించి చూడు. ఎవరైనా దొరుకుతారేమో.”

“ఎంత కోట్లకి పడగెత్తిన ధనవంతుడ్నైనా ఇలాంటి కోరికలు కోరుతున్నానంటే ఎవరొస్తారు స్వామీ వాణ్ణి పెళ్ళిచేసుకోడానికి? అయినా ఎక్కడని వెతికించేది మీరే ఆలోచించండి.”

“చూద్దాం. నేను కూడా చెప్పి ఉంచుతాను నా శిష్యులతో. నువ్వేమీ కంగారు పడకు. మన ప్రయత్నం మనం చేద్దాం.”


“తప్పుకోండి, తప్పుకోండి”, బోయీలు అరుస్తూ పల్లకీ మోసుకెళ్తున్నారు. విశాఖ వెళ్తోంది బుద్ధుణ్ణి దర్శించుకోడానికి. శాక్యముని సన్యసించక ముందు మహరాజట. స్వర్గ తుల్యమైన సుఖాలు వదులుకుని కట్టుబట్టల్తో సన్యసించాలంటే ఎంతటి మనోధైర్యం కావాలి? తథాగతుడైనాక ఒక్కసారి కూడా ‘నా మాట నమ్ము’ అని అనలేదని వింది. ‘ఏహి, పశ్య’ అని చెప్తాడనీ, విన్న మాటల్ని కంసాలి బంగారాన్ని మెరుగు పెట్టినట్టు, పరిక్షించుకోమని చెప్తాడుట. ఇప్పుడిలా మందీ మార్బలంతో పల్లకీలో చూడ్డానికి వెళ్తే తనకి పొగరనుకుంటాడేమో బుద్ధుడు?…’ పల్లకీలో కూర్చుని ఆలోచిస్తోంది విశాఖ. జనం పక్కకి తప్పుకుని దారి ఇస్తూంటే, మిగారుడు పంపిన మనుషులు చోద్యం చూస్తున్న జనాన్ని అడిగేరు.

“ఎవరు బాబూ పల్లకీలో ఉన్నది? ఎక్కడికి వెళ్తున్నారు?”

“ధనంజయుడిగారి అమ్మాయి. బుద్ధ భగవానుణ్ణి చూడ్డానికి వెళ్తోంది.”

“ధనంజయుడుగారంటే మన సాకేతు నగరం వర్తక శ్రేష్టిగారేనా? అలాగైతే అమ్మగారికి పెళ్ళయ్యిందా బాబూ?”

“అవును ఆయనే. లేకపోతే ఇంత ఆర్భాటం ఎలా వస్తుంది? అమ్మాయికి మొన్నే కదూ పదహారో ఏడు వచ్చింది? ఇంకా పెళ్ళెక్కడా?”

మిగారుడి మనుషులు, ఓహో, అయితే ఈ పిల్ల మన మిగారుడుకి కోడలౌతుందేమో చూద్దాం అనుకుంటూ పల్లకీల వెంట నడక సాగించేరు. వేణువనం ఇంకా కొంచెం దూరం ఉండగానే విశాఖ పల్లకీ ఆపి కిందకి దిగి బోయీలతో చెప్పింది: “ఇంక మీరు పదండి. నేను నడిచే వస్తాను ఇక్కడ్నుండి.”

కిందకి దిగిన విశాఖని చూసేసరికి మిగారుడి మనుషులకి వెతుకుతున్న తీగ కాలికి చుట్టుకున్నట్టైంది. విశాఖ వెనుకే వాళ్ళుకూడా వేణువనానికి బయల్దేరారు.

దూరంనుంచి వచ్చే విశాఖని చూసిన భగవానుడి మొహంలో చిన్న చిరునవ్వు. “ఆనందా, ఇటురా” పిల్చేడు.

“చెప్పండి” వెంటనే వచ్చాడు ఆనందుడు. బుద్ధుడు ఎప్పుడూ కూడా ఆనందుడ్ని రెండో సారి పిలిచే అవసరం రాలేదు.

“ఆ వచ్చే అమ్మాయి నా స్త్రీ సన్యాసినులకి పెద్ద అయి ముందుండి నడిపిస్తుంది. పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టకుండానే ఆమెని ‘మాత’ అని ప్రజలు పిలుస్తారు.”

“వాళ్ళని వెంటనే లోపలకి తీసుకురమ్మని శెలవా?”

“తీసుకురా ఆనందా”

లోపలికొచ్చిన విశాఖ పరిచయం చేసుకున్నాక ధర్మ మార్గం ఉపదేశించమని కోరింది భగవానుణ్ణి.

“నీకు ఏ పని అత్యంతమైన బాధ కలిగిస్తుందో అదే పని అవతలి వారికి చేయకుండా ఉండడమే పరమోత్తమైన ధర్మం. ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులకీ ఒకేరకమైన బాధ కలుగుతుంది. జన్మపరంపరలో చేసుకున్న కర్మ బట్టి మరో జన్మ కల్గుతోంది ప్రాణులకి. పాత జన్మల గురించి ఆలోచించడం కన్నా ముందు జన్మరాహిత్యం చేసుకోవడమే మనం చేయాల్సింది. అహింసా పరమో ధర్మః. ధర్మం ఒక్కటే అన్నివేళలా పాటించవలసిన విషయం.”

“నాకు ఏమైనా కోరికలుంటే చెప్పుకోవచ్చా?” అడిగింది విశాఖ. తల పంకించాడు తథాగతుడు.

“రోజూ కొంతమంది బౌద్ధ సన్యాసులకి మా ఇంట్లోంచి భోజనం పంపుతాను. ఒప్పుకుంటారా? నాకు భగవానుణ్ణి రోజుకి రెండు సార్లు చూడాలని కూడా ఉంది.”

“తప్పకుండా నీకు తోచిన సేవ నువ్వు చెయ్యవచ్చు. నీకు వీలైనప్పుడల్లా ఇక్కడకి రావచ్చును.”

ఇంటికెళ్ళే దారిలో మిగారుడి మనుషులు విశాఖతో మాట్లాడ్డం మొదలుపెట్టేరు. మాటల్లోనే మిగారుడి కోడలవడానికున్న లక్షణాలన్నీ విశాఖలో ఉన్నాయని గ్రహింపుకొచ్చింది. ఆ తర్వాత విషయాలు వెంటవెంటనే దానిమటుక్కవే జరిగిపోయేయి.