నాకు నచ్చిన పద్యం: ఉత్తర రామాయణంలో సీత

తే. రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు
     దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు
     గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు
     బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు

పై పద్యం కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది. పాపరాజు కడప జిల్లా వాసి. మరో సత్కవి అయిన పుష్పగిరి తిమ్మనకు స్నేహితుడు. మరీ పాతవాడేం కాడు, 18వ శతాబ్దికి చెందినవాడు. విష్ణుమాయావిలాసం అనే ఒక యక్షగానాన్ని కూడా రచించినవాడు.

ఉత్తర రామాయణాన్ని తెలుగులో ఇద్దరే వ్రాశారు. వచనం ఏమీ లేకుండా నిర్వచనోత్తర రామాయణాన్ని తిక్కన రచించాడు. తిక్కన దానిని భారతానువాదానికన్నా పూర్వమే రచించాడు. ఆ తర్వాత దాదాపు ఆరు వందల సంవత్సరాలకు కంకంటి పాపరాజు వ్రాశాడు. చిత్రమేమిటంటే తిక్కన ఉత్తర రామాయణం కంటే కంకంటి పాపరాజు ఉత్తర రామాయణమే ఎక్కువ జనప్రియమైంది. చక్కటి పద్యాలూ, మంచి కవిత్వమూ ఈ గ్రంథానికి గొప్ప కీర్తిని చేకూర్చాయి.

పై పద్య సందర్భం – శ్రీరాముడు జనప్రవాదాన్ని విని తన భార్య ఐన సీతను అడవులలో వదిలివేయడానికి నిశ్చయించుకుంటాడు. ఆ పని లక్ష్మణునకు అప్పగిస్తాడు. అన్న మాట కాదనలేక అతను సీతను రథమెక్కించుకొని అడవులకు తీసుకెళతాడు. ఆమె గర్భవతి. పాపం, ఆ తల్లికి తెలియదు, తనను నట్టడవిలో వదలివేయబోతున్నారని. గర్భవతుల మనసులోని కోర్కెలను అడిగి తెలుసుకొని వాటిని తీర్చడం ఒక ఆనవాయితీగా వస్తున్న ముచ్చట. శ్రీరాముడు మునుపొకసారి ఆమె కోరిక ఏమిటని అడిగినప్పుడు – తానంతకు ముందు పధ్నాలుగేళ్ళు గడిపిన అరణ్యవాస జీవితంలోని సుఖ లేశాన్నే మనసులో ఉంచుకుందేమో – గంగాతీరంలోని మునిపత్నులతో కొంతకాలం గడపాలనే కోరిక వున్నట్లు తెలియజేస్తుంది ఆ పిచ్చితల్లి. ఇప్పుడు ఆ సాకు చూపి ఆమెను బయలుదేరదీస్తారు. లక్ష్మణుడు ఆమెను గంగాతీరాన అడవిలో దించి, రాముని ఆజ్ఞను దుఃఖంతో ఆమెకు తెలియజేస్తాడు.

ఎంతో మురిపెంగా నాలుగు రోజులు మునిపత్నులతో గడిపి వద్దామని బయలుదేరిన సీతకు ఈ ఆజ్ఞ వినడం పిడుగుపాటే అయింది. తాను ఏ నేలమీద నిలబడి ఉన్నదో ఆ నేల గభాలున పగిలి తానందులో కూరుకొని పోతున్నట్లుగా అనిపించింది. ఆ సంఘటన యొక్క ఊహించనితనమూ, ఆ ఘాతపు తీవ్రతా ఆమెకు దిగ్భ్రమా, భయమూ ఏకకాలంలో కలిగించాయి. కనీసం మున్యాశ్రమంలో దించి, ఆ తరువాత అయినా రాజాజ్ఞ గురించి చెప్పడం జరగలేదు. నట్టడవిలో, నిర్జన ప్రదేశంలో వదిలేసి, హఠాత్తుగా రాజాజ్ఞ తెలుపబడింది. అటువంటి పరిస్థితిలో కూడా “కలనయినన్ రఘూద్వహుడు కానల లోపల ద్రోయ బంచునే” అనేది ఆమె మొదటి ప్రతిస్పందన. ఆ తర్వాత ఆమెను క్రమంగా దుఃఖం పైకొంటుంది. ‘ఇంక నేను రాముని చూడలేను కాబోలు’ అనేది ఆమె తరువాతి ప్రతిస్పందన.

‘లంకలో వున్నపుడు నా భర్త వచ్చి, శత్రువును చంపి నను విడిపించుకు పోతాడనే ఆశతో బ్రతకగలిగాను. ఇక ఇప్పుడేమి ఆశ వున్నదని’ సీత విలపిస్తుంది. “నాదు మేనున్నది, చెంత గంగ మడుగున్నది” అని బాధ పడుతుంది. వీటన్నిటికీ మించి తనమీద పడిన నింద ఎంత దుస్సహమైనదో అని దుఃఖిస్తుంది. నేను పుట్టడమే అయోనిజను (ఇక్కడ అయోనిజ అనేది సాభిప్రాయంతో వాడిన పదం). అనసూయాది మహాపతివ్రతల మన్నన బడసినదానను. ముల్లోకాలు మెచ్చుకునేట్టు అగ్ని చేత పునీతగా ప్రకటింపబడినదానను. సీత నిర్దోషి అని బ్రహ్మాదులంతా ముక్త కంఠంతో అప్పుడే పలికారు కాదా. ఈ విషయాలన్నీ తెలిసిన ప్రజలే నన్ను నిందించారని రాముడింతకు తెగించడం కేవలం నా దురదృష్టం కాక మరేమిటి? భర్తను వదిలి ఒంటిగా ఎందుకు వచ్చావని మునిపత్నులడిగితే ఏమని సమాధానం చెప్పాలి? “ఏ యనువున నే ప్రతిక్షణ మహా యుగముల్ క్రమియింతు లక్ష్మణా!” అని రోదిస్తుంది.

రాజాజ్ఞ తెలిపి, ఆమెను వదిలివేయడంతో తన పని పూర్తయిన లక్ష్మణుడు “చన కాళ్ళు రాక, చనక ఇక చనదని, ధేనువును బాయు వత్సంబు” లాగా దుఃఖిస్తూ నమస్కరించి, గంగ ఆవలి తీరంలో వుంచిన రథమెక్కి బయలుదేరిపోతాడు. అప్పుడు ఆ రథాన్ని చూస్తూ అలానే వుండిపోయింది సీత. నింద వలని బాధా, రాముని చర్యపట్ల దుఃఖమూ, హఠాత్తుగా జరిగిన పిడుగుపాటు లాంటి ఆఘాతం వలని దిగ్భ్రమా, భయమూ, ఈ అరణ్య మధ్యంలో ఒక్కసారిగా వదిలేసి పోయినారే దైవమా, అనే నిస్సహాయతా – ఆ నిమిషం వరకూ వున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండడంతో పై భావాలన్ని ఆమెను ఒక్కసారిగా ముప్పిరిగొనగా నిలువు గుడ్లతో లక్ష్మణుని రథం పోయిన వైపే చూస్తూ ఉండిపోయింది.

రథం దూర దూరంగా వెళ్ళిపోతున్నది. ఆమె రథాన్నే చూస్తున్నది. క్రమక్రమంగా అది కనిపించకుండా పోయింది. ఇప్పుడు రథం పైన ఎగురుతున్న కేతనం మాత్రము కొంచెం కొంచెంగా కనిపిస్తున్నది. ఆమె కేతనము వైపే చూస్తున్నది. కేతనమూ కనుమరుగై పోయింది. గుర్రపు గిట్టలవల్లా, రథచక్రాలవల్లా రేగుతున్న దుమ్ము మాత్రమే కనిపిస్తున్నది. ఆమె ఆ రథ పరాగాన్నే చూస్తున్నది. ఆ ధూళి కూడా మాయమైపోయింది. ఇంకేమున్నది, వట్టి బయలు! ఆమె అలానే చూస్తూ వుండిపోయింది. ఎంత చూస్తే మాత్రం ఏమున్నది. అంతా శూన్యం. వట్టి బయలు. బైటా, మనసు లోపలా కూడా.

పై పద్యం ఒక చిన్న గీత పద్యం. తెలియని పదాలు లేవు. సమాసాలు లేవు. అన్వయక్లిష్టతకు తావే లేదు. కానీ నిస్సహాయ స్థితిలో వున్న ఆ దీనురాలి అవస్థ యొక్క తీవ్రత, అకస్మాత్తుగా అచేతనమైపోయిన ఆమె మనసు, ఆ మనసంతా నిండిపోయివున్న శూన్యపు సాంద్రత – ఇవి ఆ నాలుగు పంక్తుల్లో దట్టించబడి వున్నాయి. ఆ దిగ్భ్రమలో, ఆ భయంలో ఆమె చూస్తూనే వుండిపోయిన చూపులో – కనిపిస్తూ కనిపిస్తూనే కనుమరుగైపోయిన భవిష్యత్తూ, క్రమక్రమంగా అదృశ్యమైపోయిన ఆశా, చివరకు ఒక భయంకరమైన వాస్తవం కేవలం వట్టి బయలుగా ప్రత్యక్షం కావడం – ఇవన్నీ ఈ చిన్న పద్యంలో దయనీయంగా, సమర్ధంగా రూపింపజేశాడు పాపరాజు. పద్యం చిన్నదే, కానీ మనల్ని వెంటాడుతూనే వుంటుంది – ఆమె చూపు లాగా.