ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II

SCIT గ్రూపులో తెలుగు సాహిత్యం మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న మేమంతా ఒక కుటుంబంగా మసలుకునే వాళ్ళం. ఇప్పుడు ఈమాటలో ఛందస్సుపై సాధికారంగా రాస్తున్న జెజ్జాల కృష్ణమోహన రావు గారు ‘Gem of the Day’ అనే శీర్షికన వివిధ సూక్తులు, మంచి మాటలు ఏరి అందించే వారు. పారనంది లక్ష్మీ నరసింహంగారు (‘పాలన’ గా అప్పుడు, ఇప్పుడు ఇంటర్నెట్‌లో జగమెరిగినవారు) తెలుగు ప్రముఖుల గురించి మంచి వివరాలందిస్తూ ఒక శీర్షిక నడిపేవారు. పాలన, కొండలరెడ్డి గార్లు మనం ప్రతిరోజూ వాడే మజ్జిగ, ఇంగువ, ధనియ, గరం మసాల, తులసి వంటి పదార్థాలపై బయోకెమిస్ట్రీకి సంబంధించిన శాస్త్ర వివరాలందిస్తూ చర్చలు జరిపేవారు. రసగంధాయనం, జీవ రహస్యం, కొలెస్టరాలూ, గుండె జబ్బుల గురించి, ఫిజిక్సు, లెక్కలు, భాష, పదాల వ్యుత్పత్తి గురించి వేమూరి వెంకటేశ్వర రావు గారు కూలంకషంగా చర్చిస్తూ రాసేవారు. కథల గురించి, పద్యాల గురించి, కర్ణాటక సంగీతం గురించి, ఐఐటి కాన్పూర్లో కుశాగ్రబుద్ధుల గురించి ఆసక్తికరంగా రాసేవాడు నారాయణస్వామి శంకగిరి (అప్పుడు నాసీ, ఇప్పుడు బ్లాగులోకంలో “కొత్తపాళీ”గా పరిచితులు). రామభద్ర డొక్క జయదేవుని అష్టపదులపై రాసిన చక్కని వ్యాసాలు, పద్యాల గురించి ప్రభాకర్ విస్సావజ్ఝల రాసిన వ్యాస పరంపర తీపి గుర్తులు.

నాగా గొల్లకోట కితకిత పెట్టే కవితలు, వరిగొండ సుబ్బారావు మంచి పద్యాలు అందించేవారు. మురళి చారి, ‘సీనియర్’, ‘అమెరికాలో ఆపసోపాలు’ లాంటి హాస్యకథలు ధారావాహికగా రాస్తుండేవాడు (అవి ఇప్పుడు కూడా ఆయన బ్లాగు ‘తేటగీతి’ లో చాలా ఆదరణ పొందాయి). ‘నడిచే ఎన్‌సైక్లోపీడియా’ అని అప్పటికే పేరు పడిన పరుచూరి శ్రీనివాస్ జర్మనీ నించి పాత పాత సినిమాల గురించి, సంగీత, సాహిత్యాల గురించి ఆధారాలు, గ్రంథసూచికలతో సహా అందించే విస్తృతమైన సమాచారం అందరినీ అబ్బురపరిచేది. రామభద్ర డొక్కా, ఫణి డొక్కా, నాగులపల్లి శ్రీనివాస్ వంటి వారు సమస్యా పూరణలు ఇచ్చి, చక్కటి ఛందస్సుతో పూరించేవారు.తెలుగు సినిమాల గురించి ఇండియా నుండి రాసే కెప్టెన్ మధు ఆ రోజుల్లోనే శ్రీనివాస్ పరుచూరి, విష్ణుభొట్ల సోదరులు, ప్రభాకర్ విస్సావజ్ఝల తో పాటు కలిసి సినిమా పాటలలో రాగాల జాబితా తయారు చేసారు. ఆరోజుల్లో తెలుగు సాహిత్యం గురించి రాసే సభ్యులలో ఓ పాతిక మంది గురించి రామకృష్ణ పిల్లలమఱ్ఱి గారు రాసిన ‘పైలా పైలా పచ్చీసు’ పోస్టు చదివితే, ఇప్పటికీ ఆ జ్ఞాపకాల నాస్టాల్జియాలో మునిగిపోతాను.

అప్పట్లో SCITలో పాల్గొన్నవారికీ, పాల్గొనని వారికీ కూడా గుర్తుండిపోయే వ్యక్తి ‘కేటీ’ (కె. టి. నారాయణ). శ్రీశ్రీ రచనల్ని ‘pornography of emotionalism’ అంటూ రెచ్చగొడుతూ రాయడంలోనూ, కార్మికులను, కర్షకులను గాడిదలతో, పందులతో సమానంగా చూడడంలో తప్పు లేదంటూ క్యాపిటలిజానికి కొత్త భాష్యం చెప్పడంలోనూ కేటీకి సాటి రాగలవారు లేరు. కార్మికులు, కర్షకులు చేసే ఉత్పత్తి గాడిద చేసే ఉత్పత్తికన్న ఎక్కువ విలువైనది కానప్పుడు వారికి గాడిద కంటే ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని వితండ వాదన చేయడంలో కేటీ తెలుగుల పాలిటి రష్‌లింబా అనిపించేవాడు. దాదాపు ఇలాంటి వాదనతోనే, స్త్రీలను తక్కువగా చూడడంలో తప్పేమి లేదని మనుధర్మ శాస్త్రాలను సమర్థించేవాడు కేటీ. లాండ్ సీలింగుల మీద చర్చను హార్డీ (G. H. Hardy), ఫాన్ నోయ్‌మాన్(John von Neumann) పైన చర్చగాను, స్త్రీవాద రచన మీద చర్చను తానా(Telugu Association of North America) సంస్థకు, తన చక్కెర వ్యాధికి ఉన్న సంబంధంపై చర్చగా మార్చడంలో కేటీ చూపిన ప్రతిభ అసామాన్యం. ఇటువంటి ‘లూనత్వానికి’ తగినట్టి తర్కంతో, అంతే నిబ్బరంతో , సునిశితమైన హాస్యంతో జంపాల చౌదరిగారు ఇచ్చిన సమాధానాల పరంపర తలచుకుంటే ఇప్పటికీ తెరలు తెరలుగా నవ్వు వస్తుంది. జంపాలగారి సమాధానాలు ఇంటర్నెట్టుకు కొత్తగా వచ్చే వాళ్ళకు కేటీ లాంటి వాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై పాఠాలుగా చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు.

వ్యక్తిగతంగా ఆ రోజుల్లో నన్ను అమితంగా ప్రభావితం చేసిన వారిలో చెప్పుకోవలసినవారు రామారావు కన్నెగంటి, బాపారావు, జంపాల చౌదరి, రామకృష్ణ పిల్లలమఱ్ఱి, వేలూరి వెంకటేశ్వర రావు గార్లు. అమెరికాకు వచ్చిన తొలిరోజుల్లో కాంట్(Kant), కనూత్(Knuth), కన్నెగంటి – ఈ ముగ్గురూ నాకు అత్యంత ఆరాధ్యులు. కాంట్ గురించి, కనూత్ గురించి ఎక్కడ ఏది కనిపించినా ఎంత ఉత్సాహంగా చదివేవాడినో అలాగే రామారావు కన్నెగంటి SCIT లో రాసిన ప్రతి పోస్టునీ అంతే ఉద్వేగంతో చదివేవాడిని. ఒక వారం రోజుల పాటు ఆయన పోస్టులో రాసిన విషయాలే మనసులో మెదులుతూ ఉండేవి. ఆయన రాసిన ప్రతి పోస్ట్ నాకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్టు అనిపించేది.

ఇక భారతీయ చరిత్ర గురించి, రాజకీయాల గురించి, భాషా సాహిత్యాల గురించి లోతైన విశ్లేషణతో రాసే బాపారావు గారి పోస్టుల్ని కూడా వెర్రి అభిమానంతో చదివేవాడిని. ‘థ/ ధ’ అక్షరాల మధ్య తెలుగు వారికి ఉండే అయోమయం గురించి నేను SCITలో రాసిన ఒక పోస్టుకు జవాబుగా బాపారావు గారిచ్చిన సమాధానం, ఆ తరువాత ఆయన నాతో ప్రైవేటుగా చేసిన చర్చలే నాకు భాషాశాస్త్రంపై ఆసక్తి, అభిరుచి పెరగడానికి కారణమని చెప్పక తప్పదు.

దేశం కాని దేశంలో, బంధువులంతగా లేని రోజుల్లో నన్ను ఒక కుటుంబ మిత్రుడుగా ఆదరించి ఆదుకున్న స్నేహబాంధవుడు జంపాల చౌదరిగారు. తానా పత్రిక ఎడిటరుగా ఆయన SCIT సభ్యులెందరినో రచయితలుగా మార్చడమే కాక, నాచేత కూడా తానా పత్రికలో తెలుగు సినిమా పాట మీద ఆరు నెలల పాటు వ్యాసాలు రాయించి రచనా ప్రపంచాన్ని, ఎడిటింగ్ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసారు. ఇప్పటికీ ఎడిటరుగా ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే “What would JC do?” అని ఆలోచించేంతగా ఆయన నన్ను ప్రభావితం చేసారు.

సాహిత్యం, సౌహిత్యం, సౌమనస్యం – ఈ మూడింటి కలబోత రామకృష్ణ పిల్లలమఱ్ఱి గారు. తెలుగు పద్యసాహిత్యంలో ఆయనకున్న అపారమైన విజ్ఞానం, ఛందస్సు మీద ఆయనకున్న అధికారం, అందరినీ ఆప్యాయంగా పలకరించే సౌహార్దం, ఆ రోజుల్లో తెలుగు న్యూస్‌గ్రూపులో ఎంతో మందికి ఛందోబద్ధ పద్యాల మీద ఆసక్తి పెరగడానికి కారణాలని చెబితే అతిశయోక్తి కాదు. కూచిపూడి నృత్యనాటికల విశ్లేషణ, శాస్త్రీయ సంగీత కచేరీల సమీక్షలతో ఆయన చక్కని పోస్టులు రాసేవారు. ఆయనతో నాకు పరిచయం కలగకముందు ఛందస్సు, సంప్రదాయ సాహిత్యం, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన అంశాలమీద కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉండేవి. రామకృష్ణ గారి వద్ద ఈమెయిల్ శిష్యరికం చేసిన తొలినాళ్ళలోనే ఈ అభిప్రాయాలన్నింటిని నేను పూర్తిగా పునఃపరిశీలించుకొవాల్సి వచ్చిందంటే ఆయన ప్రభావం నామీద ఎంతగా ఉందో తెలుస్తుంది.

ఆధునిక, సంప్రదాయ తెలుగు సాహిత్యాల గురించి, సంస్కృత, ప్రాకృత, పాశ్చాత్య రచయితల గురించి, సాహిత్య సిద్ధాంతాల గురించి, ఫిజిక్స్, ఫిలాసఫీల గురించి చక్కని చమత్కారంతో గిలిగింతలు పెడుతూ, ఒక్కోసారి పదునైన వ్యంగ్యంతో పొడుస్తూ , లోతుగా విశ్లేషిస్తూ రాసే వేలూరి వెంకటేశ్వర రావు గారు (ఇప్పుడు ఈమాట ముఖ్య సంపాదకులు) నాకు అప్పటికీ, ఇప్పటికీ గురుతుల్యులే.

ఇంకా, బొమ్మల కొలువు, సంక్రాంతి పతంగుల నుండి ఉత్తుత్తి అత్తయ్యలను ఆటపట్టించడం దాకా అన్ని రకాల జ్ఞాపకాల గురించి అవలీలగా రాసే కమల అనుపిండి, అన్నమయ్య పదాలనుండి ఆధునిక కథా సాహిత్యంపై ఆసక్తికరమైన సమాచారంతో చర్చించే పద్మ ఇంద్రగంటి, చెయ్యి తిరిగిన రచయితలైన సావిత్రి మాచిరాజు, శాంతిప్రియ కురద, ప్రవాస భారతీయ సంతతివారి విలక్షణమైన ధృక్పథాన్ని అందించే అరవింద పిల్లలమర్రి కూడా ఈ చర్చల్లో స్వేచ్ఛగా పాల్గొనడం SCIT ప్రత్యేకతగా ఉండేది.

SCIT లో రాజకీయాలు చర్చించకూడదు అన్న నియమావళి ఏమీ లేని కారణంగా రాజకీయ పరమైన వాడి, వేడి చర్చలతో పాటు కొన్నిసార్లు వెగటు పుట్టించే పోస్టులు కూడా వచ్చేవి. తానా, ఆటాలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల మీద చర్చ తెలియకుండానే కుల రాజకీయాల చర్చగా మారిపోయేది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి మొదలైన చర్చ ఒక రాజకీయ పార్టీ అభిమానులు మరో రాజకీయ పార్టీపై దుమ్మెత్తి పోసే వాగ్వివాదంగా ముగిసేది. ఆ రోజుల్లోనే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం గురించి అప్పట్లో చాలా మంది హేమాహేమీలు పెద్ద వాదోపవాదాలతో, లోతైన చర్చ చేసినట్టు గుర్తు.

SCIT ద్వారా నాకు చాలా మంచి స్నేహితులు దొరికారు. జర్మనీలో ఉండే శ్రీనివాస్ పరుచూరి, లాస్ ఏంజలిస్‌లో ఉండే పద్మ ఇంద్రగంటి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న అక్కిరాజు భట్టిప్రోలు, డల్లాస్‌లో ఉండే చంద్ర కన్నెగంటి , ఈ మధ్య దాకా జాన్సన్ సిటీలో నివసించిన పాణిని శంఖవరం, ప్రస్తుతం సిన్సినాటిలో ఉంటున్న మాధవ్ మాచవరం (వీరిద్దరు ఇప్పుడు ఈమాట సంపాదకులు) మొదలైనవారు గత పదిహేనేళ్ళుగా నాకు ఆప్తమిత్రులుగా, ఈమాటకు అండదండలుగా ఉన్నారంటే అందుకు SCIT ద్వారా ఏర్పడిన స్నేహబలమే కారణం.

ఆటో మోడరేషన్, SCIT క్షీణ దశ

విద్యాసంస్థలకు, పరిశోధనా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండే యూజ్‌నెట్ 1993లో AOL లాంటి ఇంటర్నెట్టు సేవలు అందజేసే ప్రైవేట్ కంపెనీల సభ్యులకు కూడా చేరువయింది. తరువాతి కొద్ది నెలల్లోనే అనేక ఇతర సంస్థలు కూడా తమ సభ్యులకు యూజ్‌నెట్ ద్వారాలు తెరిచాయి. ఇలా ప్రతినెలా తండోపతండాలుగా కొత్త సభ్యులు చేరుతుండడంతో ప్రతి చర్చావేదికలోనూ చర్చల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది.

SCIT లోనూ 1994-1995 ప్రాంతాలలో చాలా మంది కొత్త సభ్యులు చేరారు.ఈ కొత్త సభ్యుల రాకతో కొత్త ఉత్సాహం వెల్లివిరిసి SCIT లోనూ చర్చల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కాలంలో చర్చలు రాశి పరంగా పెరిగినా, వాసి పరంగా పలుచబడ్డాయని కొంతమంది పాత సభ్యులు అనుకునేవారు. అంతేకాక, ఈ కాలంలోనే అప్పటి దాక ఏ నియంత్రణ (Moderation)లేని భారతీయ గ్రూపులలో క్రాస్‌పోస్టుల బెడద ఎక్కువయ్యింది. కొంతమంది పనిగట్టుకొని తాము రాసిన ప్రతి పోస్టును 20కి పైగా ఉన్న భారతీయ గ్రూపులన్నింటికీ పంపేవారు. దానికి ఎవరైనా జవాబిస్తే, ఆ సమాధానం కూడా అన్ని గ్రూపులకూ వెళ్ళేది. అందువల్ల, SCIT ఈ క్రాస్‌పోస్టులతో నిండిపోయి, తెలుగుకు సంబంధించిన పోస్టులను వెతుక్కోవాల్సి వచ్చేది. ఖలిస్తాన్ వాది అయిన కుల్బీర్ సింగ్, మంత్ర కార్పరేషన్ అధిపతినని చెప్పుకునే డా. జై మహరాజ్ అనేవారిద్దరు SCITకి క్రాస్‌పోస్టులను ప్రతినిత్యం పంపేవారిలో ప్రముఖులు. ఈ క్రాస్‌పోస్టుల బెడద భరించలేకే ఆసక్తికరంగా రాసే చాలామంది తెలుగు సభ్యులు కూడా రాయడం మానుకున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి ఆరి సీతారామయ్య, జంపాల చౌదరి, కమల అనుపిండి, బాపారావు, రమణ జువ్వాడి, అరవింద పిల్లలమర్రి, రత్నాకర్ శొంఠి, నేను కలిసి యాంత్రిక నియంత్రణ (Auto-Moderation) పద్ధతి ద్వారా SCITలో క్రాస్‌పోస్టులు నివారించాలని పూనుకున్నాం. యాంత్రిక నియంత్రణ ఉన్నప్పుడు క్రాస్‌పోస్ట్ చేయబడిన పోస్టు తిరస్కరించబడుతుంది. కానీ, SCITకి ఆటో మాడరేషన్ పెట్టడానికి SCIT కొత్తగా పెట్టినప్పుడు జరిగిన విధంగా మళ్ళీ వోటింగ్ జరపాలి. అందుకు సిద్ధపడి మేము 1996 మార్చ్ నెలలో ఈ విషయంపై వోటింగ్ ప్రతిపాదించాం. క్రాస్‌పోస్టర్లే కాక, పాటిబండ్ల సుధాకర్ వంటి తెలుగువారు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. తీవ్రస్థాయి వాగ్వివాదాల అనంతరం వోటింగ్ జరిగింది. మా ప్రతిపాదనకు అనుకూలంగా 276 వోట్లు, ప్రతికూలంగా 64 వోట్లు రావడంతో, జూన్ 13, 1996న SCITని ఆటో మాడరేట్ చేస్తునట్టుగా ప్రకటించారు.

ఆటో మాడరేషన్ ఉన్నా స్పామ్ (వాణిజ్య ప్రకటన్లలాంటి పోస్టులు), అనామకంగా రాసేవారి పోస్టులు ఎక్కువైపోవడం, తెలుగు భాషా సాహిత్యాల మీద అభిమానం ఉన్న వారంతా ‘తెలుసా’, ఆ తరువాత ‘రచ్చబండ‘ వంటి చర్చావేదికల్లోకి తరలిపోవడంతో 2000 నాటికి SCIT దాదాపు నిర్జీవమైపోయింది. అయితే, మొదట్లో డెజాన్యూస్, ఆ తరువాత గూగుల్ పాత యూజ్‌నెట్ చర్చలన్నిటినీ భద్రపరచడంతో, WETD, SCIT ఆర్కైవులు చాలామటుకు గూగుల్‌లో ఇప్పటికీ లభ్యమతున్నాయి. కొన్ని సార్లు గూగుల్‌లొ దేనికోసమో వెతుకుతున్నప్పుడు పాత SCIT పోస్టులు తీగలా తగిలి పాత జ్ఞాపకాల డొంకంతా కదిలించినప్పుడల్లా “జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా పోవు, నా జీవితం సగాన్ని తీసుకునే పోతాయి!” అన్న చంద్ర కన్నెగంటి కవిత గుర్తొస్తూనే ఉంటుంది.