మనకు తెలియని మన త్యాగరాజు – 4

ఈ రథోత్సవ సందర్భంలోనే ఒక కథుంది. ఇది త్యాగరాజుని అద్వితీయమైన భక్తునిగా చిత్రీకరించడానికి భక్తులకి బాగా ఉపయోగపడింది. ఈ ఊరేగింపు సమయంలో రథం మీదున్న రంగనాధ స్వామిని దర్శించుకోవాలని త్యాగరాజు ఆశించాడు. కానీ అంత జనంలో ముందుకు వెళ్ళలేక అక్కడే ఉండిపోయాడు. ఈలోగా వీధి మలుపు తిరుగుతూ రంగనాధుని రథం ఆగిపోయింది. ఎంతమంది లాగినా కదల్లేదు. దేముడికి ఎవరిదో దిష్టి తగిలిందని దేవాలయ పెద్దలు విరుగుడుగా అక్కడున్న దేవదాసిలిద్దర్ని నృత్యం చేయమని ఆదేశించారు. ఇంతలో ఓ భక్తుడికి పూనకం వచ్చి, దూరంగా ఉన్న త్యాగరాజుని చూపిస్తూ, ఆయనకి దైవ దర్శనం ఇస్తే కానీ రథం కదలదనీ చెప్పాడు. అది తెలిసి త్యాగరాజు శ్రీరంగనాధుని దర్శించి, రథం మీద చేయేస్తే, అప్పుడది కదిలిందనీ కథ. ఈ సందర్భాన్ని వివరిస్తూ దేవగాంధారి రాగంలో ‘వినరాదా నా మనవి’ అనే కృతిని పాడాడని చెబుతారు. ఈ కృతి లో చరణాల్లో దేవదాసీలు నృత్యం విషయం కనిపిస్తుంది.

పల్లవి. – విన రాదా నా మనవి
చరణం1. – కనకాంగ కావేటి రంగ శ్రీ
                          కాంత కాంతలెల్ల కామించి పిలిచితే (విన)
చరణం2. – తేజినెక్కి బాగ తెరువున రాక
                          రాజ సతులు జూచి రమ్మని పిలిచితే (విన)
చరణం3. – భాగధేయ వైభోగ రంగ శ్రీ
                          త్యాగరాజ నుత తరుణులు పిలిచితే (విన)

ఆరోజు సాయంత్రం రంగనాథ స్వామికి ముత్యాల హారాలతో అందంగా అలంకరిస్తే అది చూసి ‘ఓ రంగశాయీ’ కృతిని ఆశువుగా స్వర పరిచాడనీ చెబుతారు. ఈ కథ ఎంతో విపులంగా సాంబమూర్తి ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో మాత్రమే కనిపిస్తుంది. వెంకట రమణ భాగవతార్, ఆయన కొడుకూ, మనవడూ కృష్ణ, రామస్వామి భాగవతార్లు రాసిన చరిత్రల్లో ఎక్కడా కనిపించదు. సాంబమూర్తి గారి కధనానికి ఆధారాలెక్కడివో తెలీదు. ఈ కథ 1960 దాటిన తరువాతొచ్చిన కొన్ని పుస్తకాల్లోనే కనిపించింది. టి. సుందరేశ శర్మ గారి “త్యాగరాజ చరిత్రం” లో శ్రీరంగం గురించి ఒకే ఒకసారి చిన్నగా ప్రస్తావనుంది. పైన చెప్పిన కథకానీ, కృతులు పాడిన సందర్భం కానీ లేదు. ఏదైతేనేం త్యాగరాజు రామభక్తినీ కథ ఇంకో మెట్టు పైనుంచుతుంది. ఇలాంటి కథలకతీతుడు త్యాగరాజని నా విశ్వాసం.

కాంచీపురం

త్యాగరాజూ, శిష్యులూ శ్రీ రంగం నుండి సరాసరి కాంచీపురం వచ్చారు. ఆ సమయంలో కాంచీపురం వరదరాజస్వామి గరుడోత్సవాన్ని త్యాగరాజు కనులారా తిలకించాడు. ఆ ఆనందంలో స్వర భూషణి రాగంలో ‘వరద రాజ నిను కోరి వచ్చితి మ్రొక్కేరా’ అన్న కృతినీ, రాగపంజర రాగంలో ‘వరదా నవనీతాశ పాహి’ కృతినీ రచించాడు. కంచిలోనున్న కామాక్షీ అమ్మవారిని దర్శించి, ‘వినాయకుని వలెను బ్రోవవే నిను’ అనే కృతిని మధ్యమావతి రాగంలోనూ కట్టాడు. త్యాగరాజు సంగీత ప్రతిభ చూసి ఉపనిషద్ బ్రహ్మం ఎంతగానో పొంగిపోయాడు. దాదాపు రెండు వారాల తరువాత తిరుపతికి బయల్దేరారు. సుందరేశ మొదిలియార్ అభిమానాన్నీ, శ్రద్ధనీ చూసి త్యాగరాజు ఎంతో సంతోషించాడు. తన ఇంటికి మద్రాసు రమ్మనమని మొదిలియారు కోరితే త్యాగరాజు తిరుపతి దర్శనం ముగుంచుకొని వస్తానని చెప్పాడు.

కాంచీపురం నుండి ప్రియ శిష్యుడు వాలాజపేట వెంకట రమణ భాగవతార్ ఇంటికి త్యాగరాజు వెళ్ళాడు. ఆ వూరిలోవున్న భజన మందిరాన్ని దర్శించిన సందర్భంలో మైసూరు ఆస్థాన విద్వాంసుడైన మైసూరు సదాశివరావు తోడి రాగంలో ‘త్యాగరాజు వెడలిన’ అనే కృతిని స్వరపరిచి పాడాడని చెప్పారు. ఈ వాసుదేవరావు వెంకటరమణ భాగవతార్ శిష్యుడు. కానీ ఆ కృతి అందుబాటులో లేదు.

తిరుపతి

త్యాగరాజు శ్రీ వేంకటేశ్వరుణ్ణి దర్శిద్దామని వెళ్ళిన సమయంలో స్వామి వారి గర్భగుడిలో తెర వేసేసారు. అక్కడున్న అర్చకులు త్యాగరాజుని లోపల ప్రవేశించడానికి అనుమతివ్వలేదు. ఇది చూసి ఉండబట్టలేక అప్పటికప్పుడు ‘తెరతీయగ రాదా? అనే కృతిని గౌళిపంతు రాగంలో పాడాడు. త్యాగరాజు పాటకి అక్కడున్న తెర దానంతటదే పైకి లేచిందనీ, అప్పుడు త్యాగరాజు ఎంతో సంతోషించి, మధ్యమావతి రాగంలో ‘వేంకటేశ నిను సేవింప’ అనే కృతిని పాడాడని చెబుతారు. ఈ తెర లేచే సన్నివేశాన్ని తిలకించిన అర్చకులు త్యాగరాజుని ప్రత్యేక అతిధిగా సత్కరించారనీ చెబుతారు. ఈ కథకి బహుళ ప్రాచుర్యముంది. సంగీతంలో ప్రతీ రాగానికీ సమయం కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. పైన చెప్పిన కృతుల రాగాలు, మధ్యమావతీ, గౌళిపంతూ మధ్యాహ్న రాగాలు. సమయానికి తగిన రాగంలో ఆశువుగా స్వరపరచడం త్యాగరాజు సంగీత ప్రతిభకి నిదర్శనం.

తిరుమలలో జరిగిందని చెప్పబడుతున్న తెర తీయగరాదా సన్నివేశం కూడా త్యాగరాజుని రామ భక్తునిగా మరో మెట్టు పైన కూర్చోబెట్టే విధంగానే వుంటుంది. త్యాగరాజు తిరుపతిని సందర్శించిన మాట వాస్తవం. కానీ ఈ కథ జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవు. మొట్టమొదట త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన వెంకట రమణ భాగవతార్ కానీ, కృష్ణ స్వామి భాగవతార్ కానీ త్యాగరాజుకి మహిమలు ఆపాదిస్తూ కథలు చెప్పలేదు. కానీ 1908 కాలంలో ‘సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనలు’ పేరుతో తిల్లైస్థానం శిష్య పరంపరకి చెందిన నరసింహ భాగవతార్ రాసిన పుస్తకం లో ఈ సంఘటనుంది. ఆ తరువాతొచ్చిన అంటే 1937 లో ప్రచురింపబడిన టి.సుందరేశ భాగవతార్ ‘త్యాగరాజ చరిత్రం’ లో ఈ తిరుపతి సంఘటనే కనిపించదు. ఇలాంటి సంఘటల్ని కొంతమంది చెప్పీ, కొంతమంది చెప్పకపోతే అనుమానాస్పదంగా తయారవుతాయి.

అలాగే ఈ తిరుపతి యాత్రలో భాగంగా పుత్తూరు గ్రామంలో చనిపోయిన మనిషిని బ్రతికించిన సంఘటనపై ఇంకో కథొకటుంది. తిరుపతి యాత్ర ముగించుకుని త్యాగరాజు పొత్తూరు వచ్చాడు. అక్కడ గుడి దగ్గర ఓ వ్యక్తి శవం ముందు ఒకామె రోదిస్తూ కనిపించింది. క్రితం రాత్రి ఆ గుడిలో తలదాచుకుందామనుకొని ఆ వ్యక్తి గుడి గోడ దాటి వచ్చే ప్రయత్నంలో అక్కడున్న బావిలో పడి మరణించాడు. ఈ విషయం తెలిసి త్యాగరాజు ‘నా జీవనాధార’ కృతిని పాడి ఆ శవం పై తులసి తీర్థం జల్లగానే, ప్రాణం పోయినతను బ్రతికినట్లుగా ఈ కథ కూడా ప్రాచుర్యంలోనే ఉంది. అయితే, ఇలాంటి కథలు త్యాగరాజుకి రామ భక్తునిగా మహిమలు ఆపాదించడాని కుపయోగిస్తాయే తప్ప చరిత్రలో వాస్తవాన్ని ధృవీకరించవు.

తిరుపతి నుండి మద్రాసు తిరుగు ప్రయాణంలో శ్రీ కాళహస్తిని దర్శించాడు. అక్కడున్న స్వర్ణముఖీ నదిని చూసి ఆనందంతో బిలహరి రాగంలో ‘నీవే కాని నన్నెవరు కాతురురా నీరజ దళ నయన’ కృతిని స్వరపరిచాడని చెబుతారు. ఈ కీర్తన ఆఖరి చరణంలో స్వర్ణముఖీ నది గురించుంది.

సాగర శయన నదులలో మేలైన
స్వర్ణదీ స్నానంబున కల్గు ఫలము
త్యాగరాజు వరమని బ్రహ్మాదులకు
సత్యము జేసి పల్కిన తారకము

ఆ తరువాత శ్రీ కాళహస్తి నుండి షోలింగర్ లో ఉన్న నరసింహ స్వామిని దర్శించుకున్నాడు. ఈ వూరు అరక్కోణం దగ్గరలో వుంది. అక్కడున్న దైవాన్ని స్తుతిస్తూ బిలహరి రాగంలో ‘నరసింహ నన్ను బ్రోవవే శ్రీలక్ష్మీ’ కృతినీ, ఫలరంజని రాగంలో ‘శ్రీ నారసింహ మాం పాహి’ కృతినీ రచించాడు. అక్కడే ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని చూసి, ‘పాహి రామ దూత’ కృతిని వసంత వరాళి రాగంలోనూ స్వరపరిచాడు. అక్కడో నాలుగు రోజులుండి మద్రాసు ప్రయాణమయ్యారు.

మద్రాసు

మద్రాసులో సుందరేశ మొదిలియార్ గృహంలో విడిది చేసారు. ఈ ఇల్లు బందరు వీధిలో ఉండేది. దీన్ని 1870 లో వేరొకరికి అమ్మేయడంతో ఆ ఇల్లు అనేక మార్పులకు గురయ్యింది. సుందరేశ మొదిలియార్ ఎంతో భక్తి, శ్రద్ధలతో త్యాగరాజుకి ఆతిధ్యం ఇచ్చాడు. ఈ సుందరేశ మొదిలియార్ ది కోవూరు. త్యాగరాజుని తీసుకొని అతను కోవూరు లో ఉన్న సుందరేశ స్వామి ఆలయానికెళ్ళాడు. అక్కడే త్యాగరాజు కోవూరు పంచరత్నాలు రచించాడు. పంతువరాళిలో ‘శంభో మహాదేవ’, సహాన రాగంలో ‘ఈ వసుధ నీవంటి’, ఖరహరప్రియలో ‘కోరి సేవింప రారే’, కళ్యాణి రాగంలో ‘నమ్మి వచ్చిన’, శంకరాభరణంలో ‘సుందరేశ్వరుని’ కృతులీ కోవురు పంచరత్నాల్లోకి వస్తాయి. వీటిల్లో ‘శంభో మహాదేవ’ కృతొక్కటే సంస్కృతంలో ఉంటుంది. త్యాగరాజు మద్రాసులో వారం రోజులున్నాడు. ప్రతీ సాయంత్రమూ సంగీత ప్రియుల సమక్షంలో దేవగాంధారి రాగాన్ని విస్తృతంగా పాడాడనీ ఆయన శిష్యుల ద్వారా తెలిసింది.

తిరువట్టియూర్

వీణ కుప్పయ్యర్ పూర్వీకుల సొంతూరు తిరువట్టియూర్. కుప్పయ్యర్ ఇక్కడే పుట్టాడు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన త్రిపుర సుందరి గుడుంది. ఈ గుడిని ఆది శంకరాచార్య దర్శించాడనీ చెబుతారు. త్యాగరాజు కుప్పయ్యర్ ఇంట్లో విడిది చేసి అమ్మవారి మీద అయిదు పంచరత్న కీర్తనలు కట్టాడు. ఇవి – కళ్యాణి రాగంలో ‘సుందరి నీ దివ్య రూపమును’, బేగడ రాగంలో ‘సుందరి నన్నిందరిలో’, శుద్ధ సావేరిలో ‘దారిని తెలుసుకొంటి’ మరియు సావేరి లో ‘కన్న తల్లి నాపాల కలుగ’ కృతులు. వీటిలో త్రిపుర సుందరి మహిమా, పుణ్య క్షేత్ర మహత్యమూ విశేషంగా కనిపిస్తాయి. ఈ అయిదింట్లోనూ “దారిని తెలుసుకొంటి” లో చాలా సంగతుల ప్రయోగం కనిపిస్తుంది. కేవలం పల్లవిలోనే పదహారు సంగతులున్నాయి. అలాగే అనుపల్లవీ, చరణాలకొక్కింటికీ ఎనిమిదేసి సంగతులుంటాయి. కుప్పయ్యర్ ఇంటిలోని శ్రీ కృష్ణుని విగ్రహం చూసి తన్మయత్వం చెందీ, కేదార గౌళ రాగంలో ‘వేణు గాన లోలుని కన వేయి కన్నులు కావలెనే’ కృతిని రచించాడు.

లాల్గుడి

తిరుగు ప్రయాణంలో నాగపట్టణం వెళ్ళారు. అక్కడ కాయారోహణ స్వామీ, నిలయతాక్షిల దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారి మీద – తోడి రాగంలో ‘ఎవరు తెలియ పొయ్యేరు నీ మహిమలు’ కృతినీ, సావేరి రాగంలో ‘కర్మమే బలవంతమాయా తల్లి’ కృతినీ రచించాడు. అక్కడనుండి సరాసరి లాల్గుడి త్యాగరాజు ప్రియ శిష్యుల్లో ఒకడైన లాల్గుడి రామయ్య కోరికపైనే వెళ్ళారు. ఆ వూళ్ళో సప్త ఋషీశ్వర స్వామి దేవాలయముంది. అక్కడే ఆ దేవుడి సమక్షంలో మరో పంచరత్న కృతుల్నీ రచించాడు. వీటినే లాల్గుడి పంచరత్నాలంటారు. అవి – తోడి రాగంలో ‘గతి నీవని నే కోరి వచ్చితి తల్లి పరాకా’, భైరవి లో ‘లలిత శ్రీ ప్రవర్ధే’, కాంభోజి లో ‘మహిత ప్రవృద్ధ శ్రీమతి’, మధ్యమావతిలో ‘దేవ శ్రీ తపస్తీర్థ పుర నివాస’, కళ్యాణి రాగంలో ‘ఈశా పాహిమాం’. లాల్గుడి నుండి తిన్నగా తిరువయ్యారు ఇంటికి చేరుకున్నారు.