కథ దేని గురించి?

“ఏంటండీ చదువుతున్నారు?”
“కథ. చాలా బాగుంది.”
“అలాగా? దేని గురించీ?”
“…”


కథ దేని గురించీ అన్న ప్రశ్న మనకు కొత్తది కాదు. దీనికి కారణం మన కథలు మొదటినుంచీ వస్తువు ప్రాముఖ్యమైనవి కావటం. మన కథలన్నీ ఏదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి: సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, శ్రామికుల పోరాటాలు, స్త్రీల హక్కులు, మైనారిటీ హక్కులు, ప్రపంచీకరణ, కుల వృత్తులు పోవటం – ఇలా సామాజిక పరిస్థితులూ, సమకాలిక సమస్యలూ తెలుగులో కథావస్తువులయ్యాయి. అయితే వచ్చిన నష్టమేంటీ అంటారేమో. వస్తువు చుట్టూ కథ అల్లటం అంత సులభం కాదు. కథనం మీద కంటే వస్తువు మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే కథ ప్రచార సాధనంగా కనిపించే అవకాశం ఉంది. మంచి విషయాన్ని ప్రచారం చేస్తే తప్పేంటీ అని అడగవచ్చు. ప్రచారం చెయ్యటానికి కథే రాయాల్సిన అవసరం లేదు. కరపత్రాలు పంచవచ్చు. పత్రికల్లో వ్యాసాలు రాయవచ్చు. కాని, వస్తువు గురించి కథ ద్వారానే చెప్పదలిస్తే కొన్ని కథామర్యాదలను పాటించాల్సి వస్తుంది – ముఖ్యంగా, చెప్పదల్చుకున్న విషయానికి తగిన పాత్రలను సృష్టించటం, తగిన సన్నివేశాలను కల్పించటం, పాత్రల అనుభవాల నుంచీ, వారి ప్రవర్తన నుంచీ తను ఉద్దేశించిన భావం పాఠకుడికి చేరేలా చెయ్యటం. కథలో వస్తువుకు ఎంత ప్రాముఖ్యత ఉందీ, తను చెప్పదల్చుకున్న విషయాన్ని రచయిత కథనం ద్వారా చెప్పగలిగాడా లేదా అన్న ప్రాతిపదికల మీద నేను చదివిన కథల్లో నాలుగు రకాల కథలున్నాయని నా అభిప్రాయం, అదెలానో క్లుప్తంగా వివరిస్తాను.


వైయక్తికమైన కథలు: ఇవి ఒక వస్తువు చుట్టూ కాకుండా, ఒక జీవితానుభవం, ఒక సంఘటన చుట్టూ అల్లిన కథలు. కథ దేని గురించీ అని అడిగితే పాఠకుడు వెంటనే సమాధానం చెప్పలేక పోవచ్చు. ఈ కథల్లో రచయిత ప్రధానోద్దేశం ముఖ్య పాత్రతో పాఠకుడికి అనుభూతి ఐక్యత కలగటమే. కథ చదివింతర్వాత పాఠకుడి మనసులో ఒక ఉహా చిత్రం మిగిలి పోతుంది. సామాజిక సమస్యలూ, పరిష్కారాలూ, వాటిగురించి రచయితకున్న అభిప్రాయాలూ ఈ కథల్లో కనపడవు.

ఇప్పుడు ఇంగ్లీషులో వస్తున్న కథల్లో ఎక్కువ భాగం ఇలానేవుంటాయి. ఇలాంటి కథలు తెలుగులో చాలా అరుదు. సుంకోజీ దేవేంద్రాచారి గారి “కొమ్మిపూలు” (ఆంధ్రజ్యోతి, మార్చ్ 13, 2005) ఈ కోవకు చెందిన కథ. అత్త గారింటికొచ్చిన అల్లుడు బావ మర్దులతో చేరి ఊరికి దూరంగా ఉన్నచెట్లూ గుట్టలూ తిరిగొస్తాడు. కథ చదువుతుంటే మనం కూడా వాళ్ళతోపాటే నడుస్తున్నట్లూ, పెద్ద పెద్ద బండలు ఎక్కి దిగుతున్నట్లూ, చెట్లెక్కి కాయలు కోస్తున్నట్లూ, దోవలో అక్కడక్కడా ఆగి పూలమొక్కల పేర్లు గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లూ ఉంటుంది.

సామాజికమైన కథలు: ఈ రెండోరకం కథల్లో వస్తువులు సమకాలిక సామాజిక పరిస్థితులూ, సమస్యలూ. రచయితకున్న సామాజిక స్పృహ కథలో కనిపిస్తుంది. కానీ, నేను చెప్పదల్చుకున్నది ఇదీ అని రచయిత ఎక్కడా చెప్పడు. కథ చదివింతర్వాత పాఠకుడికి వస్తువు గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఈ కథల్లో రచయిత ఉద్దేశించేది కథలోని ముఖ్య పాత్రతో పాఠకుడికి సానుభూతి కలగటం, లేక పాత్ర ప్రవర్తన పాఠకుడికి నచ్చటం, లేక నచ్చకపోవటం. కథ చదివింతర్వాత మంచి చెడ్దల గురించి ఆలోచించే బాధ్యత పాఠకుడికే వదిలేస్తాడు రచయిత.

ఈ మధ్య వచ్చిన కథలనుంచి ఒక ఉదాహరణ ఉమామహేశ్వరరావు గారి ‘వొంటేప మాను’ (ఆంధ్రజ్యోతి అక్టోబర్ 24, 2004). భోగం కులంలో పుట్టిన బంగారమ్మ జీవితం చిత్రించాడు రచయిత. ఎక్కడా ఆమె మంచి మనిషా చెడ్డమనిషా అని చెప్పడు. కాని చదివే వాడికి ఆమె మీద సానుభూతి నిస్సందేహంగా కలుగుతుంది. ఎండలో నడిచి అలసిపోయిన వారికి సేద తీర్చే వేప చెట్టు లాంటిది బంగారమ్మ. బ్రతికినన్నాళ్ళూ స్వతంత్రంగా బ్రతికింది. తనకు తోచిన విధంగా అడిగిన వారికీ, అడగని వారికీ, సహాయం చేసింది. కాల క్రమంలో గ్రామం మారి పోయింది, పరిస్థితులూ మారాయి. భోగం వీధిలో వృత్తితో సంబంధంలేని, స్కూళ్ళల్లో కాలేజీలల్లో చదువుకుంటున్న ఆడపిల్లలను కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తుంటే, ఎవ్వరూ పట్టించుకోకపోతే బంగారమ్మ పోలీసులను నిలదీస్తుంది. పోలీసులు ఆమెను బాదుతారు, వీధిలో ఆమె బట్టలు లాగేస్తారు, చేతులకు గొలుసులు కట్టి లాక్కెళ్తారు. అవమానం భరించలేని బంగారమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది. ఇప్పుడా వేపచెట్టు లేదు. కాని అప్పుడప్పుడూ అవమానాలు సహించలేక తిరగబడుతున్న ఆడవాళ్ళు కనిపిస్తారు ఆ గ్రామంలో, బంగారమ్మ పూనిందేమో అన్నట్లుగా. భోగం బంగారమ్మ జీవితం ఇతర స్త్రీలను ప్రభావితం చేసిందని రచయిత చెప్పకుండానే చెప్తాడు.

సందేశం ఇప్పించే కథలు: ఇవి కూడా వస్తువు ముఖ్యమైన కథలే. కానీ, ఈ కథల్లో తను చెప్పదల్చుకున్న విషయాన్నీ, పాఠకులకు అందించ దల్చుకున్న సందేశాన్నీ, పరోక్షంగా కాకుండా ఒక పాత్ర నోటినుంచి చెప్పిస్తాడు రచయిత. ఇలా చెయ్యటంలో ఒక సౌలభ్యం ఉంది. రచయిత చెప్పదల్చుకున్నదేదో నిస్సందేహంగా, ఎలాంటి అనువాదం చెయ్యాల్సిన అవసరం లేకుండా పాఠకుడికి చేరుతుంది. కానీ, చెప్పదల్చుకున్న విషయం ఎటూ చెప్పేస్తాడు కాబట్టి, కథను శ్రద్ధగా అల్లాల్సిన అవసరం ఉండదు. బొమ్మ గీసి, అది ఏనుగులా లేదని తెలిసీ, బొమ్మ కింద ఏనుగు అని రాయటం లాంటిది ఇలాంటి కథలు రాయటం.

తెలుగులో వస్తున్న కథల్లో ఇలాంటివి ఎక్కువ. ఒక ఉదాహరణ ఎల్ వి ప్రసాద్ గారి ‘ఒరే టిక్కరాయ్ గా!’ (ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 28, 2008). సోమరితనం ఆరోగ్యానికి మంచిదికాదని చెప్పటం రచయిత ఉద్దేశం. ప్రతిపనీ నౌకర్ చేత చేయించుకునే దొరా దొరసానీ స్వయంగా అన్నిపనులూ చేస్తుంటే చూసి తన ఉద్యోగం వూడిందని భయపడుతున్న టిక్కరాయ్ గాడికి, కథ చివర్లో, దొర చెప్పిన మాటలు ఇవి.. “…ఏ పనీ చెయ్యక కంటికి కనిపించిందల్లా తిని తొంగుంటే తిన్న దరక్క రావాల్సిన జబ్బులన్నీ వచ్చినాయంట. కదలకుండా కూర్చున్నందుకు అటు కండల్లో ఇటు గుండెల్లో కొవ్వు చేరినాదంట. అందుబాటులో వుండే పనులు కూడా అందుకోకుండా అందలమెక్కి కూర్చొని అధికార దర్పంతో నీలాంటోడిచేత చేయిస్తే నాలాంటోడి పరిస్థితి ఇదిగో కళ్ళారా చూసినావు కదా! నా బిడ్డ బిడ్డ తరం తిన్నా తరగని ఆస్తి. కోరింది తినే స్థోమత వున్నా అనుభవించటానికి ప్రాప్తం లేదురా. అందుకే ఎవ్వరి పని వారు చేసుకోవాల. చేసు కోలేక పోతే సాయం అడగాలె తప్ప పూర్తిగా ఆధారపడకూడదు. పొద్దున్నే లేచి పొడరద్ది ఒంటి నిండా ఆభరణాలు అలంకరించుకొని ఆవగింజంత పని కూడా చెయ్యక అడ్దమైన గడ్డి తిని అడ్డంగా ఊరితే రాబోయే కష్టాలనుండి ఆ భగవంతుడు కూడా కాపా డలేడని దొరసానమ్మక్కూడా డాక్టర్ గారు చెప్పినాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవ్వరి ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే వుంటుందట. ఏందిరా అట్టా చూస్తున్నావ్? నే చెప్పేది అర్ధమైందా? ”

ఇలాంటి కథల్లో సమస్యకు పరిష్కారం కథ చివర ఒక పాత్ర మరో పాత్రతో చెప్తున్న మాటల్లో కనిపిస్తుంది. ఇలాంటి వివరణకు వీలుగా ఉండటానికే కథ అల్లినట్లు అనిపిస్తుంటుంది.

స్వంత వ్యాఖ్యానం కథలు: కథనం ద్వారానో, పాత్ర నోటినుంచో తను చెప్పదల్చుకున్న విషయం చెప్పలేకపోతే ఇక రచయితకు ఉన్న ఆఖరి మార్గం స్వయంగా వ్యాఖ్యానం చెయ్యటం. ప్రధమ పురుషలో రాసే కథల్లో ఇది సులభంగా వీలవుతుంది. వ్యాఖ్యానం కథకుడి మాటల్లోనో, లేక ఒక పాత్ర ఇలా ఆలోచిస్తుందంటూనో చెయ్యవచ్చు. దీనివల్ల చెప్పదల్చుకున్న విషయం తప్పకుండా పాఠకుడికి చేరుతుంది. అయితే కథకూ చెప్పదల్చుకున్న విషయానికీ సంబంధం ఉండనవసరం లేదు.