ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I

[జనవరి సంచికకోసం ఈ వ్యాసం రాద్దామని పూనుకొని పూర్తి చెయ్యలేక వదిలేస్తే, నాకు తెలియకుండా ఆ వ్యాసానికి మెరుగులు దిద్ది ఈ మొదటి భాగాన్ని మీ ముందుకు తీసుకువచ్చిన ఈమాట సంపాదకురాలు పద్మ ఇంద్రగంటి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు – సురేశ్ కొలిచాల].

ఇది చరిత్ర కాదు, నా జ్ఞాపకాల గొడవ. ‘అహమస్మి’ అంటూ ఈమాట భుజకీర్తులు ధరించి నేనిప్పుడు నలుగురిలో తిరగగలగడానికి దోహదం చేసిన పరిస్థితుల గురించి, ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి, తమ భుజాల మీదుగా ఎత్తి నన్నుఅందలం ఎక్కించిన మహామహుల గురించి నాకు తోచిన కొన్ని మాటలు. స్వోత్కర్ష కోసం కాదు కానీ, ఇంటర్నెట్టులో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం మొదలైన వాటిపై చర్చ మొదలైన తొలి నాళ్ళలోనే ఆయా వేదికలపై పాల్గొనే అవకాశం రావడం కేవలం నా అదృష్టం. నా జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకోవడం ఇంటర్నెట్టులో తెలుగు వికాసానికి, ఈమాట పుట్టుకకి సంబంధించిన చారిత్రకాంశాలను – పాక్షికంగానైనా – కొత్తతరం వారికి పరిచయం చేయడానికి ఉపయోగపడుతుందన్న నమ్మకమే ఈ వ్యాస రచనకు పూనిక.

ఇంటర్నెట్టు — అభౌతిక ప్రపంచం

ఇంటర్నెట్‌ యుగంలో మనుషులు “మనసులు లేని యంత్రాల్లాగా తయారయ్యా” రని కంప్యూటర్లకు అంతగా అలవాటు పడని వారు వాపోతూ ఉండటం కద్దు. అయితే, నా దృష్టిలో ‘చింతయామి తస్మాదస్మి (I think, therefore I am)’ అన్న భావవాద తత్త్వానికి (Idealism) అచ్చమైన ప్రతీక ఇంటర్నెట్టు. పంచేంద్రియాల భౌతిక శరీరానుభవం కంటే బుద్ధి, మనస్సు, అనుభూతి, ఆలోచనలే ప్రధానమైన అభౌతిక ప్రపంచం ఇంటర్నెట్టు.

స్నేహాన్ని గురించి చెబుతూ ప్లేటో, ఒకే రకమైన ఆసక్తులతో, ఒకే విధమైన తాత్విక ధృక్పథంతో సత్య, ధర్మ, సౌందర్యాన్వేషణను (shared philosophical inquiry in search of beauty, truth and goodness) సాగించే వ్యక్తుల మధ్యనే నిజమైన స్నేహం వెల్లివిరుస్తుందన్నాడు[1]. కానీ, ఇటువంటి స్నేహితులని సంపాదించడం దుస్సాధ్యమనీ, ఒక మనిషికి తన జీవితకాలంలో ఒక్కరో, ఇద్దరో మాత్రమే ఇటువంటి స్నేహబాంధవులు తారసపడవచ్చునని కూడా ఆయన ప్రవచించారు. అయితే, ఇంటర్నెట్టు వంటి అభౌతిక ప్రపంచంలో ఒకే రకమైన ఆసక్తులున్న వ్యక్తులను కలుసుకోవడం అంత కష్టం కాదు. నిజానికి ఇంటర్నెట్టులో, ముఖ్యంగా యూజ్‌నెట్ సమూహాలలో, ఆ సమూహపు సభ్యులందరిని అంతస్సూత్రంగా కలిపే ఒక సామాన్య అంశం ఏదో ఒకటి ఉంటుంది. భూప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒకేరకమైన ఆసక్తులున్న వ్యక్తుల్ని కలపడంలో ఇంటర్నెట్టును మించిన సాధనం లేదనే చెప్పాలి.

నా దృష్టిలో ఇంటర్నెట్టు రాకతో మానవ సంబంధాలు అనూహ్యమైన రీతిలో మారిపోతున్నాయి. ముప్ఫై ఏళ్ళ క్రితం మానవుడు తన చుట్టూ ఉన్న సమాజంతో ఏర్పరచుకున్న సంబంధాలకు, ఇప్పడు ఇంటర్నెట్టు ద్వారా ఏర్పరచుకునే అభౌతిక సమాజపు సంబంధాలకు చాలా తేడా ఉంది. భవిష్యత్తులో ఏ సామాజిక శాస్త్రవేత్త (Sociologist) అయినా మానవ సంబంధాల చరిత్ర గురించి రాస్తే ఇంటర్నెట్టుకు పూర్వం మానవ సంబంధాలు, ఇంటర్నెట్టు తరువాతి మానవ సంబంధాలు అని రెండు విభాగాలుగా విభజించి విశ్లేషించి రాయాల్సి వస్తుందని నా అభిప్రాయం.

ఇంటర్నెట్టు పుట్టుక

 All the world’s a Net! And all the data in it merely packets.  –1989లో Arpanet 20వ వార్షికోత్సవ సభలో చదివిన ఒక పద్యం నుండి.

ఇంటర్నెట్టు అంటే వెబ్ అని, వెబ్ అంటేనే ఇంటర్నెట్ అనీ తలచే ఈ తరం వాళ్ళలో చాలా మందికి బ్లాగింగుకు పదేళ్ళ ముందే యూజ్‌నెట్‌లో రాజకీయాలు, సంస్కృతి, కంప్యూటర్ల వంటి అనేకానేక అంశాలకి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన చర్చలు జరిగేవని, వెబ్ బ్రౌజర్ల పుట్టుకకు రెండు దశాబ్దాలకు ముందు నుండే ఇంటర్నెట్టు వాడుకలో ఉండేదని అంతగా తెలియదు. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన DARPA ఏజన్సీ 1969 లో అర్పనెట్ (ARPANET) ని సృష్టించడం ద్వారా ఇంటర్నెట్టుకు అంకురార్పణ జరిపింది. భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికాలో ఎక్కడైనా న్యూక్లియర్ దాడి జరిగితే, ఆ దాడి వల్ల తమ ఆయుధాలపై పట్టు (Command & Control) పూర్తిగా నశించిపోకుండా తిరుగుదాడి చేయగలగడానికి వీలుగా నిర్మించిన పాకెట్ స్విచింగ్ (Packet Switching) సాంకేతికత ఈ అర్పనెట్ సృష్టికి మూలాధారం. అక్టోబర్ 29, 1969 న UCLA నుండి SRI (Stanford Research Institute)కి పంపిన మొట్టమొదటి అర్పనెట్ సందేశమే ఈనాడు ఆధునిక మానవ జీవితంలో అంతర్భాగమైపోయిన ఇంటర్నెట్టుకు నాంది.

1979 Computer magazine cover page
1979 లో కంప్యూటర్ మాగజైన్ కవర్ పేజీ

ఆ తరువాతి మూడేళ్ళలో పాకెట్ స్విచింగ్ సూత్రాలను వాడుకొన్న కంప్యూటర్ నెట్‌వర్కింగ్ వ్యవస్థలు పాతికకు పైగా పుట్టుకొచ్చాయి. విభిన్నమైనఈ నెట్‌వర్కింగ్ వ్యవస్థలను అనుసంధానించడానికి ఒక సార్వజనీనమైన కొత్త ప్రోటోకాల్ సృష్టించాల్సి వచ్చింది. 1974 లో ప్రతిపాదించబడి, 1978లో స్థిరత్వాన్ని పొందిన ఆ కొత్త ప్రోటోకాల్ పేరు: “Internet Transport Control Protocol (TCP/IP)”. అప్పటిదాకా సమాచార ద్వీపాలుగా విడివిడిగా ఉన్న వేర్వేరు కంప్యూటర్ నెట్‌వర్కులను ఈ ప్రోటోకాల్ ద్వారా కలపడం చాలా సులభమైపోవడంతో, అనతి కాలంలోనే ప్రపంచమంతా విస్తరించిన ఒక మహా నెట్‌వర్కింగ్ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రోటోకాల్ పేరులోని మొదటి పదమైన “Internet”, ఆ మహా నెట్‌వర్కింగ్ వ్యవస్థకు మారుపేరుగా నిలిచిపోయింది.

యూజ్‌నెట్ వార్తా సమూహాలు (Usenet Newsgroups)

 వార్తయందు జగము వర్తిల్లుచున్నది.   — శ్రీమదాంధ్ర మహాభారతము, నన్నయ్య

వార్త అంటే మాట, సంభాషణ, వర్తకము, వ్యవసాయము, పశుపాలన అన్న అర్థాలు కూడా ఉన్నాయి. పై నన్నయ్య పద్యంలో వార్త అన్న పదానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పరిష్కరించి ప్రచురించిన మహాభారతంలో “న్యూస్” అన్న అర్థంలోనే వివరించారు కానీ, “న్యూస్” అన్న వివరణ సరైనది కాదేమోనని నా అనుమానం. చేమకూర వెంకట కవి రాసిన “జాతియు వార్తయున్ జమత్కారము నర్థగౌరవము గల్గ ననేక కృతుల్ ప్రసన్న గంభీరతన్ రచించి” అన్న పద్యంలో కూడా “వార్త” అన్న పదానికి అర్థం అంత సులభంగా చెప్పలేము. నేను మొదటిసారి యూజ్‌నెట్ న్యూస్ గ్రూప్స్ చూసినప్పుడు, ఆ పదబంధంలో “న్యూస్” అన్న మాటకున్న అర్థాన్ని గురించి ఇలాగే వితర్కించి ఉంటే ఇప్పుడీ యూజ్‌నెట్ కథ చెప్పగలిగే వాణ్ణి కాదేమో.

యూజ్‌నెట్‌ని ఒక వాక్యంలో నిర్వచించడం కష్టం. యూజ్‌నెట్ అంటే ఏ ఒక్క వ్యక్తి, సంస్థ యొక్క అధికారంలో లేని అతి పెద్ద ఆన్లైన్ చర్చావేదికల సమూహం అని చెప్పవచ్చు. ఈమెయిలు, ఫైళ్ళ మార్పిడి వ్యవస్థలు (ఉదా: FTP), గోఫర్ (Gopher) లాంటి అప్లికేషన్లన్నీ ఆనాటి ఇంటర్నెట్ కి గల పార్శ్వాలనుకుంటే, యూజ్‌నెట్ ఆత్మలాంటిది. బ్లాగింగు, సోషల్ నెట్‌వర్కింగ్, వెబ్ ఫోరంలవంటి వేదికలు ఏర్పడకముందు, దాదాపు పదేళ్ల క్రితం వరకూ కంప్యుటర్ సైన్సుకి సంబంధించిన అనేక పరిశోధనాంశాలు ముందు యూజ్‌నెట్‌లోనే ప్రతిపాదించబడ్డాయి, చర్చించబడ్డాయి. యూజ్‌నెట్ కంప్యూటర్ సైన్సుకి మాత్రమే పరిమితం కాలేదు. అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయపరమైన చర్చలు యూజ్‌నెట్‌లో జరిగేవి. అనేక చారిత్రక సంఘటనలకి యూజ్‌నెట్ సాక్షిగా నిలిచింది. 1989 లో శాన్‌ఫ్రాన్‌సిస్కోలో భూకంపం వచ్చిన తరవాత ప్రపంచం నలుమూలలకీ సమాచారం చేరవేయడానికి యూజ్‌నెట్‌లో ఒక న్యూస్‌గ్రూప్ స్థాపించబడింది. కంప్యూటర్ సైన్స్ విషయపరంగా చూస్తే, వెబ్ ప్రవేశానికి పూర్వం యూజ్‌నెట్ లో జరిగినంత అద్భుతమైన, లోతైన, గాఢమైన చర్చా పరంపరలు వెబ్ ప్రవేశానంతరం నాకెక్కువగా కనిపించలేదనే చెప్పాలి. దీనికి కారణం వెబ్ 2.0 ఆవిర్భావంతో జరిగిన చర్చావేదికల వికేంద్రీకరణ అని నాకనిపిస్తుంది.

యూజ్‌నెట్ సమూహాలని “న్యూస్‌గ్రూప్స్” అని పిలిచినా, వాటిలో తాజా వార్తలకన్నా, అనేక రాజకీయ, సాంస్కృతిక అంశాలపై చర్చే ఎక్కువగా ఉండేది. నిజం చెప్పాలంటే, అమెరికా వచ్చిన కొత్తలో న్యూస్ గ్రూప్స్ చదవడం ద్వారా భారతదేశంలో జరిగే వార్తలు తెలుసుకోవచ్చన్న భ్రమతోనే ఇండియన్ న్యూస్ గ్రూప్స్ చదవటం మొదలుపెట్టాను. ఈ వార్తాసమూహాలను చదవడానికి వాడే ప్రొగ్రామ్ పేరు కూడా మనల్ని తప్పు దారి పట్టించడానికికన్నట్లు “Read News (rn)” అని ఉండేది. ఈ న్యూస్ గ్రూప్స్ లో నిజానికి వార్తలేమీ ఉండేవి కాదు, చర్చలు తప్ప. కానీ, ఇవి వార్తాసమూహాలు కావు, చర్చావేదికలు అని అర్థమయ్యేలోపలే ఈ న్యూస్‌గ్రూపులను చదవడం, వాటిలో మనకు తోచింది రాయడం కొంత అలవాటు అయిపోతుంది. కొంతమంది అదృష్టవంతులు ఆ అలవాటు నుండి త్వరలోనే బయటపడి మామూలు మనుష్యుల్లా జీవనం సాగించగలుగుతారు. మరి కొంతమంది, నాలాంటి వాళ్ళు, యూజ్‌నెట్ లోనే సమస్త విశ్వాన్నీ, ఆ చర్చల్లోనే అనంతత్వాన్ని కనుకొన్న ఆనందంతో తలమునకలై పోతూ ఉంటే, మాకు తెలియకుండానే ఈ చర్చావేదికలు మా నిత్యజీవితంలో ఒక ప్రధాన భాగమైపోయాయి.

యూజ్‌నెట్ చరిత్ర

1969 లో పుట్టిన ARPANET యొక్క మొట్టమొదటి ఉపయోగం ఈమెయిల్. ఆ రోజుల్లో రీసర్చ్ కమ్యూనిటి కి ఇది అయాచితంగా అందివచ్చిన వరమయ్యింది. కాన్ఫరెన్సులు నిర్వహించడానికి, రీసర్చ్ జర్నల్స్ నడపడానికి బాగా పనికివచ్చింది. అంతకు పూర్వం ఎన్నో నెలలు తీసుకునే సమీక్షలు కొద్ది రోజుల్లోనే పూర్తి కావడానికి, రోజులు తీసుకునే చర్చలు కొన్ని గంటలలోనే పరిష్కారంకావడానికి ఈ ఈమెయిల్ ఒక అద్భుత సాధనంగా ఉపయోగపడింది.

అయితే, ప్రతి కంప్యూటర్ ని ARPANET తో కలపడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అప్పటికే అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలలో యూనిక్స్ (UNIX) ఆపరేటింగ్ సిస్టమ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఒక యూనిక్స్ సిస్టమ్ ని ఇంకో యూనిక్స్ సిస్టమ్ తో చవకైన మోడెమ్ ల ద్వారా కలపడానికి, ARPANET కి ప్రత్యామ్నాయంగా, యూయూసిపి (UUCP) అన్న కొత్త ప్రోటోకాల్ నిర్మాణం జరిగింది.

1979 లో UUCP ప్రోటోకాల్ ఆధారంగా Tom Truscott, Jim Ellis అనే డ్యూక్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక యూనిక్స్ సిస్టమ్ నుండి “న్యూస్ ఆర్టికల్స్” ఇంకో యూనిక్స్ సిస్టమ్ కు కాపీ చెయ్యడానికి రాసిన ప్రోగ్రామే, రూపాంతరం చెంది 1981లో “యూజ్‌నెట్”గా అవతరించింది.

అమెరికాలోని అన్ని విద్యాసంస్థలు, పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు ఈ యూజ్‌నెట్ సర్వర్లు అనబడే కంప్యూటర్ ప్రొగ్రాములు నడిపేవి. ఒక యూనివర్సిటీలో ఉన్న ఒక సభ్యుడు (user) యూజ్‌నెట్‌కి ఒక పోస్టు పంపితే, అది ఆ యూనివర్సిటీలో ఉన్న యూజ్‌నెట్ సర్వర్‌లో నిక్షిప్తం చేయబడుతుంది. ఈ యూజ్‌నెట్ సర్వర్లు చుట్టుపక్కల ఉన్న ఇతర యూజ్‌నెట్ సర్వర్లతో UUCP ప్రోటోకాల్ ద్వారా పోస్టులని పరస్పరం ఎగుమతి, దిగుమతులు చేసుకుంటాయి. ఆ విధంగా పోస్టులు (articles) ఒక సర్వర్ నుండి మరొక సర్వర్‌కి “పాకుతాయి” (propagates). యూజ్‌నెట్ పోస్టులు చదివేవారు న్యూస్‌రీడరనే సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి ఆ పోస్టులని చదువుతారు. వేగవంతమైన కనెక్షన్లు ఉండే యూనివర్సిటీలకీ, IBM, Microsoft లాంటి వాణిజ్య సంస్థలకీ పోస్టులు సాధారణంగా కొన్ని గంటలలోపే చేరేవి.

ఈ విధంగా యూజ్‌నెట్ న్యూస్ గ్రూపులు అందరూ కలిసి చర్చించే అభౌతిక చర్చావేదికలుగా అమిత ప్రాచుర్యం చెందాయి. యూజ్‌నెట్ న్యూస్ గ్రూపులు ఒకరకంగా ఈనాటి గూగుల్ గ్రూపులు, యాహూ గ్రూపులు, వెబ్ చర్చావేదికల్లాంటివే. అయితే నేటి చర్చావేదికలకు ఆనాటి న్యూస్ గ్రూపులకు రెండు ప్రధానమైన భేదాలు ఉన్నాయి. 1. నేటి గూగుల్ గ్రూపులను గూగుల్ కంపనీ, యాహూ గ్రూపులకు యాహూ కంపెనీ కేంద్ర స్థానాలు. యాహూ గ్రూపుకి కానీ, గూగుల్ గ్రూపుకి కానీ పోస్టు పంపేమొదట్లో ఈ ఈ న్యూస్ ముందు మనం యాహూ లేదా గూగుల్ నియమనిబంధనలకి లోబడి ఉంటామని అంగీకరించాలి. 2. పోస్టులన్నీ (మనకి ఈ మెయిల్‌లో వచ్చినా) యాహూ లేదా గూగుల్ సర్వర్లలో మాత్రమే నిక్షిప్తం చేయబడతాయి. ఆ యా న్యూస్ గ్రూపులకి యాహూ లేదా గూగుల్ కేంద్ర స్థానం అవుతుంది. కానీ, యూజ్‌నెట్ న్యూస్ గ్రూపుల వ్యవస్థను నడిపించే సంస్థగానీ కేంద్రం కాని ఏదీ లేదు. ఇంటర్నెట్టుకు కనెక్ట్ అయిన ప్రతి యూజ్‌నెట్ సర్వరూ స్వయం ప్రతిపత్తి గలదే. యూజ్‌నెట్ సర్వర్లు మరొక సర్వర్‌తో పోస్టులు సహకార పద్ధతిలో ఇచ్చి పుచ్చుకోవడం వల్ల ఏ ఒక్క సర్వర్ యొక్క సంస్థ యూజ్‌నెట్ మీద గుత్తాధిపత్యం చలాయించలేదు. ఈ విధంగా యూజ్‌నెట్ వ్యవస్థ రెండు దశాబ్దాలకు పైగా విరాజిల్లింది. ఈ యూజ్‌నెట్ వ్యవస్థ చూసి ముగ్ధులైన కొంతమంది సిద్ధాంతకర్తలు, ఏ రకమైన ప్రభుత్వంలేని రాజకీయ వ్యవస్థను ప్రతిపాదించడం కూడా జరిగింది. నామ్ చౌమ్స్కీ (Noam Chomsky) ప్రతిపాదించిన “Anarchism: Cooperation without restraint” ఈ కోవలోకి చెందిన సిద్ధాంతమేనని నా అభిప్రాయం.

యూజ్‌నెట్ న్యూస్‌గ్రూపుల వర్గాలు, ఉపవర్గాలు

BIG-8 groups of USENET
యూజ్‌నెట్ న్యూస్‌గ్రూపుల ఎనిమిది ప్రధాన వర్గాలు

మొదట్లో ఈ న్యూస్ గ్రూపులను . net.*, fa.*, mod.* అనే మూడు ఉప వర్గాలు గా విభజించారు. ARPANET సభ్యులు మాత్రమే పాల్గొనే చర్చావేదికలు fa.* లో, మాడోరేట్ చేసిన చర్చావేదికలు mod.* లో, మిగిలిన చర్చావేదికలన్నీ net.* వర్గంలో ఉండేవి. ఉదాహరణకి భారతదేశానికి చెందిన చర్చలు net.nlang.india అన్న చర్చావేదికలో జరిగేవి. అయితే, అనతికాలంలోనే న్యూస్‌గ్రూపులు వేల సంఖ్యలో పెరిగిపోవడంతో వీటినిపునర్విభజన చెయ్యాల్సి వచ్చింది. 1987 లో ఈ న్యూస్‌గ్రూపులను ఎనిమిది వర్గాలుగా (BIG-8) విభజించారు. ఆ తరువాత 1990 దశకపు తొలిరోజుల్లో మానవీయ శాస్త్రాలకు సంబంధించిన చర్చావేదికలనేర్పాటు చేసుకోవడానికి వీలుగా humanities.* వర్గాన్ని తొమ్మిదవ వర్గంగా జతచేసారు.

1992 లో నేను అమెరికా వచ్చినప్పుడు నాకు యూజ్‌నెట్ తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఇండియాకు సంబంధించిన న్యూస్ గ్రూపులతో పాటు, కంప్యూటర్లకు సంబంధించిన చర్చలకు comp.* న్యూస్‌గ్రూపులు చదివేవాడిని. కంప్యూటర్ సైన్స్ రంగంలో హేమాహేమీల వంటి Andrew S. Tanenbaum, W. Richard Stevens, Jon Postel, Tim Berners-Lee, Abraham Silberschatz తదితరులుఈ న్యూస్‌గ్రూప్ లలో చర్చించుకుంటుంటే దేవతలే మా కళ్ళముందు కదలాడుతున్నట్లుండేది. ఆ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ లో జరిగే పరిశోధనల గురించిన చర్చలన్నింటికీ యూజ్‌నెట్టే రంగస్థలంగా ఉండేది. Linus Torvalds మొదటిసారి లైనక్స్ (Linux) ఆపరేటింగ్ సిస్టంను ప్రకటించింది యూజ్‌నెట్ పైనే[3]. తొలిసారి World-Wide Web ప్రస్తావన[5], మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ అయిన మొజాయిక్ (Mosaic) గురించి ప్రకటన[6] మొదలైన విశేషాలన్నింటికీ యూజ్‌నెట్టే కార్యరంగం. లైనక్స్ పుట్టక ముందే దాన్ని పాతబడిన టెక్నాలజీగా కొట్టిపడేసిన మినిక్స్ సృష్టికర్త Andy Tanenbaum, లైనక్స్ సృష్టికర్త అయిన Linus Torvalds ల మధ్య జరిగిన రసవత్తరమైన చర్చను[4] అపురూపంగా దాచుకొని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం నాకు బాగా గుర్తు.

ఇండియన్ న్యూస్ గ్రూప్స్, కంప్యూటర్ సైన్స్ కు చెందిన న్యూస్‌గ్రూప్సే కాక, క్రికెట్టు గురించిన చర్చల కోసం rec.sport.cricket, ఆనంద్-కాస్పరోవ్ చెస్ ఛాంపియన్‌షిప్ కోసం ఆడుతున్న రోజుల్లో rec.games.chess మొదలైన న్యూస్‌గ్రూపులతో పాటు మెల్లమెల్లగా అంతగా తెలియని కొత్త, కొత్త గ్రూపులు చదవడం అలవాటు అయిపోయింది. కారు కొనాల్సివచ్చినప్పుడు rec.autos.*, alt.autos న్యూస్‌గ్రూపులు చూడటం, టాక్సు వేళల్లో misc.taxes న్యూస్‌గ్రూపులు చదవటం, వీసాలు, గ్రీన్ కార్డుల గురించి misc.immigration.* న్యూస్‌గ్రూపులలో చర్చించడం అనాటి ప్రవాస భారతీయులందరికీ అనుభవమే. రామజన్మభూమి-బాబ్రీ మస్జిద్ ల పై తీవ్రమైన చర్చ జరుగుతున్న రోజుల్లో పాకిస్తానీ, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు చెందిన న్యూస్‌గ్రూపులు చదువుతూ వారి దృక్పథాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఒక వింత అనుభూతి. మహా గ్రంథాలయంలా అనిపించే యూజ్‌నెట్ లో స్వేఛ్ఛగా విహరిస్తూ మా పరిధి దాటి ఫిలాసఫీ, సైకాలజీ, హిస్టరి వంటి న్యూస్‌గ్రూపులతో సహా కొత్త, కొత్త న్యూస్‌గ్రూపులు చదువుతూవుంటే ప్రతిరోజూఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటుంన్నామనిపించేది. శ్రీపాదవారి మాటల్లో చెప్పాలంటే, ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళకి కొత్త సంగతులు తెలిపి, కొత్త చూపు అలవర్చి, కొత్త దారులు కనపరిచి, కొత్త స్నేహాలు కల్పించి, కొత్త శక్తిని సంఘటించి, కొత్త ప్రపంచంలోకి ఉరికించిన కొత్త వాఙ్మయ స్వరూపం యూజ్‌నెట్!

వ్యాసం రెండవ భాగంలో: యూజ్‌నెట్‌లో తెలుగు చర్చావేదిక soc.culture.indian.telugu (SCIT) “స్కిట్” ఆవిర్భావం, “తెలుసా” ఈ మెయిల్ లిస్ట్ పుట్టుకకి దారి తీసిన పరిస్థితులు, వెబ్ ఆవిర్భావం, కె. వి. ఎస్. రామారావు గారి నాయకత్వంలో ఈమాట పత్రికకి అంకురార్పణ జరగడం గురించి.


ఆధారాలు

 1. ^ Form and Reason: Essays in Metaphysics By Edward C. Halper From Chapter 2, titled “Plato and Aristotle on Friendship” [p. 48]. Published by SUNY Press, 1993
 2. ^ RFC 1121 Act One – The Poems (September 1989)
  1989 లో అర్పనెట్ పుట్టి 20 సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసిన సింపోజియంలో కంప్యూటర్ పరిశోధకులు చదివిన పద్యాలు
 3. ^ Free minix-like kernel sources for 386-AT comp.os.minix (Oct 5, 1991)
  యూజ్‌నెట్‌లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ గురించి లైనస్ చేసిన ప్రకటన
 4. ^ LINUX is obsolete comp.os.minix (Jan 29, 1992)
  లైనక్స్ పుట్టి పుట్టక ముందే అది పనికిరాదంటూ ఆండీ టనెన్బామ్ చేసిన వాదన, ఆపై జరిగిన ఘాటైన చర్చ
 5. ^ WorldWideWeb: Summary alt.hypertext (Aug 6, 1991)
  వర్‌ల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భావం గురించి టిమ్ బెర్నర్‌స్ లీ చేసిన ప్రకటన
 6. ^ New “XMosaic” World-Wide Web browser from NCSA Options comp.infosystems (Jan 29, 1993)
  యూజ్‌నెట్‌లో తొలి వెబ్ బ్రౌజర్ అయిన మొజాయిక్ ప్రకటన
 7. I Remember USENET by Brad Templeton 12/21/2001
  యూజ్‌నెట్‌ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న ఇలక్త్రానిక్ ఫ్రాంటీర్ కార్పరేషన్ చేర్మన్ అయిన బ్రాడ్ టెంపుల్‌టన్
 8. 20 Year Usenet Timeline
  20 యేళ్ళ యూజ్‌నెట్‌ చరిత్ర చూపించే గూగుల్ పేజీలు
 9. A history of the Internet
  కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం వెబ్‌సైట్లో ఇంటర్నెట్టు చరిత్ర