స్మైల్‌ – ఓ జ్ఞాపిక

నలుగురు కూర్చుని నవ్వేవేళల…
ఓ దీపం మరోదీపాన్ని వెలిగిస్తూ… స్మైల్‌ దేహం వత్తి…
నూనెలో నానిన వత్తి… స్నేహం అంటే నూనెట!

”కుమ్మరి చేసిన ప్రమిదను
గానుగ వాని నూనెతో నింపి
రైతు పండించిన పత్తిని
వత్తులుగా చేసి
దీపం వెలిగిస్తే
పలు కులాలు కలిసి
కులం చెడిన వెలుగుని చూడరా”

(కన్నడ కవి – జరగనహళ్ళి శివశంకర్)

పాలు పెరుగయి, పెరుగు మజ్జిగయి, మజ్జిగ వెన్నయి, వెన్న నెయ్యయి – ప్రతీ రాత్రీ ప్రమిద కాలపు కొంటె నవ్వులు నవ్వుతుందన్నాడు అజ్ఞాత మిత్రుడు జరగనహళ్ళి.

స్మైల్‌ మన వేమన. నగ్నంగానైనా అందంగా నవ్వే వేమన.

మనందరం – you search for the donkey you ride on లాంటి వాళ్ళం. ఎక్కిందల్లా అశ్వమనుకొంటాం.

స్మైల్‌ – ఓ లాఫింగ్‌ బుద్ధా! వీపింగ్‌ బుద్ధా, బొజ్జ బుద్ధా, అస్తిపంజరం బుద్ధా… బుద్ధుడికి ఎన్నో ఆకారాలు, బుద్ధుడ్ని చూచినవాడు విగ్రహం చేయలేదు. విగ్రహం చేసినవాడ్ని బుద్ధుడు చూడలేదు.

స్మైల్‌ నిజంగా ఓ అజ్ఞేయి. మక్కా మదీనాలు వెళ్ళాడు సతీసమేతంగా. కాని ఎజికీల్‌ కవిత ‘పిల్‌గ్రిమేజ్‌’ లో లానే. ఎలియట్‌ ‘జర్నీ ఆఫ్‌ ది మాజై’ లానే. (బొంబాయి పేలుళ్ళు, బాబ్రీ మస్జీద్‌లు, గుజరాత్‌ మారణహోమాలు కొంత సందేహాన్ని సంకోచాన్ని సంక్షోభాన్ని కలిగించినవేమో!)

ఆస్ట్రేలియా అయినా ఇంగ్లండ్‌ అయినా అమెరికా అయినా ఏ దేశంలోనైనా శుక్లపక్షపు రాత్రిలో రహస్య ధాత్రిలో తోడు వీడని వెన్నెల నీడ స్మైల్‌‌.