కవిరాజశిఖామణి

[కవిరాజశిఖామణిగా తనని తాను ప్రకటించుకున్న నన్నెచోడుని ఉనికీ, కాలనిర్ణయమూ, అతని కావ్యం కుమారసంభవము – వీటిపై విస్తృతంగానే వాదోపవాదాలు జరిగేయి. నన్నెచోడుడు ఎప్పటివాడో నిర్ధారించటానికి అనేకమంది పండితులు ప్రయత్నించారు. ఈ కవి వ్రాసిన కావ్యం ఎందుకు విశిష్టమైనదో, ఈ కవి ఏకాలంవాడో అతని కావ్య లక్షణాల ఆధారంగా ప్రతిపాదిస్తూ, రచయిత ఇక్కడ ప్రచురిస్తున్న వ్యాసంలో మొదటి భాగం ఇది – సం.]


 

ఆ హరాద్రిసుతల కతుల హర్ష మెసఁగె, దేవ సం-
దోహమునకు వీరలక్ష్మితోడ వేడ్క లొందెఁ, బు-
ణ్యాహఘోష మెసఁగె, మునిజనాశయమ్ముల న్మహో-
త్సాహమయ్యె నక్కుమారసంభవంబునం దిలన్

– నన్నెచోడుని కుమారసంభవము (10.50)

ఆ కుమారసంభవ ఘడియలో భూమిపై గొప్ప ఉత్సాహము కలిగింది. హరునికి, పార్వతికి ఎనలేని ఆనందం కలిగింది. దేవతల బృందానికి వీరలక్ష్మితో వేడుక లయ్యాయి. మునుల ఆశ్రమాలలో జనన కాలమందు చేయు పుణ్యాహవాచనాలు మారుమ్రోగాయి. ఈ పద్యం ముద్రాలంకారముతో ఉత్సాహవృత్తములో కుమారసంభవ ఘట్టమును వర్ణించే పద్యం [1],[2].

అందరికీ కవిత్రయపు భారతము తెలుసు, కవిసార్వభౌముని శృంగారనైషధము తెలుసు, అష్టదిగ్గజాల ప్రబంధాలు తెలుసు, మూరురాయరగండని ఆముక్తమాల్యద తెలుసు. కాని నన్నెచోడుని కుమారసంభవమనే రమ్య తారకను కప్పిన మబ్బు ఒక శతాబ్దం ముందు మాత్రమే తొలగినది. దీనికి కారకుడు శ్రీ మానవల్లి రామకృష్ణకవి. కవిగారు తంజావూరు సరస్వతీమహలులో దీనిని మొట్టమొదట పందొమ్మిదవ శతాబ్దపు ఆఖరి దశకములో చూచారు. ఈ కావ్యం రెండు భాగాలుగా 1909, 1914లలో ప్రకటిత మయ్యాయి. 2009 కుమారసంభవపు పునర్జన్మకు శతజయంతి అని చెప్పవచ్చు.

నన్నెచోడుడు లేక నన్నిచోడుడు ఒక కవి, ఒక చిన్న రాజు, కవిరాజు. నన్ని అంటే తెలుగులో అందమైన, ప్రియమైన అని అర్థం, అదే పదానికి కన్నడములో సత్యము, అనురాగము, ప్రేమ, నిశ్చయము, అనుబంధము అనే అర్థము ఉంది, తమిళములో దీనికి మంచి, గొప్ప అని అర్థము. తన గొప్పదనంపై ఇతనికి భరోసా ఉండింది కాబట్టి తన్ను తానే కవిరాజశిఖామణి అని చెప్పుకొన్నాడు. తెలుగు సాహిత్యంలో ఎందరో రాజకవులు – నన్నెచోడుడు, భద్రభూపాలుడు, కృష్ణదేవరాయలు, కట్టా వరదరాజ భూపతి, రఘునాథరాయలు, కదిరీపతి, విజయరాఘవుడు, విజయరఘునాథుడు, మున్నగువారు. వీరిలో ప్రథముడు నన్నెచోడుడే. ఇతడు చోడ (చోళ) వంశానికి చెందిన వాడు. తన వంశం కరికాలచోళునికి చెందినది అనీ, తాను దక్షిణ దేశానికి సూర్యునివంటి వాడు అనీ చెప్పుకున్నాడు.

కం. కలుపొన్న విరులఁ బెరుఁగం
        గలుకోడి రవంబు దిశలఁ గలయఁగఁ జెలగన్
        బొలుచు నొరయూరి కధిపతి
        నలఘు పరాక్రముడఁ డెంకణాదిత్యుండన్(1.54)

జాతి పొన్న చెట్టులతో నిండి, జాతి కోళ్ల ధ్వనులతో నిండి ఉండే ఒరయూరికి (తమిళ దేశంలోని ఉరయూర్) అతి పరాక్రమవంతుడైన టెంకణాదిత్యుడనే రాజును నేను. ఈ టెంకణమనునది ఇప్పటి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతమని [3], అక్కడికి దగ్గరలోనే మరొక ఒరయూరు ఉండిందని చరిత్రకారుల ఉద్దేశము.

తన కవిత్వం పాఠకుల హృదయాలను తాకుతుందనే ఆత్మ విశ్వాసం ఉండింది ఈ మహాకవికి. అందుకే మంచి కవిత్వం అన్నది విలుకాని బాణములా ఎదురుగా ఉండే వాని గుండెను తాకాలి. అట్టిదే కవిత్వం, అట్టిదే బాణము. మిగిలినవానిని ఆ పేరితో పిలవడం భావ్యమా, దానిని పట్టిన చేయి చేయి యేనా అంటాడు ఈ పద్యంలో-

కం. ముదమునఁ గవికృత కావ్యము
        నదరున విలుకాని పట్టినమ్మును బర హృ-
        ద్భిదమై తల యూఁపును, బెఱ
        యది కావ్యమె చెప్పఁ బట్ట నదియున్ శరమే(1.41)

పుట్టుపూర్వోత్తరాలు

నన్నెచోడుని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీదేవి. చోడబల్లి పాకనాటి 21 వేల గ్రామాలకు రాజు. ఇప్పటి నెల్లూరు జిల్లాలోని కొన్ని తాలూకాలు, ముఖ్యముగా ఉదయగిరి ప్రాంతము, ఈ పాకనాటిలో ఉండేదని చెబుతారు. ఇతని గురువు జంగమ మల్లికార్జునదేవుడు. వచ్చిన చిక్కల్లా తండ్రి కొడుకులయిన చోడబల్లి-నన్నెచోడులు ఎందరో ఉన్నారు! నన్నెచోడుని కుమారసంభవముపైన జరిగిన తర్జనభర్జనలు, వాదోపవాదాలు మరే తెలుగు కావ్యంపైన జరిగి ఉండలేదన్నది అతిశయోక్తి కాదు. దీనికి కారణము – రామకృష్ణకవిగారు ఈ గ్రంథపు శైలినిబట్టి, వారు పరికించిన శాసనాల ఆధారాలను బట్టి నన్నెచోడుడు నన్నయకంటె ఒక శతాబ్దం ముందు జీవించిన కవియని ఉద్ఘాటించారు [4]. ఇది ఆ కాలపు కవిపండితలోకంలో ఒక సంచలనాన్నే కలిగించింది. దీని ఫలితం, ఇప్పటి పరిస్థితి, ఏమంటే, నన్నెచోడుని కాలాన్ని ఐదు విధాలుగా చెప్పవచ్చు. అవి – (1) నన్నయకు ముందు, (2) నన్నయకు సమకాలం, (3) నన్నయ తిక్కనలకు మధ్య కాలం, (4) తిక్కన తరువాతి కాలం, (5) అసలు నన్నెచోడుడు అనే కవి లేడు, అతని పేరితో మరెవ్వరో ఈ గ్రంథాన్ని రచించారు!

నన్నెచోడుడు నన్నయకు ప్రాచీనుడు అని చెప్పినవారిలో మానవల్లి రామకృష్ణకవి, నడకుదుటి వీరరాజు పంతులు, నేలటూరి వేంకటరమణయ్య గారలు ప్రముఖులు. దేవరపల్లి కృష్ణారెడ్డి ఇద్దరు నన్నియలు సమకాలీనులని ఒక పుస్తకాన్నే రాశారు [5]. చాగంటి శేషయ్య వీరిని సమర్థించారు. కాని చాలమంది పండితులు నన్నెచోడుని కాలము నన్నయతిక్కనలకు మధ్య కాలమని తీర్మానించారు. కోరాడ రామకృష్ణయ్య [6], నిడదవోలు వేంకటరావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వేంకటావధాని, ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారలు, ఈ వాదాన్నే బలపరచారు. శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రులు చోడుడు తిక్కన తరువాతి వాడని ప్రతిపాదించారు. ఇక పోతే కొర్లపాటి శ్రీరామమూర్తి నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా [7] అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని లేవదీశారు. వీరి దృష్టిలో ఈ కావ్యము ఒక కూటసృష్టి (fake), మానవల్లి రామకృష్ణకవిగారే నన్నెచోడుని పేరితో కుమారసంభవాన్ని రాశారు. అన్ని వాదాలకు వాదిప్రతివాదులు హేతువులను చూపించారు [8]. నన్నెచోడుడు కుమారసంభవములో వాల్మీకి కాళిదాసాది సంస్కృత కవులను తప్ప మరెవ్వరినీ తలవలేదు. నన్నయ కూడా తన భారతములో మరే పూర్వాంధ్రకవి పేరెత్తలేదు. కావున ఈ విధంగా ఎవరు ముందో ఎవరు తరువాతో చెప్పలేము. ఛందఃపరముగా కొన్ని హేతువులను ఈ వ్యాసపు తరువాయి భాగంలో నేను ప్రతిపాదిస్తున్నాను. కానీ దానికి ముందు కుమారసంభవములోని కొన్ని వైశిష్ట్యాలను చెప్పడం ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము.