నాతి చరామి

పెల్లుబికిన వెల్లువగా
కట్టతెగిన ఆనందం
కడలి కెరటమై వచ్చి నను ముంచు వేళ
సరిగంగ ఆటలలొ
సరిజోడువై నిలిచి
మనసు బరువు సగము పంచుకొనిన వేళ

ఆ చిరునవ్వులో చెరిసగములై మనం
ఆ తుళ్ళింతలో రెండితలై మనం

గుండెలో చీకట్లు
దారులన్నీ మూసి
కంటిచూపుకు వెలుగు కప్పివేసిన వేళ
నవ్వు ప్రమిదను చిదిమి
చేయి ఊతగ చేసి
దారి పొడుగూ నువు తోడు నిలిచిన వేళ

ఆ బాట పాటలో పదం కలిపిన మనం
ఆ బ్రతుకు నడకలో పదములైన మనం

నీ కంట జారిన కన్నీటి బొట్టు
దోషిగా నను నిల్పి
నీ వాడి చూపు నను నిలదీయు వేళ
సిగ్గుతో వంగిన తలను నీ చూపులే
నను ప్రేమతో నిమిరి
తప్పు ఒప్పుల సద్దులెందుకన్న వేళ

జంటగా సమసి ఒకటైన మనం
ఆ ఒకటిలోనే జంటైన మనం

క్షణములావిరి చేయు
గ్రీష్మ తాపపు వేడి
నిప్పు సెగలై నన్ను రగిలించు వేళ
మంచు ముద్దులు జార్చు
శిశిర గాలిగ జుట్టి
ఉష్ణ శీతల నడుమ నన్నూపు వేళ

కురిసె తొలకరిలో తడిసి ముద్దై మనం
విరిసె హరివింటిలో వొదిగి వొంపై మనం

కాలము జార్చి పోయిన పరదాల మాటున
గతము వదలి వెళ్ళిన జ్ఞాపకాల అడుగున
నా అడుగుజాడల ప్రక్క నీవి కానని క్షణాన
నా పాదాలపై నువ్వు నిల్చున్న ఊసు
చెదురు మనసుకి చెప్పి ఊరడించిన వేళ
అడుగులొకటే మనవి గురుతులూ ఒకటే
మనమొక్కటే అంటు గుర్తు చేసిన వేళ

నా ఎదుట నీవుగా నీ ఎదుట నేనుగా ఒక్కటై మనమైన మనం
అడుగులో అడుగుగా ఒక్కటే అడుగుగా కలిసి నడిచే మనం