ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం

ఈమాట రచయితలకూ, పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం.

ప్రముఖ కవి, రచయత శ్రీ స్మైల్ డిసెంబర్ 5వ తేదీ మరణించారు. వారి జ్ఞాపకార్థం ఈ సంచికను స్మైల్ సంచికగా విడుదల చేస్తున్నాం. ఈ సంచికలో విశేషాలు:

ఎప్పటిలాగానే ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము. ఈ ప్రత్యేక సంచిక నిర్మాణంలో సహాయం చేసిన రచయితలు, సమీక్షకులు మొదలైనవారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.

కొన్ని ప్రకటనలు

  1. ఈమాటకు తమ రచనలు పంపే రచయితలకు, రచనలు పంపే పద్ధతి, సూచనలూ వివరిస్తూ, ఈమాట ఆశయాల్నీ ప్రచురణ పద్ధతులనీ తేటతెల్లం చేయడం కోసంగా రచయితల పేజీ సవరించబడింది. రచయితలు గమనించగలరు.
  2. కొంతమంది రచయితలు, సమీక్షల ధ్వని కరుకుగానూ, నొప్పించేటట్టూ ఉంటోందని అభిప్రాయపడ్డారు. ఇది అందరి అనుభవమూ కాకపోయినా, ఉద్దేశపూర్వకంగా చేసినది కాకపోయినా, క్షంతవ్యం కాదు. ఇకనుంచీ మరింత జాగ్రత్తగా సమీక్షలను పరిశీలించిన తర్వాతే రచయితలకు పంపుతాం.
  3. ఈమాట వ్యవస్థాపక సంపాదకుల్లో ముఖ్యులైన కొలిచాల సురేశ్ గత సంచిక విడుదల తర్వాత, దైనందిన సంపాదకీయ బాధ్యతల నుంచి స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. సంపాదక బృందం నుండి తొలగినా, ఈమాటలో భాగంగానే కొనసాగుతూ వారి అభిరుచులైన భాషాశాస్త్రం, తెలుగు సాఫ్ట్‌వేర్ రంగాలలో తమ సమయాన్ని వెచ్చిస్తారు. ఆందులో భాగంగా సురేశ్ ఈమాట పాఠకుల కోసం తెలుగు భాషావ్యుత్పత్తులపై తరచూ వ్యాసాలు రాయబోతున్నారు.
  4. ఈమాటలో అభిప్రాయాలు రాసేవారు చాలామటుకు తమ పేర్లతోనే రాస్తారు. కొంతమంది మారుపేర్లతో రాస్తున్నారు, మరీ ఒక ‘పాఠకు’డైతే అయితే కనీసం నాలుగు పేర్లతో. దీనివల్ల ఒరిగే ప్రయోజనమేమిటో మాకు తెలియటం లేదు. అందరూ తమ సొంత ఐడెంటిటీతోనే అభిప్రాయాలు రాస్తే బాగుంటుందని మా అభిలాష. అలాగే పేరు ఏది పెట్టుకున్నా కనీసం ఈమెయిల్ ఐనా నిజమైనదే ఇస్తే సంపాదకులకు ఆ కామెంట్లు రాసేవారిని సంప్రదించటానికి వీలుగా ఉంటుంది – సవరణలకో, సలహాలకో. ఇందువల్ల జరిగే నష్టమేమీ లేదు. సాధారణంగా ఈ దేశంలో పత్రికలన్నీ అభిప్రాయాలు రాసేవారి ఫోన్ నంబరు అడుగుతాయి, ఐడెంటిటీ కన్ఫర్మేషన్ కోసం. ఈమాటకు ప్రస్తుతం అంత అవసరం లేదు, రాకూడదనే మా కోరిక. అయితే, కామెంట్లకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు ఈ సంచిక నుంచీ ప్రవేశపెడుతున్నాం.
    • అభిప్రాయాలు కేవలం ఏ కథకో కవితకో వ్యాసానికో ప్రత్యక్షంగా సంబంధించి ఉండాలి. ఏ రచనకూ సంబంధం లేని అభిప్రాయాలు ప్రచురించబడవు. తోటి పాఠకుల అభిప్రాయాలను అవహేళన చేసే కామెంట్లు కూడా ప్రచురించబడవు.
    • అభిప్రాయాలు సాధ్యమైనంత వరకూ తెలుగులో లేదా ఇంగ్లీష్ లోనే ఉండాలి. RTS లేదా Unicode పద్ధతి వాడకుండా ఇంగ్లీషులో రాసిన తెలుగు కామెంట్లు ప్రచురించబడవు.
    • ఒకటీ, రెండు పదాల కామెంట్లు (అద్భుతం, బాగుంది, నాకు నచ్చింది, వగైరా) ఇకముందు నుంచీ ప్రచురించబడవు. నచ్చిందని చెప్పేటప్పుడు కనీసం ఏది నచ్చిందో, ఎందుకు నచ్చిందో కూడా చెప్పని కామెంట్లు ఎవరికోసం? వీటివల్ల రచయితకైనా, తోటి పాఠకులకైనా ఏ ప్రయోజనమూ లేదని మా అభిప్రాయం. అందుకే కామెంట్లు రాసేవారు కొంచెం వివరంగా, విశదంగా, విశ్లేషిస్తూ, విమర్శిస్తూ రాయాలని మా కోరిక. పాఠకులు మా అభిమతాన్ని ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాం.