మూడు జ్ఞాపకాలు

1. ప్రయోగం

మేమంతా చిన్నతనంలో చూసిన మొదటి రసాయనిక ప్రయోగం అదే.

ప్రయోగం జరిగే స్థలం “నీళ్ళ గది”. రోజూ స్నానాలకవసరమైన వేన్నీళ్ళు అక్కడ ఉన్న పొయ్యిమీద కాగబెట్టేవారు. పొయ్యి రాజెయ్యటాని కవసమయ్యే వివిధ సామగ్రితో ఆ గది నిండి ఉండేది – కట్టెపుల్లలు, పిడకలు,ఎండిన కొబ్బరి మట్టలు, కొబ్బరి డొక్కులు, కిర్సనాయిలు వగైరా. వీటన్నిటి వాసనలు పొగతో కలగలిసిన విచిత్రమైన వాసన ఒకటి ఉండేదక్కడ. ఇదంత నచ్చేది కాదు గాని, పచ్చి పుల్లల నుంచి వచ్చే ఒక రకమైన తియ్యటి వాసన మాత్రం నాకు చాలా ఇష్టం. అది ఒక్క కట్టెల అడితీలోనే దొరుకుతుంది.

నాన్నగారు నేను పుట్టక ముందునుంచీ డయాబెటిక్. అందుకని, తరచు తన షుగర్ లెవెల్సు పరీక్ష చేసుకునేవారు. అందులో భాగమే ఈ ప్రయోగం. బెనెడిక్ట్ సొల్యూషన్ అని ఒక నీలి రంగు ద్రావకం ఉంటుంది. దానిని ఒక పరీక్షానాళిక లోకి తీసుకుని, మరిగించేవారు. చేసేది కట్టెల పొయ్యి దగ్గరే అయినా, ఆ పొయ్యి మంట దీనికి ఉపయోగించేవారు కాదు. ఇందుకోసం పాత న్యూస్ పేపర్లు వెలిగించి మంట చేసేవారు. అవే పేపర్లు పరీక్షానాళిక పట్టుకోవటానికి, మసి తుడవటానికి కూడా ఉపయోగపడతాయి. ద్రవం కాస్త మరిగాక అందులో, వాడిన ఇంజక్క్షన్ బాటిల్లో తగుమాత్రం ఉన్న వేరే ద్రవం నుంచి కొన్ని బొట్లు ఇంక్ ఫిల్లర్ సాయంతో వేసేవారు. ఆ ద్రవం ఏమిటి నాన్నగారూ అని అడిగితే “స్పిరిట్ రా” అనేవారు. అలా వెయ్యగానే, నీలిరంగు ద్రవం రంగులు మారుతుంది. చివరకు వచ్చిన రంగుని బట్టి షుగర్ లెవెల్సు నిర్థారించేవారు. రంగు మారకపోతేనో, ఆకుపచ్చ రంగు వస్తేనో నార్మల్ అనుకుంటాను. “అలా వస్తే మీకందరికీ తలా ఒక రూపాయి ఇస్తానురా” అనేవారు. ఆయనంత ధీమాగా హామీ ఇస్తున్నారంటే అదెప్పుడూ రాదని తెలుసు. ఐనా, ప్రతిసారీ ఏదో చిన్న ఆశ. (అప్పట్లో నేను దేవుణ్ణి కోరుకునే కోర్కెలు రెండే రెండు: ఒకటి ఈ ప్రయోగంలో నాన్నగారికి మంచి రంగు రావాలని, రెండవది మాయింట్లో పనిచేసే అప్పలరాజుకి బ్రాకెట్టులో మంచి నెంబరు కలవాలని. ఆ కధ వేరే చెబుతాను) రెండు మూడు చుక్కలతో ద్రవం బుసబుసా పొంగాక, మంట నుంచి బయటకు తీసి, మసి తుడిచేవారు. రంగు చూడటం, పెదవి విరవటం, ఆ ద్రవాన్ని పారబోసి పరికరాలు శుభ్రం చెయ్యటంతో ప్రయోగం ముగిసేది. ఇది చాలా సింపుల్ ప్రయోగమే అయినా, అన్నిసార్లూ ఒకేలా ఉన్నా, ఎందుకో ఎప్పుడూ విసుగనిపించేది కాదు. నాన్నగారి చుట్టూ కూర్చుని, ఆయన ఆశాభావంలో పాలుపంచుకోవటం సరదాగా ఉండేది.

కొంత బుద్ధి తెలిసాక, ఒక సందేహం కలిగేది. ఏదో నీలిరంగు ద్రవంలో , ఇంకేదో “స్పిరిట్” వేస్తే, అది ఆయన షుగర్ లెవెల్సు ఎలా చెప్తోంది. ఎవరు పట్టుకుంటే వాళ్ళది చెబుతుందా. ఒకసారి పట్టుకు చూద్దామని అనిపించేది కాని, ఎప్పుడూ ఆ సాహసం చెయ్యలేదు. ఆయన్ని ఆ ప్రశ్న అడిగే సాహసమూ చెయ్యలేదు.

తరువాత రోజుల్లో, మేము పిఠాపురం నుంచి కాకినాడకి మారాక, ఆయన ఈ పరీక్ష చేసుకున్న గుర్తులేదు. అప్పుడప్పుడూ బయట క్లినిక్ లోనే రక్తపరీక్ష చేయించుకొనేవారేమో.

ఇప్పుడు నాన్నగారు లేరు. షుగర్ లెవెల్సు తెలుసుకోవటానికి, స్వయంగా రక్త పరీక్ష చేసుకోవటానికి కూడా అనువైన పరికరాలు వాడకంలోకి వచ్చాయి. ఏదైనా ఉదయం రక్త పరీక్ష చేసుకునేటప్పుడు, వేలు చురుక్కుమంటే, నాన్నగారి గురించిన జ్ఞాపకం మనుసులో కలుక్కుమంటుంది. కాలిన న్యూస్ పేపర్లో ఇంకా నిలిచిన అక్షరాల్ని చదవటానికి ప్రయత్నించినట్టు, గతం పొరల్లో అప్పుడప్పుడు ఆయన గురించిన స్మృతుల్ని చదవటానికి ప్రయత్నిస్తాను.


2. అప్పలరాజు కధ

ఇంటికి రోజూ వచ్చే న్యూస్ పేపర్లో ఒకొక్కరికి ఒకో రకమైన ఆసక్తి ఉండేది. ఒకరికి మొదటి పేజీ హెడ్ లైన్లు కావాలి, ఒకరికి చివరి పేజీ స్పోర్ట్సు కాలం కావాలి, మరొకరికి ఎడిటోరియల్ పేజీ కావాలి -ఇలా రకరకాలు.ఐతే, మాయింట్లో పనిచేసే ఆఫీసు నౌకరు అప్పలరాజుకి మాత్రం వీటన్నిటికంటే భిన్నమైన ఆసక్తి ఉండేది. అప్పట్లో నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీలో మేనేజరుగా పనిచేస్తుండటంవల్ల ఒక ఇంటి నౌకరును కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు.

అప్పలరాజు నాకు చాలా సన్నిహితుడు. అంటే, నా అవసరాలన్నీ అతనే చూసేవాడు. చేదతో నీళ్ళు తోడి ఒంటిమీద పోయ్యటం, బట్టలు తొడగటం, బడికి తీసుకుపోవటం వగైరా అన్నీ అతనే చేసేవాడు. బడిలో లేని సమయంలో ఎక్కువకాలం అతనితోనే గడిపేవాడిని. అతను ఎక్కడికి బయల్దేరుతున్నా, “కూడా బయల్దేరటం” అప్పట్లో నాకొక దురలవాటు. దానివల్ల అతనికెంత విసుగు కలిగేదో అప్పుడు తెలియదుగానీ, ఇప్పుడు బాగా అర్థమౌతుంది.

ఐతే అతనికీ ఒక దురలవాటు ఉండేది. అదే బ్రాకెట్ ఆట. ఒక అంకె/రెండు అంకెల మీద బెట్ కట్టే మట్కా జూదం. ఈ గేంబ్లింగ్ వలలో ఎలా చిక్కుకున్నాడో తెలియదు గాని, అప్పలరాజు దీనిని సీరియస్ గా తీసుకునేవాడని మాత్రం తెలుసు. ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళే దారిలో ఏదైనా కిళ్ళీ బడ్డీ దగ్గర ఆగి, కొన్ని నెంబర్లు చీటీ మీద రాయించుకుని రావటం చాల సార్లే చూసాను. బహుశ పెద్ద మొత్తాలు పందెం కాసేవాడు కాదేమో గాని, దాదాపు ప్రతి రోజూ కొంత కాసేవాడు. ఇల్లు గుల్ల చేసుకోక పోయినా, నెల జీతంలో కొంత సొమ్ము విధిగా దీనిలో పోగొట్టుకొనేవాడు. ఎప్పటికైనా తనకి జాక్పాట్ లాంటిది తగులుతుందని, తద్వారా తన కష్టాలన్నీ తీరిపోతాయనే ఆశ మాత్రం ఉండేది. అలా వస్తే గనుక, నాకు “బాల్” ఇస్తాననేవాడు. పెద్ద సైజు పార్టీకి అతనికి తెలిసిన మాట బాల్. అటువంటిది జరిగితే చూడాలని నాకూ ఆశగానే ఉండేది.

ప్రతి రోజూ నెంబరు గెస్ చెయ్యాలంటే, ఏదో ఒక ఆధారం ఉండాలి. దానికి అతనెన్నుకున్న మార్గమే బహు విచిత్రంగా ఉంటుంది. ఇంగ్లీషు న్యూస్ పేపర్లో ఏవో కార్టూన్లు, కామిక్స్ నుంచి చిన్న భాగాలు వేస్తారుగదా. ఈ కార్టూను బొమ్మల్లో ఆరోజు తగిలే నెంబరు రహస్యంగా దాచబడి ఉంటుందని అతని నమ్మకం. కార్టూను బొమ్మల్లో కళ్ళు సున్నా లాగాను, ముక్కు తలక్రిందులు చేసిన ఏడు అంకె మాదిరి గానూ కనిపించటం సహజమే గదా. ఇక ఒకటి అంకె గురించి చెప్పనే అక్కర్లేదు – ఏ నిలువు గీతలోనైనా దానిని చూడవచ్చు. ఇలా ఆ బొమ్మల్లో ఇంకా అనేక అంకెల కోసం అన్వేషిస్తూ, అతను గంటల కాలం గడిపేవాడు. ఈ అన్వేషణలో సహాయ పడేందుకు ఒక భూతద్దం కూడా దగ్గర ఉంచుకొనేవాడు. న్యూస్ పేపర్లో పూర్తిగా తలదూర్చి, కార్టూన్లని భూతద్దం లోంచి పరీశీలిస్తూ, ఆ బొమ్మల కళ్ళలోంచి అదృష్టం తన వాకిట్లోకి నడిచి వస్తుందని ఎదురుచూసే అతని అమాయకత్వం గురించి ఇప్పుడు తలుచుకుంటే ఎంతో జాలి కలుగుతుంది.

ఇదిగాక, రకరకాల అంకెలు వేసిఉన్న చార్టుల్లాంటివి కూడా ఏవో ఉండేవి. కాని, వాటినెలా ఉపయోగిస్తారని నేనెప్పుడూ అడగలేదు. మొత్తానికి, అప్పలరాజుకి బ్రాకెట్ ఆటలో గొప్ప అదృష్టమేదీ కలిసి రాలేదని, అతను అలాగే, ఆ నౌకరుద్యోగం చేసుకుంటూనే రిటైరై ఉంటాడని వేరే చెప్పక్కర్లేదు.

అప్పలరాజు కొద్దో గొప్పో పాడేవాడు. సైకిల్ తొక్కుతూ, “నడి రేయి ఏ జాములో, స్వామి నినుచేర దిగివచ్చునో, తిరుమల శిఖరాలు దిగివచ్చునో” అంటూ అతను కూనిరాగం తీసే పాట, ముందర ఊచ మీద కూర్చున్న నాచెవిలో అప్పుడు మోగినట్టే, ఇప్పటికీ పలుమార్లు వినిపిస్తుంది. ఐతే, అతనిని నా స్మృతిపధంలో ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం “పాండవోద్యోగాలు” నాటకంలో కర్ణ పాత్ర. “వసుదేవ కుమారా! నాయందలి సౌహార్దముచేత నీవు చెప్పిన ఈ మాట, నా సహజ కవచకుండలములు ఇంద్రుని కిచ్చునాడు, నా తండ్రి సూర్యుని వలననే కొంత ఎరింగితిని. నేడు నీ వలన సమూలముగా తెలిసినది. ఐనప్పటికీ – సూతుని చేతికిం దొరికి, సూత కళత్రము పాలు ద్రావి, …” ఇలా సాగే కర్ణ ఏకపాత్రాభినయం అతను ఎన్నో సార్లు మాముందు ప్రాక్టీసు చేసేవాడు. నాటక పద్యాలు వినటం నాకదే మొదలు. అతని సాధన చూసినప్పుడల్లా ఎప్పుడైనా అప్పలరాజుని స్టేజి మీద చూడాలని ఎంతగానో అనుకొనేవాడిని.

ఒకసారి, ఆ అవకాశం రానేవచ్చింది. ఫ్యాక్టరీ సాంస్కృతికోత్సవాలలో భాగంగా అప్పలరాజు కర్ణపాత్రలో స్టేజి మీదకి వచ్చాడు. నేను గుర్తు పట్టలేని విధంగా రాచరికపు దుస్తుల్లో కనిపించాడు. పద్యం బాగానే మొదలు పెట్టాడు. కాని, ఎందువల్లనో కొంచెం దూరం చెప్పాక మర్చిపోయాడు. ఒకటి రెండు సార్లు మళ్ళీ మొదలుపెట్టి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఎవరో ప్రాంటింగు కూడా ఇచ్చారట గాని,అది అతనికి వినబడలేదు. కర్ణుడికి యుద్ధ సమయంలో తను నేర్చిన విద్యలేవీ అక్కరకు రానట్టుగా, అప్పలరాజుకి స్టేజి మీద ఏ ఉపాయమూ ఉపయోగపడలేదు. నిరాశతో చేతులు జోడించి, అతను వెనక్కు తిరగటం చూసినపుడు నాకు చాలా విచారం కలిగింది. ఎన్నాళ్ళుగానో ఎదురుచూసిన కల కళ్ళముందే కరిగిపోయినట్టయింది.

పిఠాపురం నుంచి వచ్చేసాక, అప్పలరాజుని మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. పెద్దై, ఉద్యోగం వచ్చాక అతనికేదైనా సాయం చెయ్యాలని చిన్నప్పుడనుకొనేవాడిని. అదీ ఇప్పటిదాకా జరగలేదు. కాని, ఎప్పుడూ అనిపిస్తుంది – ఏదో ఒకరోజు నా చిరకాల బాల్యమిత్రుణ్ణి కలిసి, అతను చేసిన సేవలకి తప్పక ప్రతిఫలం చెల్లించాలని.


3. పూనకం

అమ్మకి కోపం కొంచెం ఎక్కువే అయినా, ఆవిడ మనసు మాత్రం దయతో నిండి ఉండేది. ఒకసారి నన్ను కవ్వంతో కొట్టి, వెంటనే అలా కొట్టినందుకు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఉపచారం చేసింది. ఐతే, ఎందువల్లనో ఆవిడకి పనిమనుషులతో ఎప్పుడూ పడేది కాదు. వాళ్ళకెంత పెట్టేదో, అంతగానూ వాళ్ళని తిట్టేది. ఆవిడకి ఎవరి పనీ నచ్చక అలా చేసేదో, లేక తనకున్న ఇతర మానసిక ఒత్తిడుల్ని అటు మళ్ళించేదో తెలియదుగాని, ఎంతమంది పనివాళ్ళు మారినా, ఆవిడ వాళ్ళతో గొడవ పడటం మాత్రం మారేది కాదు. ఏదైన గొడవ జరిగినప్పుడు వారిపట్ల తన నిరసనని తెలియజెయ్యటానికి రకరకాల పద్ధతులు ఉపయోగించేది. వాటిలో కొన్నిసార్లు దండం పెట్టి దయ చెయ్యమనటం కూడా కద్దు. ఐతే, ఒకసారి నిజంగానే ఆవిడ ఒక పనిమనిషి కాళ్ళకు మొక్కిన సంఘటన జరిగింది.

పిఠాపురం పట్టణాన్ని చల్లగా చూసే తల్లులు ఐదుగురు – మారెమ్మ, మరిడమ్మ, పైడమ్మ, సత్తెమ్మ, నూకాలమ్మ. అమ్మ తన భక్తి నివేదనలో భాగంగా కుక్కుటేశ్వరస్వామి, కుంతీ మాధవ స్వామి వంటి పెద్ద పెద్ద దేవుళ్ళనెలా ఆరాధించేదో, గ్రామదేవతల్ని సంతృప్తి పరచటానికి కూడా అలాగే ప్రయత్నించేది. ఇంట్లో అరడజను మంది చిన్నపిల్లలున్న ఇల్లాలు అటువంటి జాగ్రత్తలు పాటించటం సహజమే. మరీ అంత ప్రమాదకరమైనవి కాకపోయినా, అమ్మవారు, ఆట్లమ్మ లాంటివి ఇంట్లో ఏ పిల్లాడికైనా సోకటం అప్పుడప్పుడూ జరిగేది. మసూచిని దేశం నుండి పూర్తిగా పారద్రోలామని ప్రభుత్వం ప్రకటిస్తున్న రోజులవి. ఐనా, భయం ఉంటూనే ఉంటుంది గదా. ఏ సందర్భంలో చేసేవాళ్ళమో గుర్తులేదు గాని, ఏడాది కొకసారి పిల్లలమంతా ఊళ్ళో ఉన్న గ్రామదేవతల గుళ్ళన్నిటికీ వెళ్ళి నివేదనలు సమర్పించేవాళ్ళం. నాకొకసారి అమ్మవారు సోకి ఉధృతమైనప్పుడు అమ్మ కోడిపిల్లని దిష్టి తీయించింది కూడా. ఆవిడ స్వయంగా జీవహింస చెయ్యకపోయినా, అటువంటి మొక్కుబడులు తీర్చేందుకు పనివాళ్ళు ఉండేవాళ్ళు. అలా ఏ సందర్భంలో ఎవరికి మొక్కుకుందో, ఏ పనుల ఒత్తిడిలో దానిని మరిచిపోయిందో తెలియదుగాని, దాని వల్లనే ఆ సంఘటన జరిగిందని ఆవిడ నమ్మకం.

అమ్మ గాని, నాన్నగారు గాని పనివాళ్ళని ఒరే, ఒసే వంటి పదాలతో పిలిచేవారు కాదు. ఎవరినైనా పేరుపెట్టి పిలవటమే అలవాటు. ఐతే, ఒకామె పేరు మాత్రం నాకిప్పటికీ తెలీదు. ఆమెకి బాగా చెవుడు. ఆ విధంగానే ఆవిడ గురించి చెప్పేవాళ్ళం. పిలిచేటప్పుడు కూడా “ఇదిగో” అని పిలవటమే. పొట్టి జుట్టు. తలకు బాగా కొబ్బరినూనె పట్టించి, ఒక రబ్బరు బ్యాండు తగిలించేది. తెల్లచీర మాత్రమే కట్టేది. అడ్డచుట్ట సరేసరి. ఏదైనా చెప్పేటప్పుడు “ఆమటుకి” అని మొదలుపెట్టేది. భర్త లేడు. ఎదిగిన కొడుకు ఒకడుండేవాడు. కాని, అతడంతగా ప్రయోజకుడు కాదు. బహుశ ఆమే పని చేసి అతణ్ణి పోషించేదనుకుంటాను. ఇంకా ఏమేమి మానసిక ఒత్తిడులుండేవో మనకు తెలియదు.

ఒక రోజు ఆమె అంట్లు తోమి, గిన్నెలు తీసుకువచ్చి వంటింటి దగ్గర పెడుతోంది. ఉన్నట్టుండి చేతిలో వున్న గిన్నెల్ని గిరవాటు వేసి, నేలకేసి కొట్టింది. మనిషి కోపంతో ఊగిపోతోంది. ఎప్పుడైనా అమ్మ కోపంతో గిన్నెలు గిరవాటు వెయ్యటం అనుభవమే గాని, పనిమనిషి ఆ పని చెయ్యటం కొత్త. “ఎంతసేపూ నీ పిల్లలకి పెట్టుకోవటమేగాని, నా సంగతి పట్టించుకోవా?” అంది. ఆమె ప్రవర్తన చూసి అమ్మ కోప్పడుతుందేమో అనుకున్నాం. కాని, అందుకు విరుద్ధంగా, అమ్మ వెంటనే బయటకు వచ్చి, ఆ మనిషికి మొక్కింది. హారతి వెలిగించి తిప్పింది. మన్నించమని, మొక్కు వెంటనే చెల్లిస్తానని, దయచేసి శాంతించమని వేడుకొంది. అప్పటికి చెవిటామె కొంత తెప్పరిల్లింది. “అదేంటమ్మా నా కాళ్ళు పట్టుకున్నారు?” అంటూ సిగ్గుపడి కాళ్ళు వెనక్కు తీసుకుంది. ఏమీ లేదంటూ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ ఆరోజంతా ఆమెకి పని చెప్పకుండా విశ్రాంతి నిచ్చింది. తరువాత త్వరలోనే తన మొక్కు కూడా చెల్లించిందనుకుంటాను. చెవిటామె చాలా రోజులే మాదగ్గర పని చేసినా, మళ్ళీ ఎప్పుడూ అటువంటి సంఘటన జరగలేదు. మరెక్కడా నాకటువంటి అనుభవమూ ఎదురుకాలేదు.

అమ్మ ప్రతి రోజూ ఎంతో శ్రద్ధగా పూజ చేసేది. లెక్కలేనన్ని నోములు, వ్రతాలూ జరిపేది. అరటిదొప్పలో ఆవునేతితో దీపాలు వెలిగించి ఆరాధించేది. ఆవిడ భక్తికి మెచ్చి ఏ దేవుడైనా ఎప్పుడైనా బదులు పలికాడో లేదో తెలీదు. అప్పుడు చదివిన వ్రతకధలన్నీ గుర్తులేవు గాని, మారెమ్మో, మరిడెమ్మో ఇంటికివచ్చి మరీ నిలదీసిన ఈ సంఘటన మాత్రం ఒక జానపద కధలా గుర్తుండిపోయింది.