మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి

బొరుగుల మిఠాయి నములుతూ
అరిగిపోయిన జోళ్ళు ఈడ్చుకుంటూ
మేకలు తోలుకుపోతోంది ఓ పిల్ల

గుడ్డ మూట తల కింద పెట్టుకొని
పాడుబడ్డ మండపంలో బరివి గడ్డం సన్యాసి
తత్వమొకటి ఎత్తుకుంటున్నాడు

చింత చెట్టు పరిచిన నీడ కింద
తేగల బుట్ట పక్కన పెట్టుకొని
నోరు తెరిచి నిద్రపోతోంది ఓ అవ్వ

సాలీడు లేసులల్లిన సమాధి మీద
నిలబడిన దిసమొల వాడొకడు
హ్హహ్హహ్హ అని కేకలు వేస్తున్నాడు

ఊళ్ళోకి దారెటంటూ వీళ్ళల్లో
ఎవరిని అడగాలా అని
తికమక పడిపోతూ
నిలబడి పోయేను.