వాడుక భాషలో పద్యాలు

పరిచయము

ఇరవైయవ శతాబ్దంలో వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా వికసించిందో అనే విషయాన్నిగురించి ముందటి వ్యాసంలో [మో-1] తెలిపాను. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం వాడుక భాషలో ఛందోబద్ధమైన పద్యాలు రాయడాన్ని గురించి వివరించడమే. ఇలా రాయడంలో మనం ఎదురుకొనే సమస్యలను తెలుపుతాను. ప్రసిద్ధులు కొందరు రాసిన పద్యాలను మీ గమనికకు తేవడం మాత్రమే కాక చివర నేను రాసిన కొన్ని ఉదాహరణలను కూడ జత చేస్తున్నాను. కవిత్వభాష తీరుతెన్నులను గురించి, వాడుక భాషలో పద్యాలను గురించి ఇంతకు ముందే భైరవభట్ల కామేశ్వరరావుగారు ఈమాటలో ప్రచురించిన వ్యాసాలలో [కా-1][కా-2]) కొన్ని విషయాలు చర్చించబడ్డాయి.

గేయకవిత్వం రాసేటప్పుడు కొద్దిగా స్వేచ్ఛను తీసికొనవచ్చు. కొన్ని చోటులలో అక్షరాలను పొడిగించుకొనవచ్చు, కొన్ని చోటులలో తగ్గించుకోవచ్చు. హ్రస్వాన్ని దీర్ఘం చేసికోవచ్చు, దీర్ఘాన్ని హ్రస్వం చేసికోవచ్చు. గేయాలలో ప్రాధాన్యత లయకు, సంగీతానికి ఎక్కువ. వచనకవిత్వంలో రచయితకు స్వాతంత్ర్యం ఇంకా ఎక్కువ. అన్ని పంక్తుల నిడివి ఒకటిగా నుండనక్కరలేదు. ఇందులో ప్రాధాన్యత భావాలకు మాత్రమే. ఇట్టి కవితలలో పాదాంతములోని విరామాలవల్ల, పాదంలోని అనుప్రాసలవల్ల లయను కల్పించవచ్చు. అందుకే ఈ యుగంలో కవులు గేయ కవితల, వచన కవితల మాధ్యమాన్ని ఎన్నుకొన్నారు. నియమాలు వాళ్ల భావాలకు అడ్డురావు.

నియమ కతిపయములు

పద్యాలకు ఎన్నో నియమాలుంటయి [తి-1]. అందులో కొన్ని:

 • ప్రతి పద్యంలో పాదముల సంఖ్య నియమించబడి ఉంటుంది. వృత్తాలలో సామాన్యంగా ఇది నాలుగు. ద్విపదలో రెండు, త్రిపదలో మూడు, షట్పదలో ఆరు, సీసంలో నాలుగు, పిదప వచ్చే ఆటవెలది లేక తేటగీతిలో ఇంకా నాలుగు.
 • ప్రతి పాదములో ఒక నిర్దిష్టమైన అక్షరసమూహాలు ఉంటాయి. ఈ అక్షర సమూహాలను గణములు అంటారు. ఈ గణాలు మూడు విధాలు – అక్షర గణాలు (మ, భ, జ, స, న, య, ర, త, లగ, గల, లల, గగ, ల, గ), మాత్రాగణాలు (రెండు, మూడు, నాలుగు, ఐదు మాత్రలు), ఉప లేక అంశ గణాలు (సూర్య గణాలు, ఇంద్ర గణాలు, చంద్ర గణాలు). వృత్తాలైన చంపక, ఉత్పలమాలలలో, శార్దూల, మత్తేభవిక్రీడితాలలో అక్షర గణాలు ఉంటాయి. జాతులైన కందము, ఉత్సాహ, రగడ లాటి పద్యాలను మాత్రాగణాలతో రాస్తారు. ఉపజాతులైన సీసము, ఆటవెలది, తేటగీతి లాటి పద్యాలను అంశగణాలతో రాయాలి. ద్విపద, అక్కరలవంటి జాతి పద్యాలను అంశ గణాలతో రాస్తారు.
 • పాదములోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. వృత్తాలకు, జాతులకు ప్రాస తప్పక ఉండాలి. ఉపజాతులకు ఈ ప్రాస ఐచ్ఛికము. అన్ని ద్రావిడ భాషలలో ఇట్టి ప్రాస నియమము ఉన్నది. కన్నడ, మలయాళ భాషలలో యతి నియమముకన్న ప్రాస నియమము అతి ముఖ్యము.
 • తెలుగు పద్యాల విశేషతలలో వడి లేక యతి చాలా ముఖ్యమైనది. సంస్కృత ఛందస్సులో యతి అనేది ఒక విరామము మాత్రమే. అంటే పాఠకునకు యతిస్థానమువద్ద ఊపిరి పీల్చుకోడానికి అవకాశం ఉంటుంది. పాదాంతములో కూడా ఇట్టి విరామము ఉంది. కాని తెలుగులో యతి అక్షరబాంధవ్యాన్ని సూచిస్తుంది. ప్రతి పాదములో మొదటి అక్షరానికి, పాదం మధ్యలో ఉన్న అక్షరానికి లేక అక్షరాలకు చుట్టరికం ఉండాలి. అంటే ఆ అక్షరాలలోని అచ్చులు, హల్లులు ధ్వని సామీప్యాన్ని పొంది ఉండాలి.

ఉదాహరణకు మొదటి అక్షరము క అయితే యత్యక్షరము క, గా, ఖై, ఘౌ, క్ష లాటివిగా ఉండాలి. ఉపజాతులలో యతికి బదులు ప్రాసయతిని కూడా వాడుతారు. అంటే రోసి అనే పదానికి మూస అనే పదానికి రెండవ అక్షరమైన స-కారము ద్వారా ప్రాస యతి చెల్లుతుంది. కాని యతిప్రాసలు లేకుండా కూడా రాయప్రోలు సుబ్బారావుగారివంటి మహాకవులు కావ్యాలను రాశారు. వారు రాసిన కాళిదాసుని మేఘదూతమునకు అనువాదమైన దూతమత్తేభమునుండి [సు-1] ఒక పద్యాన్ని కింద ఉదహరిస్తున్నాను. కాళిదాసు మేఘదూతాన్ని మందాక్రాంతవృత్తములో రాయగా, రాయప్రోలువారు దానిని యతిలేని, ప్రాసలేని మత్తేభవిక్రీడితములో తెలుగులో అనువదించారు.

అధికారంబున నేమరిల్లి – ప్రభుశాపగ్రస్తుడై – యక్షు డొ-
క్కడు, కాంతావిరహార్తితో, జనకకన్యాస్నానపుణ్యోదకం-
బుల ఛాయాతరువీథులన్, నవయుచుండెన్ రామగిర్యాశ్రమం-
బులలో, ప్రజ్ఞలు గ్రుంక, భోగ్యమగు వర్షాంతంబు నీక్షించుచున్

ఛందస్సు రీత్యా పైన చెప్పిన అన్ని లక్షణాలు ఉంటేనే అవి పద్యాలౌతాయి. మహాకవుల పద్యాలలో తప్ప సామాన్యుల రచనలలో యతికై, ప్రాసకై ఊత పదాలు, అనవసరమైన పదాలు, అంతగా సరిపోని పర్యాయ పదాలు అప్పుడప్పుడూ దొర్లుతూ ఉంటాయి.

వాడుక భాష

వాడుక భాష అంటే ప్రజలు వారి దైనందిన కార్యక్రమాలలో (మాట్లాడడం, చదవడం, రాయడం) వాడే భాష. తెలుగు సాహిత్యంతో కొంతైనా పరిచయమున్నవారికి తప్ప సామాన్య ప్రజానీకానికి ఏవో ఒక కొన్నిటికి తప్ప, చాలా సంస్కృత పదాలకు గాని, అచ్చ తెలుగు పదాలకు గాని అర్థం తెలియదు. అంటే వారి భాష పరిమితమైనది. ఇట్టి భాష ప్రాచీనమైన వ్యాకరణములకు, నిఘంటువులకు లోబడి ఉండదు. అంటే ఈ భాష నన్నయ భట్టు శబ్ద చింతామణి, చిన్నయసూరి బాలవ్యాకరణాదుల సూత్రానుసారంగా ఉండదు. ఆథునిక ప్రయోగాలకనుగుణంగా నిఘంటువులోని పదాలకు మార్పులు, కూర్పులు, చేర్పులు ఉంటాయి. కొన్ని ఒత్తులను తొలగిస్తారు. కొన్నిటిని తారుమారు చేస్తారు. కొన్ని దీర్ఘాలు హ్రస్వాలుగా, కొన్ని హ్రస్వాలు దీర్ఘాలుగా మారుతాయి ఇందులో. అంతమాత్రాన, ఆ భాషలో సౌందర్యం లేదని చెప్పలేము. అది కూడా అందమైనదే. అది ఒక జీవనది లాటిది. ఈ వాడుక భాషలోని కొన్ని ముఖ్యాంశాలు కింద ఇస్తున్నాను.

 • పద్యాలలో ద్రుతప్రకృతికమును (పొల్లు న-కారము) కూడా కవులు వాడుతారు. వచ్చెదను అనే పదానికి బదులు వచ్చెదన్ అనే వాడుక సర్వసాధారణం పద్యాలలో. కాని వాడుక భాషలో మనం ద్రుతాన్ని ఉపయోగించము. నేను మీ యింటికి రేపు వచ్చెదన్ అని ఎవరైనా మాట్లాడితే మనం తప్పక నవ్వుకొంటాము.
 • అదే విధంగా మ-కారానికి బదులు బిందుపూర్వక బ-కారము, ఒత్తుతోటి మ-కారము పద్యాలలో ఉంటాయి. పద్మము అనే పదానికి బదులు పద్మమ్ము, పద్మంబు అని కూడా పద్యాలలో ఉపయోగిస్తాము.
 • మరొక విషయం – వాడుక భాషలో ప్రథమావిభక్తిలోని ము-కారానికి బదులు అనుస్వారాన్ని వాడుతాం మాటల్లో. అన్నము తిన్నాను అనే దానికి బదులు అన్నం తిన్నాను అంటాము కదా? కానీ పద్యాలలో అలా కాదు.
 • ఇది మాత్రమే కాక క్రియల ఉపయోగం కూడా గ్రాంథిక భాషలో, వాడుక భాషలో వేరువేరు విధంగా ఉంటుంది. తెచ్చెదను, వచ్చెదను లాటి ప్రయోగాలకు బదులు తెస్తాను, వస్తాను లాటి పదాలను వాడుక భాషలో ఉపయోగిస్తాము.
 • ఒత్తు ర-కారాన్ని మాట్లాడేటప్పుడు ఉపయోగించము. వ్రాత, క్రింద, ఇత్యాదులను రాత, కింద అనే పలుకుతాము కదా?
 • మాట్లాడేటప్పుడు సంధులను, సమాసాలను ఎక్కువగా ఉపయోగించము. సమాసాలుంటే అందులో రెండు మూడు పదాలకంటే ఎక్కువ ఉండవు. సంధులు లేకుండా పదాలను విడదీసి మాట్లాడుతాం. (ఇక్కడ నాకు నవ్వు పుట్టించే ఒక విషయాన్ని తప్పక చెప్పాలి. అదేమంటే, కవులు, పండితులు, వైయాకరణికులు దుస్సంధిని అంగీకరిస్తారు కాని విసంధిని చూస్తే మండిపడతారు.)
 • ఇప్పుడు మనం రాసే భాషలో అరసున్నను ఉపయోగించడం లేదు. కానీ కావ్య భాషలో వ్యాకరణరీత్యా దీని ఉపయోగం ఎంతో అవసరం. అరసున్న తెలిపే కొన్ని ముఖ్య విషయాలు – అరసున్న హ్రస్వాక్షరానికి తరువాత ఉంటే, అక్కడ నిండు సున్నను కూడా ఉపయోగించవచ్చు (పసిఁడి – పసిండి, వెలుఁగు – వెలుంగు ఇత్యాదులు). ఒకప్పుడు (ఇప్పుడు కూడా తమిళనాడులో) దీర్ఘాక్షరానికి తరువాతి అరసున్నను అనుస్వారముగా వాడారు (కోఁతి – కోంతి, మూఁతి – మూంతి, ఇత్యాదులు). న-కారానికి తరువాత పరుషము సరళమైనప్పుడు దానికి ముందు అరసున్న ఉంచుట వాడుక (పూచెన్ గలువలు, పూచెఁ గలువలు, ఇత్యాదులు). డు-కారాంత నామవాచకాలలో డు-కారానికి ముందు అరసున్న ఉంటుంది, దీనిని కూడా నిండు సున్నగా ఉచ్చరించవచ్చును (రాముఁడు, రాముండు). కొన్ని విభక్తి ప్రత్యయాల లోపాన్ని కూడా ఇది సూచిస్తుంది (రాముఁ గని, రాముని గని).

మనం వాడుక భాషలో పద్యం రాయాలంటే పైన చెప్పిన విషయాలను గుర్తులో పెట్టుకొని చెవులకు ఇంపుగా కృత్రిమత, పరుషత లేకుండా రాయాలి. పద్యములలోని లయకు, గతికి ఎట్టి అడ్డంకి రారాదు. కావ్యభాషయొక్క కష్టాలను, వ్యావహారిక భాషయొక్క ఆవశ్యకతను గురించి గిడుగు సీతాపతిగారు భారతీశతకములో [గో-1] ఇలా చెప్పారు.

మహిమన్ శిష్టుల నోట బుట్టి, కవి సమ్మానంబునన్ దేవవా-
క్సహవాసంబును బొంది, వ్యాకరణ రక్షాబంధ సూత్రాలచే
మహనీయస్థితి గాంచి, పండితులకే మాన్యంబుగా నిల్చు నీ
బహు కావ్యోద్ధృత భాష సాధ్యమగునే భాషింపగా భారతీ!