నాకు నచ్చిన పద్యం: భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన

మ. యమునద్గంగము కృష్ణ భూమదిల మబ్జాక్ష న్మనుష్యంబు నీ
       ల మహీధ్రన్నిఖిలా చలావళి తమాలద్భూజ మిందీవర
       త్కుముద శ్రేణి పికద్విహంగము దమస్తోమద్గ్రహోర్క ప్రభా
       సముదాయంబగుచుండె లోక మలఘు శ్యామాభ్రముల్ బర్వినన్

ఈ పద్యం భాస్కర రామాయణం, కిష్కింధ కాండము లోనిది. కవి మల్లికార్జున భట్టు.

మన ప్రధాన కావ్యాలైన భారత భాగవత రామాయణాలు ఏవీ ఒకే చేతి నుంచి వచ్చినవి కావు. భారతం కవిత్రయం రచిస్తే, భాగవతం పోతన వ్రాసిన తర్వాత శిథిలమైన భాగాల పూరణో లేక పోతన వ్రాయక వొదిలినందుననో వెలిగందల నారయా, ఏల్చూరి సింగనా రచించారు. ఇక రామాయణాన్ని భాస్కరునితో పాటు కుమార రుద్రదేవుడూ, మల్లికార్జున భట్టూ, అయ్యలార్యుడూ వ్రాశారు.

భారత భాగవతాలను ఆ తర్వాత ఎవరూ ప్రయత్నించినట్లు లేదు గానీ (ఆధునికుల్లో శ్రీపాద కృష్ణమూర్తి మినహా) రామాయణం మీద చాలామంది కవులే చేయి చేసుకున్నారు – ప్రాచీనుల్లో గోన బుద్ధారెడ్డీ, మొల్లా, ఆధునికుల్లో గోపీనాధం వెంకట కవీ, జనమంచి శేషాద్రి శర్మా, పుట్టపర్తి నారాయణాచార్యులూ, విశ్వనాథ సత్యనారాయణా, అలాంటి వారిలో కొందరు.

రంగనాథ రామాయణం పూర్తిగా ద్విపదా, మొల్ల రామాయణం బాగా సంక్షిప్తమూ కాబట్టి, రామాయణం అనగానే భాస్కర రామాయణమే భక్తిగా సంభావింప బడుతున్నది. అందులోని కిష్కింధ కాండము మల్లికార్జున భట్టు ప్రణీతము. అందులో వాలి వధ అనంతరం లంకపై దండెత్తటానికి తగిన సమయం కోసం శ్రీరామాదులు వేచి చూస్తున్నపుడు వర్షాకాలం వచ్చిన సందర్భం లోనిది పై పద్యం.

చండ ప్రచండంగా ఎండాకాలం లోకాన్ని తపింప జేసిన తర్వాత వర్షారంభ సూచనగా ఆకాశం అంతా దట్టంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. సందు లేకుండా గగనతలం నిండుగా కరి మబ్బులు ఆక్రమించాయి. లోకమంతా ఆ మబ్బుల వల్ల చీకటివారి పోయింది. ప్రకృతి లోని ప్రతీ వస్తువు పైనా నీలినీడలు కమ్మి వాటి రూపురేఖలూ స్వభావాలూ పూర్తిగా మారిపోయినట్లుగా అనిపించింది.

గంగానది కాస్తా యమునానది అయింది. తెల్లని గంగనీరు ఆ కాలమేఘచ్చాయ వలన నల్లగా మారేసరికి గంగ కాస్తా యమునగా మారింది (గంగ నీరు తెల్లగా యమున నీరు నల్లగా ఉండటం లోక ప్రసిద్ధం). ఇదీ యమునద్గంగము. ఇలాగే ఇల మొత్తం కృష్ణభూమిగా, నల్లని నేలగా (కృష్ణభూమత్+ఇలము) మారింది. మనుష్యులందరూ అబ్జాక్షులు – అంటే విష్ణుమూర్తులు, నీలమేఘశ్యాము లైనారు. కొండలూ గుట్టలూ అన్నీ నీల మహీధ్రాలు అంటే నీలగిరు లైనాయి. చెట్లన్నీ తమాల భూజాలు అంటే కాటుక చెట్లైనాయి. కొలనుల్లో వుండే కలువ పూలన్నీ ఇందివరాలు అంటే నల్లకలువ లైనాయి. పక్షులన్నీ కోయిల లైనాయి నల్లగా కనిపిస్తూ. సూర్యుడూ ఇతర గ్రహాలూ – వాటి కాంతి మీద మేఘచ్చాయ పడి వాటి ప్రభాసముదాయం అంతా చీకటి కప్పుగా మారిపోయింది.

ఘనాఘనాల అలఘుత్వమూ, సజలాంబుదాల్లోని గాఢతా, మేఘాల నీలిమ లోకంలోని వస్తువుల మీద చూపించిన ప్రభావమూ, ఉపమాలంకారం గానో ఉత్ప్రేక్ష గానో కాకుండా సాక్షాత్తూ అభేదమే చెప్పి ఉద్దిష్టభావాన్ని రూపు కట్టించాడు కవి. అంతే కాదు, నీలి నీడలు కమ్మడం సాధారణంగా కళంక సూచకం. కానీ ఇక్కడ నల్లబారిన వస్తువులేవీ అల్పాలు కాలేదు. అవీ పూజనీయాలే అయినాయి. మనుష్యులు అబ్జాక్షు లైనారు. కొండలు నీలగిరు లైనాయి. పక్షులు కోయిల లైనాయి. మామూలు కలువలు ఇందీవరా లైనాయి. ఈ విధంగా ఆ ఘనశ్యామచ్చాయతో లోకం మరి కొంత మిన్నతనం పొందిందని చెప్పడం ద్వారా, వర్షాగమనానికి హర్షాతిరేకం తోనే స్వాగతం చెప్తున్నాడీ కవి. చక్కని పోలికలతో భావబంధురంగా సాగిన ఈ పద్యంలో – ఆ చిన్న భావాన్ని ఎనిమిది దృశ్యాలతో విశదీకరించి – ఒక చిన్న భావానికే పెద్ద రూపం ఇచ్చాడు. సంస్కృత పదాల బాహుళ్యం వల్ల సహజంగా వృత్తాలకు వచ్చే ధారా, శ్రవణ పేయతా, ఈ పద్యాన్ని మరింతగా మరిచిపోలేనిదిగా చేశాయి.

భాస్కర రామాయణం రచింపబడిన తర్వాత దాదాపు రెండు వంద లేండ్లకు మొల్ల కవయిత్రి తన చిన్న రామాయణం వ్రాసింది. అందులో ఇలాంటిదే ఒక పద్యముంది. నల్లని మేఘాలు కమ్మినందున లోకం లోని వస్తువులు ఎలా నల్లగా కనిపించాయో మల్లికార్జున భట్టు వర్ణిస్తే, వెన్నెల యొక్క తెల్లని కాంతిలో లోకం ఎలా తెల్లగా మారిందో మొల్ల చెప్పింది.

ఉ. నారదులైరి సన్మునులు నాక మహీజములయ్యె భూజముల్
      శారదలైరి భామినులు శంకర శైలము లయ్యె గోత్రముల్
      పారదమయ్యె నీరధులు పన్నగ నాయకులయ్యె నాగముల్
      వారిద వర్గమెల్ల సిత వర్ణములయ్యెను పండు వెన్నెలన్

ఇదీ మొల్ల రాసిన ఆ పద్యం. మల్లికార్జున భట్టు పద్యాన్ని మొల్ల చూసే ఉంటుంది. చూసింతర్వాత ఆకర్షింపబడి కొద్ది మార్పులతో తన పద్యాన్ని తాను వ్రాసుకొని పైపద్యం మీద తన గౌరవం ప్రకటించింది.