జ్ఞాపకాల ఎదురుచూపు

నీ కోసం ఎదురుచూసే ప్రతిక్షణం
నాకు కలయిక కంటే ముఖ్యం
ఆ కాస్సేపు గడిచే వెయ్యి యుగాలు
నిన్ను హత్తుకుని వుంటాయి
చూడాలని తపించే అను నిమిషాలు
నీ చుట్టూ కన్నీటి ప్రవాహాలై ముంచెత్తుతాయి
ఆర్పే కన్రెప్పలు
చిర్నవ్వే పెదవులు
చిప్పిల్లే దు:ఖభారాన్ని దాచలేక ఒగరుస్తాయి

నీ కోసం వేచిచూసే ప్రతిక్షణం
జ్ఞాపకాలు సీతాకోకచిలుకలై నా చుట్టూ రెపరెపలాడతాయి
నీతో చెప్పలేని మాటలు నాతో నిరంతరం ప్రతిధ్వనిస్తాయి-
మన మధ్య ప్రేమ ప్రవాహమయ్యే నిశ్శబ్దం-
స్పర్శ తోనే సార్థకమయ్యే శరీరం-
ఎప్పుడూ నిన్ను కౌగిలించుకుని
మమకారం దాపున దోబూచులాడతాయి

నీ కోసం వేచిచూసే ప్రతిక్షణం
నాకు వీడ్కోలుభారంతో సంబంధం లేదు
నువ్వు ఇంకెప్పటికీ రావనో
ఎప్పుడూ నాతో వుండవనో బాధలేదు
నా జీవితం గడిచినన్నాళ్ళూ
ఒక చల్లని ఊహ-
వెచ్చని స్పర్శ-
కన్నీటి చుంబనం-
మోహమే పరమ పథమైన బిగి కౌగిలింత-
నాతోనే సజీవంగా వుంటాయి

నీ కోసం వేచిచూసే ప్రతిక్షణం
నాకు కలయిక కంటే ముఖ్యం
వెయ్యి యుగాలేం ఖర్మ-
అనంత కోటి వత్సరాలైనా సరే-
నాతో అనుక్షణం కొత్త రూపమయ్యే నువ్వు
నాతో నిరంతరం శ్వాసించే నువ్వు
నా చుట్టూ నిర్మలానందంగా పరిభ్రమించే జ్ఞాపకాలు
నన్ను అమాంతం హత్తుకుని ఉక్కిరి బిక్కిరి చేసే జ్ఞాపకాలు

వేచి చూసే ప్రతిక్షణం-
నీ కోసం వేచిచూసే ప్రతిక్షణం
నాచుట్టూ ముంచెత్తే కన్నీటి ప్రవాహాల హృదయం
అనునిమిషం నిన్ను చూడాలని తపించి తపించి ఎప్పటికీ
ఎప్పటికీ
నీరింకిపోయిన స్థాణువై ఎదురు చూస్తుంది