తారామతి బిరాదరి

పేరు తెలియని చెట్టు ఒకటి
వానకు తడుస్తూ నిలబడి ఉంది
దూరాన,ఎన్నడో మరణించిన
నాన్న గొంతు వినబడుతోంది

ఆదరా బాదరా ఓ యువతి
బిరాదరిలోకి పరిగెడుతోంది
ఎక్కడినించో తారామతి పాట
రెక్కలార్చుతూ వరండాలో వాలుతోంది

మబ్బు కొప్పులోంచి నీళ్ళ దండ
జారి చెట్ల కొమ్మల్లో చిక్కుకుంటోంది
గత రాత్రంతా నిద్రించని ఈ దేహాన్ని
అన్ని వైపుల నుండి ఏవో అదృశ్య హస్తాలు
ఊపేస్తున్నట్టుగా అనిపిస్తోంది