తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు

స్వాతంత్ర్యం వచ్చేనాటికి మాతృభాషామాధ్యమం పాఠశాల చివరితరగతి (1-11) వరకు ఉండేది; ఇంగ్లీషు ఒక పాఠ్యాంశంగా 6వతరగతినుంచి, మాధ్యమంగా ఇంటర్‌ మీడియేట్‌ నుంచి కళాశాలస్థాయిలో ఉండేది. దేశమంతటా ఈమార్పు రావటానికి ఆంగ్ల పాలకుల విద్యావిధానమే కారణం. ఈప్రయత్నం 70ఏళ్ళ తర్వాత 1920నుంచి సమగ్రంగా అమలైంది.

‘ప్రజలభాషలో రాష్ట్రపరిపాలన జరగటం ప్రజాస్వామ్యానికి అవసరం’ అనే ఆదర్శంతో భాషాప్రయుక్తరాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత దేశభాషలకు సముచితస్థానం ఇవ్వటానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగాయి. ప్రధానభాషల (Eighth Schedule languages) ను అధికారభాషలుగా గుర్తించటం, విద్యావిధానంలో పట్టభద్రస్థాయిదాకా దేశభాషామాధ్యమం ప్రవేశ పెట్టటం, గ్రంథఅకాడమీల, సాహిత్యఅకాడమీల స్థాపన, మొదలైనవి. తెలుగులో 1957లో సాహిత్యఅకాడమీ, 1968లో తెలుగు అకాడమీ వచ్చాయి. 1969-1974కి తెలుగుమాధ్యమం పి.యు.సి. నుంచి బి.ఏ., బి.కామ్‌., బి.ఎస్‌ సీ. లస్థాయిదాకా వ్యాపించింది. ఆ తర్వాతనే తెలుగుకు క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రధాన కారణం: ఇంగ్లీషుమీడియమ్‌ లో చదువుకున్నవాళ్ళకు ఉద్యోగావకాశాలు పెరగటం, తెలుగు మాధ్యమం నిరుపయూగం అనేభావం చదువుకున్నపిల్లల్లోనూ, తల్లిదండ్రుల లోనూ గట్టిగా పాతుకోటం. ఇది మరో ముప్ఫై ఏళ్ళకు తారస్థాయికి చేరుకున్నది. LKG నుంచే ఇంగ్లీషులో చదువునేర్పటం అవసరమనే అపోహ చాలావర్గాల్లో కలగటం, పనిపాటలు చేసుకునే వాళ్ళుకూడా ఈ దోవ తొక్కటం విశేషం. పార్లమెంటు అంగీకరించిన భారతదేశవిద్యావిధానం తల్లకిందులైంది.


ఇంగ్లీషుమీడియం లో చదివినవాళ్ళకు చదువు ఎంతబాగా పట్టుబడుతున్నదో తెలుసుకోటానికి “ఇండియా టుడే” వారపత్రిక ఇటీవల (2006 నవంబర్‌ 27సంచికలో[2]) ఒక జాతీయపర్యవేక్షణ చేసి వచ్చిన ఫలితాలను ప్రచురించింది. మొత్తం 5 నగరాలనుంచి 142 అతిశ్రేష్ఠపాఠశాలలను తీసుకొని 4, 6, 8 తరగతుల్లో ఉన్న 32,000 మంది విద్యార్థులను శాస్త్రీయంగా ఎంపికచేసింది. వాళ్ళకు ఆరుప్రశ్నలిచ్చి వారు రాసిన జవాబులకు మార్కులువేశారు. అలానే 43 ఇతరదేశాల్లో అదే తరగతులపిల్లలకు ఆప్రశ్నలిస్తే వచ్చిన జవాబులకు మార్కులు వేసి, రెంటినీ పోల్చిచూస్తే, అంతర్జాతీయ స్థాయి విద్యార్థుల మార్కులు 60 శాతం పైన ఉంటే మనపిల్లలు 40 శాతం మార్కులలోపలే ఉన్నారని తెలిసింది.

India Today: Cover Story
India Today: Cover Story
2006/11/27

ఇది చాలామందిని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఈపరిస్థితికి చాలాకారణాలు ఉండవచ్చుగాని ప్రధానమైంది స్కూలుస్థాయిలో మాతృభాషలో పాఠాలు చెప్పకపోవటమే అనిపిస్తుంది. అవగాహనశక్తి పరభాషలో కన్నా సొంతభాషలో సులభంగా సాధ్యమౌతుంది. సొంతభాషకు వ్యాకరణం నేర్చుకునే అవసరం ఉండదు; ఇంగీషువ్యాకరణం నేర్చుకోటం కష్టంకాబట్టి బట్టీపెట్టే అలవాటుకు ఎక్కువవిలువ, అవగాహనకు తక్కువవిలువ పిల్లలు ఇచ్చినట్టు తేలింది.

ఇంగ్లీషుమాధ్యమంలో నడిచే అత్యుత్తమపాఠశాలల స్థితే ఇలాఉంటే మరి వేలకొద్ది కుక్క గొడుగుల్లా ఏర్పడ్డ స్కూళ్ళసంగ తేమిటి? అక్కడ చదివే పిల్లలకు ఎటువంటి భాష పట్టుబడుతున్నదో పరిశోధించి తెలుసుకోవాలి. అసలు ఏభాషా సరిగా అంటటం లేదేమో! మరి ఇంగ్లీషు మాధ్యమం మీద ఇంతమందికి ఇంత మమకారం ఎలా ఏర్పడ్డది? బహుశా ఈకిందివి కారణాలై ఉండవచ్చు:

 1. హైటెక్‌ ఉద్యోగాలవిస్తృతి, వాటికి ఇంగ్లీషుమాధ్యమం ఆవశ్యకత;
 2. బీపివోలలో, కాల్‌సెంటర్లలో వేలకొద్ది ఉద్యోగాలు రావటం;
 3. మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఇంగ్లీషుచదువుకు ప్రాధాన్యం;
 4. ఇంగ్లీషు మీడియంలో చదువుకొన్నవాళ్ళు ఎక్కువమంది అమెరికా ఉద్యోగాలకు వెళ్ళటం.

పై కారణాలకూ, ఒకటో తరగతినుంచి ఇంగ్లీషుచదువుకోవాలి అనుకోటానికీ, సంబంధం ఏమీ లేదు. పూర్వపద్ధతిలో ఇంటర్నుంచి చదువుకొన్నా ఆంగ్లభాషమీద అంతగాని, అంతకన్న ఎక్కువగాని అధికారమే వస్తుంది. కాల్‌సెంటర్ల ఉద్యోగాలు (తాత్కాలికంగా నిరుద్యోగసమస్యకు పరిష్కారంగా కనిపించినా) ఇతరదేశ ఆర్థికావస్థను పెంచటానికి పనికివస్తాయి గాని, మనదేశంలో వస్తువుల ఉత్పత్తికి, జీడీపి (GDP) పెరగటానికి పనికిరావు. ఇంకో ప్రధానమైన సంగతి: తెలివైన పిల్లలు విద్యావిధానంలో లోపాలున్నా గమ్యాన్ని సాధించుకోగలరు. సామాన్యులకు అది పరిష్కారం కాదు. వాళ్ళ పురోభివృద్ధికి కారణం ఇంగ్లీషుమాధ్యమం లో వాళ్ళు చదవటం అనుకోటం మరో భ్రాంతి. ప్రపంచీకరణం అన్నిదేశాలకూ వర్తిస్తుందికాబట్టి అది కారణం గాదు.

అభివృద్ధిపొందిన ఏదేశంలోనూ మాతృభాషలో తప్ప ద్వితీయభాషలో పాఠశాలవిద్య నేర్పటం లేదు. మనదేశంలోనూ విద్యావిధానం ఆప్రాతిపదికమీదే కొనసాగింది; The University Education Commission (1948-49), The Secondary Education Commision (1952-53), National Education Commission (1964-66), The New Education Policy 1986 (modified in 1992) — ఇవన్నీ విద్యామాధ్యమంగా మాతృభాషాస్థానాన్ని మార్చాలని ఎక్కడా చెప్పలేదు. 1992 లో తుదిరూపం తీసుకున్న NPE పర్యవేక్షణ కమిటీకి అధ్యక్షులు మన పూర్వముఖ్యమంత్రి పూజ్యులు నేదురుమల్లివారే. భాషావిషయంలో 1968లో పార్లమెంటు సమ్మతించిన జాతీయవిద్యావిధానం (కొఠారీ కమిషన్‌ రిపోర్ట్‌) లో ఉన్న సూత్రాలనే అనుసరించాలని వారు పునరుద్ఘాటించారు (ఉదా: త్రిభాషాసూత్రం). కాని, అమలు చేయటంలో ఏ రాష్ట్రమూ ఈ పద్ధతి అవలంబించలేదు. ఆసంగతి కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు.

ఈమధ్యనే వచ్చిన మరో సర్వేలో మన విశ్వవిద్యాలయవిద్యను గూర్చినచర్చ ఉంది. దీని ఆధారం యూకే లోని Times Higher Education Supplement లో అచ్చయిన విశ్లేషణ (The Hindu, 06-12-2006[3]). దీనిప్రకారం మనదేశంలో ప్రపంచస్థాయిలో ఎన్నదగిన విశ్వవిద్యాలయూలు మూడే నట; అవి అగ్రస్థాయి 5, 20, 50 లలోలేవు; పై 100లో రెండు, పై 200లో మరోటి. చైనా లో 6, జపాన్లో 11, హాంకాంగ్‌లో 4, ఇతర ఆసియూదేశాల్లో 9; మరి యు.కే.లో 30, అమెరికాలో 55, ఉంటే మనవి చాలా అధమస్థితిలో ఉన్నాయన్న మాట. మనపునాదులు గట్టిగాలేకపోవటమే దీని కారణం అనిపిస్తుంది. కర్త రమేశ్‌ థాకూర్‌, Assistant Secretary- General of the UNO, Vice-Rector, United Nations University. ఇండియా టుడేలోనూ దీనిలోనూ చేసినవిశ్లేషణ మనకు కనువిప్పు కావాలి.

పరిష్కారమార్గాలు రెండు: ఒకటి శాశ్వతమైంది, రెండోది తాత్కాలికమైంది.

శాశ్వతపరిష్కారం

మనవిద్యావిధానాన్ని ఇదివరకు ప్రతిపాదించిన సూత్రాలననుసరించి[1] సమూలాగ్రంగా సంస్కరించుకోవాలి. అంతర్జాతీయ విద్యానిపుణులు కొఠారీకమిషన్‌ రిపోర్టులో చేసిన సిఫార్సులు అప్పటినించి నిష్కర్షగా అమలు చేస్తే ఇప్పటి కీ ప్రతిష్టంభన వచ్చేది కాదు. ఇప్పుడైనా ఆసూత్రాలకు అనుగుణంగా రాష్ట్రకేంద్రప్రభుత్వాలు తమతమ విధానాలను సమీక్షించుకొని మార్చుకోవాలి. ఇది అన్నిదేశాల్లో ఉన్నమార్గమే కాబట్టి శాశ్వతమైంది. ముఖ్యసూత్రం: ఇంగ్లీషుస్థాయిని తక్కువచేయకుండా మాతృభాష ద్వారా అన్నిస్థాయిల్లోనూ విద్యాబోధన జరపటం.

తాత్కాలికపరిష్కారం

ఇంగ్లీషును నేర్చుకోవద్దనీ, నేర్పవద్దనీ, ఎవరూ ఏదేశంలోనూ చెప్పరు. అయితే ఎప్పటినుంచి ఏస్థాయి వరకు, ఏపరిమాణంలో ఆంగ్లం నేర్పాలన్నదే సమస్య. ఇప్పటిలాగా ఎల్కేజీ నుంచి పిల్లలను ఇంగ్లీషుమీడియం బళ్ళలో చదివించటం, ఆత్మహత్యాసదృశం. వాళ్ళకు ఏభాషా రాని స్థితి ఏర్పడుతున్నది. మాతృభాషలో సృజనాశక్తి అడుగంటిపోతున్నది. దాన్ని ప్రభుత్వం వెంటనే ఆపెయ్యాలి.

మనం మరో అయిదేళ్ళపాటు తాత్కాలికమైన కొత్త విధానాలు, మార్గాలు శోధించ వచ్చు. వాటికి నా సూచనలు:

 1. పాఠశాలస్థాయిలో 5వ తరగతిదాకా మాతృభాషలోనే అన్ని అంశాలూ చెప్పాలి; ఒకటో తరగతినుంచి ఆంగ్లబోధనవల్ల పిల్లలకు మేలు జరగదు.
 2. ఆరో తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఇంగ్లీషు నేర్పటం, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతిదాకా ప్రతిఏడూ ఒక్కో ‘సబ్జెక్టు’ను ఆంగ్లంలో ప్రవేశ పెట్టటం, ప్రధానంగా విజ్ఞానశాస్త్రాలు, సాంకేతికవిషయూలు.
 3. 1నుంచి 10 తరగతుల దాకా తెలుగు చదువుకొన్నపిల్లలకు ఇంగ్లీషు నేర్చుకోటం సులభ మౌతుంది. తెలుగు సాహిత్యంద్వారా మన సంస్కృతి అర్థమౌతుంది. తెలుగు ద్వారా సృజనాత్మకశక్తి భావవ్యక్తీకరణ లో దెబ్బతినకుండా ఉంటుంది. (తెలుగు ఇంగ్లీషు సిలబస్‌ మార్పులు అత్యవసరం).
 4. విజ్ఞానశాస్త్రవిషయూలు అంచెలంచెలుగా 8-10 తరగతుల్లో ఉభయభాషావిధానం (bilingual method) లో నేర్పితే అవగాహన బాగా పెరిగి పైక్లాసులకు వెళ్ళినప్పుడు ఉభయమాధ్యమాలకు అలవాటు పడటం సాధ్యమౌతుంది. ఇంటర్‌ మీడియేట్‌ నుంచి ఇప్పటిలాగే రెండుమాధ్యమాలలోనూ క్లాసులు నడపాలి.
 5. ఇంటర్వ్యూలు సందర్భాన్నిబట్టి రెండు భాషల్లోనూ ఉండాలి. విద్యావిధానం, పరిపాలన, వాణిజ్యం, న్యాయవ్యవస్థ, పరిశ్రమలు తెలుగులో విస్తరించినప్పుడు తెలుగుమాధ్యమం నుంచి శిక్షణ పొందినవాళ్ళకే ఉద్యోగావకాశలు ఎక్కువవుతాయి. ప్రభుత్వం ఈమార్పు తేవటానికి చొరవతీసుకోకపోతే, భాషారాష్ట్రాలు, ప్రజాస్వామ్యం నిరర్థకమైనట్టే.

భాషాభివృద్ధికి మార్గాలు

వినియోగంవల్లనే భాష క్రమక్రమంగా పెరుగుతుంది. వినియోగంలేకపోతే భాష మార్పులేకుండా స్తబ్ధంగా ఉంటుంది. వాడుకవల్ల తెలుగు వృద్ధిపొందినరంగాలురెండు: దేశీయవృత్తులు, ప్రసారసాధనాలు. ఆంధ్రప్రదేశసాహిత్యఅకాడమీ పర్యవేక్షణలో వచ్చిన వ్యవసాయం, చేనేత, కమ్మరం, కుమ్మరం, వడ్రంగం, మొ.న వృత్తులలో తయూరయిన కోశాలు చూస్తే తెలుగుభాషావ్యాప్తి అర్థమౌతుంది. కోశనిర్మాణవిధానం నేను వ్యవసాయపదకోశం (1957-62)లో నిరూపించాను; బూదరాజు రాధాకృష్ణ, జి. ఎన్‌. రెడ్డి, తూమాటి దోణప్ప, పోరంకి దక్షిణామూర్తి, మొదలైనవారు సంపాదకులుగా ఇప్పటికి తొమ్మిది సంపుటాలు వచ్చాయి. పూర్వకోశాలలోలేని మాటలు సుమారు 50,000 పైనే ఉంటాయి. ఈకోశాల ప్రయూజనాలు ఆయూ సంపుటాల్లో చదవవచ్చు (తెలుగు యూనివర్సిటీ లోకాపీలు దొరకవచ్చు).

రెండోది వార్తాపత్రికల్లోనూ (ఇతరప్రసారసాధనాల్లోనూ) తెలుగుభాష చాలా వృద్ధి పొందింది. కొత్తమాటలు, రచనారీతులు 30, 40ఏళ్ళలో ఎలా పత్రికల్లో ప్రవేశించాయో పరిశోధనాంశంగా చాలామంది PG విద్యార్థులు కృషిచేశారు. తెలుగువాడుకలో లేని రంగాల్లో అది పెరగలేదు, పెరగదుకూడా; అవి: అన్ని స్థాయిల్లో జరిగే ప్రభుత్వపరిపాలన, వాణిజ్య-వ్యాపారాలు, న్యాయవ్యవస్థ, వైద్యసామాన్యవిజ్ఞాన సాంకేతిక విద్యలు. ఈరంగాలలో తెలుగును తక్షణం వాడటమే పరిష్కారమార్గం.

Bibliography

 1.  Krishnamurti, Bh. 1998. “The regional language vs. English as instructional medium in higher education: the Indian dilemma”. In Language, Education and Society 308-17. New Delhi: Sage Publications.
 2.  Several writers 2006 . “What’s wrong with our teaching?” (India Today, 27-11-2006)
 3.  Ramesh Thakur 2006. “The quality of India’s higher education”. (The Hndu, 09-12-2006)
 4.  Krishnamurti, Bh. and Aditi Mukherjee (eds.). 1985. Modernizaion of Indian Languages in News Media. Hyderabad: Dept of Linguistics, Osmania University.
 5.  Krishnamurti, Bh. 1998. “Language in school education in India’. In Krishnamurti 1998, 275-89.
 6.  Krishnamurti, Bh. 1998. “A survey of Telugu dialect vocabulary used in native occupations.” In Krishnamurti 1998, 121-37.
 7.  భద్రిరాజు కృష్ణమూర్తి, 2000. భాషా, సమాజం, సంస్కృతి: నీల్ కమల్ పబ్లికేషన్స్ ప్రై. లిమిటెడ్.
భద్రిరాజు కృష్ణమూర్తి

రచయిత భద్రిరాజు కృష్ణమూర్తి గురించి: ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన Dravidian Languages పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించాడు. ...