స్పందన: పత్రికా ప్రభుతా మనం

కొత్తగా మీకు చెప్పేదేమీలేదు, ఈ మధ్య మన ప్రభుత్వ రక్షక భటాధికారులు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుణ్ణీ, ఇంకో ఇద్దరు విలేకర్లనీ అరెస్టు చేసిన సంగతి. వార్త వినగానే నాకూ మనందరి లానే ఒళ్ళు బోల్డు మండింది. వేంటనే ప్రభుత్వమా డౌన్ డౌన్ అని కూకలేశాను కూడానూ. కాకపోతే, మనసులో ఏ మూలో ఇదంత తెలుపు నలుపూ విషయం కాదూ అని ఒకటే నస. అందుకే ఇక్కడ ఇలా, అందరికీ తెల్సిందేగా మళ్ళీ ఎందుకు ఊసెత్తుతున్నావ్ అని మీరనకుండా.

నాకూ, చాలామనందరి లాగానే తెలుగునాటి వార్తలు తెలిసేది ఆన్‌లైన్ పత్రికలు చదివితేనే. వాటివల్ల నాకు తెలిసింది ఇదీ. ఆ మధ్య ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక (కాదు, దినపత్రిక అనాలి కాబోలు) బాడుగ నేతలు అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురించింది. వెనుకబడ్డ వర్గాల సంఘాల నాయకులు కొంతమందిని తీవ్రంగా విమర్శిస్తూ. ఎవరినీ పేరూ పెట్టి చెప్పాలేదూ, ఏ ఆధారాలూ చూపాలేదు, పబ్లిగ్గా ప్రైవేటు భాషలో ఇద్దరు ప్రేమికులు వాళ్ళకి మాత్రమే తెలిసేట్టు మాట్లాడుకున్నట్టుగా. ఆ రోజో పక్క రోజో రెండు రోజులూనో టీవీ కెమేరాలతో సహా కొంతమంది ఆంధ్రజ్యోతి పత్రికాలయంపై దిగిపోయేరు, అద్దాలు పగలగొట్టేరు, ఫైళ్ళను తగలబెట్టేరు.

ఒక సదరు పోరాట సమితి నేత ఈ ఘనకార్యం నాదేననీ, నేనే బాధ్యుణ్ణనీ విశదించి ఇలాంటి కథనాలు మళ్ళీ రాస్తే మళ్ళీ ఇలాంటి దాడి చేస్తామనీ పబ్లిగ్గానే బెదిరించారు కూడానూ. ఆ ఇద్దరు ప్రేమికుల్లో ఒకరీయనేనేమో అని మనకనుమానం రాకూడదు. వచ్చినా అనకూడదు, శాంతిభద్రతలు భంగం అవుతై. అయితే, ఇంత బాహాటంగా చెప్పినా ప్రభుత్వమూ పోలీసులూ విననట్టే ఉన్నారు. ఎలానూ, మన మీద అవాకులూ చెవాకులూ రాసే దినపత్రికేగా, ఆ మాత్రం శాస్తి జరగాల్లే, అన్నట్టేమో. అసలిన్ని పత్రికలెందుకు, ప్రజల టైము వేస్టు, మేమే మీకెలానూ ప్రభుత్వం గురించి, అంటే మాగురించి నిజాలు నిగ్గదీసి మరీ చెప్తున్నామాయె, అనేమో. నాకైతే తెలీలేదు.

అసలు పత్రికలంటే ప్రజాస్వామ్యానికి గొంతులూ గట్రా, నిజాన్ని చెప్పినందుకే ఈ దాడి అంటూ పాత్రికేయులంతా ఆ సదరు దళిత నాయకుని దిష్టిబొమ్మ నొకదాన్ని తగలబెట్టారు వారి నిరసనలో భాగంగా. ఇకనేం, వెంటనే, అంటే వర్జ్యమూ రాహుకాలమూ చూస్కోని ముహూర్తం ఒక నెల తర్వాత దొరికితే(అది రాత్రి అయితే తప్పు ప్రభుత్వానిది ఎలా అవుతుంది?) కాలాతీతం కాకుండా, ఆంధ్రజ్యోతి సంపాదకుణ్ణీ, ఇంకో ఇద్దరు విలేకర్లనీ పోలీసువారు అరెస్టు చేసేరు, దళిత అవమాన నిరోధక చట్టమో, అలాంటిదే ఇంకోటో, ఏదో ఒక మిషతో. రాజు తల్చుకుంటే చట్టాలకి కొదవా. దిష్టిబొమ్మ తగలెట్టడానికీ, అసలు మనిషిని తగలెట్టడానికీ పెద్ద తేడా లేనట్టుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకో, Alexis de Tocqueville రాసిన Democracy in America అన్న పుస్తకం లో కొన్ని మాటలు గుర్తొచ్చినై.

“In countries where the doctrine of the sovereignty of the people ostensibly prevails, the censorship of the press is not only dangerous, but absurd…. The sovereignty of the people and the liberty of the press may therefore be regarded as correlative, just as the censorship of the press and universal suffrage are two things which are irreconcilably opposed.”

సెన్సారుషిప్పు సంగతి దేవుడెరుగు, వాటిపై గూండాలదాడి జరుగుతుంటే చిద్విలాసపు చిరునవ్వుల్లో అంతా ఈశ్వరేచ్చ అనే ప్రభుత్వాన్ని చూస్తే ఏ ప్రజాస్వామ్యికవాది గుండెలుప్పొంగవూ? ఒక్క నిమిషం – ఏ పత్రికలు ఏ ఉద్దేశాలతో ఏ అవాకులూ చవాకులే రాసినా ప్రభుత్వాన్ని కించపర్చినా, వాటిపైన రాళ్ళేయడమూ వాటిని తగలబెట్టడమూ చేస్తే, మిట్ట మధ్యాన్నం సూర్యుణ్ణి చూసి ఉమ్మేసినట్టు అవుతుందనీ, సంస్థాగత విమర్శలకీ, వైయక్తిక స్పర్ధలకీ తేడా ఉందనీ, ఇది ప్రత్యేకించి ఉమ్మేస్తున్నది ప్రభుత్వమైతే ఈ తేడా గుర్తు పెట్టుకోవడం మరింత ముఖ్యమనీ, మీకూ నాకూ తెలీదేమో గానీ, ప్రజాస్వామ్య పాలనలో యుక్తాయుక్తాలన్నీ ఆపోశన పట్టేసిన మన ముఖ్యులైన మంత్రిగారలందరికీ తెలుసు. నామాట నమ్మకపోతే మన గృహశాఖామాత్యుల్నడగండి.

ఏమైతేనేం, ఆందొళనలూ, నిరసనలూ కాస్త పోటెత్తినై. మనమూ ఏం ఊర్కోలేదు కదా. అర్జెంటుగా మన నిరసన తెలిపేశాం. మనకు తెలిసిందల్లా ఏవిటంటే పత్రికాస్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టనీ, దాన్ని కాపాడుకోవడం మనకు చాలా ముఖ్యాతిముఖ్యమనీ. మన బాధంతా ఈ స్వేచ్ఛని కాలరాస్తున్నారనే. ఈ విషయంలో నాకూ ఏ సందేహమూ లేదు, మీకూ ఉండకూడదంతే. మన చాతనైంది మనం చేయాలి, మన ఫోర్తెస్టేటుని మనం కాపాడుకోవాలి. సరే ఇదంతా బానేవుంది కానీ… నా అనుమానం, ఆంధ్రజ్యోతి వారు, మనం ఆందోళన పడ్డది కేవలం వారి పాత్రికేయ నిబద్ధతా, నిజాయితీ, నిస్వార్ధ సమాజ సేవ గురించేనని చంకలు గుద్దుకుంటారేమో అని. ఎందుకంటారా?

ఓ రెండ్రోజుల తర్వాత సంపాదకుల వారూ, విలేకర్లూ బైటికొచ్చారు. వచ్చీ రాగానే, ఇది తమకే కాదు ప్రజాస్వామ్యానికీ, ప్రజలకూ, పత్రికా ప్రపంచానికి కూడా ఒక మహా విజయమనీ నినదించారు. పత్రికల్లో కవులు అక్షరం మీద దాడి అంటూ కవితలల్లేరు, పుంఖానుపుంఖాలుగా ప్రచురించేరు, ఇంకో సంపాదకులవారు (ఆ ఆంధ్రజ్యోతి వారే) తన అలవాటు తప్పకుండా ముందు పేజి ముఖ్యాంశాలన్నీ కవితాత్మకంగా నాటకీయంగా రాసినట్టే, ఈ వార్తని కూడా అలానే రమణీయంగా కవిత్వపు రంగులద్ది మరీ ప్రచురించేరు. (ఇంత గొప్ప నాటకీయతని సృజించే ఈ మనీషిని సినీ ప్రపంచం ఎందుకు గుర్తించలేదో!)అసలు ఎంత దుర్వార్త ఐనా, మేటరెంత సీరియసైనా, అంత్య ప్రాసలతో, అత్యంత కవితాత్మక స్పృహ తో చెప్పటం మన సంపాదకుల వారి రక్తం లోనే ఉంది. అసలిది మన జాతి గొప్పతనం, ప్రతీ విషయమూ కవిత్వంగా ప్రకటించేయడం. వ్యాసం లాగానో వార్త లాగానో రాస్తే మళ్ళీ ఋజువులూ అవీ ఇవీ పెద్ద గొడవ. ఇంత గొప్ప మహాకవితాత్మ ఉన్న సంపాదకులు దొరకని ఇతర పత్రికలు మామూలు వాక్యాలతో ఈ వార్తల్ని వార్తల్లాగానే రాసి సరిపెట్టుకున్నై.

అయితే, మన సంపాదకులకీ విలేకరులకీ వచ్చిన మద్దతు సంపూర్ణమూ కాదు, సంఘటితమూ కాదు. ఒక తెలుగు దినపత్రిక ముఖ్య సంపాదకులొకరు బాడుగ జర్నలిజం అన్న పేరుతో ఒక చిన్న వ్యాసం అచ్చేశారు. ఆంధ్రజ్యోతి వారు అంత పత్తిత్తులేమీ కాదని, వారు ప్రచురించినది వార్తే కాదనీ, అది కేవలం పని గట్టుకొని బురద చల్లడమే ననీ, వీరి వాదన. ఇంకో పత్రికవారు నిజం సాక్షిగా ప్రభుతది తప్పేమీ లేదని వెనకేసుకొచ్చి, అసలు తప్పంతా పత్రిక వారిదేననీ తేల్చి చెప్పేశారు. వాదన చేసిన వారెవరైనా (ఆ సంపాదకు)లెంతటి ఘనులైనా, వాదనలో ఏదో నిజం ఉన్నట్టు అనిపించక పోదు. ప్రత్యేకించి ఇటువంటి వాదనలో, లేకపోతే ఆంధ్రజ్యోతి వారి యాజమాన్యం మీదో ఇంకాసిని (పత్రి)కోళ్ళు ఏవేవో కూస్తూనే ఉన్నై కొద్దికాలం నుంచీ. అంతెందుకూ, సమాజంలో బడుగు, మైనారిటీ, తదితర ఉపేక్షించబడ్డ వారి పక్షాన ఏకతాటిన నిలబడి పోరాడే, పాటలు పాడే, కవితలు రాసే మేధావీ కార్యవాదీ వర్గం కూడా చీలిపోయి, ఎవరికి తోచినట్లు వారికీ వీరికీ తప్పు అంటగట్టెశారు. అయినా ఒకళ్ళు చెప్పాలా, ఆ మాట కొస్తే, మనమూ పేపర్లూ అవీ చదూతూనే ఉన్నాం గదా, ఎంత తెలీక పోయినా ఆ మాత్రం మనకూ అనుమానం రాదూ? ఏదో సామెత చెప్పినట్లు ‘ఎంత ముసిలిదైనా నీచు కంపెరగదా’ అని.

మళ్ళీ ఇంకోసారీ, పైన చెప్పిన పుస్తకంలో అదే వ్యాసంలో ఇంకో పేరాలో తోక్వీల్ ఇలా అన్నాడని గుర్తొచ్చింది:

“The characteristics of the American journalist consist in an open and coarse appeal to the passions of his readers; he abandons principles to assail the characters of individuals, to track them into private life and disclose all their weaknesses and vices. Nothing can be more deplorable than this abuse of the powers of thought…

…The personal opinions of the editors have no weight in the eyes of the public. What they seek in a newspaper is a knowledge of facts, and it is only by altering or distorting those facts that a journalist can contribute to the support of his own views.”

అదండీ నా మనసులో జోరీగ నస. పత్రికలపైనా, వాటి స్వేచ్ఛ పైనా ఎవరన్నా దాడి చేస్తే ఎవరూ ఉపేక్షించరు. కానీ, ఇది ఏ పత్రికకో సంబంధించింది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదుల గురించి కదా మనం మాట్లాడుతున్నది. ప్రభుత్వం కుళ్ళు కడగడానికి పత్రికలున్నై. మరి పత్రికల కుళ్ళు కడగడానికి? ఏ వ్యవస్థలో నైనా మార్పు అంతర్గతంగా ఆత్మవిమర్శ వల్ల రావాలే తప్పితే ఎవరో చెపితే వచ్చేది కాదు. మరి పత్రికావ్యవస్థలో ఈ సంగతి ఎవరూ మాట్లాడుతున్నట్టు కానీ, దీని గురించి మథన పడుతున్నట్టు గానీ, నాకైతే తెలీదు. అధికారం చేతికిస్తే ప్రభుత్వాని కొక్కదానికేనా కళ్ళు నెత్తికెక్కేదీ, దుర్వినియోగం చేసేదీ? మీరూ నేనూ ఏం తక్కువ తిన్నాం? పత్రికలవాళ్ళు మాత్రం ఏం తక్కువ తిన్నారు?

ఈ సంగతి వాళ్ళకు (అంటే మన తెలుగు నాట పాత్రికేయులకు అందరికీ) తెలిసేదెట్లా? మరి ఈ ఎస్టీముడు ఫోర్తెస్టేటు తన కుళ్ళు తానే కడుక్కునేదెట్లా?